రాహుల్ గాంధీ: అమెరికాలో చైనా, భారత్‌ల గురించి ఏం చెప్పారు?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Congress/X

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. భారత్‌లో ప్రతిపక్ష నేతగా ఆయన తొలి అమెరికా పర్యటన ఇది.

రాహుల్ గాంధీ టెక్సస్‌లో తాజాగా రెండు కార్యక్రమాలలో పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి భారతీయులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

‘ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రజల మనసుల్లో బీజేపీ, ప్రధాని మోదీ పట్ల ఉన్న భయాలు మాయం అయ్యాయి’ అని చెప్పారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాహుల్‌కు స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు

ఫొటో సోర్స్, Congress/X

ఫొటో క్యాప్షన్, అమెరికాలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు

రాహుల్‌పై బీజేపీ విమర్శలు

‘‘భారత్ అనేది ఒకే భావజాలమని ఆర్ఎస్ఎస్ నమ్ముతోంది. కానీ అది భిన్న భావజాలాలతో ఏర్పడినదని మేం విశ్వసిస్తున్నాం. మేం కూడా అమెరికా తరహాలోనే అందరికీ కలలు కనే హక్కు, ప్రతి ఒక్కరికి అవకాశాలు పొందే హక్కు ఉండాలనే విషయాన్ని నమ్ముతాం’’ అని రాహుల్ గాంధీ అమెరికాలో చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రకటనపై బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ స్పందించారు.

‘‘ఆర్ఎస్ఎస్‌ను అర్ధం చేసుకోవాలంటే రాహుల్‌కు ఈ జన్మ సరిపోదు. ద్రోహులు ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు. విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శించేవారు ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు’’ అని విమర్శించారు.

రాహుల్, అఖిలేష్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజకీయ ప్రసంగాలలో ప్రేమ అనేమాటకు బదులు ద్వేషం, కోపం, అన్యాయం, అవినీతి అనే మాటలే వినపడుతున్నాయని రాహుల్ చెప్పారు

నిరుద్యోగంపై ఏమన్నారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు, నిరుద్యోగంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు.

ఈ రోజు ఇండియాలో ప్రతి వస్తువు వెనుక అది ఫోన్ కానివ్వండి, లేదా ఫర్నీచర్ కానివ్వండి.. ‘మేడ్ ఇన్ చైనా’ అనే లేబుల్ కనిపిస్తోంది అని రాహుల్ చెప్పారు.

అలాగే తన 4 వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర గురించి కూడా ఆయన విద్యార్థులతో మాట్లాడారు.

‘‘మీరు 4 వేల కిలోమీటర్లు ఎందుకు తిరిగారు, అంత అవసరం ఏముంది?’’ అని మీరు మొదట ప్రశ్నించారు.

‘‘దీనికి కారణం ఏమిటంటే.. భారతదేశంలో అన్ని ప్రసార, ప్రచార సాధానాల దారులు మూసుకుపోయాయి. మేం పార్లమెంటులో మాట్లాడిన మాటలు టీవీలలో రావు. మేం మీడియా దగ్గరకు వెళ్లాం. కానీ వారు మా మాటలు వినలేదు. మేం న్యాయవ్యవస్థను కూడా సంప్రదించాం. కానీ ఏమీ జరగలేదు. అన్నిదారులు మూసుకుపోయాయి. దీంతో చాలా కాలం మేం ప్రజలకు ఏ విషయాన్నైనా ఎలా చెప్పాలా అని ఆలోచించాం’’ అని చెప్పారు.

