షేక్ హసీనాను వెనక్కి పంపాలని బంగ్లాదేశ్ అడిగితే భారత్ ఏం చేస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభజ్యోతి ఘోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, బంగ్లాదేశ్ మధ్య 2013 నుంచి ఖైదీల అప్పగింత ఒప్పందం అమల్లో ఉంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నారు. భారతదేశం షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా కోరారు.
ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరితే భారత్ ఏం చేస్తుంది?
“మనం ఖైదీల అప్పగింత గురించి మాట్లాడాల్సి వస్తే, అది పూర్తిగా ఊహాజనితమైన ప్రశ్న. అలాంటి పరిస్థితి వస్తే, ఊహాతీతమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంప్రదాయం లేదు” అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రంధిర్ జైస్వాల్ చెప్పారు.
ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం దాట వేస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్ నుంచి అలాంటి విజ్ఞప్తి ఎప్పటికైనా రావచ్చనే విషయాన్ని భారత్ కొట్టి పారేయడం లేదు.
దీంతో పాటు బంగ్లాదేశ్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మధ్యంతర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం ఎక్కువకాలం ఊహాతీతమైనదిగా ఉండదనే సంకేతాలు పంపిస్తోంది.
“షేక్ హసీనా మీద నమోదైన కేసుల విషయంలో ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరాలా వద్దా అనే అంశంపై హోంశాఖ, న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంటాయని” బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం.తౌహిద్ గత వారం రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే రెండు దేశాల మధ్య కుదిరిన ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను తప్పనిసరిగా అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు.

ఖైదీల అప్పగింత ఒప్పందం ద్వారా షేక్ హసీనాను అప్పగించాలని కోరడం, ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకురావడం అంత తేలిక కాదనే విషయం ఢాకాకు తెలుసు
ఈ ఒప్పందంలో ఉన్న అనేక నిబంధనలు, షరతులే దీనికి కారణం. వీటి ఆధారంగా హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించడాన్ని భారత్ నిరాకరించవచ్చు.
దీంతో పాటు న్యాయపరమైన చిక్కులు, ఎత్తుగడలతో అప్పగింత అంశాన్ని చాలా కాలం పెండింగ్‌లో పెట్టవచ్చు.
మరో కీలకమైన అంశం ఏమిటంటే షేక్ హసీనా భారత్‌కు 50 ఏళ్లుగా విశ్వసనీయమైన, నమ్మకమైన, ఆధారపడదగిన భాగస్వామిగా ఉన్నారు.
షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తే, ఆమెపై నమోదైన కేసుల్లో అక్కడ న్యాయ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసుల్లో దోషిగా తేలితే ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య భారత్ ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించకపోవచ్చు.ఈ వ్యవహారంపై అనేక రకాల వాదనలు వినిపించవచ్చు. ఈలోపు, ఆమె మరో దేశంలో ఆశ్రయం తీసుకుంటే భారత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
అందుకే భారత ప్రభుత్వం ఈ ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు.

ఫొటో సోర్స్, THE WEEK
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
రాజకీయపరమైన అభియోగాలు, నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అప్పగించే అంశాన్ని తిరస్కరించవచ్చని భారత్- బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం 2013లోని కీలక నిబంధన చెబుతోంది.
దీని ప్రకారం ఏదైనా నేరం రాజకీయాలకు సంబంధించినది అయితే అలాంటి వ్యక్తులను అప్పగించడాన్ని నిరాకరించవచ్చు.అయితే రాజకీయేతర నేరాల జాబితా చాలా పెద్దగా ఉంది. ఇందులో హత్య, అదృశ్యం, బాంబు దాడులు, టెర్రరిజం లాంటివి ఉన్నాయి.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమెపై నమోదైన కేసుల్లో హత్య, సామూహిక హత్యలు,కిడ్నాపులు, చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి.దీంతో హసీనాను అప్పగించే అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి తిరస్కరించడం కష్టం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తిరస్కరణ మార్గాలు
ఖైదీల మార్పిడి ఒప్పందానికి 2016లో చేర్చిన కొత్త నిబంధన ద్వారా ఖైదీల మార్పిడి మరింత సులువుగా మారింది. దేశం నుంచి పారిపోయిన వాళ్లను త్వరగా తీసుకువచ్చేలా దీన్ని తీసుకువచ్చారు.
సవరించిన ఒప్పందంలోని ఆర్టికల్ 10(3) నిందితుడిని అప్పగించమని అభ్యర్థిస్తున్న దేశం సదరు వ్యక్తిపై నమోదైన అభియోగాలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాలను సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కోర్టు ఇచ్చే అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు. వాళ్లను అప్పగించాలని ఈ నిబంధన చెబుతోంది.
దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని ఏదైనా కోర్టు షేక్ హసీనా మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే, దాని ఆధారంగా ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరవచ్చు.
ఇవ్వన్నీ ఉన్నప్పటికీ ఇదే క్లాజ్‌లో ఉన్న కొన్ని సెక్షన్ల ప్రకారం ఆశ్రయం ఇచ్చిన దేశం మరో దేశపు అభ్యర్థనను తిరస్కరించవచ్చు.
