వెస్ట్ బ్యాంక్‌లో వేగంగా విస్తరిస్తున్న అక్రమ అవుట్‌పోస్టులు, బీబీసీ పరిశీలనలో ఏం తేలిందంటే..

- రచయిత, జేక్ టచ్చి, జియాద్ అల్-క్వట్టన్, ఎమిర్ నాదెర్, మాథ్యూ కాసెల్
- హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్
‘‘50 ఏళ్లు అక్కడే నివసించాను. ఆ ప్రాంతాన్ని నా ఇల్లుగా భావించాను. కానీ గత ఏడాది అక్టోబర్‌లో ఓ వ్యక్తి నా తలకు తుపాకీ గురిపెట్టి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించారు’’ అని పాలస్తీనాకు చెందిన వృద్ధురాలు అయేషా షతయ్యే చెప్పారు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో తన ఇంటికి దగ్గరగా అక్రమ సెటిలర్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేసిన తర్వాత, 2021 నుంచి హింస, బెదిరింపులు మొదలయ్యాయని, అవి అంతకంతకూ పెరిగిపోయాయని, చివరకు తమను ఆయుధాలతో బెదిరించే స్థాయికి చేరాయని ఆమె బీబీసీతో చెప్పారు.
ఇటీవలి సంవత్సరాల్లో ఈ అవుట్‌పోస్టుల సంఖ్య వేగంగా పెరిగిందని బీబీసీ విశ్లేషణలో తేలింది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌లో కనీసం 196 అవుట్‌పోస్టులు ఉన్నాయి. వాటిలో 29 ఏడాది కాలంలో ఏర్పాటు చేసినవే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని అవుట్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.
అవుట్‌పోస్టులంటే పొలాలు, నివాస సముదాయాలు, లేదా కారావాన్‌ల గ్రూప్స్.. ఇలా ఏవైనా కావొచ్చు. అవుట్‌పోస్టులకు బౌండరీలంటూ ఏమీ లేవు. అంతర్జాతీయ నిబంధనలతో పాటు ఇజ్రాయెల్ చట్టం ప్రకారం ఇవి అక్రమమే.
అయితే ఈ అవుట్‌పోస్టులకు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలున్నాయి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను బీబీసీ పరిశీలించింది. కొత్త అక్రమ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం డబ్బు సమకూర్చినట్లు ఆ పత్రాలు చెబుతున్నాయి.
ఇతర వర్గాల ద్వారా కూడా బీబీసీ ఈ విషయంపై పరిశీలన జరిపింది. తనను బెదిరించారని అయేషా చెప్పిన సెటిలర్ అవుట్‌పోస్టును బీబీసీ పరిశీలించింది.
సెటిల్‌మెంట్‌లతో పోలిస్తే అవుట్‌పోస్టులు వేగంగా, పెద్ద మొత్తంలో భూమి ఆక్రమించుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అవుట్‌పోస్టుల వల్ల పాలస్తీనీయులపై హింస, వేధింపులు వంటివి పెరిగిపోతున్నాయని అంటున్నారు.


ఫొటో సోర్స్, Matthew Cassel/bbc
పాలస్తీనీయులపై పెరుగుతున్న హింస
వెస్ట్ బ్యాంక్‌లో ఎన్ని అవుట్‌పోస్టులు ఉన్నాయన్నదానిపై అధికారిక సమాచారం లేదు. అయితే, ఇజ్రాయెలీ సెటిల్‌మెంట్ వ్యతిరేక వాచ్‌డాగ్స్ పీస్ నౌ, కెరెమ్ నవోట్, పాలస్తీనా అథారిటీ సేకరించిన జాబితాను, లొకేషన్లను బీబీసీ పరిశీలించింది.
ఈ ప్రాంతాల్లో నిర్మించిన అవుట్‌పోస్టుల సమాచారం తెలుసుకోవడానికి, ఏ సంవత్సరంలో వాటిని ఏర్పాటు చేశారో ధ్రువీకరించుకోవడానికి బీబీసీ వందలాది శాటిలైట్ చిత్రాలను పరిశీలించింది. సోషల్ మీడియా పోస్టులు, ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రచురణలు, వార్తల్లో పేర్కొన్న ఆధారాల ద్వారా ఈ అవుట్‌పోస్టులు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయని నిర్ధరించింది.