‘‘అప్పుడు ప్రజల వద్దకు వ్యవస్థలు వెళ్లపోకపోతే, వాటికి బదులు మనమే వెళదామనే ఆలోచన హఠాత్తుగా వచ్చింది. దీంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’

‘‘ఈ యాత్ర నా పనితీరును మౌలికంగా మార్చివేసింది. ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు. రాజకీయాలలో ప్రేమను పరిచయం చేయడమనేది చాలా సహజంగా జరిగిపోయింది. ఇదో కొత్తపోకడ. ఎందుకంటే చాలా దేశాలలో రాజకీయ ప్రసంగాలలో ఎక్కడా ప్రేమ అనేమాట దొర్లదు. కేవలం ద్వేషం, కోపం, అన్యాయం, అవినీతి లాంటి మాటలే వినపడతాయి’’ అని చెప్పారు.

ప్రవాసభారతీయులు నిర్వహించిన మరో కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘మీరిక్కడకు మనసులో కోపాన్ని పెట్టుకుని రాలేదు. ప్రేమతో వచ్చారు. మీరు ఇక్కడ మా రాయబారులు. అందుకే మీకు ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఇండియాకు అమెరికా, అమెరికాకు ఇండియా అవసరం. మీ పాత ఇంటికి, కొత్త ఇంటికి మధ్య మీరే వారధులు’’ అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, INC

‘‘అంతా మేడ్ ఇన్ చైనానే’’

ప్రపంచమంతటా నిరుద్యోగ సమస్య లేదని రాహుల్ గాంధీ అన్నారు. కేవలం పశ్చిమ దేశాలు, ఇండియాలో మాత్రమే ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు.

1940 నుంచి 1960ల దాకా ఉత్పత్తి ప్రపంచానికి అమెరికా కేంద్రంగా ఉండేదని చెప్పారు. కార్లు, వాషింగ్‌ మెషిన్లు, టీవీలు, ఇలా అన్నీ అమెరికాలో తయారయ్యేవి.

కానీ క్రమంగా ఈ ఉత్పత్తుల తయారీ కొరియా, జపాన్‌కు మారింది. ఇప్పుడు చైనాకు మారింది.

‘‘ఉత్పత్తి రంగంపై చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇండియాలో మీరు ఫోన్లు, ఫర్నిచర్, దుస్తులను చూస్తే వాటిపై ‘మేడ్ ఇన్ చైనా’ అని రాసి ఉంటుంది. ఇది నిజం’’ అని చెప్పారు.

‘‘పశ్చిమ దేశాలు, అమెరికా, యూరప్ , భారత్ లాంటి దేశాలు ఉత్పత్తి అనే ఆలోచనను మానేసి, ఆ పని చైనాకు అప్పగించేశాయి’’ అని తెలిపారు.

ప్రత్యేకంగా నిరుద్యోగ సంక్షోభం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘ఉత్పత్తి ఉపాధిని సృష్టిస్తుంది. కానీ మనమైనా, అమెరికాలాంటి దేశాలైనా వినియోగాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాం’’ అన్నారు.

భారత్ ఉత్పత్తి గురించి ఆలోచించాలని రాహుల్ చెప్పారు. తయారీ రంగంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ ముందుంటున్నాయని చెప్పారు.

బంగ్లాదేశ్ ప్రస్తుతం సమస్యలను ఎదుర్కొంటోందని, అయినా వస్త్ర పరిశ్రమలో గట్టిపోటీ ఇస్తోందని చెప్పారు.

అయితే, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

కొత్త రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, మెట్రో మార్గాల నిర్మాణం వంటివి నరేంద్ర మోదీ ఆర్థిక విధానం ప్రధానంగా దృష్టిపెడుతున్న రంగాలు.

మూడేళ్లుగా ఆయన ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

భారతదేశంలో 2014-2024 మధ్య సుమారు 54 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మితమయ్యాయి.

అయితే నిరుద్యోగ సమస్యపై ప్రధాని మోదీపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా గణాంకాల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో చదువుకున్న యువత సంఖ్య 2000లో 54.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి పెరిగింది.

‘‘ప్రజాస్వామ్య వాతావరణంలో భారత్ ఉత్పత్తి తీరుపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది జరిగే వరకు నిరుద్యోగాన్ని ఎదుర్కోక తప్పదని’’ రాహుల్ గాంధీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)