కంటి మార్పిడి చికిత్స, ఊహించని స్థాయిలో పురోగతి

ఫొటో సోర్స్, aaron james
- రచయిత, మేడ్‌లైన్ హాల్‌పర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే మొదటిసారి కంటి (మనిషి కన్ను) మార్పిడి చికిత్స చేయించుకున్న వ్యక్తి ఆరోగ్యంలో ఊహించని స్థాయిలో పురోగతి కనిపిస్తోంది.
అమెరికా ఆర్మీకి చెందిన ఆరాన్ జేమ్స్ ఏడాది క్రితం కంటి మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడాయన మళ్లీ మామూలుగా తన జీవితాన్ని గడపగలుగుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.
46 ఏళ్ల ఆరాన్ జేమ్స్, కంటితో పాటు, పాక్షిక ముఖమార్పిడి చికిత్స కూడా చేయించుకున్నారు.
2021లో పవర్ లైన్ ఇన్‌స్టాలర్‌గా పని చేస్తున్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో ఆయన ముఖంలో చాలా భాగం దెబ్బతింది.
‘‘చికిత్స ద్వారా ఆయనకు అమర్చిన కన్ను పని తీరు మామూలుగా ఉంది. జంతువుల నుంచి సేకరించి అమర్చిన కళ్లలా కాకుండా, ఈ మానవ కంటి పరిమాణం తగ్గలేదు’’ అని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
‘‘ఈ విధానంలో మేం చూస్తున్న ఫలితాలు నమ్మలేకపోతున్నాం. అంతే కాకుండా ఇది కొత్త చికిత్సా విధానాలకు దారి చూపుతుంది. ఇంద్రియాల మార్పిడికి సంబంధించిన క్లిష్టమైన చికిత్సలపై పరిశోధనలకు స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని కంటి వైద్యురాలు వైదేహి దెదానియా చెప్పారు.
ప్రస్తుతం జేమ్స్ తనకు అమర్చిన కన్నుతో ఇంకా చూడలేకపోతున్నారు. కానీ ఆయన ఆ కన్నుతో మళ్లీ చూడగలరని పరిశోధకులు ఆశాభావంతో ఉన్నారు.
‘‘కాంతికి రెటీనా ఎలక్ట్రికల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది లెక్కించే ఎలక్ట్రోరెటినోగ్రఫీ అనే పరీక్షలో, జేమ్స్‌కు అమర్చిన కంటిలో కాంతిని గుర్తించే నరాల కణాలు, కంటి మార్పిడి చికిత్స విజయవంతమైందని వెల్లడించాయి’’ అని పరిశోధకులు వెల్లడించారు.
‘‘ఈ ఎలక్ట్రికల్ ప్రతిస్పందన కాంతిని సంకేతాలుగా మార్చుతుంది. ఆ సంకేతాలను అందుకుని మెదడు చూపుగా మారుస్తుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే కంటిమార్పిడి చికిత్సలు, చూపును తిరిగి తీసుకురావడంలో ఉపయోగపడతాయన్న ఆశాభావం కలిగిస్తోంది’’ అని తెలిపారు.


ఫొటో సోర్స్, aaron james
అందరిలాగే..
జేమ్స్‌కు మే నెలలో 21 గంటల పాటు ఈ సర్జరీ చేశారు. 140 మందికి పైగా ఆరోగ్య నిపుణులు దీనిలో పాల్గొన్నారు.
30లలో ఉన్న ఓ వ్యక్తి తన ముఖం, కన్నును డొనేట్ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడానికి శస్త్రచికిత్స సమయంలో డాక్టర్లు దాత ఎముక నుంచి అడల్ట్ స్టెమ్ సెల్స్‌ను జేమ్స్ కంటి నరంలోకి ఎక్కించారు.
ప్రస్తుతం ద్రవాహారం తీసుకోవడం, వాసన చూడగలగడం సహా జేమ్స్ అనేక పనులు చేయగలుగుతున్నారని డాక్టర్లు తెలిపారు.
‘‘నేను సాధారణ వ్యక్తిలానే ఉన్నాను. అన్ని పనులూ మామూలుగా చేయగలుగుతున్నాను’’ అని జేమ్స్ అన్నారు.
అమెరికాలో ముఖమార్పిడి చికిత్స చేయించుకున్న 19వ వ్యక్తి జేమ్స్. ప్రపంచంలో పూర్తిస్థాయిలో కంటి మార్పిడి చికిత్స చేయించుకున్న తొలి వ్యక్తీ ఈయనే. 46 ఏళ్ల జేమ్స్, గతంలో మిలటరీలో పని చేశారు.
కంటి నిర్మాణం, సున్నితత్వం, పనితీరు వల్ల కంటి మార్పిడి శస్త్రచికిత్సలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.
కంటికి మళ్లీ చూపు తెప్పించడంపై పరిశోధనలు చేయడానికి జేమ్స్ అవయవమార్పిడి చికిత్సను పరిశోధకులు పరిశీలిస్తున్నారని న్యూయార్క్ యూనివర్సిటీ ముఖమార్పిడి కార్యక్రమ డైరెక్టర్ డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్జ్ చెప్పారు.
ప్రస్తుతం జేమ్స్ తన కూతురు అలైస్‌ను కాలేజీకి పంపడంపై దృష్టి పెట్టారు.
‘‘ఈ ఏడాది నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది’’ అని ఆయన అన్నారు.
‘‘నాకు ఇంకో అవకాశం రావడం ఒక గొప్ప బహుమానంగా భావిస్తున్నాను. నేను జీవితంలో ఒక్క క్షణాన్నీ వృథా చేయను’’ అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














