షేక్ హసీనా విషయంలో భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటి?

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని నరేంద్ర మోదీ
    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు వచ్చి సుమారు నెల రోజులవుతోంది. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.

షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది భారత్.

అయితే, ఇప్పటి వరకు షేక్ హసీనా విషయంలో భారత్ ఇంకా తన తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా దౌత్య, అధికారిక పాస్‌పోర్టును ఇటీవల రద్దు చేసింది.

దీంతో ఆమె భారత్‌లో ఉండటానికి చట్టపరమైన ఆధారం ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.

ఈ పరిస్థితుల్లో భారత్ ముందు మూడు మార్గాలు ఉన్నట్లు దిల్లీలోని కొందరు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు ‘బీబీసీ’తో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ మూడు ఆప్షన్లు ఏంటి?

మొదటి ఆప్షన్.. షేక్ హసీనాకు భారత్‌లో కాకుండా వేరే దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేయడం. అది ఆమె భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేని ఏర్పాటు అయి ఉండాలి.

రెండో ఆప్షన్.. షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా భారత్‌లోనే ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోవడం. తక్షణ అవసరాలకు అనుగుణంగా ఆమె భారత్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేయడం.

మూడో ఆప్షన్.. పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూసి ఆ తరువాత షేక్ హసీనాను మళ్లీ బంగ్లాదేశ్ పంపించడం. అక్కడ ఆమెను మళ్లీ రాజకీయాల్లోకి పంపేలా భారత్ ప్రయత్నించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ మూడో ఆప్షన్‌కు కారణాలున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఇంకా అక్కడ ఉనికిలోనే ఉంది. హసీనా తన దేశానికి వెళ్లిన తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు.

అయితే, భారత్‌కు మొదటి ఆప్షన్ మంచిదని దౌత్య వ్యవహారాల నిపుణులు కొందరు సూచిస్తున్నారు.

షేక్ హసీనా భారత్‌లోనే ఉంటే అది దిల్లీ-ఢాకాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

భారత్-బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం కింద షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా నుంచి అభ్యర్థన వస్తే భారత్ దాన్ని తిరస్కరించవచ్చు.

న్యాయపరమైన విచారణ కింద ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించడం భారత్‌‌కు అంత మంచి ఆప్షన్ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

బంగ్లాదేశ్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఏ దేశానికి పంపొచ్చు?

షేక్ హసీనా అత్యవసరంగా భారత్‌కు రావడం, బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఆగస్టు 6నభారత పార్లమెంటులో మాట్లాడారు.

ఆ సమయంలో ఆయన హసీనా భారత్‌లో ఉండడానికి సంబంధించి ‘ప్రస్తుతానికి’ అనే పదాన్ని వాడారు. కానీ, అప్పటి నుంచి హసీనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనను చేయలేదు.

కానీ, ఆమెను సురక్షితంగా మరో దేశానికి పంపేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

అయితే, ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చి, ఎక్కువ కాలం ఇక్కడే ఉంచేందుకు భారత్ సైతం వెనుకాడటం లేదు.

‘‘మంచి జరుగుతుందని మేం ఆశిస్తున్నాం, అలాగే ఏదైనా చెడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు అన్నారు.

అంటే, షేక్ హసీనా విషయంలో మంచి జరుగుతుందని ఇంకా భారత్ ఆశిస్తోందని తెలుస్తోంది.

షేక్ హసీనా అమెరికా ప్రయాణానికి ప్రారంభంలోనే అవరోధాలు ఎదురు కావడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇతర చిన్న యూరోపియన్ దేశాలతో భారత్ చర్చలు జరిపింది.

కానీ ఈ విషయంలో సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని ప్రస్తుతం ఖతార్‌తో భారత్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మధ్య ప్రాచ్యంలో ఖతార్ ప్రభావవంతమైన దేశం.

రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలంటూ తనకు తాను షేక్ హసీనా అమెరికాను కానీ, మరే ఇతర దేశాలను కానీ ఇప్పటి వరకు కోరలేదు. ఆమె తరఫున భారత ప్రభుత్వమే అన్ని రకాల చర్చలు జరుపుతోంది.