ఉదాహరణకు, ఖైదీలను అప్పగించాలని ఏ దేశాన్ని కోరతారో, ఆ దేశంలో ఆ వ్యక్తి మీద ఏదైనా కేసు పెండింగ్‌లో ఉంటే దాని ఆధారంగా అప్పగింత అభ్యర్థనను తిరస్కరించవచ్చు.అయితే షేక్ హసీనా విషయంలో ఇది వర్తించదు. భారత్‌లో ఆమె మీద ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేవు.
ఖైదీల ఒప్పందంలోని మరో సెక్షన్ ప్రకారం అప్పగించాలని కోరిన వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు ‘సహజ న్యాయసూత్రాలు, చిత్తశుద్ధితో’ జరగలేదని భావించినప్పుడు కూడా అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే హక్కు ఉంటుంది.
అప్పగింత కోరుతున్న వ్యక్తి మీద ఆరోపణలన్నీ నేరచట్టం పరిధిలోకి రాని సామాజిక నేరాలకు సంబంధించినవైనప్పుడు కూడా అభ్యర్థనను తిరస్కరించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘పెండింగ్‌లో పెడతారా?’
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ అభ్యర్థిస్తే దాన్ని తక్షణమే తిరస్కరించడానికి బదులు భారత దేశం చాలా కాలం పెండింగ్‌లో పెట్టవచ్చు అని దిల్లీలోని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
“షేక్ హసీనా ఎలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విడిచి వచ్చారో మనకు తెలుసు. ఆపదల్లో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చి మళ్లీ ఆమెను అలాంటి ఆపదల్లోకి పంపించడం భారత్ ముందున్న ప్రత్యామ్నాయం కాదు” అని మాజీ రాయబారి టీసీఏ రాఘవన్ చెప్పారు.
హసీనాను అప్పగించాల్సి వస్తే, అలాంటి ప్రతిపాదనను తిరస్కరించేందుకు భారత్ ముందు అనేక మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
“మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారతదేశం షేక్ హసీనాకు అండగా నిలవక పోతే, భవిష్యత్‌లో మరో దేశం ఏదీ భారత్‌ను నమ్మకపోవచ్చు” అని రాఘవన్ చెప్పారు.
షేక్ హసీనాకు మద్దతుగా నిలవడానికి అప్పగింత అభ్యర్థనను నిరవధింకంగా పెండింగ్‌లో ఉంచడమే భారత్ ముందున్న ఉత్తమ మార్గం.
ఎందుకంటే ఇటువంటి ఒప్పందాల్లో చట్టపరమైన లొసుగులు ఉంటాయి. బంగ్లాదేశ్ అభ్యర్థనను పెండింగ్‌లో ఉంచడానికి న్యాయ నిపుణులు వాటిని ఉపయోగించవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అప్పగింత అభ్యర్థన వస్తే.. షేక్ హసీనా విషయంలో భారత్ అదే బాటలో నడుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
“ఇటువంటి ఒప్పందాల ప్రకారం, అప్పగింత అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది” అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి ఢాకా మాజీ హైకమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా మరో దేశం వెళతారా?
“2008లో ముంబయి మీద దాడుల్లో ప్రధాన నిందితుడు, అమెరికన్- పాకిస్తాన్ పౌరుడు హుస్సేన్ రాణాను భారత్ తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం 2008 నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. రాణా ప్రస్తుతం అమెరికన్ జైల్లో ఉన్నాడు. భారత్, అమెరికా మధ్య 1997లోనే ఖైదీల అప్పగింత ఒప్పందం కుదిరింది” అని చక్రవర్తి బీబీసీతో చెప్పారు.
“ఖైదీల అప్పగింత చట్టాలను గౌరవించే పక్షంలో హుస్సేన్ రాణా ఎప్పుడో భారత్ రావాల్సి ఉంది. 2024 ఆగస్టు 15న కాలిఫోర్నియా కోర్టు రాణాను భారత్‌కు అప్పగించాలని ఆదేశించింది. రాణాను అప్పగించాలని భారత్ కోరడం మొదలు పెట్టిన తర్వాత 16 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు”
ఇలాంటి పరిస్థితుల మధ్య షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను అభ్యర్థిస్తుందని భావించలేం. ఒక వేళ అలాంటి అభ్యర్థన వచ్చినా దాని మీద భారత్ తక్షణం కానీ కొన్ని నెలల్లో కానీ నిర్ణయం తీసుకోకపోవచ్చు.
దానికంటే ముందు, షేక్ హసీనా మరో దేశానికి వెళ్లే అంశాన్ని దిల్లీలోని ప్రభుత్వ అధికారులు కొట్టి పారేయడం లేదు. అదే జరిగితే ఆమె అప్పగింత అభ్యర్థన రావడం దాని మీద నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలపై చర్చ కూడా తలెత్తదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














