కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్‌: డిబేట్‌ తర్వాత సర్వేలు ఎవరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు డోనల్ట్ ట్రంప్, కమలా హారిస్, ప్రెసిడెన్షియల్ డిబేట్
    • రచయిత, ద విజువల్ జర్నలిజం అండ్ డేటా టీమ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

అధ్యక్ష ఎన్నికల్లో తొలుత 2020లో పోటీ పడిన వారే తిరిగి పోటీకి దిగారు. అయితే జులైలో అధ్యక్షుడు బైడెన్ పోటీ నుంచి వైదొలగి అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు పలికారు.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే- ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు డోనల్డ్‌ ట్రంప్‌కు మరోసారి అధ్యక్షుడయ్యే అవకాశం ఇస్తారా లేక అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటారా?

ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ, ఫలితాలు ఎలా ఉంటాయి? అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరుగుతున్న డిబేట్ల ప్రభావం ఎలా ఉంది? లాంటి అంశాలపై ఆసక్తి పెరుగుతోంది.

డిబేట్‌లో ఎవరు గెలిచారనే దానిపై సర్వేలు ఏం చెబుతున్నాయి ?

డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ తొలి టీవీ డిబేట్‌లో డెమోక్రాట్లు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి పైచేయి సాధించారని బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జుర్చెర్ చెప్పారు.

అయితే సర్వేలు మనకు ఏం చెబుతున్నాయి ? రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో మారిన పరిస్థితుల ప్రభావం ప్రజల మీద ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

అయితే, అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ తర్వాత బీబీసీ పరిమిత స్థాయిలో తక్షణ సర్వే చేపట్టింది.

సీఎన్ఎన్/ఎస్ఎస్ఆర్ఎస్ చేపట్టిన సర్వేలో డిబేట్ చూసిన 600 మంది రిజిస్టర్డ్ ఓటర్లలో 63 శాతం కమలా హారిస్ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు. 37 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గు చూపారు. డిబేట్‌కు ముందు ఇదే ఓటర్లు ఎవరు బెస్ట్‌గా నిలబోతున్నారన్నదానిపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే ఇది తప్పనిసరిగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని అనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే కేవలం 4 శాతం మాత్రమే డిబేట్ తర్వాత ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తమ అభిప్రాయం మార్చుకున్నట్లు చెప్పారు.

అందుకే తాజా పరిణామాలు ఎన్నికల గణాంకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దాని గురించి తెలుసుకునేందుకు కొంత వేచి చూడాల్సి ఉంటుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాతీయ స్థాయిలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు?

ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని జో బైడెన్ నిర్ణయం తీసుకునే వరకు సర్వేలన్నీ ట్రంప్‌ విజయం సాధిస్తారనే చెప్పాయి. ఆ సమయంలో అది ఊహాత్మకమైనప్పటికీ, కమలా హారిస్ పోటీలోకి దిగినా అంత మెరుగ్గా ఉండకపోవచ్చని అనేక సర్వేలు సూచించాయి.

అయితే ఆమె అనూహ్యంగా అభ్యర్థిగా మారి ప్రచారంలోకి దిగిన తర్వాత పోటీ రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేల్లో ఆమె తన ప్రత్యర్థిపై స్వల్ప ఆధిక్యత సాధించారని, దాన్ని అలాగే కొనసాగిస్తున్నారని తేలింది. జాతీయ స్థాయి సర్వేల్లో ఇద్దరూ దాదాపు దగ్గరగా ఉన్నారు.

పైన ఉన్న పోల్ ట్రాకర్ చార్ట్‌లో, కమలా హారిస్ పోటీలోకి ప్రవేశించిన తర్వాత గణాంకాలు ఎలా మారుతూ వచ్చాయనేది చూడవచ్చు. ఈ చిత్రంలో ఉన్న చుక్కలను చూస్తే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రభావం ఎలా పెరుగుతుందో తెలుసుకోవచ్చు.

చికాగోలో డెమోక్రాటిక్ పార్టీ నాలుగు రోజుల సమావేశాల తర్వాత హారిస్‌ 47 శాతానికి చేరుకున్నారు. ఆగస్టు 22న ఆమె అమెరికన్లను ఉద్దేశించి అభ్యర్థి హోదాలో ఇచ్చిన ప్రసంగం తర్వాత ఆమెకు మద్దతు పెరగడం మొదలైంది.

ట్రంప్‌కు మొదటి నుంచి లభిస్తున్న మద్దతు స్థిరంగా ఉంది. ఆయనకు 44 శాతం మద్దతు ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్ ఎఫ్.కెన్నడీ ఆగస్టు 23న పోటీ నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించినా, ట్రంప్ మద్దతుదారుల శాతంలో ఎలాంటి మార్పు లేదు.

