పారాలింపిక్స్: భారత్‌ లాంటి కొన్ని దేశాలు ఒలింపిక్స్‌ కన్నా ఇక్కడ ఎక్కువ మెడల్స్ ఎలా గెలుస్తున్నాయి?

పారిస్, పారాలంపిక్స్, బంగారు పతకాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పారిస్ పారాలంపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో బంగారు పతకం గెలుచుకున్న భారతీయ ఆటగాడు ప్రవీణ్ కుమార్
    • రచయిత, జాన్వీ మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2024 సెప్టెంబర్ 7, శనివారం నాటికి పారిస్ పారాలంపిక్స్‌లో భారత్ 27 పతకాలను గెలుచుకుంది. పారాలంపిక్స్‌లో భారతదేశపు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది.

దీనిపై క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటుంటే, భారత్‌కు ఈ స్థాయి విజయాలు చూసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

పారాలంపిక్స్‌కు ముందు జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ కథ వేరుగా ఉంది. అందులో ఆడేందుకు భారత్ తరఫున 110 మంది ఆటగాళ్ల భారీ బృందం పారిస్ వెళ్లింది. కానీ, ఆరు పతకాలు మాత్రమే గెలవగలిగింది. ఇందులో ఒకటి రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి. ఆరు క్రీడల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే ఇది జరిగిన వెంటనే, పారాలంపిక్స్‌కు 84 మంది సభ్యుల బృందాన్ని పంపింది భారత్. ఈ బృందం ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లు గెలిచిన పతకాల కంటే నాలుగు రెట్లు అధికంగా గెలిచారు. ఇది ఈ కథనం ప్రచురించే శనివారం ఉదయం నాటికి ఉన్న పరిస్థితి.

భారత్ ఒక్కటే కాదు, బ్రిటన్, యుక్రెయిన్, నైజీరియాల పెర్ఫార్మెన్స్‌ కూడా ఇలాగే ఉంది.

ఇందులో అర్ధంకాని విషయం ఏంటంటే, కొన్ని దేశాలు ఒలింపిక్స్ కన్నా పారాలింపిక్స్‌లో ఎలా సత్తా చూపించాయి అన్నది.

ఈ రెండు పోటీలను ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదని ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ రెండు క్రీడల్లో ఆటగాళ్ల శారీరక, మానసిక సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి.

మానవ శరీరంలో అత్యుత్తమ సామర్థ్యాన్ని బయటకు తీసేవిగా ఒలింపిక్స్‌కు పేరుంటే, పారాలంపిక్స్‌ ధైర్య,స్థైర్యాలకు పరీక్ష పెడతాయనే మాట ఉంది.

ఒలింపిక్స్‌లో పెద్దగా ప్రభావం చూపని భారత్ సహా కొన్ని దేశాలు మరి పారాలంపిక్స్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్ ఎలా చేశాయి. దీనికి కారణాలేంటో చూద్దాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జీవంజీ దీప్తి, పరుగు పందెం, పారిస్, పారాలంపిక్ గేమ్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం గెలుచుకున్న పారా అథ్లెట్ దీప్తి జీవంజి

పోటీ తక్కువ, పతకాలెక్కువ

ముందుగా, ఒలింపిక్స్‌తో పోల్చుకుంటే పారాలంపిక్స్‌లో పాల్గొనే దేశాల సంఖ్య తక్కువ. పతకాల సంఖ్య ఎక్కువ.

పారిస్ ఒలింపిక్స్‌లో 32 స్పోర్ట్స్ కేటగిరీల్లో 329 గోల్డ్ మెడల్ ఈవెంట్ల కోసం 204 టీములు పోటీ పడ్డాయి. పారిస్ పారాలంపిక్స్‌లో 549 బంగారు పతకాల కోసం 22 కేటగిరీల్లో 170 టీములు పోటీ పడ్డాయి. అందువల్ల సహజంగానే, పారాలంపిక్స్‌లో పతకాలు గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే రెండు పోటీల్లో పాల్గొనే దేశాల్లో కొన్ని పారాలంపిక్స్‌లో ఎక్కువ పతకాలు గెలుచుకుంటున్నాయి.

ఉదాహరణకు చైనాను తీసుకుంటే, టోక్యో ఒలింపిక్స్‌లో చైనా 89 పతకాలు గెలుచుకుంటే పారాలంపిక్స్‌లో 207 మెడల్స్ సాధించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో బ్రిటన్ 64 పతకాలు గెలిచింది. పారాలంపిక్స్‌లో 124 పతకాలను సాధించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలిస్తే పారాలంపిక్స్‌లో 19 మెడల్స్ గెలుచుకుంది.