బీబీసీ పరిశీలించిన మొత్తం 196 అవుట్‌పోస్టుల్లో సగానికి పైగా(89) 2019 సంవత్సరం నుంచి నిర్మించినవేనని తేలింది.
వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా ప్రజలపై పెరుగుతున్న హింసకు, ఈ అవుట్‌పోస్టుల్లో కొన్ని కారణం. పాలస్తీనీయులపై హింసను ప్రేరేపిస్తున్నాయని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 8 మంది అతివాద సెటిలర్లపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
‘‘పాలస్తీనా ప్రజలపై ఊహించలేనంత స్థాయిలో ఉన్న సెటిలర్ల హింసను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి నేర సంస్కృతిని, దానికి బాధ్యులయ్యేవారిని కట్టడి చేయాలని ఇజ్రాయెల్ అధికారులను కోరుతున్నాం’’ అని యూకే విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

సెటిలర్లపై ఆంక్షలు
ఎక్కువ మంది సెటిలర్లు తమ దేశ పౌరులని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ ఆర్మీ మాజీ కమాండర్ అవై మిజ్రాహి చెప్పారు. అయితే అవుట్‌పోస్టులు పాలస్తీనీయులపై హింసకు కారణమవుతున్నాయన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.
బ్రిటన్ ఆంక్షలు విధించిన అతివాద సెటిలర్లలో మోషే షర్విట్ ఒకరు. తన తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించారని అయేషా చెప్పింది మోషే షర్విట్ గురించే. మోషే ఏర్పాటు చేసిన అవుట్‌పోస్టు అయేషా ఇంటికి 800 మీటర్ల కన్నా తక్కువ దూరంలోనే ఉంది. మోషేపై మార్చిలో అమెరికా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. ఆయన తన అవుట్‌పోస్టు కేంద్రంగా పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపిస్తున్నారని అమెరికా ఆరోపించింది.
‘‘ఆయన మా జీవితాన్ని నరకంలా మార్చివేశారు’’ అని అయేషా అన్నారు. ఇప్పుడామె నబ్లస్ పట్టణానికి దగ్గరలోని టౌన్‌లో తన కొడుకుతో కలిసి నివసిస్తున్నారు.

సెటిల్‌మెంట్స్, అవుట్‌పోస్టులకు తేడా ఏంటి?
సెటిల్‌మెంట్స్‌లాగా అవుట్‌పోస్టులకు ఇజ్రాయెల్ అధికారిక అనుమతి ఉండదు. బాగా పెద్దగా ఉండే సెటిల్‌మెంట్‌లు పట్టణ ప్రాంతాల్లా కనిపిస్తాయి. ఇజ్రాయెల్ చట్టం ప్రకారం వెస్ట్ బ్యాంక్ అంతటా సెటిల్‌మెంట్‌లుగా పిలిచే యూదుల కాలనీలు నిర్మించారు.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అవుట్‌పోస్టులు, సెటిల్‌మెంట్‌లు రెండూ అక్రమమైనవే. ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలు నివసించడంపై అంతర్జాతీయంగా నిషేధం ఉంది. అయితే వెస్ట్ బ్యాంక్‌లో నివసించే యూదు సెటిలర్లలో ఎక్కువమంది ఆ ప్రాంతంతో తమకు మతపరమైన, చారిత్రక అనుబంధం ఉందని చెబుతుంటారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన అత్యున్నత న్యాయస్థానం జులైలో ఓ ప్రకటన చేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో కొత్త సెటిల్‌మెంట్ కార్యకలాపాలన్నింటినీ ఇజ్రాయెల్ నిలిపివేయాలని, సెటిలర్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పింది. అయితే, ఆ ఆదేశాలను ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. ‘‘ఆ అభిప్రాయం ప్రాథమికంగా తప్పు, ఒకరివైపే నిలిచినట్టు ఉంది’’ అని ఇజ్రాయెల్ ఆరోపించింది.
అవుట్‌పోస్టులకు చట్టపరమైన ఆమోదం లేనప్పటికీ అవి పెద్ద సంఖ్యలో ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న ఆధారాలు అంతగా లేవు.
