టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎందుకు పేలిపోయింది? ఇప్పటికీ సమాధానం దొరకని 5 ప్రశ్నలు

ఫొటో సోర్స్, RMS Titanic / Getty
- రచయిత, రెబెక్కా మోరెల్ అలిసన్ ఫ్రాన్సిస్
- హోదా, బీబీసీ న్యూస్ సైన్స్
అట్లాంటిక్ సముద్ర గర్భంలోని టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్ళిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయి, ఐదుగురు చనిపోయిన ఘటనకు ఏడాది దాటిపోయింది.
ఆ ప్రమాదానికి కారణం ఏమిటో కనుగొనేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు బహిరంగ విచారణ చేయనున్నారు. సెప్టెంబర్ 16న ఈ విచారణ ప్రారంభమవుతుంది.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ డిజైన్‌లో లోపాలు, ప్రమాద హెచ్చరికలను పెడచెవిన పెట్టడం.. తదితర అంశాలపై విచారణ జరపనున్నారు.
అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల (12,500 అడుగులు) లోతులోని టైటానిక్ శిథిలాలను చూపిస్తామని, అది జీవితకాల అవకాశమంటూ టైటాన్ సబ్‌మెర్సిబుల్ నిర్వాహకులు చెప్పారు.
ఐదుగురితో ప్రయాణమైన ఈ సబ్‌మెర్సిబుల్ అట్లాంటిక్ సముద్రగర్భంలో పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురూ చనిపోయారు.

అప్పుడేం జరిగిందంటే..
టైటాన్ సబ్‌మెర్సిబుల్ 2023 జూన్ 18న సముద్రం లోపలికి దిగడం మొదలైంది. అప్పుడు అందులో ఓషన్‌గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్, బ్రిటిష్ సముద్ర సాహసికుడు హమీష్ హార్డింగ్, ప్రసిద్ధ ఫ్రెంచ్ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, బ్రిటిష్ -పాకిస్తాన్ వ్యాపారవేత్త షహజాదా దావూద్, ఆయన 19 ఏళ్ల కుమారుడు సులేమాన్ ఉన్నారు.
సముద్రం అడుగుకు వెళ్తున్న సబ్‌మెర్సిబుల్‌కు, సముద్రంపైన ఉండే సహాయక నౌతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో, సబ్‌మెర్సిబుల్ ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ సమాచారం అందుకున్న యూఎస్ కోస్ట్ గార్డు, సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ జాడను తెలిపే వార్త కోసం ప్రపంచమంతా ఎదురుచూసింది.
కానీ నాలుగు రోజుల తరువాత జూన్ 22న టైటానిక్ నౌక ముందు భాగానికి సుమారు 500 మీటర్లు (1,600 అడుగులు) దూరంలో ఆ సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించారు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ కేవలం గంటా 45 నిమిషాల పాటు మాత్రమే సముద్రం లోపలికి డైవ్ చేసింది.
ఈ ప్రమాదంపై ఓ ఐదు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడంలేదు.

ఫొటో సోర్స్, Supplied via Reuters / AFP
తప్పు జరుగుతోందని తెలుసా?
టైటాన్‌లో ప్రయాణిస్తున్నవారికి సహాయంగా సముద్ర ఉపరితలంపై సపోర్ట్ షిప్ పోలార్ ప్రిన్స్ ఉంది. టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లోని వారు ఈ ఉపరితల నౌకతో సంప్రదింపులు జరిపే సమాచార వ్యవస్థ ఉంది.
