ఏపీ, తెలంగాణ: వరద బాధితులు ఎలా ఉన్నారు, ఏం చెబుతున్నారు?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
‘‘ఆ వరదతోపాటే మేం కూడా చచ్చిపోతే బాగుండనిపిస్తోంది. మా పరిస్థితి ఏం బాగా లేదు. ఇల్లు మొత్తం మునిగిపోయింది. వస్తువులు, సరుకులు ఏమీ లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను, నా ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో మిగిలిపోయాం’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు గౌసియా.
విజయవాడ రామకృష్ణాపురంలో బుడమేరు పరివాహక ప్రాంతంలో ఓ చిన్న రేకుల ఇంట్లో గౌసియా ఉంటున్నారు. కుట్టు పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వరద ఆమె కుటుంబంలో తీరని నష్టాన్ని మిగిల్చింది.
ఇటు తెలంగాణకు వచ్చిన వరదల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ గూడేనికి చెందిన యాకుబ్ అనే వ్యక్తి కుటుంబం కొట్టుకుపోయింది. యాకుబ్ కొడుకు షరీఫ్ ప్రాణాలతో బయటపడ్డారు. యాకుబ్ చనిపోగా, ఆయన భార్య సైదాబీ ఆచూకీ గల్లంతయ్యింది.
‘‘ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. ఏం చేయాలో తెలియక నేను, డాడీ, మమ్మీ ఇంటిపైన రేకులు ఎక్కాం. మధ్యాహ్నం ఒకటిన్నర దాకా అక్కడే ఉన్నాం. ‘‘మా ఇంటికి ఉన్న నాలుగు గదులు కూడా ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. చివరికి మేం నిల్చున్న గది కూలిపోయి నేను, మమ్మీ, డాడీ నీళ్లలో పడి కొట్టుకుపోయాం’’ అంటూ వరద తీవ్రతను బీబీసీకి వివరించారు షరీఫ్.
తెలుగు రాష్ట్రాల్లో వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అయినవారు దూరమై... ఆస్తులు నష్టపోయి..జీవనాధారం కోల్పోయి...ఇలా పలు రూపాల్లో బాధితులుగా మారిన వారు పడుతున్న వేదన మాటల్లో చెప్పలేనిది. వారం రోజులు గడిచిన తర్వాత కూడా విజయవాడలోని కొన్ని కాలనీల్లో మోకాలి లోతు నీరు కనిపించింది. ఖమ్మంలో మున్నేరు ప్రవాహం సెప్టెంబర్ 8వ తేదీన మరోసారి ఉధృత రూపం దాల్చింది.


ఫొటో సోర్స్, Getty Images
బెజవాడ.. విలయం
సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలు.. ప్రకాశం బరాజ్ 70 గేట్ల నుంచి కిందకు ప్రవహిస్తున్న వరద నీటి హోరు బెజవాడ మొత్తం వినిపిస్తుందేమో అన్నట్లుగా ఉంది.
బరాజ్ నుంచి చూస్తే కృష్ణా నది మీదున్న రైల్ బ్రిడ్జ్ అంచును తాకుతూ...ఏ క్షణంలోనైనా బ్రిడ్జ్ మీదకు చేరుతుందనేంత ఉధృతితో నీరు ప్రవహించింది. ఇది అక్కడి భయానక పరిస్థితికి అద్దం పట్టింది.
అక్కడ నుంచి అప్పటికే బుడమేరు వరదతో నీట మునిగిన సింగ్ నగర్ పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాం. కానీ ఎటు చూసినా నీరే కనిపించడంతో అటువైపు వెళ్లేందుకు పోలీసులు ఎవర్నీ అనుమతించలేదు. అదే సమయంలో అక్కడికి వందలాది పడవలు తీసుకెళుతున్న లారీలు కనిపించాయి. అవన్నీ కూడా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బోట్లు.
అందులోని ఒక బోటు సహాయంతో మేం లోపలికి వెళ్లాం. మొదట రామకృష్ణాపురం కాలనీకి చేరుకున్నాం . ఆ ఏరియాలో ఏ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ కూడా మాకు కనిపించలేదు. మొదటి అంతస్తు నుంచే ఇళ్లు కనిపిస్తున్నాయి. వరద అంతలా వచ్చింది.
ప్రజలంతా రెండు, మూడు అంతస్తుల నుంచి సహాయం అర్థిస్తూ కనిపించారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ పైనుంచి చూస్తే మూడు లక్షల మంది ఉండే ఆ ప్రాంతమంతా ఒక నదిలో ఉన్నట్లు కనిపించింది.
అసలు విజయవాడ ఇంతలా ముంపునకు గురవ్వడానికి కారణమేమిటి?

