హ్వాల్దిమిర్: ‘రష్యన్ గూఢచారి’గా నిపుణులు అనుమానించిన ఈ తిమింగలాన్ని కాల్చి చంపారా?

ఫొటో సోర్స్, Helene O Barry
- రచయిత, టామ్ మెక్‌ఆర్థర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నార్వే తీరంలో ఒక బెలూగా జాతి తిమింగలాన్ని కాల్చి చంపారని జంతు హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ‘హ్వాల్దిమిర్’ అనే నిక్‌నేమ్ ఉన్న ఈ తిమింగలం కళేబరం నార్వే తీరంలో తేలుతూ కనిపించింది.
ఈ తిమింగలం ఒంటి మీద బుల్లెట్ గాయాలు కనిపించాయని, దీన్ని కాల్చి చంపారని, ఇది తీవ్రమైన నేరమని జంతు హక్కుల సంఘాలు ఆరోపించాయి.
‘మేము హ్వాల్దిమిర్‌కు న్యాయం చేస్తాం.’ అని ‘వన్‌వేల్’ అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలు రెజీనా హాగ్ సోషల్ మీడియా ప్రకటనలో అన్నారు.
ఐదేళ్ల కిందట నార్వేజియన్ జలాల్లో కనిపించి, చాలా ఫేమస్ అయిన ఈ బెలూగా జాతి తిమింగలాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వన్‌వేల్ అనే సంస్థ ఏర్పాటైంది.
అప్పట్లో ఈ తిమింగలం ఒంటి మీద ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఎక్విప్‌మెంట్’ అని రాసి ఉన్న బెల్ట్, దానికి ఒక కెమెరా తగిలించి ఉండటంతో ఇది రష్యా తరఫున గూఢచర్యంలో పాల్గొంటోందని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, రష్యా ఈ ఆరోపణలపై ఎప్పుడూ స్పందించ లేదు.
నార్వేలో దీన్ని స్థానికులు ‘హ్వాల్దిమిర్’ అని వ్యవహరిస్తున్నారు. తిమింగలాన్ని నార్వే భాషలో "హ్వాల్" అంటారు. ఆ పదానికి రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి పేరు కలిపి వ్యంగ్యంగా హ్వాల్దిమిర్ అని పిలవడం మొదలుపెట్టారు.
ఈ ఆర్కిటిక్ వేల్ కళేబరం సెప్టెంబర్ 1న రిసావికా పట్టణం వద్ద తేలుతూ కనిపించింది. పరీక్షల కోసం దానిని సమీపంలోని ఓడరేవుకు తరలించారు.
హ్వాల్దిమిర్ మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ నార్వేజియన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నోవా (నార్వేజియన్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ రైట్స్), వన్‌వేల్ సంస్థలు తెలిపాయి.


ఫొటో సోర్స్, One Whale
శరీరంపై బుల్లెట్ గాయాలు ఎందుకున్నాయి?
‘దాని శరీరంపై అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయి.’ అని హాగ్ సోమవారం తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆరోపించారు.
సోషల్ మీడియాలో వన్‌వేల్ సంస్థ ప్రచురించిన ఫోటోలలో రక్తసిక్తమైన హ్వాల్డిమిర్ ఒంటి మీద గాయాలు కనిపించగా, అవి బుల్లెట్ గాయాలేనని ఆ సంస్థ ఆరోపించింది.
"తిమింగలం మీద గాయాలు చాలా దారుణమైనవి. వాటిని చూస్తే ఈ విషయంలో నేరం జరిగిందనడాన్ని తోసిపుచ్చలేం." అని నోవా డైరెక్టర్ సిరి మార్టిన్‌సెన్ అన్నారు.
కానీ, కళేబరాన్ని గుర్తించిన మెరైన్ మైండ్ సంస్థ మాత్రం ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
‘‘గాయాలను మేం కూడా చూశాం. కానీ మరణానికి కారణమేంటనేది ఇప్పుడే చెప్పలేం.’’ అని ఆ సంస్థ డైరెక్టర్ సెబాస్టియన్ స్ట్రాండ్ అన్నారు.
పరీక్షల కోసం హ్వాల్దిమిర్ కళేబరాన్ని నార్వేజియన్ వెటర్నరీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. పరీక్ష రిపోర్ట్ మూడు వారాలలో రావచ్చని ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Jorgen Ree Wiig
శిక్షణ పొందిన తిమింగలమా..?
హ్వాల్దిమిర్ వయసు సుమారు 15 సంవత్సరాలు ఉండొచ్చు. బెలూగా జాతి తిమింగలాలు సుమారు 60 ఏళ్ల వరకు జీవిస్తాయి.
దీని మరణంపై విచారణ ప్రారంభించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తామని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు.
హ్వాల్దిమిర్‌ను ప్రమాదాల నుంచి ఎలా రక్షించాలనే విషయంపై మెరైన్ మైండ్, వన్ వేల్‌లకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
గతంలో వన్‌వేల్ దాన్ని ఉత్తర నార్వేలోని బారెంట్స్ సముద్రానికి తరలించాలని డిమాండ్ చేసింది. ఇది బెలూగాలకు సహజమైన ఆవాసమని, ఆ తిమింగలం ఓడలను ఢీకొనే ప్రమాదం అక్కడ తక్కువగా ఉంటుందని వాదించింది. కానీ, ఇలా తరలించడం ప్రమాదకరమని మెరైన్ మైండ్ అన్నది.

ఫొటో సోర్స్, Jorgen Ree Wiig
హ్వాల్దిమిర్ మొదటిసారి 2019 ఏప్రిల్‌లో రష్యాకు చెందిన ఉత్తర నౌకదళం మర్మాన్స్క్‌కు 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగోయా ద్వీపం సమీపంలో నార్వేజియన్ పడవలకు కనిపించింది.
అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఎందుకంటే బెలూగాలు ఎత్తైన ఆర్కిటిక్‌కు దక్షిణంగా కనిపించడం చాలా అరుదు.
సైనిక అవసరాల కోసం డాల్ఫిన్‌ల వంటి సముద్ర జీవులకు ట్రైనింగ్ ఇచ్చిన చరిత్ర రష్యాకు ఉందని, ఇది కూడా అలాంటిదే కావచ్చని నిపుణులు అప్పట్లో అన్నారు. మర్మాన్స్క్ వాయువ్య ప్రాంతంలో తమ నౌకా స్థావరాలకు సమీపంలో తిమింగలాలకు శిక్షణ ఇచ్చే ప్రదేశాలను బారెంట్స్ అబ్జర్వర్ వెబ్‌సైట్ గుర్తించింది.
అయితే, హ్వాల్దిమిర్ గురించి రష్యా అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా, సముద్ర జీవులకు గూఢచారులుగా శిక్షణ ఇస్తున్నామన్న ఆరోపణలను రష్యా గతంలోనే తోసి పుచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