ఇజ్రాయెల్ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలున్న రెండు సంస్థలు వెస్ట్ బ్యాంక్‌లో కొత్త అవుట్‌పోస్టుల ఏర్పాటు కోసం డబ్బు, స్థలం సమకూర్చడంపై బీబీసీకి కొత్త ఆధారాలు దొరికాయి.
ఆ రెండు సంస్థల్లో ఒకటి వరల్డ్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూజెడ్‌వో). ఈ అంతర్జాతీయ సంస్థను స్థాపించి శతాబ్దానికిపైగా కాలం దాటింది. ఇజ్రాయెల్ ఏర్పాటులో ఈ సంస్థ పాత్ర కీలకం. ఇది సెటిల్‌మెంట్ డివిజన్. 1967 నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న భూభాగంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాంతాల నిర్వహణ బాధ్యత ఈ సంస్థదే. ఇజ్రాయెలీ పబ్లిక్ ఫండ్స్‌తోనే దీనిని ఏర్పాటు చేశారు.
పీస్ నౌ సేకరించిన సమాచారాన్ని బీబీసీ విశ్లేషించగా అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడానికి సెటిల్‌మెంట్ డివిజన్లు తరచుగా భూమి సమకూరుస్తున్నాయని తేలింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడంపై నిషేధం విధించామని, భూమిని వ్యవసాయం కోసమే ఉపయోగిస్తున్నామని డబ్ల్యూజెడ్‌వో చెబుతోంది. కానీ, నాలుగు అక్రమ అవుట్‌పోస్టులు నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Matthew Cassel/BBC
అవుట్‌పోస్టులకు పరోక్షంగా ఇజ్రాయెల్ ఆర్థిక సాయం
ఈ ఒప్పందాల్లో ఒకదానిపై 2018లో ఝవి బార్ యోసెఫ్ సంతకం చేశారు. మోష్ షర్విట్‌లాగే ఆయనపై కూడా బ్రిటన్, అమెరికా దేశాలు ఆంక్షలు విధించాయి. పాలస్తీనీయులపై హింసను ప్రేరేపించడం, వారిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆయా దేశాలు ఆంక్షలు విధించాయి.
వ్యవసాయం, పశువుల మేత పెంపకం కోసం కేటాయించిన భూమిలో అక్రమ అవుట్‌పోస్టులు నిర్మిస్తున్న విషయం తెలుసా? అని డబ్ల్యుజెడ్‌వోను బీబీసీ ప్రశ్నించగా ఆ సంస్థ స్పందించలేదు. ఝవి బార్ యోసఫ్‌ను సైతం బీబీసీ ప్రశ్నించినా సమాధానం దొరకలేదు.
మరో కీలక సెటిలర్ సంస్థ అమానాకు సంబంధించిన రెండు డాక్యుమెంట్లను కూడా బీబీబీ బయటపెట్టింది. అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి అమానా సంస్థ భారీ మొత్తంలో లోన్లు ఇచ్చినట్టు తేలింది.
అమానా సంస్థ ఒక సెటిలర్‌కు 2,70,000 డాలర్లు (రెండు కోట్ల 25 లక్షల రూపాయలకు పైగా) లోన్ రూపంలో ఇచ్చినట్టు తేలింది. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం అక్రమంగా పరిగణించే అవుట్‌పోస్టులో గ్రీన్‌హౌస్ నిర్మించడానికి ఈ లోను మంజూరైనట్టు ఇజ్రాయెల్ కోర్టు పత్రాల్లో ఉంది.
1978లో అమానా సంస్థను నెలకొల్పారు. వెస్ట్ బ్యాంక్ అంతటా సెటిల్‌మెంట్ల నిర్మాణం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కలిసి ఈ సంస్థ పనిచేస్తుంది.
అయితే అవుట్‌పోస్టులకు సైతం అమానా మద్దతు ఉందని ఆధారాలు బయటపడుతున్నాయి.
2021లో జరిగిన ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్‌కు సంబంధించిన ఒక రికార్డింగ్‌ను ఒక సామాజిక కార్యకర్త బయటపెట్టారు. ‘‘గడచిన మూడేళ్లలో మనం చేసిన ఒక ఆపరేషన్... పశువుల పెంపకం కేంద్రాన్ని విస్తరించడం (అవుట్‌పోస్టు)’’ అని ఆ రికార్డింగ్‌లో అమానా సీఈవో జీవ్ హెవర్ చెబుతున్నారు.
