‘హెల్పర్‌ అని సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపించారు’- రష్యా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన యువకులు ఇంకా ఏం చెప్పారంటే...

అయినవారి ఆలింగనం
ఫొటో క్యాప్షన్, రష్యన్ సైన్యం నుంచి భారత్‌కు క్షేమంగా తిరిగొచ్చిన సుఫియాన్ ఆత్మీయ ఆలింగనం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఇండియాకు తిరిగిరావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. కానీ ఆ రోజులు తలుచుకుంటేనే ఏడుపు వస్తోంది. మళ్లీ కుటుంబాన్ని కలుసుకోగలిగినందుకు అల్లాకు ధన్యవాదాలు. ఇది నాకు పునర్జన్మ లాంటిది’’ అని బీబీసీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు మహమ్మద్ సుఫియాన్.

సుఫియాన్‌ది తెలంగాణలోని నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణం.

ఏజెంట్ల చేతిలో మోసపోయి ఎనిమిదినెలలకుపైగా రష్యా-యుక్రెయిన్ యుద్దంలో పాల్గొన్న ఆయన, శుక్రవారంనాడు భారత్‌కు తిరిగి వచ్చారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబసభ్యులను, బంధువులను కలిసి భావోద్వేగానికి గురయ్యారు.

రష్యా నుంచి భారత్‌కు చేరుకున్న ఆరుగురు యువకుల్లో సుఫియాన్ ఒకరు.

వీరిలో మరో ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి (గుల్బర్గా) ప్రాంతానికి చెందిన వారు. మరొకరు కశ్మీర్, ఇంకొకరు పంజాబ్‌కు చెందినవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుఫియాన్
ఫొటో క్యాప్షన్, సుఫియాన్ 8నెలలకుపైగా రష్యన్ ఆర్మీలో పనిచేశారు.

ఎలా వెళ్లారు?

24 ఏళ్ల సుఫియాన్ గతేడాది డిసెంబరులో రష్యాకు వెళ్లారు. అంతకుముందు ఆయన దుబాయిలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేవారు. దుబాయ్‌లో పనిచేసే సమయంలోనే రష్యాలో హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయనే ప్రకటనను ఒక యూట్యూబ్ చానల్‌లో చూశారు.

ఆ యూట్యూబ్ చానల్ నడిపే వ్యక్తి పేరు ఫైజల్ ఖాన్. ఈయన ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. రష్యాలో హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయని తన యూట్యూబ్ చానల్‌లో వీడియోలు పెట్టి యువతను ఆకర్షిస్తుంటారీయన.

యూట్యూబ్‌లో ప్రకటన చూసిన సుఫియాన్ రష్యా వెళ్లాలనుకున్నారు. దుబాయిలో ఉద్యోగానికి 15 రోజులపాటు సెలవు పెట్టి ఇండియాకు తిరిగి వచ్చారు.

భారతీయ యువతకు రష్యాలో సెక్యూరిటీ, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు వీరిని తీసుకెళ్లారు. ఇందుకోసం రష్యాతోపాటు, ముంబయిలోనూ ఇద్దరేసిచొప్పున నలుగురు ఏజెంట్లు పనిచేసేవారు. ఈ నలుగురికీ సమన్వయకర్తగా దుబాయిలో ఫైజల్ ఖాన్ వ్యవహరించారు.

ఫైజల్ ఖాన్ తన యూట్యూబ్ చానల్‌లో పెట్టే వీడియోలు చూసే యువకులు...అందులో ఇచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా సంప్రదింపులు జరిపేవారు. తాను కూడా రష్యాకు వెళితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ఫైజల్ ఖాన్‌ను సంప్రదించినట్లు సుఫియాన్ బీబీసీకి చెప్పారు.

‘‘రష్యాలో మాకు సెక్యురిటీ జాబ్ అని మాత్రమే చెప్పారు. ఆర్మీలో పనిచేయాలనిగానీ, యుక్రెయి‌న్‌తో యుద్ధానికి తీసుకెళతారనిగానీ చెప్పలేదు. మూడు నెలల శిక్షణ ఉంటుందని...ఆ సమయంలో నెలకు రూ.30వేలు జీతం ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత జీతం పెరుగుతుందని నమ్మబలికారు’’ అని బీబీసీకి తెలిపారు సుఫియాన్.

సమీర్ అహ్మద్
ఫొటో క్యాప్షన్, సమీర్ అహ్మద్

రష్యాకు వెళ్లాక ఏమైంది?

రష్యాకు వెళ్లాక సుఫియాన్ సహా ఎంతోమంది భారతీయ యువకులను ఏజెంట్లు రష్యన్ ఆర్మీలో చేర్చారు. వారికి నెల నుంచి నెలన్నరపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత యుక్రెయిన్ సరిహద్దుకు తీసుకెళ్లి యుద్దంలోకి దింపారు.

