కమలా హారిస్: తనపై ఉన్న అనుమానాలు, అపనమ్మకాలను పటాపంచలు చేయగలరా?

కమలాహారిస్
ఫొటో క్యాప్షన్, అధ్యక్ష అభ్యర్థిగా తన సత్తాపై కమలాహారిస్ డెమొక్రాట్ల సందేహాలను ఎదుర్కొన్నారు
    • రచయిత, కోర్ట్నీ సుబ్రమణియన్
    • హోదా, బీబీసీ న్యూస్

షికాగోలో ఈ వారం జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వేదికపైకి కమలా హారిస్ వచ్చినప్పుడు, తనను అభినందించిన ప్రేక్షకులలో తాను అధ్యక్ష అభ్యర్థి అవుతానని ఏనాడూ ఊహించనివారే ఎక్కువమంది ఉండి ఉంటారని ఆమెకూ తెలుసు.

అమెరికా అత్యున్నత రాజకీయ పదవికి పోటీ పడేందుకు తనకున్న సామర్థ్యంపై అధ్యక్షుడు జో బైడెన్ సహా, డెమొక్రాట్లలోని అనేకమంది అనుమానాలను 59 ఏళ్ల కమలా హారిస్ ఎదుర్కొన్నారు.

జులై మధ్యలో బైడెన్ స్థానంలో డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికైనప్పటి నుంచి కమలా హారిస్‌ అందరిలోనూ ఉత్సాహం వెల్లువెత్తడం చూశారు. ఆ ఉత్సాహం పోలింగ్ లోనూ, నిధుల సేకరణలో, దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో ఆమెను చూసేందుకు వచ్చిన భారీ జనసందోహంలోనూ ప్రతిబింబించింది.

కానీ ఇటీవల వారాలలో ఆమె సృష్టించిన రాజకీయవేగం, ఉత్సాహం డెమొక్రాట్లలో ఎన్నడూ చూడలేదు.

2019లో అధ్యక్ష పదవికి పోటీపడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు స్వల్పకాలంలోనే ముగిశాయి. పైగా ఉపాధ్యక్షురాలిగా ఆమె తన పదవీకాలాన్ని, సవాళ్లు, ఇబ్బందులతోనే ప్రారంభించారు. ముఖ్యమైన ఇంటర్వ్యూలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు.

మరోపక్క ఆమె దగ్గర ఉన్న సిబ్బంది వెళ్ళిపోవడం, వారి స్థానంలో మరొకరిని నియమించడమో జరిగిపోయాయి. అలాగే ఆమెకు ఆమోదయోగ్యమైన రేటింగ్స్ కూడా రాలేదు. ఇలా గత మూడున్నరేళ్లుగా శ్వేతసౌధంలో ఆమె అమెరికన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత ఆమె తన రాజకీయ నైపుణ్యాలలో రాటుదేలారు. తన పార్టీలోని గ్రూపులతోనూ, వ్యక్తులతోనూ సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారిని తనకు మద్దతు ఇచ్చే విషయంలో విశ్వాసపాత్రులుగా మార్చుకున్నారు.

గర్భస్రావం హక్కులు వంటి అంశాలద్వారా విశ్వసనీయతను పెంచుకున్నారని సలహాదారులు, మిత్రపక్షాల నేతలు చెబుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఆమె సరిగ్గా ఇలాంటి క్షణం కోసం సిద్ధమవుతున్నారు.

గురువారం డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా ఆమోదించిన కమలా హారిస్‌కు, దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడానికి కేవలం 80 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్న సమయంలో జాతీయ వేదికపై తనను తాను తిరిగి పరిచయం చేసుకునే అవకాశం లభించింది.

అదే సమయంలో తనను ఎప్పుడూ సహజ నాయకురాలిగా చూడని పార్టీకి తనకు పార్టీని నడపగలిగే సామర్థ్యం ఉందని రుజువు చేయడంతోపాటు, గాజా, ఇజ్రాయెల్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పార్టీని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా ఉందని నిరూపించుకోవాల్సి ఉంది.

ఇక వీటన్నింటికీ మించి మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఓడించే సవాలును కమలా హారిస్ ఎదుర్కోగలరా అనే డెమొక్రాట్ల సందేహాలకు ఆమె తెరదించాల్సిన అవసరం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కమలాహారిస్
ఫొటో క్యాప్షన్, కమలా హారిస్

శ్వేత సౌధానికి దారి

2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను డోనల్డ్ ట్రంప్ ఓడించిన రోజు రాత్రే కమలాహారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. ఆమె తన స్వల్ప పదవీకాలంలో తన పని తీరుతో పతాకశీర్షికలలో నిలిచారు. ముఖ్యంగా 2018లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్‌ను సూటిగా ప్రశ్నించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.

ఒబామా లాగే ఆమె కూడా అమితమైన ఆకాంక్షలున్న యువ సెనేటర్. తన మొదటి పదవీకాలం సగం పూర్తయిన తర్వాత ఆమె అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఆ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. కాలిఫోర్నియాలోని ఆమె స్వగ్రామం ఓక్లాండ్ లో 20,000 మందికిపైగా అభిమానులు తరలివచ్చారు. కానీ డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆమె చేసిన ప్రయత్నం తొలి అధ్యక్ష ప్రాథమిక ఓటింగ్ కు ముందే విఫలమైంది.

బైడెన్ సహా, లెఫ్ట్ వింగ్ సెనేటర్ బెర్నీ శాండర్స్ లాంటి ప్రత్యర్ధుల ముందు స్పష్టమైన రాజకీయ గుర్తింపును ఏర్పరుచుకోవడంలో కమలా హారిస్ విఫలమయ్యారు. ఆమె ప్రజాదరణ పొందిన అభ్యుదయ వైఖరిని అవలంబించినట్టు కనిపించారని, కానీ వాటిపట్ల ఆమెకు చిత్తశుద్ధి, లోతైన అవగాహన ఉన్నట్టు లేదనే విమర్శలు వచ్చాయి.

