అక్కడి యువత ఎందుకు వైరస్‌లను శరీరంలోకి ఎక్కించుకుంటోంది?

దోమలు, మలేరియా, వ్యాక్సీన్, ప్రయోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దోమ
    • రచయిత, ల్యూక్ మింట్జ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తగినంత డేటా ఆధారంగా వివిధ వ్యాధులకు వ్యాక్సీన్‌లను, చికిత్సలను రూపొందించడానికి దశాబ్దాలు కాకపోయినా సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు ఒక వివాదాస్పద విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో ప్రాణాంతకమైన వైరస్‌లు, పరాన్నజీవులు, బ్యాక్టీరియాలను వలంటీర్ల శరీరంలోకి ఎక్కిస్తారు.

తెలిసితెలిసి రోగాన్ని ఒంట్లోకి ఎక్కించుకోవడం మామూలు విషయం కాదు. కానీ, ప్రతి సంవత్సరం 6 లక్షలమందికి పైగా ప్రజల మరణానికి కారణమైన మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే దోమలతో కుట్టించుకోవడానికి అనేకమంది యువతీ యువకులు ముందుకు వచ్చారు.

మలేరియా వ్యాప్తిని తగ్గించడానికి కొత్త వ్యాక్సీన్‌ను పరీక్షించేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్‌ 21 అని పిలిచే వ్యాక్సీన్ పరీక్షలో పాల్గొనేందుకు కొందరు యువతీయువకులు స్వచ్ఛందంగా అంగీకరించారు. ఈ ట్రయల్స్ ప్రారంభ దశలోనే మంచి ఫలితాలు రావడం శాస్త్రవేత్తలలో కూడా ఉత్సాహాన్ని నింపింది.

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ఈ ఇన్‌స్టిట్యూట్ 2001నుండి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ 2017లో తొలిసారి ఈ తరహా ట్రయల్స్ నిర్వహించింది. ప్రతి వలంటీర్‌ను ప్రయోగశాలలోకి తీసుకెళతారు. అక్కడ టేబుల్ మీద చిన్న కుండ ఉంటుంది. దానిపైన గుడ్డ కప్పి ఉంటుంది. లోపల ఉత్తర అమెరికా నుండి దిగుమతి చేసుకున్న కొన్ని దోమలు ఉన్నాయి. వాటిలో మలేరియా పరాన్నజీవి ఉంది.

వలంటీర్ తన చేతిని కుండలోపల పెట్టగానే మూత చుట్టూ గుడ్డను కప్పేస్తారు. దాంతో దోమలు వలంటీర్ చేతిపై కుడతాయి. రక్తాన్ని పీల్చుకునేటప్పుడు దోమల లాలాజలం ద్వారా మలేరియా క్రిమి వలంటీర్ రక్తంలోకి ప్రవేశిస్తుంది.

వలంటీర్లకు మలేరియా రాకుండా తమ టీకా రక్షిస్తుందన్నది పరిశోధకుల అంచనా.

ఒక వలంటీర్ ఉద్దేశపూర్వకంగా వ్యాధికి గురయ్యే ప్రయోగాన్ని హ్యూమన్ చాలెంజ్ ట్రయల్ అని అంటుంటారు.

అయితే, కావాలని ఇలా రోగాన్ని ఎక్కించుకోవడం ప్రమాదమని, ప్రాణాలపట్ల నిర్లక్ష్యంతో చేసే సాహసమని అనిపించవచ్చు. కానీ, ఇటీవలి దశాబ్దాలలో ఈ ధోరణి చాలాచోట్ల కనిపించడమే కాక, వైద్యరంగంలో అనేక విజయాలకు కూడా కారణమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మలేరియాను నివారించడంలో ఆర్21వ్యాక్సీన్‌ 80% వరకు ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు చేసిన రెండో మలేరియా వ్యాక్సీన్‌ కూడా.

ప్రతి సంవత్సరం మలేరియా బారినపడి వేలమంది మరణిస్తున్న ఐవరీ కోస్ట్, దక్షిణ సూడాన్‌లోని శిశువులకు ఈ టీకా మొదటి డోసులను ఇచ్చారు.

మలేరియా దోమలతో కుట్టించుకుంటున్న వలంటీర్ల వల్లే ఈ ప్రయోగాలు సక్సెస్ అయినట్లు, వ్యాక్సీన్ ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

"గత 20 సంవత్సరాలుగా చేస్తున్న చాలెంజ్ ట్రయల్స్‌లో అద్భుతమైన పురోగతి ఉంది" అని వ్యాక్సినాలజీ ప్రొఫెసర్, జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ అడ్రియన్ హిల్ చెప్పారు. సాధారణ ఫ్లూ నుంచి కోవిడ్ వరకు వ్యాక్సీన్‌ల తయారీలో ఈ పరిశోధన నమూనాలు ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు.