విజయవాడ మునకకు ఆ మూడు కారణాలు
ఆగస్టు నెలలో (30-31 తేదీల్లో) ఒక రోజులో 26 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం విజయవాడ చరిత్రలో మొదటిసారి. ఇది ఎవరూ ఊహించనిది.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు కృష్ణానదికి పోటెత్తిన ఎగువ వరద నీరు, అదే సమయంలో బుడమేరు నుంచి 45 వేల క్యూసెక్కుల వరద నగరంలోకి వచ్చి నిలిచిపోయింది. ఈ కారణాలతోనే విజయవాడ సగానికి పైగా నీటిలో మునిగిపోయిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన చెప్పారు.
ఈ మూడు కారణాల్లో బుడమేరు తెచ్చిన ముప్పే ఎక్కువని ఆమె అన్నారు.
లోతట్టు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, శ్రీరాజరాజేశ్వరి పేట, అరుణోదయ కాలనీ, రామకృష్ణాపురం, జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ, కండ్రిగ, నున్న, పాయకాపురం.. ఇలా అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి.
“ఇదేదో వర్షం నీరే అనుకున్నాం. కానీ తొలి అంతస్తును ముంచేసేంత వరద వస్తుందని అసలు ఊహించలేదు. అవకాశమున్నోళ్లందరం మొదటి ఫ్లోరుకు చేరుకున్నాం. ఆ పరిస్థితి లేనోళ్లు ముందు జాగ్రత్తగా ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలా వెళ్తుండగానే వరద ముంచెత్తడంతో కొందరు అందులో చిక్కుకుని మరణించారు.” అని డాబాకొట్లు సెంటర్‌కు చెందిన పూర్ణ బీబీసీకి చెప్పారు.
పూర్ణ బట్టల షాపు నడుపుతున్నారు. ఆయన ఇల్లు, షాపు కూడా 7 నుంచి 8 అడుగుల నీటిలో మునిగిపోయాయి. తనకు లక్షల్లో నష్టం వచ్చిందని పూర్ణ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ముంపుకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నవే. వీటితో పాటు చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజులపేట ముంపు బారినపడ్డాయి. వీటీపీఎస్ (విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్)లోకీ నీరు చేరింది.
ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజులపేట ముంపుకు గురవ్వడంతో అక్కడి ప్రజలు జాతీయ రహదారి పక్కన గుడారాలు వేసుకుని కాలం గడిపారు.

మరోవైపు కృష్ణా నదికి కూడా అదే సమయంలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తడంతో బుడమేరు వరద నీరు కృష్ణా నదిలోకి చేరలేక వెనక్కి వెళ్లడం మొదలైంది.
“బుడమేరు మార్గంలో మూడొంతుల భాగం ఆక్రమణలకు గురైంది. ఇప్పుడవే మునిగాయి.” అని ఏపీ జలవనరుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ డి. రామకృష్ణ బీబీసీతో అన్నారు.

డ్రోన్లతో సహాయం...
ఆదివారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి.
సింగ్ నగర్ ప్రాంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్నారు.
డ్రోన్ల సహాయంతో ఆహారం, పాలు, అత్యవసర మందులు వరద బాధితులకు అందించారు.
పరిస్థితి కాస్త తెరిపినిచ్చి, వరద నీటి స్థాయి పలు కాలనీల్లో తగ్గడంతో ప్రజలు బయటికి వచ్చారు. వారికి అత్యవసరమైనవి, తీసుకుని వెళ్లగలిన సామాన్లు పట్టుకొని ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో లూనా సెంటర్, డాబాకొట్లు సెంటర్, గంగానమ్మ గుడి వీధి వంటి ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాలు తాళాలు వేసి కనిపించాయి. ఇక్కడ వీధులకు వీధులే ఖాళీ చేసి వెళ్లారా అన్నట్లుగా పరిస్థితి ఉంది.
మరోవైపు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సాయం అందించినా, అది అందరికీ చేరలేదు. నీట మునిగిన వారిలో కొందరికి పడవను కూడా పంపలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితులే కొందరు వరద నీటి నుంచి బయటకు వచ్చి ట్యూబులు, ప్లాస్టిక్ టైర్లు కొనుక్కుని, వాటి సహాయంతో తమ వారిని బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, TDP
నున్న, కండ్రిగ, పాయకాపురం ప్రాంతాల్లో చాలామంది మా ఇళ్ల చుట్టూ శవాలు కొట్టుకొస్తున్నాయి, పిల్లలతో ఉండలేకపోతున్నాం, కాపాడండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు బీబీసీ వెళ్లి వరద బాధితులతో మాట్లాడింది.
శవాలు కొట్టుకొస్తున్న మాట వాస్తవమేనని, తాము కళ్లతో చూశామని కండ్రిగ ప్రాంతానికి చెందిన బాధితులు కొందరు బీబీసీతో చెప్పారు.
అయితే అది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు యాభై, వంద కావని నాలుగైదు శవాలనే చూశామని చెప్పారు. ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్గంధం రావడంతో పాటు కొన్ని పశువుల మృతదేహాలు కూడా కనిపించాయి.