‘‘ఇప్పుడు మన నియంత్రణలో ఉన్న ఆ ప్రాంతం దాదాపు రెండు సెటిల్‌మెంట్‌లకన్నా ఎక్కువ’’ అని హెవర్ అందులో అన్నారు.
పాలస్తీనా ప్రజలపై హింసను ప్రేరేపించడం, వారిని అస్థిరపరచడం, వారి ఆస్తులకు నష్టం కలిగించడం వంటి ఆరోపణలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంస్థల్లో అమానా కూడా ఉంది. ఆ ఆంక్షల్లో అవుట్‌పోస్టుల గురించి ప్రస్తావించలేదు.
అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి లోన్లు ఎందుకిస్తున్నారని అమానాను బీబీసీ ప్రశ్నించగా ఆ సంస్థ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Matthew Cassel/BBC
సెటిల్‌మెంట్‌లకన్నా పెద్దగా అవుట్‌పోస్టులు
ఇజ్రాయెల్ ప్రభుత్వం అవుట్‌పోస్టులను చట్టబద్ధం చేసి వాటిని సెటిల్‌మెంట్‌లుగా మార్చడమనే విధానం కూడా కొనసాగుతోంది. గత ఏడాది 10కి పైగా అవుట్‌పోస్టులను చట్టబద్ధం చేసే ప్రక్రియను ఇజ్రాయెల్ ప్రభుత్వం మొదలు పెట్టింది. మరో ఆరు అవుట్‌పోస్టులను చట్టబద్ధం చేసింది.
సెటిలర్ అయిన మోషే షర్విట్ ఫిబ్రవరిలో తనను తన ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటేశారని అయేషా చెప్పారు. తన అవుట్‌పోస్టులో మోషే తనను బంధించారని, స్థానిక సిబ్బంది ఇదంతా కెమెరాలో చిత్రీకరించారని ఆమె తెలిపారు.
ఏడు చదరపు కిలోమీటర్ల భూమిని ఇప్పుడు తాము నియంత్రిస్తున్నామని మోషే చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతం వెస్ట్ బ్యాంకులో వేల మంది ప్రజలున్న పెద్దపెద్ద పట్టణ సెటిల్‌మెంట్‌ల కన్నా పొడవైనది.
అవుట్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించే కొందరు సెటిలర్ల ప్రధాన లక్ష్యం.. పాలస్తీనా కమ్యూనిటీలను ఆధారంగా చేసుకుని కీలకమైన ప్రాంతాలపై పట్టు సాధించడమేనని పీస్ నౌకు చెందిన హాగిట్ ఆఫ్రాన్ చెప్పారు.
అవుట్‌పోస్టుల్లో నివసించే సెటిలర్లు తమను తాము భూ పరిరక్షకులుగా భావించుకుంటుంటారని, ఈ ప్రాంతం నుంచి పాలస్తీనా ప్రజలను తరమివేయడమే వారి రోజువారీ పని అని ఆమె వివరించారు.
2021లో అవుట్‌పోస్టు ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి మోషే షర్విట్ తమను హింసించారని, బెదిరింపులకు పాల్పడ్డారని అయేషా చెప్పారు.
దశాబ్దాలుగా పచ్చిక బయళ్లలో తన భర్త నబిల్ మేకలను మేపుతున్నారని అయేషా తెలిపారు. 2021లో మోషే షర్విట్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయాన్నారు. తన భర్త మేకలను తోలుకుని పచ్చిక బయళ్లలోకి వెళ్లగానే షర్విట్, ఆయన అనుచరులు తమ వాహనంలో అక్కడికి చేరుకుంటారని, మేకలను అక్కడి నుంచి తరిమివేయాలని చెబుతుంటారని అయేషా వివరించారు.