పాఠశాలలో జాతివివక్షపై అప్పటి తన ప్రత్యర్థి బైడెన్ రికార్డును కమలా హారిస్ సవాల్ చేశారు. దీనివల్ల ఆమెకు అప్పట్లో కాస్త పేరు వచ్చింది. ఆమె పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది.

అయితే 8నెలల తరువాత బైడెన్ తమ ప్రైమరీ వైరాన్ని పక్కన పెట్టి కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. ఆ స్థానానికి నామినేట్ అయిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా కమల గుర్తింపు పొందారు. 2021 జనవరిలో అమెరికా చరిత్రలో మొదటిసారిగా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

కమలా హారిస్
ఫొటో క్యాప్షన్, డెమెుక్రాట్లలోని గ్రూపులు, వ్యక్తులతో కమలా హారిస్ చక్కగా సమన్వయం చేసుకున్నారు

సీటు బెల్ట్‌తో పుట్టాను

గురువారం రాత్రి డెమొక్రటిక్ సదస్సులో కమలా హారిస్ చేయనున్న ప్రసంగం ఆమె రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టం. వరుసగా మూడోసారి తమ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయిన ట్రంప్‌కు రిపబ్లికన్ సదస్సు పట్టాభిషేకం చేయగా, ఆకస్మికంగా తెరపైకి వచ్చిన కమలా హారిస్‌కు ఆమె ఎవరనే గుర్తింపును, ఆమె రాజకీయ జీవితాన్ని నిర్వచించడానికి ఆ ప్రసంగమే కీలకమని ఓ సీనియర్ సహాయకుడు తెలిపారు.

"ఆమె అధ్యక్ష పదవికి ఎందుకు పోటీ చేస్తున్నారు? దేశం పట్ల ఆమె విజన్ ఏమిటి?' అని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సిమన్స్ ప్రశ్నించారు. ప్రజలకు అర్థమయ్యేలా ఆమె విధానాలు, రాజకీయ జీవితంలోని అన్ని అంశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుందన్నారు.

కానీ నాలుగు రోజుల వ్యవధిలో, కమలా హారిస్ నేరాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, వలసల గురించి పదునైన ప్రసంగం చేయాల్సి ఉంది.

సుదీర్ఘకాలం రిపబ్లికన్ వ్యూహకర్తగా ఉన్న వైట్ ఐరెస్ మాట్లాడుతూ 2019లో అధ్యక్ష ఎన్నికల్లో విఫలమైన సమయంలో కమలా హారిస్ తీసుకున్న వామపక్ష వైఖరిని కూడా ఏదో ఒక సమయంలో స్పష్టం చేయాల్సి ఉంటుందని అన్నారు.

గాజాలో ఇజ్రాయెల్ చర్యలపై నిరసనలు కూడా ఆమె ఎదుర్కోనున్నారు. అధ్యక్షుడు బైడెన్ కంటే కాల్పుల విరమణ, పౌర మరణాలను ఖండించడంలో కమలా హారిస్ మరింత శక్తిమంతంగా ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ పరిపాలనకు స్థిరమైన మద్దతు నుంచి ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ వైఖరి పార్టీ ప్రగతిశీల విభాగాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది.

అయినప్పటికీ, గత వారం రోజులుగా ఆమెను సిద్ధం చేస్తున్న మిత్రపక్షాలు, సలహాదారులు మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి పునాదులు వేసుకున్నారని వాదిస్తున్నారు. ఈ క్షణంలో ఆమె నిజంగా ఈ స్థానంలో ఉంటారని ఎవరూ ఊహించలేదు.

అవకాశం అంటే కాస్త అదృష్టాన్ని అందిపుచ్చుకోవడమేనని, దీనిని అదృష్టంగా తాను అభివర్ణించబోనని, అవకాశం వచ్చిన క్షణాన్ని ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని సీనియర్ రాజకీయ సలహాదారు ఒకరు తెలిపారు.

1990వ దశకం నుంచి కమలా హారిస్‌తో పరిచయం ఉన్న సూసీ టాంప్కిన్స్ బ్యూయెల్ మాట్లాడుతూ గత కొన్ని వారాలుగా కమలా హారిస్ ప్రదర్శన చూసి తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నారు.

బైడెన్ డిబేట్ ముగిసిన కొద్ది రోజులకే, కమలాహారిస్ ఆయనతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తరువాత ఈ విషయాన్ని ఆమె సూసీ టాంప్కిన్స్‌తో పంచుకుంటూ ఏదో మార్పు జరగబోతోందని గ్రహించినట్టు చెప్పారు.

ఆ సమయంలో రాజకీయ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సీటు బెల్ట్ కట్టుకుని సిద్ధంగా ఉండమని టాంప్కిన్స్ చమత్కారంగా చెపితే, కమలా హారిస్ కూడా అంతే చమత్కారంగా ‘నేను సీటు బెల్ట్‌తోనే పుట్టాను’ అని అన్నారు.

‘ఆమె సమాధానం నాకు నచ్చింది’ అని టాంప్కిన్స్ అన్నారు. ఈ నెల మొదట్లో శానిఫ్రాన్సిస్కో విరాళాల సేకరణలో 12 మిలియన్ డాలర్ల నిధుల సేకరణకు టాంప్కిన్స్ సాయపడ్డారు.

‘‘ఇది హఠాత్తుగా జరిగింది. కానీ సరిగ్గానే జరిగింది. అందుకు ఆమె (కమలా హారిస్) సిద్ధంగా ఉన్నారు’’

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)