ఒక అభ్యర్థికి ఎంత ప్రజాదరణ ఉందనేది తెలుసుకోవడానికి ఈ జాతీయ సర్వేలు ఉపయోగ పడవచ్చు కానీ, వాటి ఆధారంగా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వెయ్యడం వీలు కాకపోవచ్చు.

ఎందుకంటే అమెరికా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లను గెలుచుకోవడంకంటే అవి ఎక్కడ గెలుచుకున్నారన్నదే ముఖ్యం.

అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసేవాళ్లు దాదాపు స్థిరంగా ఉంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే గెలుపోటములలో కీలకంగా మారతాయి. వాటినే బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారు.

కీలక రాష్ట్రాలలో ఎవరు గెలవనున్నారు?

అమెరికాలోని ఇలాంటి ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో ఎన్నికల అంచనాలు నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. దీంతో రేసులో ఎవరు ముందంజలో ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం.

ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే, అనేక రాష్ట్రాలలో అభ్యర్థులిద్దరూ ఒక్కశాతం తేడాతో ఉన్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. అందులో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా కూడా ఉంది. ఎన్నికల్లో విజేతకు అవసరమైన 270 ఓట్లు సాధించే ప్రయత్నాలను ఈ రాష్ట్రం అందించే మద్దతు సులభం చేస్తుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్, హారిస్, పెన్సిల్వేనియా

ఫొటో సోర్స్, Getty Images

పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉండేవి. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఆ రాష్ట్రాలను రిపబ్లికన్లకను అనుకూలంగా మార్చారు. 2020లో జో బైడెన్ వాటిపై మళ్లీ పట్టు సాధించారు. కమలా హారిస్ ఈ ఏడాది ఆ పరంపరను కొనసాగించగలిగితే ఆమె ఎన్నికల్లో విజేతగా అవతరించవచ్చు.

కమలా హారిస్ డెమోక్రటిక్ నామినీగా మారిన తర్వాత పోటీ తీరు మారిందనడానికి ఒక సంకేతం ఏంటంటే, జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడానికి ముందు ఏడు రాష్ట్రాల్లో ఆయన ట్రంప్ కంటే దాదాపు ఐదు శాతం వెనుకబడి ఉన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు డోనల్ట్ ట్రంప్, కమలా హారిస్, ప్రెసిడెన్షియల్ డిబేట్

ఈ సగటును ఎలా సృష్టిస్తారు?

పైనున్న రేఖా చిత్రంలో మేము ఉపయోగించిన గ్రాఫిక్స్, యావరేజెస్‌ను ఎన్నికల సర్వేలను విశ్లేషించే వెబ్‌సైట్ 538 (ఇది పేరు) తయారు చేసింది. ఈ వెబ్‌సైట్ అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ ఏబీసీ న్యూస్‌లో భాగం. వీటిని తయారు చేసేందుకు జాతీయ స్థాయిలో, కీలక రాష్ట్రాల్లో వివిధ పోలింగ్ సంస్థలు వ్యక్తిగత స్థాయిలో సేకరించిన డేటాను 538 సేకరించింది.

వారి నాణ్యత ప్రమాణాలలో భాగంగా 538 వెబ్‌సైట్ తాము సూచించిన ప్రమాణాలను పాటించే ఎన్నికల సర్వే సంస్థల డేటాను మాత్రమే సేకరిస్తుంది. అందులో ఎంతమంది వ్యక్తుల అభిప్రాయాలు సేకరించారు, ఎప్పుడు సేకరించారు, ఎలా సేకరించారు( టెలిఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఆన్‌లైన్ మొదలైనవి) లాంటి వివరాలు పూర్తి పారదర్శకంగా ఉన్న డేటాను మాత్రమే తీసుకుంటుంది.

కమలా హారిస్, అమెరికా, అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్, విస్కాన్సిన్

ఫొటో సోర్స్, Reuters

ఈ సర్వేలను నమ్మవచ్చా?

ప్రస్తుతం ఈ సర్వేల ప్రకారం జాతీయ స్థాయిలో, బ్యాటిల్ గ్రౌండ్స్‌గా చెబుతున్న కీలక రాష్ట్రాల్లో కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్ మధ్య రెండు పర్సంటేజ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నప్పుడు విజేతను అంచనా వెయ్యడం చాలా కష్టం.

2016, 2020లో ఎన్నికల అంచనాలు ట్రంప్‌కున్న మద్దతును తక్కువగా అంచనా వేశాయి. సర్వేలలో ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు పోలింగ్ సంస్థలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి.

(జాయ్ రొక్సాస్ అందించిన డిజైన్లతో మైక్ హిల్స్, లిబ్బీ రోజర్స్ రచన)

( బీబీసీ కోసం కలెక్టివ్ ‌న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)