‘మాటలు కూడా లేకపోతే ఇక బతకడం ఎందుకు?'- తాలిబాన్ల కొత్త చట్టంపై అఫ్గాన్ మహిళల ఆవేదన

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు
ఫొటో క్యాప్షన్, పాఠశాలకు వెళ్లలేకపోతున్న టీనేజ్ బాలికలు
    • రచయిత, యోగితా లిమాయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాబూల్ నగరంలో ఇంగ్లీషు పాఠాలు నేర్చుకోవడానికి బస్సులో ప్రైవేట్ క్లాసులకు వెళ్లడం, ఫ్రెండ్స్‌‌తో సరదాగా కబుర్లు చెప్పుకోవడం, నవ్వడం ఇలా ప్రతిరోజూ ఒక గంటపాటు కొత్త విషయాలు నేర్చుకోవడం షబానా దినచర్యలో భాగం.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆమె జీవితాన్ని చుట్టుముట్టిన శూన్యత‌కు ఈ గంట సమయం ఒక చిన్న విరామం.

ఆమె మరో దేశంలో ఉండి ఉంటే, బిజినెస్ డిగ్రీ చేయాలన్న తన కలను నిజం చేసుకోవడానికి అవసరమైన క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్‌ను ఆమె వచ్చే ఏడాదికల్లా పొందే అవకాశం ఉండేది.

కానీ, ఆమె అఫ్గానిస్తాన్‌లో ఉన్నారు. టీనేజ్ అమ్మాయిలందరు చదువుకోవడానికి వీలు లేకుండా మూడు సంవత్సరాలపాటు ఆ దేశంలో చదువులపై నిషేధం విధించారు.

ఇప్పుడు ఒక మహిళ ఇల్లు దాటాక గొంతు పెంచి మాట్లాడటం కూడా నేరమేనంటూ కొత్త చట్టం వచ్చాక, జీవితాన్ని ఆహ్లాదకరంగా ఉంచే చిన్నచిన్న ఆనంద క్షణాలు కూడా భయంతో నిండిపోయాయి.

"మేం బయటకు వస్తే భయపడతాం. బస్సులో ఉన్నా భయపడతాం. మా పరదా తీసే ధైర్యం కూడా మాకు లేదు. ఎవరైనా తాలిబాన్లు మా మాటలు వింటే మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయంతో మాలో మేము కూడా మాట్లాడుకోవడం మానేశాం” అని షబానా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అఫ్గానిస్తాన్, తాలిబాన్లు
ఫొటో క్యాప్షన్, మహిళలు బయట తమ గొంతును పెంచి మాట్లాడకూడదని తాలిబన్లు కొత్త నిబంధనను విధించారు

జీవచ్ఛవాల్లా ఉన్నాం

అఫ్గానిస్తాన్‌కు వెళ్లిన బీబీసీ, తాలిబాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఆ దేశంలోని మహిళలు, బాలికలు, అలాగే తాలిబాన్ ప్రతినిధుల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి అనుమతిని సంపాదించింది.

నిజానికి, ఇలాంటి అనుమతి దొరకడం చాలా అరుదు.

అఫ్గాన్ పౌరుల విషయంలో కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి ఇరాన్‌లో మొరాలిటీ పోలీసుల్లాంటి విధులు నిర్వహించే తాలిబాన్ల ధర్మ ప్రచారం, దుర్గుణ నివారణ మంత్రిత్వ శాఖకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి.

ఇప్పటికే అనేక కఠినమైన ఆంక్షలతో చాలావరకు స్వేచ్ఛను కోల్పోయిన మహిళలపై, ఇది మరొక పిడుగుపాటు.

“మాట్లాడలేకపోతే బ్రతకడం ఎందుకు? మేము జీవచ్ఛవాలలాగా తిరుగుతున్నాం” అని షబానా అన్నారు.