మరికొన్ని వ్యాధి నిరోధకాలపై పరిశోధన జరిపేందుకు ఈ వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని, మరింత ప్రభావవంతమైన టీకాలు తయారుచేయాలని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటికే జికా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధికారకాలపై ప్రయోగించి చూశారు. భవిష్యత్తులో హెపటైటిస్ సీ వంటి వైరస్‌లపై పరిశోధన జరపాలనుకుంటున్నారు.

చాలెంజ్ ట్రయల్స్‌కు సంబంధించిన వారి వివరాలు సెంట్రల్ రిజిస్టర్‌లో నమోదు కానప్పటికీ, రెండు దశాబ్దాలుగా కనీసం డజను వ్యాక్సీన్‌లకు వారు సేవలందించారని హిల్ చెప్పారు. 1980 నుంచి 2021 వరకు 308 హ్యూమన్ చాలెంజ్ స్టడీస్‌ నిర్వహించినట్లు ఒక నివేదికలో వెల్లడైంది.

సరైన పద్ధతిలో ఈ అధ్యయనాలు నిర్వహిస్తే వీటి వల్ల కలిగే నష్టాలకన్నా లాభాలు ఎక్కువగా ఉంటాయని హిల్ చెప్పారు. కానీ, కొన్ని పరిశోధనలు వైద్యరంగంలో నైతిక విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, అయితే నిషేధించిన కొన్ని ప్రయోగాలను ఇటీవలి కాలంలో విస్తృతంగా నిర్వహిస్తుండడం పట్ల ప్రముఖ శాస్త్రవేత్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

R21వ్యాక్సీన్, దోమలు,డెంగ్యూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, R21వ్యాక్సీన్

ఇటువంటి ట్రయల్స్ ఎందుకు నిర్వహించాలో తెలుసుకోవాలంటే వైద్య చరిత్రలోని కొన్ని చీకటి కోణాలను అవగతం చేసుకోవాలి. నాజీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు అప్పట్లో విమర్శల పాలయ్యాయి. నిర్బంధంలో ఉన్న ఖైదీల శరీరంలోకి క్షయ, ఇతర వ్యాధికారక క్రిములను బలవంతంగా ఎక్కించేవారు. 1940ల మధ్యలో 1308మందికి సిఫిలిస్, ఇతర లైంగిక వ్యాధుల క్రిములను సంక్రమింపజేసిన గ్వాటెమాలలోని అమెరికన్ వైద్యుల చర్యల గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు.

1950, 1960లలో న్యూయార్క్ నగరంలోని విల్లోబ్రూక్ స్టేట్ స్కూల్‌కి చెందిన 50 మందికి పైగా వికలాంగ పిల్లలను హెపటైటిస్‌కు గురిచేశారన్న విషయం 1970 ప్రారంభంలో బయటపడింది.

వైద్యరంగంలో నైతిక విలువలకు భిన్నంగా నిర్వహించే పరీక్షలకు ఇది పెద్ద ఉదాహరణగా నిలిచింది. అయితే విల్లోబ్రూక్ ప్రయోగాలు కూడా హెపటైటిస్‌ సోకడానికి ఒకటి కంటే ఎక్కువ వ్యాధికారకాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి.

అయినప్పటికీ, ఈ ఉదాహరణలేవీ వలంటీర్లను ప్రభావితం చేయలేకపోయాయని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎథిక్స్ డైరెక్టర్ డేనియల్ సల్మాసీ చెప్పారు. ఆయన గ్వాటెమాల సిఫిలిస్ ప్రయోగాలపై ఏర్పాటు చేసిన యూఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్‌లో సభ్యుడు కూడా.

1960ల చివరలో,1970ల ఆరంభంలో అధికాదాయ దేశాలలోని శాస్త్రవేత్తలు మెడికల్ ట్రయల్స్ కోసం మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి వలంటీర్లకు అవరోధంగా మారాయి. ఫలితంగా చాలెంజ్ ట్రయల్స్ నిర్వహించడం కష్టమైంది.

అయితే, క్రమంగా మహమ్మారుల నుంచి పెరుగుతున్న ముప్పుతో శాస్త్రవేత్తలు మరోసారి హ్యూమన్ స్టడీస్ మీద దృష్టి పెట్టారు.

