బీబీసీ ఫ్యాక్ట్ చెక్: ట్రంప్‌ అబద్ధం చెప్పారా, మస్క్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన నిజాలెన్ని?

ఎలాన్ మస్క్, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Donald J. Trump/X

ఫొటో క్యాప్షన్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షులు డోనల్డ్ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేశారు
    • రచయిత, జేక్ హార్టన్, మార్క్ పాంటింగ్, లూసీ గిల్డర్
    • హోదా, బీబీసీ వెరిఫై

సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విటర్)లో ఎలాన్ మస్క్‌తో సాగిన 2 గంటల సంభాషణలో డోనల్డ్ ట్రంప్ అనేక వాదనలు చేశారు.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో తన ప్రచారంలో చెప్పినట్లు అక్రమ వలసలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావించారు. వాతావరణ మార్పుల గురించి కూడా ఆయన మాట్లాడారు.

ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీబీసీ వెరిఫై ఫ్యాక్ట్ చెక్ చేసింది. మరి.. ఆయన చేసిన వాదనల్లో ఎంత నిజముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు

సముద్ర మట్టం భారీగా పెరగనుందా?

ట్రంప్ వాదన: ''ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు గ్లోబల్ వార్మింగ్ కాదు. రాబోయే 400 ఏళ్లలో సముద్ర మట్టాలు ఒక ఇంచ్‌(అంగుళం)లో ఎనిమిదో వంతు పెరుగుతాయి.''

వాస్తవం: వాతావరణ మార్పుల అంచనాల ప్రకారం, సముద్ర మట్టాల పెరుగుదలను ట్రంప్ చాలా తక్కువగా అంచనా వేశారు.

ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం, 2014 నుంచి 2023 వరకు సముద్రం మట్టం ఏడాదికి సగటున 4.8 మిల్లీమీటర్లు (0.19 అంగుళాలు) పెరిగింది. అంటే, ఇది అంగుళంలో ఎనిమిదో వంతు(0.13 అంగుళాలు) కంటే ఎక్కువే.

మంచుకొండలు ఎంత త్వరగా కరుగుతున్నాయనే అంశాన్ని కచ్చితంగా అంచనా వేయలేం, కాబట్టి భవిష్యత్తులో సముద్ర మట్టాల పెరుగుదలపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రావడం కష్టం. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

అలాగే, 2100వ సంవత్సరం నాటికి సముద్ర మట్టం 0.28 మీటర్ల నుంచి 1.01 మీటర్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) అంచనా వేసింది. ఇంతకంటే ఎక్కువ పెరుగుదల ఉండే అవకాశం లేదని పేర్కొంది.

సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరగడం వల్ల తీరప్రాంతాలు నీటమునిగి, లక్షలాది మంది ప్రమాదంలో పడే అవకాశముంది. మాల్దీవుల వంటి లోతట్టు ప్రాంతాలున్న దేశాలు నీటిలో మునిగిపోతాయి.

అమెరికా, వలసదారులు

ఫొటో సోర్స్, Getty Images

రెండు కోట్ల మంది అక్రమంగా బోర్డర్ దాటారా?

ట్రంప్ వాదన: ''20 మిలియన్ల మంది (2 కోట్లు) బోర్డర్ దాటారని అనుకుంటున్నా. నెలనెలా లక్షల మంది వస్తున్నారు.''

వాస్తవం: జో బైడెన్ హయాంలో దక్షిణ సరిహద్దు(సదరన్ బోర్డర్) దాటి ఎంతమంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే, ఈ అక్రమ వలసలు రికార్డు స్థాయికి చేరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పెరిగినా కానీ, ట్రంప్ చెప్పినంత మంది అయితే కాదు.

2021 జనవరి నుంచి 2024 జులై వరకు 1.01 కోట్ల మంది అక్రమ వలసదారులను అధికారులు గుర్తించినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. వారిలో 80 లక్షల మంది సదరన్ బోర్డర్ నుంచి ప్రవేశించారు.

అయితే, వాళ్లంతా అమెరికాలోకి ప్రవేశించినట్లు దీనర్థం కాదు. వారిలో చాలా మందిని అధికారులు వెనక్కి పంపి ఉండొచ్చు. లేదా పదేపదే బోర్డర్ దాటేందుకు ప్రయత్నించిన వారి సంఖ్యలో కూడా ఇందులో కలిసి ఉండొచ్చు.

