డోనల్డ్ ట్రంప్‌పై దాడి కేసులో అనుమానితుడు రేయాన్ వెస్లీ రౌత్ ఎవరు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అన్ బట్లర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై ఫ్లోరిడాలో జరిగిన హత్యాయత్నంలో రేయాన్ వెస్లీ రౌత్‌ను అనుమానితుడిగా అమెరికా మీడియా గుర్తించింది.
ఉత్తర కరోలినాకు చెందిన 58 ఏళ్ల రౌత్ తన జీవితకాలంలో ఎక్కువ భాగం అక్కడే గడిపినట్టు ఆయన ఆస్తి పత్రాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఆయన హవాయిలో నివసించారు.
రాజకీయాలపై ఆయనకు భిన్నాభిప్రాయాలున్నట్టు రౌత్ కార్యకలాపాలను బట్టి అర్ధమవుతోంది. అయితే యుక్రెయిన్ యుద్ధం కోసం ఏమైనా చేయాలని ఆయన గట్టిగా అనుకుంటున్నారని, ఆయనకు అనేక న్యాయపరమైన సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఆయన గురించి మరింత సమాచారం అందుబాటులో ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
రౌత్ ఏం చేస్తుంటారు?
ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌కు రౌత్ ఏకే-47-స్టైల్ రైఫిల్‌తో వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. అనుమానితుడు దాక్కున్న పొద నుంచి ఆయుధాన్ని, రెండు బ్యాక్‌ప్యాక్‌లను, కెమెరాను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది.
రౌత్ తన కారులో పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన డ్రైవ్ చేస్తున్న బ్లాక్ నిస్సాన్ కారును ఓ వ్యక్తి ఫొటో తీశారు.
గోల్ఫ్ కోర్స్ దగ్గర రైఫిల్‌ను గుర్తించిన 45 నిమిషాల తర్వాత రౌత్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇద్దరు అధికారులు గుర్తించి, వెంబడించారని పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ రిక్ బ్రాడ్‌షా చెప్పారు.
చివరకు ఇంటర్ స్టేట్ 95 దగ్గర అధికారులు రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, మార్టిన్ కౌంటీ షెరిఫ్‘స్ ఆఫీస్
సోషల్ మీడియాలో రౌత్ ఏం రాసేవారు?
రౌత్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను బీబీసీ వెరిఫై బృందం గుర్తించింది. రష్యా బలగాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విదేశీ ఫైటర్లు యుక్రెయిన్‌కు వెళ్లాలని రౌత్ పిలుపునిస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయి.
‘‘మీ పిల్లల కోసం, కుటుంబాల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడేందుకు నేను హవాయి నుంచి యుక్రెయిన్‌కు వస్తున్నా. నేను అక్కడికి వచ్చి మీ కోసం మరణిస్తాను’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్టులో రాసి ఉందని బీబీసీ అమెరికా పార్ట్‌నర్ సీబీఎస్ న్యూస్ తెలిపింది.
రౌత్ ప్రొఫైల్‌లో పాలస్తీనా, తైవాన్ అనుకూల పోస్టులు, చైనా వ్యతిరేక సందేశాలు కూడా ఉన్నాయి. కోవిడ్-19 వైరస్‌ను ఉదాహరణగా చూపుతూ చైనా బయో వార్‌కు దిగుతోందన్న ఆరోపణలు కూడా ఆ పోస్టుల్లో ఉన్నాయి.
ఒక దశలో రౌత్ ట్రంప్‌కు మద్దతుదారుగా కూడా నిలిచారని సీబీఎస్ తెలిపింది. ‘‘2016లో రిపబ్లికన్ నా చాయిస్’’ అని ఒక పోస్టులో రాశారు రౌత్. కానీ తర్వాత కాలంలో ’’మీ వ్యవహారశైలి మారిపోయింది, అధ్వాన్నంగా తయారైంది. మీరు వెళ్లిపోతే నేను సంతోషిస్తాను’’ అని ట్రంప్‌ను ఉద్దేశించి రాశారు.
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై జులైలో కాల్పులు జరిగినప్పుడు గాయపడ్డవారిని పరామర్శించాలని అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు రౌత్ ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌తో రౌత్‌కు ఉన్న సంబంధమేంటి?
యుద్ధంలో యుక్రెయిన్‌కు సహకరించాలని తాను అనుకుంటున్నట్టు గత ఏడాది న్యూయార్క్ టైమ్స్‌తో రౌత్ చెప్పారు. తాలిబాన్ల నుంచి తప్పించుకుని వచ్చిన అఫ్ఘాన్ సైనికులను యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించుకోవాలని కోరారు.