ఇటువంచి అధ్యయనాలు వేగంగా నిర్వహించడం చాలా అవసరం. కానీ సంప్రదాయక వ్యాక్సీన్‌ ట్రయల్‌లో వలంటీర్‌లకు వ్యాక్సీన్‌ లేదా ప్లాసిబో వ్యాక్సీన్ ఇస్తారు. ఆపై సాధారణ జీవితం గడపమని చెబుతారు. కొంతమంది వలంటీర్లు వైరస్ బారిన పడతారని, తద్వారా వ్యాక్సీన్‌ల ప్రభావాన్ని పరీక్షించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశిస్తారు. ఇది నెమ్మదిగా జరిగే క్లిష్టమైన ప్రక్రియ.

ఒకపక్క కొన్ని కోట్లమంది ప్రజలు వ్యాధితో బాధపడుతుండగా, ఒక మామూలు అంటువ్యాధి నిరోధక వ్యాక్సీన్‌ డెవలప్ చేయడానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. వీటి కోసం కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

అందుకే ట్రయల్స్‌లో వేగం పెంచారు. టీకాలు వేసిన వలంటీర్‌కు నేరుగా వైరస్‌ ఎక్కించడం ద్వారా వైరస్ సోకే వరకూ వేచిచూసే సమయాన్ని తగ్గిస్తున్నారు.

"సమయం ముఖ్యమైనది - కొన్నిసార్లు మనం చాలా వేగంగా పనిచేయాలి, చాలెంజ్ ‌ట్రయల్స్ సమర్ధమైనవి. సమయం, డబ్బును ఆదా చేయడంతో పాటు ప్రాణాలను కాపాడతాయి." అని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో పనిచేసే మెడిసిన్ ప్రొఫెసర్ ఆండ్రియా కాక్స్ అన్నారు.

సాల్మొనెల్లా, షిగెల్లా వంటి అరుదైన వ్యాధికారక క్రిములపై అధ్యయనం చేసేటప్పుడు మానవులపై పరిశోధించడం చాలా ఉపయోగకరమని ఆమె చెప్పారు. ‘‘సంప్రదాయ ట్రయల్స్ జరిపితే సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే స్వచ్ఛంద సేవకులు వ్యాధికి గురయ్యే వరకు శాస్త్రవేత్తలు వేచి ఉండాలి. ఇది చాలా సమయం తీసుకునే వ్యవహారం.’’ అని ఆమె అన్నారు.

చాలెంజ్ ట్రయల్స్‌ని సమర్థంగా నిర్వహించగలిగితే అవి హెచ్చరిక వ్యవస్థలుగా కూడా పని చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మొదటి దశ వ్యాక్సీన్‌లు పొందినవారికి అప్పుడప్పుడు దంతాల సమస్యలు వస్తాయని కాక్స్ చెప్పారు. ఈ లక్షణాల గురించి శాస్త్రవేత్తల సమక్షంలో పరీక్షించడం మంచిదని అన్నారు.

దోమల ద్వారా సంక్రమించే డెంగీ జ్వరం నుండి రక్షించడానికి 2016 లో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం రూపొందించిన డెంగ్వాక్సియా వ్యాక్సీన్‌ను ఆమె ఉదహరించారు.

2022లో, అమెరికా పరిశోధకులు 20 మంది ఆరోగ్యవంతమైన మహిళలకు రెండు రకాల జికా వైరస్ వ్యాధికారకాలను ఎక్కించారు. వీరిలో గర్భవతులు, పాలిచ్చే తల్లులు లేరు.

అలాగే ఇదే సంఖ్యలో పురుషులకు కూడా వ్యాధికారకాలు ఎక్కించారు. జికా వైరస్ పెద్దవాళ్లలో కొద్దిగానే ప్రభావం చూపిస్తుంది. కానీ గర్భధారణ సమయంలో జికా వైరస్ సోకిన తల్లిదండ్రులకు జన్మించిన శిశువులపై అసాధారణ ప్రభావం చూపుతుందని తేలింది. కొన్ని సందర్భాల్లో, పెద్దలలో నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా బయటపడింది.

దోమల మందు స్ప్రే, దోమల నివారణ, పొగ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దోమల మందు స్ప్రే చేస్తున్న వ్యక్తి

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుటికీ మానవ అధ్యయనాల్లో అప్పుడప్పుడూ ఇబ్బందులు ఉంటాయి. 2012లో, జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక వలంటీర్ మలేరియా సోకిన ఏడు రోజుల తర్వాత, కచ్చితంగా చెయ్యాల్సిన మెడికల్ చెకప్‌కు హాజరుకాలేదని హిల్ చెప్పారు. ‘‘వారం రోజులపాటు ఆయన ఆచూకీ లభించ లేదు. చివరికి ఆయన బాగానే ఉన్నాడన్న విషయం ఎథిక్స్ కమిటీకి వివరించాం. అయితే ఇటువంటి సంఘటనలు వికటిస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.’’ అని హిల్ అన్నారు.