ఆ విషయంపై కర్ణాటక రాష్ట్రం కలబురిగికి చెందిన అబ్దుల్ నయీం బీబీసీతో మాట్లాడారు.

‘‘మాకు ఆర్మీలో జాబ్ అని చెప్పలేదు. కేవలం సెక్యూరిటీ హెల్పర్ జాబ్ అని చెప్పారు. రష్యాకు వెళ్లాక ఏజెంట్లు మాట మార్చారు. మమ్మల్ని మోసం చేశారు. ఫోన్ చేస్తే రష్యాలోని ఏజెంట్లపై ఫైజల్ ఖాన్ నెపం తోసేసేవాడు. మేం పూర్తిగా మోసపోయాం. రష్యా వెళ్లేందుకు ఒక్కొక్కరి నుంచి ఫైజల్ ఖాన్ 3 లక్షల రూపాయలు వసూలు చేశారు’’ అని నదీం చెప్పారు.

రష్యా ఆర్మీలో చేర్పించాక ఫోన్లు అందుబాటులో లేక కుటుంబంతో మాట్లాడేందుకు వీలయ్యేది కాదని సుఫియాన్ వివరించారు.

‘‘గతేడాది డిసెంబరులో నేను రష్యా వెళ్లాను. దుబాయిలో పనిచేస్తున్న సమయంలోనే ఇండియాకు వచ్చాను. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి...అక్కడి నుంచి షార్జా మీదుగా రష్యా చేరుకున్నా’’ అని వివరించారు.

యుద్ధంలో పాల్గొన్న అనుభవాలను వివరిస్తూ…‘‘యుద్దంలో మమ్మల్ని ఒకచోట ఉంచేవారు కాదు. ఒకచోటు నుంచి మరొకచోటుకు వెళుతున్నప్పుడు మా ఫోన్లను ఆర్మీవాళ్లు తీసుకునేవారు. ఎవరితోనూ మాట్లాడేందుకు వీలుండేది కాదు’’ అని చెప్పారు.

యుక్రెయిన్ సరిహద్దులో ఉన్నప్పుడు ఫోన్లు వాడితే సిగ్నల్ ఆధారంగా డ్రోన్ దాడి జరిగేందుకు వీలుంటుందని అప్పట్లో ఫోన్లను అనుమతించలేదని, ఈ విషయాన్ని రష్యా అధికారులు ముందుగానే చెప్పారని ఫిబ్రవరిలో బీబీసీ ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా ఏజెంట్ ఫైజల్ ఖాన్ చెప్పారు.

‘‘నా శిక్షణ మొదలైన 25 రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడగలిగాను. అప్పటికే మావాళ్లు ఎంతో ఆందోళనతో ఉన్నారు. జరిగింది వారికి చెప్పాను. ఆ తర్వాత నన్ను అక్కడి నుంచి తీసుకువచ్చేందుకు వాళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు’’ అని తెలిపారు.

‘‘మాకు శిక్షణలో భాగంగా ఏకే 12, ఏకే 74, గ్రెనెడ్స్ వంటివి వాడటం నేర్పించారు. ఒకవేళ ట్రైనింగ్‌ను తేలికగా తీసుకున్నా, సరిగా చేయలేకపోయినా పక్కనుంచి తుపాకులు పేల్చి భయపెట్టేవాళ్లు. అక్కడ చెప్పిన పనులు చేయాల్సిందే’’ అని సుఫియాన్ గుర్తు చేసుకున్నారు.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు...15 గంటలపాటు డ్యూటీ చేసేవారమని చెప్పారు. చెప్పిన పని చేయకపోతే శిక్షలు కూడా విధించారని చెప్పారు. అయితే, అవి ఎలాంటి శిక్షలు అని అడిగితే సుఫియాన్ చెప్పలేకపోయారు.

రష్యా యుక్రెయిన్ యుద్ధం
ఫొటో క్యాప్షన్, రష్యాకు వెళ్లాకే ఆర్మీలో చేరాలని తెలిసిందని, ముందుగా చెప్పలేదని సయ్యద్ ఇలియాస్ హుస్సేనీ చెప్పారు.

‘కళ్లముందే చనిపోయారు’

రష్యా ఆర్మీలో పనిచేస్తూ గుజరాత్, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో హైదరాబాద్ నాంపల్లికి చెందిన అఫ్సన్, గుజరాత్ కు చెందిన హేమిల్ ఉన్నారు.

డ్రోన్ దాడిలో గుజరాత్ కు చెందిన హేమిల్ తమ కళ్ల ముందే చనిపోయాడని రష్యా నుంచి తిరిగి వచ్చిన యువకులు బీబీసీతో చెప్పారు.

