నవజాత శిశువుల పేగుల్లోని రహస్యాలను బయటపెట్టిన తాజా అధ్యయనం..

పిల్లల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,
    • రచయిత, స్మిత ముందసద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నవజాత శిశువుల చిన్న పేగుల్లో ఎలాంటి బ్యాక్టీరియా చేరుతుందో సమగ్రంగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 2,000కు పైగా మలం శాంపిళ్లను అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో తేలిన విషయాలు చూసి వారు ఆశ్చర్యపోయారు. నవజాత శిశువుల మలంలో మూడు రకాల మైక్రోబయో ప్రొఫైల్స్‌ను శాస్త్రవేత్తలు గమనించారు. ప్రతి దాంట్లో వేర్వేరు తరహా బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు.

వాటిలో బి. బ్రీవ్ అనే బ్యాక్టీరియా ప్రత్యేకమైనది. తల్లి పాలలోని పోషకాలను శిశువులు ఎక్కువగా ఉపయోగించుకోవడానికి, రోగాల బారిన పడకుండా నిరోధించడానికి ఈ బ్యాక్టీరియా సాయపడుతుందని ప్రాథమిక పరీక్షల్లో తేలింది.

మరో రకం బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనదని, శిశువులకు రోగాలు ఎక్కువగా రావడానికి ఈ బ్యాక్టీరియా కారణమవుతుందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు నేచర్ మైక్రోబయాలజీలో ప్రచురించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Wellcome Sanger Institue

ఫొటో క్యాప్షన్, తల్లి పాలతో ప్రయోజనాలు కలిగేలా చేసే బి.బ్రీవ్

తొలి నెల రోజులే కీలకం

శిశువులు పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే వారిలో మైక్రోబయోమ్‌ (మన పేగుల్లో లక్షలాది సూక్ష్మజీవులు జీవించే వ్యవస్థ) అభివృద్ధి చెందుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే మనిషి మొత్తం జీవితానికి సంబంధించిన సూక్ష్మజీవుల వ్యవస్థ, పుట్టిన నెలరోజుల్లోపే పేగుల్లోకి చేరుతుంది.

ఇంగ్లండ్‌లోని వెల్‌కమ్ సంగర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆరోగ్యంగా ఉన్న 1,288 మంది నవజాత శిశువుల మలం శాంపిళ్లపై అధ్యయనం చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతో కలిసి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. ఈ శిశువులందరూ బ్రిటన్‌లోని ఆస్పత్రుల్లో జన్మించినవారే. ఒక నెలలోపు వయసున్న శిశువులపై అధ్యయనం నిర్వహించారు.

వాటిలో చాలా శాంపిళ్లు విభిన్నమైన బ్యాక్టీరియాతో మూడు విస్తృత కేటగిరీలకు చెంది ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

బి.బ్రీవ్, బి. లాంగమ్ బ్యాక్టీరియా గ్రూపులు మనిషి శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయని భావిస్తున్నారు.

తల్లిపాలలో ఉండే పోషకాలను నవజాత శిశువులు ఉపయోగించుకునేలా ఈ బ్యాక్టీరియాలు చేయగలవని శిశువులను పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు.

ఇ.ఫెకాలిస్ అనే బ్యాక్టీరియా శిశువులను ఇన్‌ఫెక్షన్ బారిన పడేలా చేసే ప్రమాదముందని భావిస్తున్నారు.

ఈ అధ్యయనంలో పరిశీలించిన శిశువుల్లో ఎక్కువ మంది పుట్టిన తొలి కొన్నివారాల్లో పూర్తిస్థాయిలో లేదా కొద్ది మొత్తంలో అయినా తల్లిపాలను తాగారు.

తల్లి పాలు అయినా, ఫార్ములా పాలు అయినా చిన్నపేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే ప్రసవం సమయంలో యాంటీబయాటిక్స్ తీసుకున్న తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇ.ఫెకాలిస్ బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది.

ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఇంకా నిర్ధరణ కాలేదు.

తల్లి వయసు, ఆమె నేపథ్యం, తల్లికి అది ఎన్నో కాన్పు? వంటి విషయాలన్నీ శిశువుల్లో మైక్రోబయోమ్ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ సూక్ష్మజీవులు పిల్లల దీర్ఘకాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది నిర్ధరించడానికి మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది.

పిల్లల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా?

1,200 మంది నవజాత శిశువుల నుంచి సేకరించిన శాంపిళ్లను విశ్లేషించిన తర్వాత పేగుల్లో మైక్రోబయోటా అభివృద్ధి చేయగల మూడు మంచి బ్యాక్టీరియాలను గుర్తించామని వెల్‌కమ్ సంగర్ సంస్థకు చెందిన డాక్టర్ యాన్ షావో చెప్పారు.

ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌కు అనుగుణంగా ప్రభావవంతమైన చికిత్సా విధానం అభివృద్ధి చేయడానికి తొలి అడుగుగా ఈ ఫలితాలను భావించాలి.

శిశువు పుట్టిన తర్వాత తొలి నెలలో పేగుల్లో మైక్రోబయోమ్ ఎలా చేరిందన్నది పరిశీలించడానికి ఈ అధ్యయనం వల్ల కొత్తగా అనేక విషయాలు తెలిశాయని లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం మైక్రోబయోమ్ లెక్చరర్ డాక్టర్ రాయిరి రాబర్ట్స్‌సన్ చప్పారు. అయితే ఈ పరిశోధనలో ఆయన పాల్గొనలేదు.

పేగుల్లో మైక్రోబయోమ్ ఏర్పడడంపై శిశువు పుట్టిన విధానం, తల్లిపాలు ఎంత ప్రభావం చూపిస్తాయన్నదానికి సంబంధించి ఇటీవలి కాలంలో మనకు చాలా సమాచారం, అవగాహన లభించాయి. సాధారణంగా చిన్నతనంలో వచ్చే ఆస్తమా, అలర్జీలు వంటి సమస్యల గురించి కూడా మనకు అవగాహన పెరిగింది.

అయినప్పటికీ మైక్రోబయోమ్‌కు చేసే చికిత్సలను మెరుగుపరిచే స్థాయికి ఇంకా మనం చేరుకోలేదు.

‘‘పిల్లల పుట్టుక, తల్లిపాలు అందించడం వంటివి చాలా క్లిష్టమైన, వ్యక్తిగతమైన అంశాలు’’ అని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ కెన్నీ చెప్పారు.

‘‘అయితే శిశువు జన్మించిన విధానం, శిశువుకు పాలు పట్టించే అనేక రకాల పద్ధతులు మైక్రోబయోమ్ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తర్వాత కాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది మనమింకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేదు’’ అని ఆమె అన్నారు.

‘‘అందుకే ఈ పరిశోధన చాలా కీలకమైనది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

యూకే బేబీ బయోమ్ అధ్యయనంలో భాగంగా ఈ పరిశోధన జరిగింది. వెల్‌కమ్, వెల్‌కమ్ సంగర్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ పరిశోధనకు నిధులు అందించాయి.

రచయితల్లో ఒకరైన డాక్టర్ ట్రెవర్ లాలీ ప్రోబయాటిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకులు. వెల్‌కమ్ సంగర్ సంస్థ పరిశోధకుల్లో ఒకరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)