చికిత్స చేయగల వ్యాధులతో మాత్రమే చాలెంజ్ ట్రయల్స్ నిర్వహించాలన్న ఆలోచన ‘అర్థంలేని నైతికత’ అని న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బయో ఎథిక్స్ ప్రొఫెసర్ అయిన ఆర్థర్ కాప్లాన్ అభిప్రాయపడ్డారు.

వైరస్,పరిశోధన,మైక్రోగ్రావిటీ,ట్రయల్స్‌,మహమ్మారి

ఫొటో సోర్స్, Imperial College London/Thomas Angus

ఫొటో క్యాప్షన్, ముక్కుద్వారా వైరస్ ఎక్కిస్తున్న ఫోటో

‘‘పరోపకారం, ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించడం అనేది వలంటీర్లు పరిశోధనలో భాగం కావడానికి చట్టబద్ధమైన కారణం." అని కాప్లాన్ అన్నారు. వలంటీర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొంటే వారికి కొంత లబ్ధి కూడా చేకూరుతుందని ఆయన చెప్పారు.

అలాగే కోవిడ్ మహమ్మారి సోకినప్పటికీ కొంతమంది ఎందుకు అనారోగ్యం బారిన పడకుండా ఉండగలుగుతున్నారనే అధ్యయనంలో ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే వారి ముక్కులోనే రోగనిరోధక శక్తిని కలిగిన యంత్రాంగం ఉందని, దాంతో వారి శరీరంలో వైరస్ ప్రవేశించలేదని వివరించారు.

కానీ, ఈ అధ్యయనం వివాదాన్నికూడా సృష్టించింది. కోవిడ్-19కి ఎటువంటి నివారణ లేదు. పైగా దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

36 మంది యువకులకు వారి ముక్కు ద్వారా వైరస్‌ను పంపించారు. లండన్ ఆసుపత్రిలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచారు.

‘‘వలంటీర్ల ముక్కు, గొంతులో వైరస్ క్రిములు పెరగడాన్ని మేం గమనించాం. సుమారు 10 రోజుల పాటు వారు ఆ వ్యాధితోనే ఉన్నారు." అని ఈ రిపోర్టుకు సహ రచయిత, ఇంపీరియల్ కాలేజీ లండన్‌లోని క్లినికల్ లెక్చరర్ అనికా సింగనాయగం చెప్పారు.

ఈ అధ్యయనం ఇంటివద్దే వ్యాధి నిర్ధరణ చేసే పరీక్షలు నిర్వహించడానికి వీలు కల్పించేలా కచ్చితమైన ఫలితాలను ఇచ్చిందని చెప్పారు.

యూకే, చాలెంజ్ ట్రయల్స్‌, ఇన్‌ఫ్లూయెంజా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)

ఫొటో సోర్స్, Sean Cousins

ఫొటో క్యాప్షన్, సీన్ కజిన్స్

యూకేలోని సౌతాంప్టన్‌లో సీన్ కజిన్స్ అనే 33 ఏళ్ల కొరియర్ బాయ్ 2014- 2020 మధ్య మూడు చాలెంజ్ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇందుకోసం ఆయనకు 14,280 డాలర్ల (సుమారు రూ. 12లక్షలు)కు పైగా ముట్టజెప్పారు.

రెండు ట్రయల్స్‌లో ఇన్‌ఫ్లూయెంజా బారినపడ్డారు సీన్ కజిన్స్. మూడోది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ). అయితే, డబ్బులు ఇవ్వకపోయినా తాను ఈ ట్రయల్స్‌లో పాల్గొనేవాడినని ఆయన అంటున్నారు.

‘‘కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి కొంత టైమ్ కేటాయించాలని అనుకుంటున్నా. కుదిరితే మానవజాతికి సహాయం చేయాలన్నది నా ఆశయం." అని సీన్ చెప్పారు.

శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారు: భవిష్యత్తులో మనం మరిన్ని చాలెంజ్ ట్రయల్స్‌ చేయాల్సి రావచ్చు. ఉపయోగించే వ్యాధికారకాల జాబితా కూడా పెరుగుతుంది. కొన్ని ప్రమాదకరమైనవి, చికిత్స చేయలేనివి కూడా ఉండొచ్చు. మా ప్రయోగాలు మరింత విస్తృతంగా జరుగుతాయని అనుకుంటున్నాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇవి ఆగిపోతాయి.

సరైన ప్రణాళికలతో పనిచేస్తే శతాబ్దాలుగా మానవాళిని పీడిస్తున్న వ్యాధులకు చాలెంజ్ ట్రయల్స్ వేగవంతమైన, మెరుగైన టీకాలను డెవలప్ చేయడంలో తోడ్పడతాయని చాలామంది శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)