బయటకు వెళ్లి తిరిగి రాలేదు..
సెప్టెంబరు 6వ తేదీ నాటికి విజయవాడ ప్రాంతంలో 29 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు, పల్నాడు జిల్లాలలో మరో ఎనిమిది మంది చనిపోయినట్లు తెలిపింది.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర తమ కుటుంబీకుల శవాలు వస్తాయేమోనని పలువురు భయంభయంగా పరిశీలించారు.
‘‘మూడు, నాలుగు రోజుల నుంచి ఇక్కడికొచ్చి చూసి వెళుతున్నాం. పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాం. సింగ్ నగర్ నుంచి గురువారం ఒక మృతదేహం వచ్చిందని తెలియగానే వెళ్లి చూశాం. అది మా ఆయనదే’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు ధారా శాంతకుమారి.
భర్త, ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా సాగిపోతున్న శాంతకుమారి జీవితంలో వరద ఒక్కసారిగా చీకట్లు నింపింది.
శాంతకుమారి భర్త ధారా మహేశ్ బాబు ఎక్స్ రే టెక్నీషియన్‌గా పని చేసేవారు. ఆదివారం సింగ్ నగర్‌కు వెళ్లి వస్తుండగా, వరదలో కొట్టుకుపోయి చనిపోయారు.
వస్తువులు నాశనం
“వినాయక చవితి వస్తుంది కాబట్టి బెల్లం దిమ్మెలు అమ్ముకోవచ్చని రూ. 3 లక్షల విలువైన సరుకు తెప్పించా. వరద నీరు దుకాణంలోకి చేరడంతో బెల్లం దిమ్మెలు అన్నీ కరిగిపోయాయి. వాటితో పాటు ఉప్పు, బియ్యం వంటివి కూడా పాడైపోయాయి. ఈ నష్టం నుంచి కోలుకోవడం కష్టమే” అని సింగ్ నగర్‌కు చెందిన వ్యాపారి శ్రీలత అన్నారు
ముంపు ప్రాంతాల్లోని వీధుల్లో ఉన్న దుకాణాలన్నింటి పరిస్థితి ఇదే.
బట్టలు, కిరణా సరుకులు, మెకానిక్ షాపుల ముందు ఉండే వాహనాలు, మెడికల్ షాపులు ఇలా అన్ని నీట మునిగితే... ఇళ్లలోకి చేరిన నీరుతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, బట్టలు, ఫర్నీచర్ పాడైపోగా... కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయని బాధితులు చెప్పారు.
వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి వారి వస్తువులు, వాహనాలు బట్టి వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా.

సహాయక చర్యలు ముమ్మరం
శుక్రవారం నాటికి వరద చాలా వరకు తగ్గడంతో ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దాదాపు 1,200 వాహనాల్లో బియ్యం, నిత్యవసర సరుకులు తీసుకువచ్చి వరద బాధితులకు పంపిణీ చేయించింది.
150 ఫైరింజన్లతో వీధులు శుభ్రం చేయించే పని చేపట్టింది. చెత్త తొలగింపు, బ్లీచింగ్, దోమల మందు పిచికారీ పనులు జరుగుతున్నాయి.
ప్రకాశం బరాజ్ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కూడా తగ్గింది.

మున్నేరు-ఖమ్మం కన్నీరు
సెప్టెంబరు 2వ తేదీన తెలంగాణలోని ఖమ్మం త్రీటౌన్‌లోని వెంకటేశ్వరనగర్‌ను బీబీసీ సందర్శించింది.
ఇది మున్నేరు నదికి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. కాలనీలోని ఓ వీధిలోకి వెళ్లినప్పుడు రేకుల ఇంటిపైన ఐస్ క్రీమ్ బండి కనిపించింది. మున్నేరు వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ రెండంతస్తుల ఇల్లు కూడా మునిగిపోయిందని బాధితులు చెప్పారు.
ఇంట్లో వస్తువులన్నీంటికి బురద అంటడంతో రోడ్డుపై పడేశారు. బియ్యం మొదలుకుని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మంచాలు, పరుపులు, సర్టిఫికెట్లు, పుస్తకాలు.. ఇలా ఒకటేమిటి కట్టుబట్టలు తప్ప అక్కడి వారికి ఏమీ మిగల్లేదు. మోతీనగర్, బొక్కలగడ్డ, సాయినగర్, రాజీవ్ గృహకల్ప, జలగం నగర్.. ఇలా చాలా కాలనీలలో మొదటి అంతస్తు వరకు మున్నేరు ముంచేసింది.
‘‘ఏ వస్తువూ మిగల్లేదు. ప్రతి ఒక్కటి నీళ్లలో నానింది. 16 అడుగుల ఇల్లు మునిగిపోయింది. వస్తువులే కాదు, జీవితాలూ పోయినాయి. మళ్లీ కోలుకోవాలంటే నాలుగైదేళ్లు పట్టేలా ఉంది’’ అని వెంకటేశ్వరనగర్‌కు చెందిన బాలకృష్ణ అన్నారు .
అక్కడికి దగ్గర్లోని రంగనాయకుల గుట్ట రోడ్డు, మోతీనగర్ ప్రాంతాలకు బీబీసీ వెళ్లింది.
అక్కడి వీధి నిండా వరదకు కొట్టుకుని వచ్చిన పెద్దపెద్ద దుంగలు పడి ఉన్నాయి. బురదను తొలగిస్తూ, ఇంట్లో తడిచిపోయిన వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తున్నారు కాలనీవాసులు.
‘‘ఒక్కసారిగా నీళ్లు వచ్చేశాయి. సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం’’ అని మోతీనగర్‌కు చెందిన షేక్ ఫర్జానా చెప్పారు .