“కొత్త చట్టం గురించి తెలిశాక, ఇకపై ఇంగ్లీషు కోర్సుకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను బయటకు వెళితే ఏదో ఒకటి మాట్లాడతాను. దానివల్ల నాకు ప్రమాదం జరగొచ్చు. క్షేమంగా ఇంటికి రావడం కూడా సందేహమే. కానీ, మా అమ్మ చదువుకొమ్మని నన్ను ప్రోత్సహించింది’’ అన్నారు షబానా.

దేశాన్ని స్వాధీనం చేసుకున్న మూడు సంవత్సరాలలో, తాలిబాన్లు కఠినమైన శాసనాలు విధించకపోయినా, ప్రజలు భయంతో వారికి వారే నియంత్రణను పాటిస్తారని స్పష్టమైంది.

ఇప్పుడు కాబూల్‌లాంటి నగరాల్లోని వీధుల్లో మహిళలు తక్కువ సంఖ్యలో కనిపిస్తారు. దాదాపు మహిళలందరూ తల నుంచి పాదాల వరకు వదులుగా ఉన్న నల్లని వస్త్రాలు లేదా ముదురు నీలం రంగు బురఖాలను కప్పుకుని ఉంటారు. గత సంవత్సరం ప్రకటించిన డిక్రీ ప్రభావం కారణంగా, చాలామంది మహిళలు కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేసుకుంటారు.

“ప్రతి క్షణం మేము జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది’’ అని నౌషీన్ అనే హక్కుల కార్యకర్త తెలిపారు.

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాబూల్‌లో ఒక దుకాణం కిటికీలోంచి చూస్తున్న మహిళలు. ఇక్కడ మహిళలు కలుసుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు లభిస్తాయి

ఆన్‌లైన్‌లో ఉద్యమం

గత సంవత్సరం వరకు కొత్త ఆంక్షలు విధించినప్పుడల్లా హక్కులను డిమాండ్ చేస్తూ కాబూల్, ఇతర నగరాల వీధుల్లో ప్రదర్శనలు చేసిన మహిళల్లో నౌషీన్ కూడా ఒకరు.

అనేక సందర్భాల్లో తాలిబాన్ బలగాలు ఈ నిరసనలను హింసాత్మకంగా అణిచివేశాయి.

గత ఏడాది తాలిబాన్లు నౌషీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

‘‘మాకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? ఇది ఇస్లామిక్ వ్యవస్థ అంటూ తాలిబాన్లు నన్ను ఒక వాహనంలో ఎక్కించుకుని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ నన్ను నానా మాటలూ అన్నారు. కొట్టారు కూడా’’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘‘నిర్బంధం నుంచి విడుదలయ్యాక మేము అంతకు ముందు మనుషుల్లాగా లేము. అందుకే నిరసనలను కూడా ఆపేశాము’’ అని ఆమె అన్నారు. ‘‘ నేను స్త్రీని అయినందున ఇకపై అవమానానికి గురికావడం ఇష్టం లేదు. ఇలా జీవించడం కంటే చనిపోవడం మేలు.” అన్నారామె.

ఇప్పుడు అఫ్గాన్ మహిళలు తమ ముఖాలను కప్పుకుని, స్వేచ్ఛ గురించి పాటలు పాడుతూ ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం ద్వారా తమ అసమ్మతిని తెలుపుతున్నారు. ‘‘ఒకే గొంతుగా మారదాం, చేతులు కలిపి కలిసి నడుద్దాం. ఈ క్రూరత్వం నుంచి విముక్తి పొందుదాం" అని ఆ పాటలో కొంతభాగానికి అర్ధం.

ఒక మహిళతో కలిసి ఫోటో దిగడానికి లేదా నా ఎదురుగా కూర్చోవడానికి కూడా ఇష్టపడని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ఈ కొత్త చట్టాన్ని సమర్థించుకున్నారు.