అనేకమంది సైనికులు యుక్రెయిన్‌కు వెళ్లడానికి ఆసక్తితో ఉన్నారని, వారిని అక్రమంగా అయినా సరే పాకిస్తాన్, ఇరాన్ నుంచి యుక్రెయిన్‌కు తరలించాలని తాను ప్రణాళిక వేస్తున్నట్టు న్యూయార్స్ టైమ్స్‌కు ఫోన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌత్ చెప్పారు.
ఇటీవల జులైలో రౌత్ రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలు చేశారు.
‘‘సైనికులారా... దయచేసి నాకు ఫోన్ చేయకండి. అఫ్గాన్ సైనికులను యుక్రెయిన్ అంగీకరించేలా చేసేందుకు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. రానున్న కొన్ని నెలల్లో ఇందుకు సంబంధించి మనకు కొన్ని జవాబులు దొరుకుతాయని భావిస్తున్నాం. దయచేసి సహనంతో ఉండండి’’ అని జులైలో ఫేస్‌బుక్‌లో రౌత్ చేసిన ఓ పోస్టులో ఉంది.
యుక్రెయిన్ విదేశీ వలంటీర్ల అంతర్జాతీయ గ్రూప్‌తో రౌత్ ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఇతర యుక్రెయిన్ అధికారులూ ఆయనకు దూరంగానే ఉన్నారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీ రాజకీయ హింసను ఖండించారు.
‘‘నిప్పుతో చెలగాటమాడితే అందుకు తగ్గ ఫలితాలుంటాయి’’ అని రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పినట్టు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, పామ్ బీచ్ కౌటీ షెరిఫ్‘స్ ఆఫీస్/రాయిటర్స్
రౌత్‌కు నేర చరిత్ర ఉందా?
తప్పుడు చెక్‌లు రాయడం సహా రౌత్‌పై 1990ల్లో కొన్ని కేసులున్నట్టు సీబీఎస్ తెలిపింది.
2002 నుంచి 2010 మధ్య ఉత్తర కరోలినాలోని గిల్ ఫోర్డ్ కౌంటీలో రౌత్‌పై చాలా ఆరోపణలు వచ్చాయని, పలు కేసుల్లో ఆయన దోషిగా తేలారని సీబీఎస్ వెల్లడించింది.
అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నట్టు 2002లో రౌత్‌పై కేసు నమోదైంది.
హిట్ అండ్ రన్, రద్దయిన లైసెన్సుతో డ్రైవింగ్ చేయడం సహా ఆయనపై అనేక ఆరోపణలున్నాయి.
అయితే గతంలో రౌత్ ఇంటిపక్కనే నివసించిన వ్యక్తి కిమ్ మౌంగో ఆయన్ను మంచి హృదయం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. అయితే రౌత్ ఆస్తులపై ఫెడరల్ ఏజెంట్లు దాడులు జరిపారని ఆమె తెలిపారు.
అలాగే దొంగలించిన సొమ్ము, ఇతర వస్తువులు రౌత్ ఇంటి నిండా భారీగా ఉండేవని ఆమె చెప్పారు. రౌత్, ఆయన కుటుంబం బహిరంగంగా కాల్పులకు దిగడం తాను చూశానని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రౌత్ కుటుంబ నేపథ్యమేంటి?
2016లో తాను ట్రంప్‌కు మద్దతిస్తున్నట్టు రౌత్ సోషల్ మీడియా పోస్టులో ఉన్నప్పటికీ... ఆయన రిపబ్లికన్ పార్టీతో సంబంధం లేని ఓటరుగా ఉన్నారు.
తమను ప్రేమించే, ఎంతో జాగ్రత్తగా చూసుకునే తండ్రిగా రౌత్‌ను అభివర్ణించారు ఆయన కుమారుడు. ఆయన నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తారని చెప్పారు.
‘‘ఫ్లోరిడాలో ఏం జరిగిందో నాకు తెలియదు. అది జరిగి ఉండదని నేను అనుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి ఆయన గురించి నేను ఇలాంటివేవీ వినలేదు. ఆయన హింసకు పాల్పడడం నాకసలు తెలియదు’’ అని రౌత్ పెద్ద కొడుకు ఒరాన్ సీఎన్ఎన్‌కు మెసేజ్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడేం జరుగుతుంది?
రౌత్ తుపాకితో కాల్చారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
‘‘మా ఏజెంట్ల మీద ఒక వ్యక్తి కాల్పులు జరపగలరని మేం అనుకోవడం లేదు. మా ఏజెంట్లు అనుమానితుడిని పట్టుకున్నారు’’ అని అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన రాఫెల్ బారోస్ తెలిపారు.
పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన కాల్పుల తర్వాత ఆయనకు తగిన భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఆయనకు ముప్పు చాలా ఎక్కువగా ఉందన్నారు.
తాజా ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.
ఉత్తర కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో రౌత్ పాత ఇంట్లో కూడా సీక్రెట్ సర్వీస్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు సోదాలు జరిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














