బంగ్లాదేశ్: ‘పాకిస్తాన్, చైనాల వైపు అడుగులు వేస్తున్న తాత్కాలిక ప్రభుత్వం’.. భారత్‌కు ఇబ్బందికరమేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కథనం
- హోదా, బీబీసీ హిందీ
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయి నెల రోజులవుతోంది.
ఆమె అధికారం కోల్పోయిన తరువాత బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం, అక్కడి కొన్ని ప్రధాన పార్టీలు పాకిస్తాన్, చైనాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న దిశగా సంకేతాలిస్తున్నాయి.
నెల రోజుల కిందటి వరకు భారత్‌తో సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా, పాకిస్తాన్‌లతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటోంది.
బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ సెప్టెంబర్ 1న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మంత్రి నహిద్ ఇస్లాంతో భేటీ అయ్యారు.
సయ్యద్ అహ్మద్ పాకిస్తాన్‌తో 1971 నాటి సమస్యను పరిష్కరించుకునే విషయంపై నహిద్ ఇస్లాంతో మాట్లాడారంటూ ఓ అధికారిని ఉటంకిస్తూ ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రిక తన కథనంలో పేర్కొంది.
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య 1971 యుద్ధం కొన్నేళ్లుగా ప్రధాన సమస్యగా ఉంది.
ఈ భేటీకి ముందు, ఆగస్టు 30న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్‌తో మాట్లాడారు.


ఫొటో సోర్స్, Getty Images
చైనా చొరవ
1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ ఏర్పాటును చైనా వ్యతిరేకించింది.
అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చైనా వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
తాత్కాలిక ప్రభుత్వం కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్‌లో ‘జమాత్ ఎ ఇస్లామీ’పై నిషేధం ఎత్తివేసింది. ‘జమాత్ ఎ ఇస్లామీ’ని షేక్ హసీనా ప్రభుత్వం 2013లో నిషేధించింది.
‘జమాత్ ఎ ఇస్లామీ’ బంగ్లాదేశ్‌లో అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ. ఈ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ చాలా బలంగా ఉంది.
షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఉద్యమంలో ఈ సంస్థ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు.
బంగ్లాదేశ్‌లో హింసను, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ‘జమాత్ ఎ ఇస్లామీ’పై ఆరోపణలు ఉన్నాయి.
భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ‘జమాత్ ఎ ఇస్లామీ’ బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక అల్లర్లను ప్రేరేపించిందని, ఇది భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అని ఆరోపణలున్నాయి.
భారత దేశం గతంలో బంగ్లాదేశ్‌కు ఇష్టం లేని పనులు చేసిందని ‘జమాత్ ఎ ఇస్లామీ’ అధినేత షఫీక్ ఉర్ రెహమాన్ అన్నారు.
బంగ్లాదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదలకు భారత్‌దే బాధ్యత అని ఆయన ఆరోపించారు.
“బంగ్లాదేశ్ గత భారాన్ని(భారత్ ప్రభావాన్ని) వదిలించుకుని అమెరికా, చైనా, పాకిస్తాన్‌తో బలమైన సంబంధాలను కొనసాగించాలి” అని రెహమాన్ అన్నారు.

ఫొటో సోర్స్, X/BANGLADESHHIGHCOMMISSION
హసీనా నిష్క్రమణతో చైనాకు అవకాశం దొరికిందా ?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం ఎత్తి వేయడంతో ‘జమాత్ ఎ ఇస్లామీ’ నాయకులు చైనా రాయబారిని కలిశారు.
“చైనా బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌కు, ఆ దేశ ప్రజలకు అండగా చైనా నిలుస్తుంది” అని చైనా రాయబారి యావో వెన్ చెప్పారు.
షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో ఆమె చైనా కంటే భారత్‌తో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
2024 జులైలో షేక్ హసీనా తన చైనా పర్యటనను మధ్యలోనే ముగించుకుని బంగ్లాదేశ్ తిరిగి వచ్చారు.
బంగ్లాదేశ్ చేరుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ తీస్తా ప్రాజెక్టు నిర్మాణంపై భారత్, చైనా ఆసక్తిగా ఉన్నాయని.. అయితే ఆ ప్రాజెక్టును భారత్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
సహజంగానే చైనాకు ఈ ప్రకటన నచ్చకపోయి ఉండొచ్చు.
షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడం చైనా, పాకిస్తాన్‌కు అవకాశం లాంటిదని విశ్లేషకులు అంటున్నారు.
చైనా రాయబారి, ‘జమాత్ ఎ ఇస్లామీ’ నేతల భేటీని కూడా ఇదే కోణంలో చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
"బంగ్లాదేశ్ ఏర్పాటును చైనా వ్యతిరేకించింది. బంగ్లాదేశ్‌ను చైనా చివరికి గుర్తించింది” అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేశారు.
“బంగ్లాదేశ్ ఏర్పాటును జమాత్ కూడా వ్యతిరేకించింది. బంగ్లాదేశీయులకు మద్దతిస్తామన్న చైనా మాటలు బూటకం. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం చూసిన తర్వాత కూడా చైనా తన దేశంలో అధికార మార్పిడిని కోరుకోదు. 1989ని (తియానన్మెన్ స్క్వేర్) గుర్తు చేసుకోండి. జమాత్ కూడా వీగర్ ముస్లింలను పక్కన పెట్టి చైనీయులకు మద్దతిస్తుంది”అని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు.
