121 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం, ఒకచోటకు చేరిన వారసులు-ఏం జరిగిందంటే....

- రచయిత, ఐమీ థామస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోస్టు చేసిన 121 ఏళ్ల తర్వాత అందిన ఒక పోస్టుకార్డు...ఆ కార్డు రాసిన, అది చేరిన వ్యక్తుల వారసులను ఒక్కచోటకు చేర్చింది.
ఎవార్ట్ అనే బాలుడు తన అక్క లిడియాకు 1903లో పంపిన ఆ పోస్ట్‌కార్డు ఈ నెలలో స్వాన్‌సీ బిల్డింగ్ సొసైటీకి చెందిన క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్‌కు వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల కుటుంబాలవారు తమ మూలాలను పరిశీలించుకుని తామంతా బంధువులమవుతామని గుర్తించగలిగారు.
‘‘ఇది ఒక రకంగా ఫ్యామిలీ రీయూనియన్ లాంటిది. అయితే ఈ కుటుంబానికి ఉన్న ఏకైక లింక్ వందేళ్ల కిందటి మా ఉమ్మడి పూర్వీకులే.’’ అని ఈ ఉత్తరం రాసిన ఎవార్ట్‌కు మనవడైన ఓ వ్యక్తి అన్నారు.


ఫొటో సోర్స్, Swansea Building Society
పోస్టుకార్డులో ఏముంది..?
పశ్చిమ సస్సెక్స్‌కు చెందిన 65 ఏళ్ల నిక్ డేవిస్, ఈ ఉత్తరం రాసిన ఎవార్ట్‌కు మనవడు అవుతారు. ఈ కార్డు ద్వారా కుటుంబ మూలాలు తెలుసుకుని కొత్త కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఓ అద్భుతంలా అనిపిస్తోందని డేవిస్ అన్నారు.
ఫిష్‌గార్డ్‌లోని తన తాత ఇంట్లో వేసవి సెలవులు గడపడానికి వెళ్లేటప్పటికి ఎవార్ట్ 13ఏళ్ల పిల్లవాడై ఉండొచ్చని డేవిస్ అభిప్రాయపడ్డారు.
ఎవార్ట్ అక్క లిడియా పోస్టుకార్డులు సేకరిస్తూ ఉండొచ్చని డేవిస్ భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ తన ఊరు స్వాన్‌సీలో ఉన్న అక్క లిడియాకు రాశారని డేవిస్ తెలిపారు.
‘‘నేను వాటిని సంపాదించలేకపోయాను. దీనికి జతను సేకరించడం అసాధ్యం. నేను సారీ చెబుతున్నాను. నువ్వు ఇంటి దగ్గర సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను.’’ అని ఎవార్ట్ ఆ పోస్ట్‌కార్డ్‌లో రాశారు.
తన తాత పోస్టుకార్డుల జత గురించి చెప్పి ఉండొచ్చని భావిస్తున్నట్లు డేవిస్ చెప్పారు.
రైలు చార్జీలు కాక, తన దగ్గర 10 షిల్లింగుల పాకెట్ మనీ ఉందని, ఇక్కడంతా బాగానే ఉందని ఎవార్ట్ ఆ పోస్టుకార్డులో రాశారు.

