నేపాల్‌లో నదిలో పడిన బస్సు, 27 మంది మృతి, అత్యధికులు భారతీయులే

ఫొటో సోర్స్, Getty Images
41 మంది భారతీయ యాత్రికులు సహా మొత్తం 43 మందితో వెళ్తున్న బస్ ఒకటి నేపాల్‌లోని తనాహు జిల్లాలోని అంబుఖైరేని సమీపంలో ఉన్న మార్స్యాంగ్డీ నదిలోపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది చనిపోయారు.
ఈ మేరకు తనాహు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జనార్దన్ గౌతమ్ ‘బీబీసీ నేపాలీ’కి ధ్రువీకరించారు.
ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని వైద్య చికిత్స కోసం ఆర్మీ హెలికాప్టర్‌లో కఠ్మాండూ తరలించినట్లు తెలిపారు.
ఇద్దరు బస్సు సిబ్బందితో సహా ఈ బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సు కొన్ని రోజుల కిందట నేపాల్‌లోకి ప్రవేశించిందని, దీనిలో మహారాష్ట్రకు చెందిన ప్రయాణికులున్నారని పోలీసులు ధ్రువీకరించారు.
బస్సులో ఉన్న కొందరు చనిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే, చనిపోయిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
కాగా, మహారాష్ట్రలోని జలగావ్ నుంచి 41 మంది నేపాల్ యాత్రకు వెళ్లారని, వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి అక్కడ నదిలో పడిపోయిందని మహారాష్ట్ర రిలీఫ్ అండ్ రీహ్యాబిలిటేషన్ మినిస్టర్ అనిల్ పాటిల్ తెలిపారు.


ఫొటో సోర్స్, RUPESH TAMANG
బస్సులో ఎవరున్నారు?
గోరఖ్‌పూర్ నుంచి నేపాల్ వచ్చిన ఈ బస్సు కేశర్వాని ట్రాన్స్‌పోర్టుకు చెందినదని డీఎస్‌పీ భట్ తెలిపారు.
డ్రైవర్, హెల్పర్ కాకుండా భారతీయ ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన ఈ ప్రయాణికులు కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత నేపాల్‌కు వచ్చినట్లు రికార్డు అయి ఉంది.
ఈ ప్రయాణికులందరూ ఒక హోటల్‌లో బస చేశారు. ఆ తర్వాత రోజు ఈ బస్సులోనే వీరు పోఖరాకు వెళ్లారు.
8 రోజులు ఉండేందుకు అనుమతి తీసుకుని వీరు నేపాల్‌కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Rupesh Tamang
పోఖరా నుంచి కఠ్మాండూ వెళ్తున్న సమయంలో ఈ బస్సుకు ప్రమాదం జరిగింది.
గల్లంతైన వారి కోసం సహాయ బృందాలు వెతుకుతున్నాయి. అయతే, వర్షం కారణంగా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలు సజావుగా సాగడం లేదు.
ప్రమాద స్థలం నుంచి బాధితులను రక్షించి, వారిని రోడ్డుకు తీసుకొచ్చారు స్థానిక పోలీసులు.
నదిలో పడిపోతున్న బస్సుకు చెందిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్నాయి. సహాయ బృందాలు బస్సులో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
సహాయ చర్యలలో ఆర్మీ హెలికాప్టర్‌ను వాడుతున్నట్లు నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి గౌరవ్ కుమార్ కేసీ తెలిపారు.
ప్రమాద స్థలంలో తీసిన ఫోటోలు, వీడియోల్లో మార్స్యాంగ్డీ నది తీరంలో బస్సు భాగాలు కనిపిస్తున్నాయి.
‘‘బస్సు పడిపోయిన ప్రదేశానికి సహాయ బృందాలు వెళ్లడం కష్టమవుతోంది. దీంతో, రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతోంది’’ అని అంబుఖైరేని పోలీస్ హెడ్ శివ థాప బీబీసీ నేపాలీతో చెప్పారు.
ఈ బస్సు ప్రమాదం తర్వాత కఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ రిలీఫ్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
‘‘భారతీయ ప్రయాణికులతో పోఖరా నుంచి కఠ్మాండూ వెళ్తోన్న ఒక భారత పర్యాటక బస్సు మర్స్యాంగ్డి నదిలో 150 మీటరు లోతులోకి పడిపోయింది. ఈ బస్సులో సిబ్బందితో సహా 43 మంది ఉన్నారు. స్థానిక అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం కూడా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది.
ఎంబసీ ఎమర్జెన్సీ రిలీఫ్ నెంబర్: +977-9851107021’’ అని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














