అమెరికాలో జంతువులు, పక్షుల ప్రభావం లేకుండానే మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ

అంటువ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోస్టన్‌లోని ల్యాబ్‌లో పాలను పరీక్షించారు
    • రచయిత, కేలా ఎప్‌స్టీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జంతువులు, పక్షుల ప్రభావం ఏమీ లేకుండానే అమెరికాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడ్డారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మిస్సోరికి చెందిన ఆ రోగికి ఆసుత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బర్డ్ ఫ్లూ నుంచి కోలుకుంటున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది.

తాజా కేసుతో కలిపి ఈ ఏడాది అమెరికాలో 14 మంది బర్డ్ ఫ్లూ బారిన పడ్డారు. అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు, జంతువుల ప్రభావం లేకుండా, వాటికి దగ్గరగా సంచరించకుండా ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడిన తొలి కేసు ఇదేనని సీడీసీ చెప్పింది.

ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, సాధారణ ప్రజలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం అంత ఎక్కువగా ఏమీ లేదని సీడీసీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

ఆవుల్లో ఎక్కువగా..

బర్డ్ ఫ్లూ పక్షులు, జంతువుల్లో వ్యాపించే ఒక అంటు వ్యాధి. మనుషులు ఈ వ్యాధి బారిన పడడం అరుదు.

గతంలో కోళ్లు లేదా పశువుల నుంచి మనుషులకు సోకిన కేసులు నమోదయ్యాయి. కానీ మిస్సోరికి చెందిన ఈ రోగిపై మాత్రం బర్డ్ ఫ్లూ సోకిన జంతువుల ప్రభావం ఏ మాత్రం లేదు.

‘‘జంతువులు లేదా పక్షులతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఓ వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డ తొలి కేసు ఇదే’’ అని సీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఆ రోగి చికిత్స పొందుతున్నారు. ఫ్లూని తగ్గించే యాంటీవైరల్ మందులు తీసుకున్నారు.

అమెరికాలో ఈ ఏడాది ఆవుల్లో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చిలో పెద్ద సంఖ్యలో ఆవులు బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయి. ఈ నెల 3వ తేదీ నాటికి 14 రాష్ట్రాల్లో ఆవులకు బర్డ్ ఫ్లూ సోకిన కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది.

మిస్సోరిలో మాత్రం ఈ ఏడాది ఆవుల్లో బర్డ్ ఫ్లూ కనిపించలేదు. కోళ్లలో కనిపించింది. గతంలో మరికొన్ని పక్షులు ఈ వైరస్ బారిన పడ్డాయని అధికారులు చెప్పారు.

ఈ ఏడాది మార్చిలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిన విషయాన్ని అమెరికా అధికారులు కనుగొన్నారు. డెయిరీలో బర్డ్ ఫ్లూ బారిన పడ్డ ఆవుల నుంచి ఆయనకు వైరస్ వ్యాపించిందని గుర్తించారు.

1990లలో తొలిసారి చైనాలో బర్డ్ ఫ్లూ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటార్కిటికా సహా అన్ని ఖండాలకూ బర్డ్ ఫ్లూ వ్యాపించింది.

ప్రస్తుతం మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అంటున్నారు. అయితే చాలా ఏళ్లుగా ఈ వ్యాధి సోకుతున్న విధానాన్ని, వ్యాపిస్తున్న తీరును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపింది. సీ లయన్స్, సీల్స్, ఎలుగుబంట్లు వంటి అనేక రకాల జంతువులకు ఈ వైరస్ సోకింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)