అధికారిక లెక్కల ప్రకారం, గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది.

అలాగే, ప్రతినెలా లక్షల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లుగా చెప్పే గణాంకాలు లేవు. జులైలో సదరన్ బోర్డర్ నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న 57000 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అడ్డుకున్నారు. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్పం.

బైడెన్ హయాంలో, 2023 డిసెంబర్‌లో గరిష్టంగా 2,50,000 మంది వలసదారులు బోర్డర్ దాటేందుకు ప్రయత్నిస్తూ సరిహద్దు వద్ద పట్టుబడ్డారు.

అమెరికా, ట్రంప్

బేకన్ రేటు ఐదు రెట్లు పెరిగిందా?

ట్రంప్ వాదన: ''నాకు తెలిసి గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్పణం పెరిగింది. బేకన్ (మాంసంతో తయారుచేసే ఆహార పదార్థం) ధర నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది.''

వాస్తవం: ట్రంప్ వాదన అబద్ధం. జో బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం రేటు గరిష్టంగా 9.1 శాతానికి పెరిగింది. ఇది గత వందేళ్లలో కాదు, గడచిన 41 ఏళ్లలో అత్యధికం. ట్రంప్ దిగిపోయిన తర్వాత బేకన్ ధర 17 శాతం పెరిగింది. ట్రంప్ చెప్పినట్లు నాలుగైదు రెట్లు పెరగలేదు.

బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి రెండేళ్లలో ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. 1981 నుంచి పోలిస్తే గరిష్ట స్థాయికి చేరింది. అయితే, ఇతర పశ్చిమ దేశాల్లోనూ అదే పరిస్థితి.

కరోనా మహమ్మారి, యుక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్ ప్రభావితమై, డిమాండ్ - సప్లై చెయిన్ దెబ్బతింది. దీంతో ధరలు పెరిగాయి.

2021లో 1.9 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాలన్న బైడెన్ ప్రభుత్వ ప్రణాళికలు కూడా అందుకు ఒక కారణమని పలువురు ఆర్థికవేత్తలు తెలిపారు. తిరిగి 2022 మధ్య నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతూ వచ్చింది. గత జూన్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా ఉంది.

యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2021లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయేప్పటికి స్లైస్‌డ్ బేకన్ ధర 5.83 డాలర్లు కాగా, ఇప్పుడు దాని ధర 6.83 డాలర్లు.

అమెరికా మెక్సికో బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా మెక్సికో బోర్డర్

ట్రంప్ వందల మైళ్ల గోడ కట్టారా?

ట్రంప్ వాదన: "దక్షిణాన సరిహద్దును బలోపేతం చేసేందుకు నేను వందల మైళ్ల మేర గోడ నిర్మించా''

వాస్తవం: ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంతదూరం గోడ నిర్మించారనే విషయం మీరు లెక్కించే విధానంపై ఆధారపడి ఉంటుంది.

కొత్తగా నిర్మించిన గోడ, పాతగోడ పునర్నిర్మాణం లేదా మరమ్మతులను కలిపితే, ట్రంప్ హయాంలో 458 మైళ్ల(724 కిలోమీటర్ల)కి పైగా సరిహద్దు గోడ నిర్మితమైంది.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం, 458 మైళ్ల మేర సరిహద్దు గోడ ఉంది. అందులో కేవలం 85 మైళ్లు (సుమారు 136.7 కిలోమీటర్లు) మాత్రమే కొత్తగా గోడ నిర్మాణం జరిగింది, అంటే ట్రంప్ హయాంలో నిర్మించింది.

మిగిలిన చోట్ల మార్పులు, లేదా గోడకు మరమ్మతులు చేసి పటిష్టం చేయడం వంటి పనులు జరిగాయి.

జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత గోడ నిర్మాణాన్ని నిలిపేశారు. కానీ, అక్రమ చొరబాట్లను నిరోధించడం కోసం కొన్ని ప్రాంతాల్లో గోడ నిర్మాణానికి గతేడాది అనుమతులు ఇచ్చారు.

సదరన్ టెక్సాస్‌లో 20 మైళ్ల (32 కిలోమీటర్లు) మేర గోడ నిర్మాణానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)