బీసీ కులగణన చేయాలన్న హైకోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా-బీసీ నాయకులు రెట్టింపు అవుతారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా రాజకీయ అలజడికి దారితీసిన కులగణన వ్యవహారం తెలంగాణలో కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పింది కోర్టు.
మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతోపాటు, మొత్తంగా కులాలవారీగా ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్ల దశ-దిశను మార్చగల ఈ బీసీ కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందా?
‘‘మూడు నెలల్లోపు ఓబీసీల జనాభా లెక్కించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కూడా తాము కులగణన చేయడానికి సిద్ధమని చెప్పడంతో హైకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది’’ అని ఈ కేసులో వాదించిన న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ బీబీసీతో చెప్పారు.
‘‘మేం 2018 నుంచి ఈ అంశంపై పోరాడుతున్నాం. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు కానీ, వాస్తవంలో జరిగింది వేరు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే, దాన్ని 18 శాతానికి తగ్గించారు కేసీఆర్. దీంతో మేం కోర్టుకు వెళ్ళాం. కోర్టులో ఆ పిటిషన్‌పై కౌంటర్ వేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకాలం ఆలస్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలస్యం చేసినా వారి పాలసీ ప్రకారం కులగణనకు అనుకూలం కాబట్టి, తప్పని పరిస్థితుల్లోనే కౌంటర్ వేశారని మేం భావిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు చాలా కీలకం. దీంతో ఈ కులగణన స్థానిక ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలి’’ అని ఈ పిటిషన్ వేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
కుల గణనకు, స్థానిక ఎన్నికలకు లింకు
స్థానిక సంస్థల ఎన్నికలతో ఈ కులగణనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. స్థానిక ఎన్నికల ముందు కులగణన జరిగితే తెలంగాణలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంటు, అసెంబ్లీతో పాటూ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని ఎవరూ కదల్చలేరు. కానీ బీసీలకు స్థానిక సంస్థల్లోనే తప్ప పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవు.
ప్రతి స్థానిక ఎన్నికల ముందు ఆ రిజర్వేషన్లను ప్రభుత్వాలు మార్చడం, చాలామంది కోర్టులకు వెళ్ళడం, రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆధారమైన కుల జనాభా లెక్కలు ఎక్కడని కోర్టులు ప్రశ్నించడం-ఇదంతా ఒక తంతుగా నడుస్తోంది. దాంతో అది ఎన్నికల హామీగా కూడా మారింది.
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, నగర కార్పొరేటర్, నగర్ మేయర్ – ఈ పదవుల్లో బీసీల రిజర్వేషన్లు కనుక పెరిగితే ఆ మేరకు బీసీల రాజకీయ ప్రాతినిధ్యం బాగా పెరుగుతుంది.
ఈ రిజర్వేషన్ వల్ల ఆయా గ్రామాల, పట్టణాల రాజకీయ పరిస్థితులు, పవర్ గేమ్‌లు, అధికార కేంద్రాలు...ఇలా అన్నీ మారిపోతాయి. సాధారణంగా తెలంగాణ పరిస్థితుల మేరకు అగ్రకులాలకు వెళ్ళే చాలా సీట్లలో బీసీలు అధికారంలోకి వస్తారు. అందుకే బీసీ సంఘాలు ఈ రిజర్వేషన్ కోసం చాలా పట్టుదలగా వాదిస్తుంటాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. అయితే ఆ రిజర్వేషన్లు నిర్ణయించేందుకు సరైన ప్రాతిపదిక అంటే, కులాలవారీగా జనాభా లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే లెక్కిస్తారు. బీసీ, ఓసీ జనాభా లెక్కలు తీసుకోరు.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఎప్పుడు మొదలయ్యాయి?
1986లో ఎన్.టి. రామారావు ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రారంభం అయ్యాయి. అప్పుడు అది 20 శాతంగా ఉండేది. తరువాత కోట్ల విజయ భాస్కర రెడ్డి హయాంలో 34 శాతానికి పెరగ్గా, 2019లో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని 22 శాతానికి తగ్గించింది.