పారిస్‌ పతకాల పట్టికలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

అదే సమయంలో, ఒలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు పారాలంపిక్స్‌లో వెనుకబడ్డాయి.

నైజీరియా, యుక్రెయిన్ లాంటి దేశాలు భారత్‌తో పోటీ పడి పారాలంపిక్స్‌లో మంచి ప్రతిభ కనబరిచాయి.

పారిస్, పారాలంపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారా అథ్లెట్ల విషయంలో ఆరోగ్య రక్షణ, అంగ వైకల్యం పట్ల సామాజిక దృష్టి కోణం, నిపుణుల శిక్షణ లాంటి అంశాలది కీలక పాత్ర

హెల్త్‌కేర్

ఒలింపిక్స్‌లో సాధించే విజయాలకు, ఆయా దేశాల సంపద, జీడీపీకి సంబంధం ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది.

దీనర్ధం, సంపన్న దేశాలే పతకాలు గెలుస్తాయని లేదా ఎక్కువ డబ్బు ఉంటే పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండవచ్చని కాదు. కాకపోతే, పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండే మొదటి పది దేశాలు మిగతా దేశాలతో పోల్చుకుంటే సంపన్న దేశాలే.

అదే పారాలంపిక్స్ విషయానికొస్తే, సంపద కంటే ఆరోగ్య రక్షణ, అంగ వైకల్యం పట్ల సామాజిక దృష్టి కోణం లాంటివి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.

ఈ కారణం వల్లనే పారాలంపిక్స్‌లో అమెరికా కంటే బ్రిటన్ ఎక్కువ పతకాలు గెలుస్తుందనేది కొంతమంది వాదన.

భారత్‌లోనూ, వైద్య సేవల లభ్యత విషయంలో అసమానతలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్ లాంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

అంటే, ఈ దేశాల్లో వికలాంగులకు, పారా అథ్లెట్లకు ఉత్తమ వైద్య సేవలు, ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని దీనర్థం.

పారిస్, పారాలంపిక్ గేమ్స్, దీప్తి జీవంజి, భారత దేశం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పారిస్ పారాలంపిక్స్ ప్రారంభ వేడుక్లలో పాల్గొన్న భారత బృందం

పారా స్పోర్ట్స్ సంస్కృతి

చైనా, బ్రెజిల్ మాదిరిగా భారత్‌లో జనాభా ఎక్కువ. వీరిలో వికలాంగులైన క్రీడాకారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, సంఖ్య ఎక్కువ ఉన్నంత మాత్రాన వారందరూ ఉత్తమ ప్రతిభావంతులు కాకపోవచ్చు.

వికలాంగుల పట్ల సామాజిక వైఖరి ఎలా ఉందనే అంశం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ దీనికి మంచి ఉదాహరణ.

అనేక దేశాల్లో, వికలాంగుల పట్ల చిన్నచూపు, జాలి చూపించడం లాంటివి చేస్తుంటారు. ఈ దేశాల్లో వికలాంగులైన అథ్లెట్లను క్రీడాకారులుగా గుర్తించరు. భారత దేశంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండేది.

అయితే ఇటీవలి కాలంలో, వికలాంగుల పట్ల సామాజిక వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. వికలాంగుల క్రీడలను దేశంలోని క్రీడా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.

పారాలంపిక్స్‌లో సాధించిన పతకాలే దీనికి నిదర్శనం.

గత రెండు దశాబ్దాల్లో, పారా స్పోర్ట్స్ పట్ల అవగాహన పెరిగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారా అథ్లెట్లకు క్రీడల్లో శిక్షణ, సౌకర్యాల కల్పనకు నిధులు పెంచాయి.

2010లో కామన్‌వెల్త్ గేమ్స్‌కు దిల్లీ ఆతిధ్యమిచ్చిన తర్వాత, పారా అథ్లెట్లకు ఇచ్చే నగదు బహుమతిని క్రీడామంత్రిత్వ శాఖ పెంచింది. వారికిచ్చే ప్రైజ్ మనీని సాధారణ క్రీడాకారుల స్థాయికి చేర్చింది.