సబ్‌మెర్సిబుల్‌లోని ఆన్‌బోర్డు సమాచార వ్యవస్థ ద్వారా వారు టెక్స్ట్ రూపంలో సందేశాలు పంపడానికి, స్వీకరించడానికి అవకాశం ఉంది. సబ్‌మెర్సిబుల్ వైఫల్యానికి సంబంధించిన సమస్యలు కానీ, హెచ్చరికలు కానీ ఏమైనా వచ్చాయా అనే విషయాన్ని ఈ సందేశాల లాగ్ (రికార్డ్) చూపుతుంది.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు అకోస్టిక్ మానిటరింగ్ పరికరం ఉంటుంది. దానికి మైక్రోఫోన్స్ ఉంటాయి. సబ్‌మెర్సిబుల్ ఒత్తిడికి గురైనా, ఏ భాగమైనా దెబ్బతిన్నా, సబ్‌మెర్సిబుల్ నుంచి ఏదైనా అసాధారణ శబ్దం వచ్చినా ఆ పరికరం గుర్తించి అలర్ట్ చేస్తుంది. దీంతో సబ్‌మెర్సిబుల్‌లోని వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది.
‘‘సబ్‌మెర్సిబుల్‌లో ఏదైనా తప్పు జరిగితే అకౌస్టిక్ మానిటరింగ్ పరికరం ఆడియో సంకేతాల ద్వారా తమను అప్రమత్తం చేస్తుందని స్టాక్టన్ రష్ నమ్మారు’’ అని లోతైన సముద్రజలాల్లో నిర్వహించే కార్యకలాపాల్లో అనుభవం ఉన్న ప్రసిద్ధ అన్వేషకుడు విక్టర్ వెస్కోవో వివరించారు.
‘‘అయితే ఈ సబ్‌మెర్సిబుల్ సముద్రం పైకి రావడానికి తగినంత సమయం ఇచ్చేలా ఆ మానిటరింగ్ పరికరం అప్రమత్తం చేయగలిగిందా?’’ అని అనుమానం ఉందని ఆయన చెప్పారు.
‘‘ఆ హెచ్చరిక ఎంత త్వరగా ఇవ్వగలిగిందనేదే ప్రశ్న. సబ్‌మెర్సిబుల్ సముద్రం లోపలికి దిగేటప్పుడు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. అందులోని అలారమ్‌లు ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. దీంతో, అందులో ఉన్నవారికి తమ జీవితాలు ఏం కానున్నాయనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు’’ అని విక్టర్ వెస్కోవో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
టైటాన్‌లో ఏ భాగం విఫలమైంది?
టైటాన్ వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి దాని శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు.
టైటాన్ డిజైన్‌లో అనేక సమస్యలు ఉన్నాయి.
సబ్‌మెర్సిబుల్ నుంచి బయటకు చూసేందుకు అమర్చిన కిటికీ అద్దం (వ్యూపోర్ట్)ను సముద్రంలో 1,300 మీటర్ల (4,300 అడుగులు) లోతున ఉండే పీడనాన్ని తట్టుకునేలా రూపొందిచారు. కానీ, టైటాన్ సబ్‌మెర్సిబుల్ అంతకంటే మూడింతల లోతుకు వెళ్ళింది.
టైటాన్ ఆకృతి కూడా గుండ్రంగా కాకుండా అసాధారణంగా సిలిండర్ తరహాలో ఉంది. లోతైన సముద్రజలాల్లోకి వెళ్లే చాలా సబ్‌మెర్సిబుల్స్ ఆకృతి గుండ్రంగానే ఉంటుంది. దీనివల్ల సముద్రం లోపల ఉండే పీడనం సబ్‌మెర్సిబుల్‌కు అన్నివైపులా సమానంగా పంపిణీ అవుతుంది.
ఈ వాహనం బయటి భాగాన్ని కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. సహజంగా సముద్రంలోని తీవ్రమైన పీడనాన్ని తట్టుకోవడానికి టైటానియం లాంటి లోహాలను ఉపయోగిస్తారు.
"లోతైన సముద్రజలాల్లో కార్బన్ ఫైబర్‌ను ఓ అనూహ్యమైన పదార్థంగా పరిగణిస్తారు’’ అని సబ్‌మెరైన్‌ల తయారీలో అగ్రగామి అయిన ట్రిటాన్ సబ్‌మెరైన్స్ సీఈఓ ప్యాట్రిక్ లాహే అన్నారు.