మారుతున్న బంగ్లాదేశ్ వైఖరిపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
"బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం హింసాత్మక ఇస్లాంవాదులకు స్వేచ్ఛను ఇస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడలేదు. ఆ ప్రభుత్వానికి మెజారిటీ లేదు” అని ఆయన సోషల్ మీడియాలో రాశారు.
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రాసిన పుస్తకాలు వివాదాస్పదంగా మారడంతో ఆమె కొన్నేళ్ల నుంచి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లలేకపోయారు.
ఆమె 2011 నుంచి భారత్‌లో ఉంటున్నారు.
"మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు భారత దేశానికి, మహిళలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం" అని తస్లీమా నస్రీన్ చెప్పినట్లుగా ‘మింట్’ తన కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్?
షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగాలేవు.
2018 బంగ్లాదేశ్ సార్వత్రికఎన్నికలలో పాకిస్తాన్ హైకమిషన్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
మధ్యంతర ప్రభుత్వంలోని సభ్యులతో సమావేశం చాలా ముఖ్యమైనదని పాకిస్తాన్ హైకమిషనర్ చెప్పారు. ఈ సమావేశంలో అనేక రంగాలలో సహకారం గురించి చర్చించినట్లు చెప్పారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ గురించి బ్రహ్మ చెల్లానీ ‘ద జపాన్ టైమ్స్’ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు .
"2022 ప్రాంతంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు అనిపించింది. కానీ నేడు పరిస్థితి వేరు. బంగ్లాదేశ్ ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 వేల కోట్లు), ప్రపంచ బ్యాంకు నుండి ఒకటిన్నర బిలియన్ డాలర్లు(సుమారు రూ. 12 వేల 500 కోట్లు), ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి బిలియన్ డాలర్లు(సుమారు రూ. 8 వేల కోట్లు) రుణం కావాలని కోరింది. అభివృద్ధి విషయంలో పాకిస్తాన్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ పరిస్థితి భిన్నంగా ఉంది” అని ఆయన ఆ వ్యాసంలో రాశారు.
ఆయన ఇంకా ఏం రాశారంటే.. "బంగ్లాదేశ్ పాకిస్తాన్ మార్గాన్ని అనుసరిస్తుందా అనే ప్రశ్నలేవనెత్తుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సైన్యం ఎన్నికల్లో పాత్ర పోషిస్తోంది. బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వెనుక తాను కీలకంగా వ్యవహరించాలని ఆ దేశ సైన్యాధిపతి భావిస్తున్నారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హింసాత్మక మత సంస్థలపై చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. తాత్కాలిక ప్రభుత్వ చర్యలు సరైన దిశలో సాగడం లేదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌గా మారుతుంది” అని బ్రహ్మ చెల్లానీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1971- భారత్ పాకిస్తాన్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు
బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు.
నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో బంగ్లాదేశ్‌ను గుర్తించకపోవడంతో ఆయనతో మాట్లాడేందుకు కూడా ముజిబుర్ రెహమాన్ నిరాకరించారు.
పాకిస్తాన్ కూడా మొదట బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని తిరస్కరించింది.
ఆ తర్వాత పాకిస్తాన్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.
1974 ఫిబ్రవరిలో, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ శిఖరాగ్ర సమావేశం లాహోర్‌లో జరిగింది. ఆ సమయంలో భుట్టో ప్రధానమంత్రిగా ఉన్నారు. భుట్టో ముజిబుర్ రెహమాన్‌కు అధికారిక ఆహ్వానాన్ని పంపారు.
తొలుత ముజిబుర్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించినా తర్వాత అంగీకరించారు.
ఈ సమావేశం తరువాత, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన అడ్డంకులను పరిష్కరించడానికి మూడు దేశాలు ఏప్రిల్ 9, 1974న ఒప్పందంపై సంతకాలు చేశాయి.
1974లో బంగ్లాదేశ్‌ను గుర్తిస్తూ జుల్ఫికర్ అలీ భుట్టో .. ‘అల్లా కోసం ఈ దేశ పౌరుల తరఫున మేం బంగ్లాదేశ్‌ను గుర్తిస్తున్నాం. బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ నుంచి ప్రతినిధి బృందం వస్తుంది. ఏడు కోట్ల మంది ముస్లింల తరపున వచ్చే ఒక బృందం మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది’ అన్నారు.
“బంగ్లాదేశ్‌ను గుర్తించడం నాకు నచ్చిందని చెప్పడం లేదు. నేను ఆనందంగా ఉన్నానని కూడా చెప్పడం లేదు. ఇది మంచి రోజు కాకున్నప్పటికీ వాస్తవాన్ని మనం మార్చలేం. బంగ్లాదేశ్‌ను గుర్తించాలని పెద్ద దేశాలు మనకు సలహా ఇచ్చాయి. అయితే మనం పెద్ద దేశాలు, భారత్‌కు తలవంచడం లేదు. అయితే ఇది చాలా ముఖ్యమైన సమయం. ముస్లిం దేశాలు సమావేశం అవుతున్నప్పుడు మన మీద ఒత్తిడి లేదని చెప్పడం లేదు. బంగ్లాదేశ్‌ను గుర్తించాలని కోరుతున్న దేశాలు మన శత్రువులు కాదు. అవి మన మిత్ర దేశాలు, మన సోదర దేశాలు” అని జుల్ఫికల్ అలీ భుట్టో అన్నారు.
ఇది జరిగి దాదాపు 50 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకొన్న తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకరినొకరు ఆలింగనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ రెండు దేశాలు కలిసిన చోట చైనా కూడా ఉండటం భారత్‌కు ఆందోళన కలిగించే విషయం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