ఫొటో సోర్స్, Swansea Building Society
ఎవార్ట్, లిడియా ఎక్కడుండేవారు...?
1903లో 11 క్రాడాక్ స్ట్రీట్‌లో నివసించిన ఆరుగురు పిల్లల్లో లిడియా, ఎవార్ట్ అనే ఇద్దరు ఉన్నారు. వారు అక్కా తమ్ముళ్లు. ఆ ఆరుగురు పిల్లల తల్లిదండ్రులు జాన్ ఎఫ్ డేవిస్, మరియా డేవిస్. వృత్తిరీత్యా జాన్ ఎఫ్ డేవిస్ దర్జీ.
స్వాన్‌సీలో నివసిస్తున్న లిడియా బంధువులు 58ఏళ్ల హెలెన్ రాబర్ట్స్, 61 ఏళ్ల మార్గరెట్ స్పూనర్‌లు ఆ ఉత్తరంలో పేరును చూసి లిడియాను గుర్తించారు.
అలా ఒక్కొక్కరి గురించి ఆరా తీయగా వారి వారసులైన నలుగురు బంధువులు ఇప్పుడు జీవించి ఉన్నట్లు తేలింది.
ఈ దూరపు బంధువులు నలుగురు స్వాన్‌సీలోని పశ్చిమ గ్లామోర్గన్ ఆర్కైవ్స్ దగ్గర తొలిసారి కలుసుకున్నారు.
ఆరేళ్లగా తమ కుటుంబం మూలాల గురించి తెలుసుకుంటున్న హెలెన్ రాబర్ట్స్ తన బంధువులను కలుసుకున్న తర్వాత భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘చాలా ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే...ఇంతమంది కుటుంబ సభ్యులున్న విషయం నాకు తెలియదు.’’ అని ఆమె అన్నారు.
తమ వెనకటి తరాల గురించి వారిదగ్గరున్న సమాచారం, ఫోటోలు వంటివాటి ఆధారంగా వారంతా ఒకచోట కలుసుకోగలిగారు.
లిడియా, ఎవార్ట్‌లు స్వర్గం నుంచి ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారని హెలెన్ రాబర్ట్స్ అన్నారు.

ఫొటో సోర్స్, FAMILY PHOTO
పోస్టుకార్డు చేరడానికి ఇంత ఆలస్యం ఎందుకు?
మొదట 11 క్రాడాక్ స్ట్రీట్‌లోని ఇంటికి చేరిన ఆ పోస్ట్‌కార్డ్‌ను ఏ బైబిల్‌లోనో దాచి ఉంచొచ్చని, ఆ బైబిల్‌ను తర్వాత వేలంలో అమ్ముకొని ఉండొచ్చని, ఆ బైబిల్‌ను కొన్న వ్యక్తి దాన్ని తిరిగి పోస్ట్ చేసి ఉండొచ్చని, దీంతో ఆ పోస్టుకార్డు తిరిగి అదే అడ్రస్‌కు చేరి ఉంటుందని ఈ నలుగురు బంధువుల్లో ఒకరైన మార్గరెట్ స్పూనర్ భావిస్తున్నారు.
‘‘మా నాయనమ్మ ఒకతే కూతురని మేం అనుకున్నాం. ఆమెకు తోబుట్టువులు ఉన్నారన్న విషయం గురించి మేం ఆలోచించలేదు. తర్వాతే ఆ విషయం తెలిసింది.’’ అని నలుగురు బంధువుల్లో ఒకరైన ఫెయిత్ రెనాల్డ్స్ చెప్పారు.
‘‘బంధువులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తోంది.’’ అని రెనాల్డ్స్ అన్నారు.

ఫొటో సోర్స్, FAMILY PHOTO
ఈ ఉత్తరాన్ని ఆర్కైవ్స్‌లో ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు.
‘‘ప్రస్తుతం స్వాన్‌సీలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పోస్టుకార్డును ఇక్కడ ఉంచడమే సముచితమని మేం భావిస్తున్నాం. ఆ కుటుంబంతో, ఆర్కైవ్ సర్వీసుతో మాట్లాడిన తర్వాత ఈ ఆలోచనకు వచ్చాం.’’ అని స్వాన్ సీ బిల్డింగ్ సొసైటీకి చెందిన హెన్రీ డార్బీ చెప్పారు.
‘‘చరిత్ర అంటే ఓ బాక్స్‌లో కూర్చుని...అక్కడే ఉండిపోయేది కాదు. చరిత్ర మనచుట్టూ తిరిగేది.’’ అని ఆర్కైవిస్ట్ ఆండ్రూ డుల్లీ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














