తాడిపత్రి: జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య గొడవలకు కారణం ఏమిటి, 40 ఏళ్ళ వైరం ఎందుకు చల్లారడం లేదు?

ఫొటో సోర్స్, BBC/Thulasi Prasad Reddy
- రచయిత, తులసి ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
డిసెంబర్ 2020: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల పరస్పర దాడులు.
మే 13, 2024: తాడిపత్రిలో చెలరేగిన హింస. టీడీపీ కార్యకర్త ఇంటి మీదకు పెద్దారెడ్డి, వైసీపీ కార్యకర్త ఇంటి మీదకు ప్రభాకర్ రెడ్డి.
ఆగస్టు20, 2024: తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.
రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య నిత్యం చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు తాడిపత్రిలో ప్రశాంతతకు పరీక్ష పెడుతున్నాయి.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎన్నికల తరువాత తొలిసారి ఆగస్టు 20న తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చి వెళ్లారు. ఆయనకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్దారెడ్డి తాడిపత్రికి రాకూడదు అంటూ ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచరుడు మురళి ఇంటి మీద దాడి చేశారు. వాహనాలను, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇంటి లోపల నిప్పంటించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో మురళి తన లైసెన్స్ గన్‌తో బయటకు వచ్చారు.
‘టీడీపీ వాళ్ళు నాపై పథకం ప్రకారం దాడికి యత్నించారు. మురళి ఇంటిని ధ్వంసం చేశారు’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి బీబీసీకి చెప్పారు.
తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని మురళి కలిశారు. అయితే ఈ ఘటనలో వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, బీబీసీ

ఫొటో సోర్స్, BBC/Thulasi Prasad Reddy
40 ఏళ్ల చరిత్ర
తాడిపత్రి ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వేలమందికి ఉపాధి లభిస్తోంది. పండ్ల తోటలకు పేరుగాంచింది. కానీ తాడిపత్రి పేరు చెప్పగానే ఫ్యాక్షన్ గుర్తుకొస్తుంది.
జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరు వల్ల తాడిపత్రికి ఫ్యాక్షన్ గుర్తింపు వచ్చిందని సీనియర్ జర్నలిస్ట్ కుంటిమద్ది అమర్ బీబీసీతో చెప్పారు.
ఆ కుటుంబాల మధ్య వైరానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉందని ఆయన అన్నారు.
‘‘కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి అలియాస్ సూరీడు కాలం నాటి నుంచి జేసీ కుటుంబంతో వైరం మొదలైంది. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి , కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నదమ్ములు. సూర్యప్రతాప్ రెడ్డి కుమారుడే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి మధ్య తొలుత ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. ఆ తరువాత అవి రాజకీయ కక్షలుగా మారాయి.
కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి కుటుంబానికి అండగా వైఎస్ రాజా రెడ్డి ఉండేవారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వారి ప్రధాన అనుచరుడు భోగతి నారాయణ రెడ్డి ఓ వర్గంగా ఉండేవారు. తొలుత ఈ రెండు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచేది’’ అని కుంటిమద్ది అమర్ తెలిపారు.
తమ కుటుంబాల మధ్య మూడు తరాలుగా ఆధిపత్య పోరు కొనసాగుతోందని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా అనేక సందర్బాల్లో చెప్పారు.
‘‘సమితులు ఉన్నకాలంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఆధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య పోరు నడిచేది. నాటి నుంచి ఆ పోరు కొనసాగుతూనే వస్తోంది’’ అని ఓ సందర్భంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, UGC
రాజకీయ వైరంగా ఆధిపత్య పోరు
తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో జేసీ దివాకర్ రెడ్డి 1985 నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి 1999లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచారు.
‘‘జేసీ కుటుంబంతో ఉన్న రాజకీయ వైరం కారణంగా కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి 2004లో ధర్మవరం టిక్కెట్ రాలేదు. దాంతో సన్నిహితుడైన పరిటాల రవీంద్ర ఆహ్వానం మేరకు కేతిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది’’ అని కుంటిమద్ది అమర్ తెలిపారు.
2004లో టీడీపీ తరపున పోటీ చేసిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఓడిపోయారు.
నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఆ తరువాత 2006 ఏప్రిల్ 17వ తేదిన సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యారు.
ఈ హత్యలో జేసీ కుటుంబం పాత్ర ఉందనేది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణ.
‘‘ఆ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక కేసులతో జైల్లో ఉన్నారు. దాంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నాడు టీడీపీలో ఉన్న ఆ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ధర్మవరానికి పరిమితం చేయడంతోపాటు జైలు నుంచి బయటకు వచ్చిన పెద్దారెడ్డిని తాడిపత్రి రాజకీయాల్లోకి జోక్యం చేసుకోవద్దని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశించారు’’ అని అమర్ వివరించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత కేతిరెడ్డి కుటుంబం 2011లో వైసీపీలో చేరింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత జేసీ కుటుంబం టీడీపీలో చేరింది.
2014లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.
అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి బాధ్యతలను పెద్దారెడ్డికి అప్పగించింది.
సుమారు 40 ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన జేసీ కుటుంబానికి 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.
తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గెలిచారు.
అలా రెండు కుటుంబాల మధ్య రోజురోజుకు ఉద్రిక్తలు పెరుగుతూ పోయాయి. అటుఇటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఒకరికొకరు వార్నింగులు ఇచ్చుకోవడం సాధారణమైంది.
‘‘నేను కక్ష తీర్చుకోవాలంటే గంట పట్టదు. వాళ్ల ఇంట్లోకి పోయిన వాడిని బెడ్ రూంలోకి పోలేనా?’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరిస్తే, ‘‘పంచె విప్పతీసి కొడతాం’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇస్తుంటారు. ఇలా ఒకరి మీద మరొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవడం , తిట్టుకోవడం సాధారణంగా మారింది.