భారత్ చొరవతో ఏదైనా దేశం ఆమెకు ఆశ్రయమిచ్చేందుకు అంగీకరిస్తే, అప్పుడామె దిల్లీ నుంచి ఆ దేశానికి ఏ పాస్‌పోర్టుపై వెళ్తారనేదీ ఇప్పుడు మరో ప్రశ్న.

అయితే, దీనిపై ఢాకాలో భారత మాజీ రాయబారి రివా గంగూలీ దాస్ అభిప్రాయం వేరేగా ఉంది.

‘‘ఇది అంత పెద్ద సమస్య కాదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టు రద్దు చేస్తే, భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ లేదా పర్మిట్ సాయంతో ఆమె వేరే దేశానికి వెళ్లొచ్చు. ఉదాహరణకు, టిబెట్ శరణార్థులలో వేలాది మందికి పాస్‌పోర్టు లేదు. అలాంటి విదేశీయులకు భారత ప్రభుత్వం ట్రావెల్ డాక్యుమెంట్(టీడీ) జారీ చేస్తుంది. దాంతో, వారు ఇతర దేశాలకు వెళ్లగలుగుతున్నారు’’ అని రివా గంగూలీ దాస్ తెలిపారు.

ఒకవేళ ఏదైనా దేశం ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిస్తే, భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్‌పై ఆ దేశానికి తేలికగా వెళ్లి, వీసా తీసుకుని అక్కడే ఉండవచ్చు అన్నారు రివా.

‘‘షేక్ హసీనా రాజకీయంగా ప్రముఖ నాయకురాలు. ఆమె విషయంలో చాలా నిబంధనలు సరళతరం కావొచ్చు’’ అని రివా అన్నారు.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ శరణార్థి

భారత్ అంతకుముందు టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు, నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షాకు, అఫ్గానిస్తాన్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ నజీబుల్లాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిచ్చింది.

షేక్ హసీనా కూడా 1975లో తన కుటుంబంతో కలిసి భారత్‌లో ఆశ్రయం పొందారు. కానీ, ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకునే ముందు, భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దీని ప్రభావం ఎంత ఉంటుందనే విషయాన్ని దిల్లీ ఆలోచిస్తుంది.

దలైలామాకు 1959లో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చిన తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాల్లో నెలకొన్న ప్రతికూల ప్రభావం 65 ఏళ్ల తర్వాత కూడా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

షేక్ హసీనాకు ఇక్కడే రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిస్తే, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకునే విషయంలో అవరోధాలు ఎదురుకావొచ్చని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నారు.

రాజకీయ పునరావాస సాయం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనా పాత్ర ఇంకా ముగిసిపోలేదని చాలా మంది భావిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆమె రాజకీయ పునరాగమనానికి భారత్ సాయం చేయడం మంచిదని చెబుతున్నారు.

‘‘బంగ్లాదేశ్ రాజకీయాల్లో మూడు సార్లు(1981, 1996, 2008ల్లో) హసీనా అద్భుతమైన పునరాగమనం చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఈ మూడుసార్లలో ప్రతిసారీ ఆమె కోలుకోలేరని చాలామంది భావించారు. కానీ, వారు ఆలోచించేది తప్పని ఆమె నిరూపించారు’’ అని ఒక అధికారి బీబీసీతో అన్నారు.

అయితే, ఆ సమయంలో ఆమె వయసుకు, ఇప్పటికి తేడా ఉంది. ఇప్పుడామె వయసు 75 ఏళ్లు దాటిందనేది కొందరి అభిప్రాయం.

దీనికి స్పందించిన ఒక అధికారి, ‘‘వయసు ఆమెకు అనుకూలంగా లేదు. కానీ, మహమ్మద్ యూనస్‌ 84 ఏళ్ల వయసులో తొలిసారి తన జీవితంలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యతను చేపట్టినప్పుడు, షేక్ హసీనా విషయంలో మనమెందుకు అలా ఆలోచించాలి. ఆయన కంటే ఆమె చిన్నవారు’’ అని అన్నారు.

