కమలాహారిస్: ‘మా అమ్మ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. ఉన్నంతలో సర్దుకుని జీవించాం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోనీ జుర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కమలాహారిస్ అధికారికంగా డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గురువారం రాత్రి అంగీకరించారు.
ఈ సందర్భంగా ఆమె కీలక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించినప్పటికీ కొత్త విషయాలు ఏమీ చెప్పలేకపోయారు.
ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొదటి శ్వేత జాతేతర మహిళగా సంచలనం సృష్టించిన కమలా హారిస్.. "మీరెవరో వేరే వాళ్లు చెప్పాల్సిన అవసరం రానివ్వొద్దు. మీరు ఎవరో వాళ్లకు చూపించండి" అని అన్నారు.
గురువారం తన 45 నిమిషాల ప్రసంగంలో తానెవరో, తాను గెలిస్తే ఏం చేస్తానో అమెరికన్లకు చెప్పే ప్రయత్నం చేశారు ఆమె.

1) ‘ప్రజలే నా క్లయింట్లు’
చాలా మంది అమెరికన్లకు కమలాహారిస్ అంటే ఎవరో తెలుసు. కానీ ఆమె భావజాలం, నేపథ్యం ఏమిటో తెలియదు. మొట్టమొదట, తన ప్రసంగం ద్వారా వాటిని తెలియజేసే ప్రయత్నం చేశారు.
భారతదేశం నుంచి వలస వచ్చిన తన తల్లి ప్రయాణాన్ని కమల వివరించారు.
తన తల్లిదండ్రులు ఎలా కలుసుకున్నారు, చివరికి వాళ్లు ఎలా విడాకులు తీసుకున్నారనే విషయాలూ ఆమె చెప్పారు.
కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లోని శ్రామికులు ఉండే ప్రాంతంలో గడిచిన తన బాల్యం గురించి మాట్లాడారు.
‘నేను మధ్యతరగతి నుంచి వచ్చాను’ అని ఆమె చెప్పారు.
‘మా అమ్మ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. మాకున్న దానిలోనే సర్దుకుని జీవించాం. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని మా అమ్మ ఆశించింది’ అని తెలిపారు.
న్యాయవాద వృత్తిని తాను ఎందుకు ఎంచుకున్నారో కమలా హారిస్ వివరించారు.
"నా కెరీర్ మొత్తం ఒకే ఒక క్లయింట్ ఉన్నారు. వాళ్లు ప్రజలు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2) విజన్ వెల్లడి
హారిస్ తన ప్రసంగంలో అమెరికన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆధునిక అమెరికన్ రాజకీయాల విభజన పోరాటాలు, పొరపొచ్చాలకు అతీతమైన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
అమెరికా ముందుకు సాగడానికి ఒక కొత్త మార్గం కోసం, ఒక అమూల్యమైన, చాలా తక్కువ వ్యవధి కల అవకాశం ఉందని ఆమె అన్నారు. కానీ దాని గురించి ఎక్కువ వివరించలేదు.
గతంలో చాలా మంది అధ్యక్ష ఆశావహులు ఇలాంటి ఐక్యత, పక్షపాతరహిత మార్గం లాంటి అస్పష్టమైన మాటలు చాలానే చెప్పారు.
హారిస్ తన విధానాల గురించి చెప్పినప్పుడు, ఆమె సాధారణ అంశాలనే చెప్పారు.
ఆరోగ్యం, గృహవసతి, కిరాణా సామగ్రితో సహా రోజువారీ అవసరాల ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారిస్తానని ఆమె చెప్పారు.
ప్రత్యేకంగా అబార్షన్ హక్కుల గురించి మాట్లాడారు. అది మహిళల స్వేచ్ఛను కాపాడే సాధనమని అన్నారు. దీని గురించి ప్రతి డెమొక్రటిక్ కన్వెన్షన్‌లోనూ చెబుతున్నారు.
"అమెరికన్లు వారి సొంత జీవితాల గురించి, ముఖ్యంగా వారి మనసు, ఇంటి విషయాల గురించి సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే తప్ప అమెరికా నిజంగా సుసంపన్నం కాదు" అని అన్నారు.
హారిస్ తనను తాను ‘సెంటర్-లెఫ్ట్ మోడరేట్’ అని చెప్పుకున్నారు. అయితే ఆమె పేర్కొన్న విధానాలకు, జో బైడెన్ విధానాలకు పెద్దగా మార్పు లేదు.
"నేను వెళ్లిన ప్రతి చోటా, కలిసిన ప్రతి ఒక్కరిలో, ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్న దేశాన్ని చూస్తున్నాను" అని అన్నారు.
3) మారని గాజా యుద్ధ సందేశం
పాలస్తీనా అనుకూలురు కొందరు కన్వెన్షన్ బయట నిరసనలు తెలుపుతుండగా, హారిస్ తన ప్రసంగంలో గాజా యుద్ధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ప్రెసిడెంట్ బైడెన్, నేను 24 గంటలూ పని చేస్తున్నాం. బందీలుగా ఉన్న వాళ్లను విడిపించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, కాల్పుల విరమణ చేపట్టే సమయం వచ్చింది" అని ఆమె అన్నారు.
ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఉందని ఆమె అన్నారు. అక్టోబర్ 7 హమాస్ దాడి క్రూరత్వాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అయితే, జనాలలో కొందరు ఆమెను గేలి చేసే ప్రయత్నం చేయగానే, వెంటనే పాలస్తీనియన్ల దుస్థితినీ ప్రస్తావించారు. వాళ్ల బాధలు "హృదయ విదారకం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4. ట్రంప్ ఒక 'అన్‌సీరియస్ మ్యాన్'
రెండు రోజుల క్రితం ఒబామా దంపతులు మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యక్తిత్వంపై విమర్శలు చేశారు.
హారిస్ సైతం తన రిపబ్లికన్ ప్రత్యర్థిని విమర్శించారు. అయితే అవి గత కొన్ని నెలలుగా బైడెన్‌తో డెమొక్రాట్ నేతలంతా చేస్తున్నవే.
"డోనాల్డ్ ట్రంప్ ఒక అన్‌సీరియస్ వ్యక్తి," అని కమలాహారిస్ అన్నారు. "ట్రంప్‌ను తిరిగి వైట్‌హౌస్‌కు తీసుకువస్తే తీవ్ర పరిణామాలుంటాయి" అని హెచ్చరించారు.
జనవరి 6న అమెరికా క్యాపిటల్‌పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని, ఆయన నేరారోపణలను కమలా ప్రస్తావించారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కోసం హెరిటేజ్ ఫౌండేషన్ తయారు చేసిన ప్రాజెక్ట్ 2025 బ్లూప్రింట్‌పైనా విమర్శలు చేశారు.
మాజీ ప్రెసిడెంట్ ఈ ప్రణాళికను తిరస్కరించినా, ఇది ఆయన సలహాదారులే రాశారని, ఇది "మన దేశాన్ని గతం వైపు లాగుతుంది" అని అన్నారు.
భవిష్యత్తు, గతంలో ఉన్న తేడాలు ఇప్పటివరకు హారిస్ ప్రచారంలో ప్రధాన అంశంగా ఉన్నాయి.
ప్రస్తుత రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్, జో బైడెన్‌కు సంబంధించిన జనాదరణ లేని అంశాలు, ఈ రెండింటి నుంచి తనను వేరు చేసుకోవడానికి ఆమె తరచుగా వాటిని ప్రస్తావిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