ఫొటో సోర్స్, AMAR KUNTIMADDI
జేసీ కుర్చీలో పెద్దారెడ్డి
నాడు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి, తన కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో జేసీ వర్గీయులు పోస్టులు పెట్టారంటూ 2020 డిసెంబరులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జేసీ ఇంట్లో ప్రభాకర్ రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చోవడం సంచలనమైంది.
ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. దాంతో చిన్నపాటి ఘర్షణలు మాత్రమే జరిగాయి.
ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల మరుసటి రోజు భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల మీద పోలీసులు దాడులు చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
ఆ ఘర్షణల్లో రెండు కుటుంబాల మీద కేసులు పెట్టారు. తాడిపత్రికి వెళ్లొద్దంటూ కొంతకాలం పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కోర్టు ఆంక్షలు విధించింది.
తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని, ఆయన కుమారులను రానివ్వకూడదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తరచూ అంటూ ఉండేవారు.
జులై 19న మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతారు’’ అని హెచ్చరించారు.
జులై 20న అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందిస్తూ ‘‘తాడిపత్రి నియోజకవర్గం ఏమైనా జేసీ కుటుంబం జాగీరా?’’ అని ప్రశ్నించారు.
ఎన్నికల తర్వాత చాలామంది వైసీపీ నేతలు నియోజకవర్గాన్ని వీడారు. ఎన్నికల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా కోర్టు ఇచ్చిన కండిషన్ బెయిల్‌తో పట్టణానికి దూరంగా ఉన్నారు.
కానీ ఆగస్టు 20న పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో మళ్లీ ఘర్షణలు జరిగాయి. ఇందుకు మీరంటే మీరే కారణమని వైసీపీ, టీడీపీలు ఆరోపించుకుంటున్నాయి.
ఎస్పీ అనుమతితో కొన్ని డాక్యుమెంట్ల కోసం తాను తాడిపత్రి నివాసానికి వచ్చానని పెద్దారెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘పథకం ప్రకారం నాపై దాడికి ప్రయత్నించారు. మురళి ఇంటిని ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకపోవడంతోనే నేడు దాడులు జరుగుతున్నాయి’’ అని పెద్దారెడ్డి ఆరోపించారు.
‘‘జేసీ కుటుంబంతో రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత వైరాలు లేవు’’ అని తరచూ చెబుతూ ఉండే కేతిరెడ్డి పెద్దారెడ్డి ‘‘జేసీ కుటుంబం అరాచకాలను అడ్డుకోవడం వల్లే తమ మీద దాడులకు ప్రయత్నిస్తున్నారు’’ అని అంటూ ఉంటారు.
అయితే వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు తాడిపత్రిలో విధ్వంసం జరిగిందని జేసి ప్రభాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి నేను మాట్లాడను. ఆ ఐదు ఏళ్లు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ప్రజలు పంచె విప్పి కొడతారని నేను అన్నమాట నిజమే” అని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘పెద్దారెడ్డి వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రజలను, మా కుటుంబాన్ని ఎంతగానో వేధిస్తున్నారు’’ అంటూ గతంలో ప్రభాకర్ రెడ్డి అంటూ ఉండేవారు. ప్రెస్‌మీట్లు పెట్టి పోలీసులు, అధికారుల మీద కూడా ఆరోపణలు చేయడం, వార్నింగులు ఇవ్వడం చేసేవారు.

‘‘ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం కోసమే’’
తాడిపత్రిలో గ్రానైట్ లాంటి వనరులున్నాయి. ఈ పట్టణం హైవే పక్కన ఉంటుంది. వనరులమీద ఆధిపత్యం కోసమే ఈ రెండు కుటుంబాలు పోటీ పడుతూ ఉద్రిక్తతల్ని రాజేస్తున్నాయని స్థానికంగా పని చేస్తున్న హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం, పట్టణంపై పెత్తనం కోసం పోరు జరుగుతూనే ఉందని అన్నారు.
‘‘అనంతపురం జిల్లాలోనే ఇది సంపన్న ప్రాంతం కావడంతో అక్కడి వనరులు వ్యాపారాలపై పెత్తనం కోసం పోటీ అది. కేబుల్, లారీ, ఆటో.. ఇలా ప్రతి రంగం మీదా వారి పెత్తనం ఉంటుంది’’ అని అనంతపురానికి చెందిన మానవ హక్కుల వేదిక నాయకుడు ఎ.చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














