‘ఖరీదైన కారు, విలాసవంతమైన ఇల్లు’ - చైనా కోసం గూఢచర్యం చేసిన జంటకు దక్కిన బహుమతులు

లిండా సన్, క్రిస్టోఫర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గూఢచర్యం కేసులో లిండా సన్, ఆమె భర్త క్రిస్టోఫర్‌లను అరెస్ట్ చేశారు. తర్వాత వారికి బెయిల్ లభించింది
    • రచయిత, సైమ్ కైబ్రల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చైనా కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

కోవిడ్ సమయంలో న్యూయార్క్ ప్రభుత్వం నిర్వహించిన ఒక అధికారిక ఆన్‌లైన్ సమావేశానికి చైనా సర్కారుకు యాక్సెస్ ఇచ్చారని లిండా సన్‌పై ఆరోపణలు వచ్చాయి.

నేరారోపణలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆ సమయంలో చైనా గూఢచారి లిండా సన్, అమెరికాలో అండర్ కవర్ ఏజెంట్‌గా ఉన్నారు.

ఆమె దాదాపు 14 ఏళ్లుగా అమెరికాలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్‌కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి స్థాయికి చేరుకున్నారు.

41 ఏళ్ల లిండా సన్ తన పదవిని చైనా అధికారులకు సహాయం చేయడానికి ఉపయోగించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు.

తైవాన్ దౌత్యవేత్తలు, న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లిండా సన్ అడ్డుకున్నారని.. బీజింగ్‌కు అంతర్గత పత్రాలను చేరవేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

దీనికి బదులుగా లిండా సన్, ఆమె భర్త క్రిస్టోఫర్‌ హూలకు చైనా లక్షల డాలర్ల విలువైన బహుమతులు అందజేసిందన్న ఆరోపణ కూడా ఉంది.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
లిండా సన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తన లాయర్‌తో కలిసి బ్రూక్లిన్ కోర్టు బయటకు వస్తున్న లిండా సన్

అత్యంత జాగ్రత్తగా....

చైనా అందజేసిన డబ్బుతో ఆమె న్యూయార్క్‌లో 41 లక్షల డాలర్ల (సుమారు 34 కోట్ల రూపాయల) విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

హవాయి రాష్ట్రంలోని హోనోలులులో కూడా వీరు 21 లక్షల డాలర్ల(సుమారు 17.5 కోట్ల రూపాయల) విలువైన మరో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ జంట కొత్త మోడల్ ఫెరారీ రోమా స్పోర్ట్స్ కారు సహా అనేక లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది.

మంగళవారం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో వీరిద్దరూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

విదేశీ ఏజెంట్లుగా నమోదు చేసుకోవడం, వీసా మోసాలు, మనీ లాండరింగ్ సహా అన్ని ఇతర ఆరోపణలను వారు తోసిపుచ్చారు.

అమెరికా చట్టాల ప్రకారం ఇతర దేశాలు, రాజకీయ పార్టీలు లేదా వాటి ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు విదేశీ ఏజెంట్లుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి.

లిండా సన్

ఫొటో సోర్స్, Getty Images

చైనా అధికారులు, ప్రతినిధుల కోరిక మేరకు తాను పనిచేసిన విషయాన్ని లిండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో చైనా కాన్సులేట్ అధికారులను న్యూయార్క్ ప్రభుత్వ నాయకులకు పరిచయం చేశారనేది లిండాపై వచ్చిన ప్రధాన ఆరోపణ.

కోవిడ్‌కు సంబంధించిన ఒక మీటింగ్ కాల్‌లో లిండా రహస్యంగా ఒక చైనా అధికారిని చేర్చారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

"న్యూజెర్సీ మాజీ సెనేటర్ బాబ్ మెనెండెజ్‌తో పాటు సీనియర్ అధికారులపై విదేశీ ప్రభుత్వాల నుంచి బహుమతులు స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఆందోళనకరం’’ అని బీబీసీతో న్యూయార్క్ ప్రభుత్వ మాజీ న్యాయవాది హోవార్డ్ మాస్టర్ అన్నారు.

అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తైవాన్ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలను కూడా లిండా అడ్డుకున్నారని ఆమెకు వ్యతిరేకంగా సమర్పించిన ప్రభుత్వ దస్తావేజుల్లో పేర్కొన్నారు.

2016లో తైవాన్‌కు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనకుండా న్యూయార్క్‌కు చెందిన ఒక అగ్ర రాజకీయ నాయకుడిని తప్పించిన తర్వాత లిండా చైనా అధికారికి ఒక సందేశాన్ని పంపారు. అందులో ‘‘ఇక్కడంతా సరిగ్గానే జరిగింది’’ అని లిండా రాశారు.

2019లో తైవాన్ అధ్యక్షుడి న్యూయార్క్ పర్యటన సందర్భంగా, బీజింగ్ అనుకూల నిరసనల్లో లిండా పాల్గొనడం కనిపించింది.

బాతు మాంసంతో చేసిన వంటకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాల్టెడ్ డక్ వంటకాన్ని లిండా తల్లిదండ్రుల ఇంటికి 16 సార్లు పంపించారని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

బాతు మాంసం సహా...

ప్రభుత్వ న్యాయవాది వెల్లడించిన వివరాల ప్రకారం, గూఢచర్యం చేసినందుకు లిండా, ఆమె భర్తకు చైనా అధికారులు చాలా డబ్బు చెల్లించారు. చైనా పర్యటన ఖర్చులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కచేరీలు, స్పోర్ట్స్ ఈవెంట్లకు సంబంధించిన టిక్కెట్లు, ఇతర షో లకు సంబంధించిన టిక్కెట్లను కూడా వారికి ఇచ్చారు.

ఇవే కాకుండా లిండాకు వరుసకు సోదరుడయ్యే ఒక వ్యక్తికి ఉద్యోగం, చైనా ప్రభుత్వ అధికారికి చెందిన ప్రైవేట్ షెఫ్ వండిన నాన్‌జింగ్ సాల్టెడ్ డక్ డిష్‌ను హోం డెలివరీ చేశారు.

కోర్టు పత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ వంటకాన్ని 16 సార్లు ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు.

మంగళవారం ఉదయం లాంగ్ ఐలాండ్‌లోని వారింటికి వెళ్లిన ఫెడరల్ ఏజెంట్లు లిండా, ఆమె భర్తను 10 నేరారోపణలపై అరెస్ట్ చేశారు.

"మేం ఈ ఆరోపణలను కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మా క్లయింట్‌లు ఈ అభియోగాలపై ఆందోళన చెందుతున్నారు’’ అని లిండా న్యాయవాది జారోఫ్ సోరఫ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏపీ పేర్కొంది.

తర్వాత కోర్టు వారిద్దరినీ బెయిల్‌పై విడుదల చేసింది. ఇప్పుడు వీరిద్దరూ అమెరికాలోని కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రయాణించగలరు.

న్యూయార్క్‌లోని చైనా కాన్సులేట్ ప్రతినిధులను సంప్రదించవద్దని లిండాను కోర్టు ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)