‘‘టైటాన్ అప్పటికే అనేకసార్లు టైటానిక్ శిథిలాల వరకు వెళ్లిరావడం వల్ల సముద్రజలాల ఒత్తిడికి కార్బన్ ఫైబర్ కుంచించుకుపోయి, దెబ్బతింది. క్రమంగా బలహీనపడిపోయింది. వివిధ లోహాల మధ్యన ఉన్న జంక్షన్లు కూడా ఆందోళనకరమే. కార్బన్ ఫైబర్‌ను టైటానియం రింగ్స్‌తో జత చేయడం కూడా ఒత్తిడిని తట్టుకునే శక్తిని తగ్గించింది’’ అని ఆయన వివరించారు.
‘‘వాణిజ్య సబ్‌మెర్సిబుల్ పరిశ్రమకు దీర్ఘకాలిక, మచ్చలేని భద్రతా రికార్డు ఉంది. ఓషన్‌గేట్ సంస్థ మాత్రం ఆ రికార్డును నిలబెట్టుకోలేకపోయింది’’ అని పాట్రిక్ లాహే అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఆ శబ్దాలు ఎక్కడివి?
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆచూకీ కోసం నౌకలు, విమానాలు, రిమోట్‌తో నడిచే వాహనాలు (ఆర్‌ఓవీలు) తీవ్రంగా గాలించాయి.
రెండు రోజుల గాలింపు అనంతరం ఓ పరిశోధక విమానంలోని సోనార్, సముద్రజలాల అడుగు నుంచి శబ్దాలను గుర్తించినట్టు తెలిసింది. ఈ శబ్దాలు టైటాన్ సబ్‌మెర్సిబుల్ నుంచే వస్తున్నాయనే అంచనాను పెంచాయి. దీంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రిమోట్ వాహనాలను పంపారు, కానీ ఏమీ కనుగొనలేకపోయారు.
ఆ శబ్దాలు ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ గల్లంతైన సమయంలో, అది వైఫల్యానికి గురైనట్లు సూచించే శబ్దాన్ని అమెరికా నౌకాదళం గుర్తించింది. కానీ దాని శకలాలను కనుగొనేంత వరకూ ఈ సమాచారం బయటకు రాలేదు.

ఫొటో సోర్స్, Oceangate
ఓషన్‌గేట్ భద్రతను ఎందుకు విస్మరించింది?
ఓషన్‌గేట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌పై అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు. తాను చాలా ఆందోళన చెందానని, టైటాన్‌లో ప్రయాణించవద్దని తన స్నేహితుడు హమీష్ హార్డింగ్‌తో సహా చాలామంది ప్రయాణికులకు చెప్పానని విక్టర్ వెస్కోవో తెలిపారు.
ఓషన్‌గేట్ కంపెనీ మెరైన్ ఆపరేషన్స్ మాజీ డైరక్టర్ డేవిడ్ లోచ్‌రిడ్జ్ సహా సబ్‌మెర్సిబుల్ భద్రతకు సంబంధించిన భయాలను నేరుగా ఓషన్‌గేట్ కంపెనీ దృష్టికే తీసుకువెళ్ళారు. లోచ్‌రిడ్జ్ టైటాన్‌ను అభివృద్ధి చేస్తున్నప్పుడు దాని సామర్థ్యాన్ని అంచనా వేశారు.
లోచ్‌రిడ్జ్ అనేక తీవ్రమైన భద్రతా ఆందోళనలను గుర్తించారని యూఎస్ కోర్టు పత్రాలు చూపుతున్నాయి.
ఓషన్‌గేట్ ప్రయోగం ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని మెరైన్ టెక్నాలజీ సొసైటీకి చెందిన ఇంజనీర్లు స్టాక్టన్ రష్‌కు రాసిన లేఖలో తెలిపారు.