‘‘రాత్రీపగలూ అనే తేడా లేకుండా ఎప్పుడూ ప్రాణాలకు ప్రమాదం ఉండేది. మాతో వచ్చిన మిత్రుడిని(హేమిల్) మేం పోగొట్టుకున్నాం. మా కళ్ల ముందే ఆయన చనిపోయారు. ఆయన్ని కాపాడుకోలేకపోయాం’’ అని కలబురిగికి చెందిన మహమ్మద్ సమీర్ అహ్మద్ బీబీసీకి చెప్పారు. ‘‘ఎప్పుడు ఏం జరుగుతుందోననే ప్రాణభయంతో రోజులు గడిపాం’’ అని ఆయన బీబీసీకి వివరించారు.

అబ్దుల్ నయీమ్

అడవిలోనే తిండీ,నిద్ర

కర్ణాటకలోని కలబురిగికి చెందిన సమీర్ అహ్మద్ కూడా ఫైజల్ ఖాన్ చేతిలో మోసపోయిన వారిలో ఒకరు. రష్యాకు వెళ్లిన విషయం గురించి మాట్లాడుతూ..‘‘నేను నిరుడు డిసెంబరు 18 చెన్నై వెళ్లా. అక్కడి నుంచి దుబాయి మీదుగా మాస్కో వెళ్లా. 21వ తేదీన మాస్కోకు చేరుకున్నా’’ అని వివరించారు.

‘‘అక్కడ మమ్మల్ని ఆర్మీలో చేర్పించారు. మేం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కావు. తినడానికి అడిగితే ఎప్పుడైనా మార్కెట్‌కు తీసుకెళ్లేవారు. మేం ఉండే గ్రామం నుంచి చాలాదూరం వెళ్లాల్సి వచ్చేది. అడవిలోనే తినాలి, అక్కడే పడుకోవాలన్నట్టుగా ఉండేది పరిస్థితి’’ అని తెలిపారు.

కర్ణాటకకు చెందిన మరో యువకుడు సయ్యద్ ఇలియాస్ హుస్సేనీ బీబీసీతో మాట్లాడారు.

‘‘అక్కడ ప్రతి రోజూ యుద్దం నడుస్తుండేది. నిత్యం తుపాకులు, బాంబులు పేలుతూనే ఉంటాయి. చాలా భయంవేసేది. ఎలా రష్యాకు వెళ్లామో...అలా తిరిగి వస్తామని ఇంట్లో వాళ్లకు ప్రామిస్ చేశాం. అందుకే ధైర్యాన్ని కూడదీసుకుని రోజులు గడిపాం’’ అని చెప్పారు.

‘‘మేం రష్యా ఆర్మీలోకి వెళ్లాక రెండు నెలలపాటు ఫైరింగ్ చేసేందుకు పనిచేశాం. తర్వాత నుంచి సొరంగాలు తవ్వే పని అప్పగించారు’’ అని హుస్సేనీ చెప్పారు.

రష్యాకు వెళ్లాకే ఆర్మీలో చేరాలని తెలిసిందని, ముందుగా తమకు ఏజెంట్లు ఆ విషయం చెప్పలేదని సయ్యద్ ఇలియాస్ హుస్సేనీ చెప్పారు.

45 మంది యువకుల విడుదల
ఫొటో క్యాప్షన్, రష్యా ఆర్మీలోని భారతీయులను వెనక్కు తీసుకువస్తామని సెప్టెంబరు 12న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.

45 మంది యువకుల విడుదల

రష్యాలో చిక్కుకున్న యువకులలో కొందరిని వెనక్కి తీసుకురావడంలో భారత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కుటుంబీకులు చెప్పారు.

రష్యాలో చిక్కుకున్న 45 మందిని వెనక్కు తీసుకువస్తున్నట్లు సెప్టెంబరు 12వ తేదీన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.

ఈ ఏడాది జులైలో ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించిన సందర్భంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయ యువకులను విడిచిపెట్టాలని కోరినట్లుగా రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు.

ఈ ప్రక్రియ మొదలై..యువకులు తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు.

‘‘మేం యుక్రెయిన్ సరిహద్దు నుంచి సెప్టెంబరు ఆరో తేదీన బయల్దేరాం. దాదాపు 36 గంటలపాటు ప్రయాణించిన తర్వాత మాస్కోకు చేరుకున్నాం. అక్కడ డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పదో తేదీన భారత్ కు బయల్దేరాం. రష్యాలోని భారత ఎంబసీ అధికారులు ఎంతో సహకారం అందించారు’’ అని చెప్పారు సుఫియాన్.