‘‘ప్రభుత్వమో, పోలీసులో లేదా న్యాయమూర్తో చెబితే అలాగే అక్కడి నుంచి పశువులను తీసుకెళ్తానని నేను చెప్పేవాడిని. అప్పుడాయన నేనే ప్రభుత్వాన్ని, నేనే న్యాయమూర్తిని, నేనే పోలీసుననేవారు’’ అని నబిల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Matthew Cassel/BBC
నిబంధనలు అతిక్రమించి సెటిల్‌మెంట్‌లు
ఇజ్రాయెల్ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలున్న శక్తిమంతమైన గ్రూపుల నుంచి అతివాద సెటిలర్లకు డబ్బు, భూమి సమకూరుతున్నాయి. సెటిలర్లు ఆ భూమిలో అక్రమ అవుట్‌పోస్టులు నిర్మిస్తున్నట్టు బీబీసీ ఐ పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, Yotam Ronen/BBC
బీబీసీ పరిశోధనలో ఏం తేలిందంటే...
మోషే షర్విట్ వంటి సెటిలర్లు వ్యవసాయ భూమి వరకే పరిమితం కాకుండా పాలస్తీనా రైతులను భయపెడుతున్నారని, వారిని అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నారని పాలస్తీనా అథారిటీకి చెందిన వాల్ రెసిస్టెన్స్ కమిషన్ అధికారి మోయాద్ షాబాన్ చెప్పారు.
‘‘పాలస్తీనా ప్రజలు అసలేమీ లేని స్థితికి చేరుకున్నారు. వాళ్లు తినలేరు, కనీసం మంచినీళ్లు కూడా తాగలేరు’’ అని ఆయన చెప్పారు.
గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత మోషే షర్విట్ హింసాత్మక కార్యకలాపాలు మరింత ఎక్కువగా పెరిగాయని ఏరియల్ మోరాన్ చెప్పారు. సెటిలర్ల విషయంలో ఏరియల్ మోరాన్ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు.
షర్విట్ పొలాల్లోకి వస్తూ గతంలో పిస్టల్ తెచ్చుకునేవారు. ఇప్పుడాయన భుజం మీద రైఫిల్ పెట్టుకుని కార్యకర్తలను, పాలస్తీనా ప్రజలను బెదిరిస్తున్నారు.
మోషే షర్విట్ బెదిరింపులకు భయపడి అక్టోబరు 7 తర్వాత అయేషా వంటి ఎన్నో కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి.
వెస్ట్ బ్యాంక్‌లో సెటిలర్ల హింస ఊహించలేని స్థాయికి చేరిందని ఐక్యరాజ్య సమితి మానవ వ్యవహారాల సమన్వయ కార్యాలయం తెలిపింది.
‘10 నెలల కాలంలో పాలస్తీనీయులపై 1,100 దాడులు జరిగాయి. ఏడుగురు చనిపోయారు. 230 మందికి పైగా గాయపడ్డారు. పాలస్తీనా ప్రజలు చేసిన ప్రతిదాడుల్లో ఐదుగురు సెటిలర్లు చనిపోయారు. 17 మంది గాయపడ్డారు’’ అని ఆ కార్యాలయం చెప్పింది.
ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాత 2023లో అయేషా, నబిల్ తమ వస్తువులు కొన్ని తీసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్లారు.
వాళ్లు ఇంటికెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేవు. కిచెన్‌లో కప్ బోర్డులు ఊడిపోయాయి. లివింగ్ రూమ్‌లో ఉన్న సోఫాలన్నింటినీ ఎవరో కత్తితో చించేశారు.
‘‘నేను ఆయన్ను ఏమీ అనలేదు. ఆయన మా ఇంటిని ఎందుకిలా చేయడం?’’ అని అయేషా ప్రశ్నిస్తున్నారు.
మోషే మీద వచ్చిన ఆరోపణలపై స్పందించాలని బీబీసీ పలుమార్లు ఆయన్ను సంప్రదించింది. కానీ ఆయన స్పందించలేదు.
2023 జులైలో బీబీసీ బృందం ఆయన్ను తన అవుట్ పోస్టు దగ్గర కలిసింది. అయేషా వంటి పాలస్తీనా ప్రజలను తిరిగి వాళ్లింటికి రానిస్తారా? అని అడగ్గా మేమేం మాట్లాడుతున్నామో తనకు అర్థం కావడం లేదని, అసలు తాను మోషే షర్విట్ కాదని ఆయన బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