రహదారి పై నుంచి పొలాల్లోకి కార్లు
మున్నేరు గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రవహించింది.
2022లో అత్యధికంగా 30.5 అడుగుల ఎత్తు వరకు చేరిన మున్నేరు ప్రవాహం ఇప్పుడు ఏకంగా 36 అడుగుల ఎత్తులో ప్రవహించింది. ఈ నీరంతా వెళ్లి కృష్ణానదిలో కలవడం కారణంగా ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి కొనసాగింది.
మున్నేరు ప్రభావం కేవలం ఖమ్మం పట్టణంలోనే కాదు, అటు మహబూబాబాద్, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలపైనా పడింది. నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వరద ప్రవాహానికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిలో కార్లు కొట్టుకుపోయాయి. వాహనాల్లోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కొన్ని వాహనాలు దాదాపు 500 మీటర్ల దూరం మేర కొట్టుకుపోయి పొలాల్లో కూరుకుపోయాయి. వాటిని ట్రాక్టర్లకు కట్టి పొలాల్లోంచి లాక్కొచ్చారు.
భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి వరద పోటెత్తింది. రిజర్వాయర్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు మించి నీరు రావడంతో కట్టపై నుంచి పొంగిపొర్లింది. దీనివల్ల కూసుమంచి-నాయకన్ గూడెం మధ్య సెప్టెంబరు ఒకటో తేదీన వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహంలోనే యాకుబ్ కుటుంబం కొట్టుకుపోయింది.
వరద నీటి ధాటికి నాయకన్ గూడెం వద్ద ఉన్న పెట్రోల్ పంపు ఆనవాళ్లు కోల్పోయింది. పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లు, ఒక కారు కొట్టుకుపోయేంతగా వరద ప్రవాహం సాగింది.

పొలాల్లో ఇసుక మేటలు
మహబూబాబాద్ జిల్లాలోనూ తీవ్రంగా నష్టం జరిగింది. మానుకోట, నెల్లికుదురు, డోర్నకల్, చిన్నగూడూరు, సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. పాకాల, పాలేరు, ఆకేరు, వట్టె వాగు వంటి వాగులు పొంగి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
‘‘మాకున్న నాలుగెకరాల్లో వరి పొలం వేశాను. వరదతో ఇసుక కొట్టుకువచ్చి పొలం నామరూపాల్లేకుండా పోయింది’’ అని ఖమ్మం జిల్లా నాయకన్ గూడేనికి చెందిన వెంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు.
పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో...దాన్ని తొలగించడం రైతులకు సవాలుగా మారింది. పచ్చని పంటలతో ఉండాల్సిన పొలాలు ఇసుక, బురదతో నిండిపోయాయి. తెలంగాణలో దాదాపు 4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాలో తేలింది.
‘‘పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.పదివేల చొప్పున పరిహారం అందించనున్నాం.’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఫొటో సోర్స్, FB/revanthofficial
తెలంగాణ, ఏపీలో నష్టం ఇలా..
వరదల కారణంగా ఏపీ, తెలంగాణలో నష్టంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అంచనా వేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.81లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. మరో 19,453 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతినగా, 3,756 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంచనాకు వచ్చింది.
భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపించామని, తొలి నివేదిక ద్వారా కేంద్రాన్ని రూ. 6,880 కోట్లు అడిగామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలంగాణలో రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పించింది. 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తేల్చింది.
‘‘రహదారుల పరంగా రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.175 కోట్లు, పంటలు దెబ్బతినడం కారణంగా రూ. 415 కోట్లు, చెరువులు దెబ్బతిని రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.170 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.12కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 25 కోట్లు, పట్టణాల్లో వసతులు దెబ్బతిని రూ.1,150 కోట్లు, మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు కలిపి రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది’’ అని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














