ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పరిస్థితి ఎలా ఉందంటే..

అల్పపీడనం, వాయుగుండం, తుపాను

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో కొట్టుకుపోయిన కల్వర్టు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో శనివారం (సెప్టెంబర్ 7) రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు, కల్వర్టులు, పాత వంతెనలు కొట్టుకుపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అల్పపీడనం, వాయుగుండం, తుపాను

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గంగవరం బడి వీధిలో కూలిన పెంకుటిల్లు

కూలిన పాత ఇల్లు

భారీ వర్షాల ప్రభావంతో విశాఖ నగరంలో కొన్నిచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. గాజువాక ప్రాంతంలోని గంగవరం బడి వీధిలో ఓ పెంకుటిల్లు కూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఉమ్మిడి ధనం అనే మహిళకు గాయాలయ్యాయి.

గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ ఏరియాలో కొండవాలు నుంచి మట్టి పెళ్లలు జారిపడడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

వాయుగుండం, అల్పపీడనం, తుపాను

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అల్లూరి జిల్లా కొత్తవీధి మండలం దేవరపల్లి గ్రామం దగ్గర వరద

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏ సహాయం కావాలన్నా ప్రజలు 08912590102, 089125901800, 0912565454 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని అధికారులు సూచించారు.

కొట్టుకుపోయిన కల్వర్టు

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని చామగడ్డ గ్రామంలో ప్రధాన రోడ్డుపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని దాదాపు 30 గ్రామాలతో వంచుల పంచాయతీకి సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాలతో ఏజెన్సీలోని చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

విజయవాడలో కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇక్కడ మళ్లీ వరద వస్తుందేమోనని బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రభుత్వం రేపు (సోమవారం) స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)