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌పై ఎలాంటి నిషేధం లేదు. దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్ ఆ పార్టీకి ఉంది.

పార్టీ సుప్రీం నేతగా, రాబోయే రోజుల్లో షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్తారని కొందరు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఆమెపై నమోదైన కేసుల్లో ఆమె కోర్టు విచారణను ఎదుర్కోవచ్చని, వచ్చే ఎన్నికల్లో ఆమె పాల్గొనకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, తిరిగి ఆ దేశానికి వెళ్లి, రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడాన్ని ఆపడం కష్టమని అన్నారు.

అవామీ లీగ్ పునరుద్ధరణకు భారత్ సాయం చేస్తుందని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్, పొలిటికల్ సైంటిస్ట్ శ్రీరాధ దత్ అన్నారు.

‘‘అవామీ లీగ్ కచ్చితంగా రాజకీయ శక్తిగా ఉంటుంది. రాజకీయాల నుంచి పూర్తిగా ఆ పార్టీని తీసేయడం కుదరని పని. కానీ, పార్టీలో పెద్ద మొత్తంలో మార్పులు రావడం తప్ప మరో మార్గం లేదు’’ అని బీబీసీతో అన్నారు.

బంగ్లాదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ పోటీ చేయాలనే ఆలోచనను ఆమె ఆచరణాత్మకంగా చూడటం లేదు.

దౌత్య పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, MOFA-BD

ఫొటో క్యాప్షన్, వీసా లేకుండా దౌత్య పాస్‌పోర్టుపై భారత్‌కు వచ్చిన షేక్ హసీనా

పాస్‌పోర్టు రద్దయిన తర్వాత

షేక్ హసీనా భారత్‌కు వచ్చినప్పుడు, ఆమెకు దౌత్య పాస్‌పోర్టు ఉంది. దీని సాయంతోనే, వీసా లేకుండా ఇన్ని రోజులు ఆమె భారత్‌లో ఉండగలిగారని బీబీసీ బంగ్లా రిపోర్టు చేసింది.

అయితే, షేక్ హసీనాతో పాటు ఎంపీలు, మంత్రులందరి దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్టు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ప్రకటించింది.

దీంతో పాస్‌పోర్టు లేకుండా షేక్ హసీనా ఎలా భారత్‌లో ఉంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

దీనిపై భారత మాజీ దౌత్యవేత్త పినాక్ రంజన్ చక్రవర్తి బీబీసీతో మాట్లాడారు.

పినాక్ రంజన్ సుదీర్ఘకాలం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రొటోకాల్ డివిజన్‌కు హెడ్‌గా పనిచేశారు.

షేక్ హసీనా టెక్నికల్‌గా పూర్తిగా చట్టబద్ధంగానే భారత్‌లో ఉంటున్నారని తెలిపారు.

‘‘వీసా-రహిత సమయంలో లేదా మరేదైనా ప్రత్యేక పరిస్థితుల కింద ఆమె ఇక్కడకు వచ్చుంటే, భారత్‌కు వచ్చినప్పుడు ఆమె పాస్‌పోర్టుపై అరైవల్ స్టాంప్ వేస్తారు. భారత్‌కు రావడం, ఇక్కడ నివసించడం చట్టబద్ధమని ఈ అరైవల్ స్టాంప్ అర్థం. ఆ తర్వాత ఆమె పాస్‌పోర్టును ఆ దేశం రద్దు చేసినా భారత్‌కు నష్టమేమీ ఉండదు’’ అని తెలిపారు.

దౌత్య మార్గాల ద్వారా పాస్‌పోర్టు రద్దు విషయాన్ని భారత్‌కు తెలిపినా, ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవచ్చు.

‘‘దీని తర్వాత కూడా, షేక్ హసీనాకు వాలిడ్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వం ఆమె అప్లికేషన్‌ను అంగీకరించకపోతే, ఆమె దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి, ఇక్కడ ఉండటాన్ని చట్టబద్ధంగానే భారత్ చూస్తుంది’’ అని పినాక్ రంజన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)