తమకు గత నాలుగైదు నెలలుగా జీతం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు.

‘తెలిస్తే పంపించేవాళ్లం కాదు’

రష్యా నుంచి వచ్చిన యువకులను చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భావోద్వేగ పరిస్థితి కనిపించింది. కుటుంబీకులు, బంధువులను గుండెలకు హత్తుకుని ‘భగవంతుడి దయతో మళ్లీ వచ్చాం’ అంటూ అక్కడి పరిస్థితులను వివరించారు బాధితులు.

తమవారు యుద్దం చేయడానికి రష్యా వెళుతున్నారని ముందుగా తెలియదని, ఏజెంట్లు మోసం చేశారని యువకుల కుటుంబీకులు చెప్పారు.

‘‘తొమ్మిది నెలలుగా పైనున్న భగవంతుడిపైనే ఆశలు పెట్టుకున్నాం. గత ఎనిమిది, తొమ్మిది నెలలుగా వారిని తీసుకువచ్చేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికి ఫలితం దక్కింది. ఇదే పని భారత ప్రభుత్వం ముందుగా చేసి ఉండిఉంటే.. నాంపల్లికి చెందిన అఫ్సన్, గుజరాత్ కు చెందిన హేమిల్ మన మధ్యనే ఉండేవారు’’ అని సుఫియాన్ సోదరుడు అన్నారు.

కలబురగికి చెందిన సయ్యద్ నవాజ్ అలీ బీబీసీతో మాట్లాడారు. ఈయన రష్యా వెళ్లి తిరిగి వచ్చిన సయ్యద్ ఇలియాస్ హుస్సేనీ తండ్రి. తమ కుమారులను తీసుకురావడంలో ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సహా ఎంతోమంది సాయపడ్డారని అన్నారు.

‘‘రష్యాకు వెళ్లేటప్పుడు ఎందుకు వెళుతున్నారో మాకు తెలియదు.మోసం జరిగింది. ఇలా జరుగుతుందని తెలిస్తే మా పిల్లలను ఎందుకు పంపిస్తాం. ఏదిఏమైనా భగవంతుడు మా పిల్లలను రక్షించాడు. మాకోసం ప్రభుత్వం కృషిచేసింది. మా పిల్లలను హిందుస్థాన్ పిల్లలుగా భావించి వారిని సురక్షితంగా ప్రభుత్వం తీసుకువచ్చింది’’ అని అన్నారు నవాజ్ అలీ.

అయితే, తమ ఆర్మీలో పనిచేసే చాలామంది భారతీయులకు చట్టపరమైన వీసాలు లేవని న్యూ దిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం గతంలో స్పష్టం చేసింది.

‘‘రష్యా ఉద్దేశ్యపూర్వకంగా సైన్యంలో భారతీయులను చేర్చుకోలేదు. ఈ యుద్ధంలో వారెలాంటి పాత్ర పోషించరు. భారత ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం’’ అని రష్యా రాయబార కార్యాలయం జులైలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఏజెంట్ ఫైజల్ ఖాన్ ఏమన్నాడంటే..

రష్యాకు తీసుకెళ్లి మోసగించిన వ్యవహారం బయటపడినప్పుడు..అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏజెంట్ ఫైజల్ ఖాన్ తో బీబీసీ మాట్లాడింది.

తాను ఎక్కడా సెక్యురిటీ, హెల్పర్ ఉద్యోగాలు అని చెప్పలేదని అప్పట్లో ఫైజల్ ఖాన్ చెప్పారు.

‘‘ఆర్మీ హెల్పర్ అని చెప్పాను. గతంలో నేను చేసిన వీడియోలు చూడొచ్చు. రష్యా అధికారుల నుంచి కూడా మాకు హెల్పర్ జాబ్ అనే సమాచారమే ఉంది. నేను దాదాపు ఆరేడేళ్ల నుంచి ఈ పనిలో ఉన్నాను. ఇప్పటివరకు దాదాపు రెండు వేల మందికి వేర్వేరు చోట్ల ప్లేస్‌మెంట్ ఇప్పించాను. దానికి రూ.3 లక్షలు తీసుకునేవాడిని. అవన్నీ నేరుగా బ్యాంకు అకౌంట్ ద్వారా సవ్యంగా తీసుకున్న డబ్బులే. బ్లాక్ మనీ కాదు’’ అని అప్పట్లో ఫైజల్ ఖాన్ బీబీసీకి దుబాయి నుంచి జూమ్ కాల్ ద్వారా చెప్పారు.

బాధితులు ఇండియాకు చేరుకున్న నేపథ్యంలో ఏజెంట్ ఫైజల్‌ఖాన్‌ను సంప్రదించేందుకు బీబీసీ మరోసారి ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)