డీప్-సీ స్పెషలిస్ట్ రాబ్ మెక్ కల్లమ్ స్టాక్టన్రష్‌తో సాగించిన ఈమెయిల్ సంభాషణలో.. ‘‘టైటాన్‌ను డీప్ డైవ్ కార్యకలాపాలకు వినియోగించొద్దు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కనిపిస్తోంది’’ అంటూ పంపిన ఈమెయిళ్లను ఆయన గత ఏడాది బీబీసీకి చూపించారు.
దీనిపై రష్ స్పందిస్తూ.. ‘‘కొత్త ఆవిష్కరణలను అడ్డుకునేందుకు భద్రతా పరమైన వాదనలను ఉపయోగించే పరిశ్రమ వర్గాలతో విసిగిపోయాను’’ అని చెప్పారు.
కానీ టైటాన్ ప్రమాదంలో ఓషన్‌గేట్ సీఈఓ చనిపోయారు కాబట్టి, ఆయనను భద్రతా ఆందోళనలను ఎందుకు వినలేదని ఎప్పటికీ అడగలేం. కానీ వాటి గురించి కంపెనీలో ఇంకా ఎవరెవరికి తెలుసు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్నది బహిరంగ విచారణ ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Oisin Fanning
అధికారులు ఎందుకు అనుమతిచ్చారు?
సముద్రగర్భంలోకి వెళ్లే సబ్‌మెర్సిబుల్స్ డిజైన్, నిర్మాణం, టెస్టింగ్, ఆపరేషన్స్ అన్నీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో స్వతంత్ర సంస్థలైన అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, లేదంటే నార్వేకు చెందిన గ్లోబల్ అక్రిడిటేషన్ సంస్థ డీఎన్‌వీ తనిఖీలు చేస్తాయి.
చాలామంది సబ్‌మెర్సిబుల్ ఆపరేటర్లు ఈ తనిఖీలు చేయిస్తుంటారు. కానీ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చేయించలేదు.
టైటాన్ సురక్షితమని చెప్పడానికి ధృవీకరణ పత్రాలు అవసరం లేదని, తమ సొంత ప్రొటోకాల్స్, ప్రయాణికుల సమ్మతి సరిపోతాయని స్టాక్టన్ రష్ వాదించారు.
టైటాన్‌లో ప్రయాణించడానికి ఒకొక్కరు 2,5000 అమెరికన్ డాలర్లు (రూ. 2,09,70,812) చెల్లించారు. వీరంతా ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తమకు తెలుసనే ధృవీకరణ పత్రంపై కూడా సంతకం చేయాల్సి వచ్చింది.
ఐర్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త ఓయిసిన్ ఫానింగ్ 2022లో టైటాన్‌లో రెండు సార్లు వెళ్ళివచ్చారు. ఈ సబ్‌మెర్సిబుల్ గల్లంతు కావడానికి ముందు ఆయన రెండోసారి ప్రయాణించారు.
భధ్రతను ఓషన్‌గేట్ బృందం తీవ్రంగా పరిగణించిందని, సముద్రంలోకి దిగే ప్రతిసారీ అన్ని విషయాలు స్పష్టంగా వివరిస్తారని తెలిపారు. అయితే టైటాన్ సబ్‌మెర్సిబుల్ సర్టిఫైడ్ కాదనే విషయాన్ని ఆయనకు ఓషన్‌గేట్ సంస్థ స్పష్టంగా చెప్పలేదు.
‘‘టైటాన్ ప్రయోగాత్మకమైనదని మనందరికీ తెలుసు. మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే అంతకు ముందు కొన్నిసార్లు అది సముద్రంలోకి వెళ్లి వచ్చింది. అది బాగా పనిచేస్తున్నట్లు అనిపించింది" అని ఫానింగ్ చెప్పారు.
బహిరంగ విచారణ రెండు వారాల పాటు జరగనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