2023 తెలంగాణ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంతకు ముందు అంటే 2018 ఎన్నికల్లో కూడా బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
సరిగ్గా ఇదే పాయింట్ మీద దేశమంతా వివాదం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, ఏ కులం వారు ఎందరున్నారో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారీ రాహుల్ గాంధీ ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ మాత్రం కులగణనకు అనుకూలంగా లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కుల గణన పూర్తి చేసిన బిహార్
ఈ వివాదాల నేపథ్యంలోనే 2023లో బిహార్ రాష్ట్రం కులగణన పూర్తిచేసింది. 2015లో కర్ణాటకలో కులగణన జరిగింది. ఆ తరువాత మరే రాష్ట్రంలోనూ అలా జరగలేదు. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి, జనాభాలో బీసీల శాతం ఎంతో తేలిస్తే, దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలని బీసీలు డిమాండ్ చేస్తారు. అప్పుడు స్థానిక సంస్థల పదవుల్లో బీసీల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. ఇది ప్రత్యక్షంగా స్థానిక రాజకీయాల మీద, పరోక్షంగా రాష్ట్ర రాజకీయాల అతి పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే బీసీ నాయకులంతా ఈ కులగణన స్థానిక సంస్థల ఎన్నికలకంటే ముందే పూర్తి చేయాలని పట్టు పడుతున్నారు. అంతేకాదు, జనాభాలో తమ వాటా ఆధారంగా అన్నింటా ప్రాతినిధ్యం కోసం బీసీ సంఘాలు డిమాండ్ చేస్తాయి.
‘‘బీసీలకు స్థానిక సంస్థల్లో 40 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామన్న సందర్భం వచ్చిన ప్రతిసారీ కోర్టుల్లో వివాదం అవుతోంది. డాటా లేకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కోర్టులు అడుగుతున్నాయి. ఈ సర్వే అయితే, ఆ సమస్య తీరిపోతుంది’’ అని పిటిషనర్ సత్యనారాయణ అన్నారు.
‘‘బీసీ కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. మూడు నెలల లోపల కులగణన రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ చెప్పింది. రేవంత్ రెడ్డి కులగణన బిల్లుని అసెంబ్లీలో పెట్టారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి బీసీ కులగణన చేయాలని చెప్పారు. సీఎం 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే రెండు నెలల్లోనే బీసీ కులగణన రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి’’ అని మీడియాతో అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు.
ఈ అంశంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీతో మాట్లాడారు.
‘‘అసలు 2018లో ఈ అంశంపై మొదటి పిటిషన్ వేసిందే నేను. అప్పట్లో జస్టిస్ రామచంద్ర రావు తీర్పు కూడా వచ్చింది. ఏ ప్రభుత్వం ఏం చేసింది అన్నది గతం. ఇప్పుడు అది కాదు చర్చ. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. అందుకోసం సుప్రీంకోర్టుకే వెళతారో, మోదీనే ఒప్పిస్తారో అది రేవంతే చూసుకోవాలి’’ అని శ్రవణ్ అన్నారు .
ఈ అంశంపై ఈ ఏడాది జూలై 15న ముఖ్యమంత్రి రేవంత్ కూడా సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు పెంపుపై అధికారులతో చర్చించారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏ అడుగు వేస్తుందనేది చూడాల్సి ఉంది.

ఫొటో సోర్స్, TWITTER/BRS PARTY
సకల జనుల సర్వే రహస్యం ఇప్పుడైనా బయటకు వస్తుందా?
2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే సకల జనుల సర్వే పేరుతో ఒక సమగ్ర సర్వే నిర్వహించారు. అందులో తెలంగాణ మొత్తం కులాల వారీ జనాభా వచ్చింది. అయితే ఆ సమాచారాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ సమాచారాన్ని అన్వయించి బీసీ కుల గణన చేపడితే చాలా సులువుగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టని సకల జనుల సర్వే సమాచారం, రేవంత్ ప్రభుత్వం బయట పెడుతుందా?
‘‘సకల జనుల సర్వే పద్ధతి బావుంది. మంచి డాటా వచ్చింది. కానీ దానిని కేసీఆర్ రాజకీయాలకు వాడుకున్నారు. పబ్లిక్‌లో పెట్టలేదు. దాన్ని బేస్ చేసుకుని కులగణన చేస్తే ఇప్పుడు ప్రక్రియ సులభం అవుతుంది’’ అని బీబీసీతో అన్నారు బీసీ నాయకులు యర్ర సత్యనారాయణ.
‘‘సకల జనుల సర్వే రిపోర్ట్‌ని చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలి. అప్పుడు అది బీసీ కులగణనకి ఉపయోగపడుతుంది. కేసీఆర్, కేటిఆర్‌లకు చిత్తశుద్ధి ఉంటే సకల జనుల రిపోర్ట్ బయట పెట్టాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు డిమాండ్ చేశారు.
‘‘కేసీఆర్, కేటీఆర్‌లను కాకుండా, రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఈ డిమాండ్ చేయండి వీహెచ్ గారూ. గతం సంగతి ఎందుకు? భవిష్యత్తులో స్థానిక సంస్థల విషయంలో బీసీలకు ఎలా న్యాయం చేయాలి అనేది చూడమనండి’’ అని వ్యాఖ్యానించారు దాసోజు శ్రవణ్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