పారా స్పోర్ట్స్ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్న రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. ప్రస్తుతం పారిస్ పారాలంపిక్స్‌లో పాల్గొన్న బృందంలోని 84 మందిలో 23 మంది హరియాణా నుంచి వచ్చిన వారే.

పారా అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం భారీ నగదు బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు, అవార్డులు అందిస్తోంది. పారా స్పోర్ట్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు హరియాణా అడుగుజాడల్లో నడుస్తున్నాయి.

అవగాహన పెరగడంతో భారత దేశంలో స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్న పారా అథ్లెట్ల సంఖ్య పెరుగుతోందని వీల్ చైర్ క్రికెటర్ రాహుల్ రాముగడే చెప్పారు.

“వైకల్యం ఉన్న వ్యక్తి తాను బయటకు వచ్చి సత్తా ప్రదర్శించగలనని భావించాలి. వారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అవకాశం వస్తే, లక్ష్యాలను సాధించేందుకు వాళ్లెప్పుడూ సిద్ధంగా ఉంటారు. అది అక్కడితో ఆగిపోదు. అనేక మంది పారా అథ్లెట్లు ప్రస్తుతం ఇతరులకు శిక్షణలో సాయం అందిస్తున్నారు” అని ఆయన చెప్పారు.

రాహుల్ కూడా ఇలాంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన, ఆయన సహచరులు దేశంలో వీల్‌చైర్ క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నారు.

ఒకప్పుడు గుర్తింపుకు సంబంధించిన సమస్య ఉండేది. ఒలింపిక్స్‌తో పోల్చుకుంటే పారాలంపిక్స్‌కు ప్రజాదరణ తక్కువ. పారా అథ్లెట్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. దీని వల్ల వారి మీద ఒత్తిడి, అంచనాల ప్రభావం తక్కువగా ఉంటుంది.

అయితే వారిలోనూ ఉత్తమ ప్రదర్శన అందించాలనే కోరిక, ఏదో ఒకటి సాధించాలనే తపన బలంగా ఉంటాయి. అవే వారిని వేదికపైకి నడిపిస్తున్నాయి.

పారిస్, పారాలంపిక్స్, భారత దేశం, షూటింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టోక్యో, పారిస్‌ పారాలంపిక్ గేమ్స్‌లో షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవని లెఖరా

సాధించాల్సింది చాలా ఉంది.

పారా స్పోర్ట్స్ గురించి భారత సమాజపు దృష్టి కోణం మారుతున్నప్పటికీ, ఆటగాళ్లు ఇప్పటికీ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.

రైఫిల్ షూటర్ అవని లెఖరా టోక్యో, పారిస్‌లలో బంగారు పతకాలు సాధించారు. అయితే వాళ్లు శిక్షణ తీసుకునే రేంజ్ దగ్గర ఇప్పటికీ వీల్‌చైర్‌లో వెళ్లగలిగే ఏర్పాట్లు లేవు.

“అవని సాధించిన విజయాల తర్వాత శిక్షణా కేంద్రం దగ్గర ర్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే దేశంలోని అనేక క్రీడా మైదానాలు, శిక్షణ కేంద్రాలు, వ్యాయామశాలలు, టాయిలెట్లలోనూ పరిస్థితులు పెద్దగా మారలేదు” అని రాహుల్ రాముగడే చెప్పారు.

అవని సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తూ ఇండియన్ నేషనల్ షూటింగ్ కోచ్ సుమ షిరూర్ కూడా ఇదే విషయం చెప్పారు.

“పారిస్ పారాలంపిక్స్ తర్వాత అవని ప్రయాణం మరింత స్వేచ్ఛాయుతంగా సాగాలి. అయితే మన దేశంలో అది అంత తేలిక్కాదు. మన దేశంలోని వికలాంగ క్రీడాకారులకు అనుకూలమైన వ్యవస్థ లేదు. బహిరంగ ప్రదేశాల్లోనూ వీల్‌చైర్‌ అనుకూల వసతులు లేవు. ఇలా ఉంటే చాలా కష్టం. అయితే ఆమె జీవితంలో మరింత స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవచ్చు” అని సుమ చెప్పారు.

పారాలంపిక్స్‌లో సాధించిన విజయాల నుంచి ఒక ముఖ్యమైన విషయం గ్రహించవచ్చు. భారత్ ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని భావిస్తూ ఉంటే వ్యవస్థలు కూడా ఇలాగే పని చేయాలి. క్రీడల్ని అందరికీ అందుబాటులోకి తేవాలి.

( బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)