ఈ చట్టంలో అనేకచోట్ల మత గ్రంథాలకు సంబంధించిన ఆదేశాలను వివరించారు. సుప్రీం లీడర్ ఆమోదించిన ఈ చట్టం ఇస్లామిక్ షరియా చట్టానికి అనుగుణంగా ఉందని ఆయన నాతో అన్నారు.

అయితే, షిరీన్ అనే ఒక టీచర్ దీనిని తోసిపుచ్చారు. “ఇది షరియాకు వాళ్ల సొంత భాష్యం. చదువుకుని పురోగమించాలని కోరుకునే హక్కును ఇస్లాం స్త్రీ పురుషులిద్దరికీ ఇచ్చింది. మహిళల గొంతు వినపడకూడదని వాళ్లు అంటే, చరిత్రలోకి వెళ్లి పరిశోధిద్దాం. ఇస్లామిక్ చరిత్రలో చాలామంది మహిళలు మాట్లాడారు’’ అని ఆమె అన్నారు.

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు
ఫొటో క్యాప్షన్, మంత్రసాని శిక్షణ పొందుతున్న అతి కొద్ది మందిలో కేనాత్ ఒకరు

‘స్త్రీలను వస్తువుల్లా చూస్తున్నారు’

తాలిబన్ల ఆంక్షలకు వ్యతిరేకంగా నిశ్శబ్దంగా తిరుగుబాటు చేస్తూ, రహస్య పాఠశాలలను నడుపుతున్న అఫ్గాన్‌ మహిళల నెట్‌వర్క్‌లో షిరీన్‌ కూడా ఒక భాగం. ఈ పాఠశాలలను చాలా ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తూ, భద్రత కోసం తరచుగా వాటిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారామె. ఈ కొత్త చట్టం ఆమె భయాలను మరింత పెంచింది.

దీంతో ఆమె ఇంట్లో కాకుండా, ఒక రహస్య ప్రదేశంలో మాతో మాట్లాడారు.

“ప్రతిరోజూ నేను నిద్రలేచిన వెంటనే...ఇవాళ అంతా ప్రశాంతంగా జరిగిపోవాలని దేవుణ్ని కోరుకుంటా. కొత్త చట్టం వచ్చినప్పుడు, నేను దానిలోని నియమాలన్నింటినీ నా విద్యార్థులకు వివరించాను. పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందని వాళ్లకు చెప్పాను. కానీ వీటన్నింటితో చాలా విసిగిపోయాను. కొన్నిసార్లు నాకు పెద్దగా అరవాలనిపిస్తుంది” అని ఆమె అన్నారు. ‘‘వాళ్లు స్త్రీలను మనుషులుగా కాకుండా, తమ ఇంట్లో మాత్రమే ఉంచే పనిముట్లుగా చూస్తారు.’’ అన్నారామె.

ఇలాంటి రహస్య పాఠశాలల నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతున్న మనస్తత్వవేత్త కరీనా, తమపై విధించిన ఆంక్షల కారణంగా అఫ్గాన్ మహిళల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరిగిపోయాయని తెలిపారు. కొత్త చట్టం ప్రకటించాక సహాయం కోరుతూ తనకు వచ్చే కాల్స్ సంఖ్య పెరిగిందని చెప్పారు.

‘‘నా స్నేహితురాళ్లలో ఒకరు ఇది తన చివరి మెసేజ్ అంటూ నాకు మెసేజ్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. జీవితంలో ఏ ఆశా లేదని, జీవించాల్సిన అవసరం లేదని వాళ్లు భావిస్తున్నారు’’ అని కరీనా తెలిపారు. ‘‘వాళ్లకు నచ్చజెప్పడం చాలా కష్టమైన విషయం’’ అన్నారామె.

చదువుకునే అవకాశం లేకపోవడంతో ఇలా నిరాశలో మునిగి ఆత్మహత్యకు పాల్పడాలని ఆలోచిస్తున్న వాళ్ల పట్ల తాలిబాన్ ప్రభుత్వ బాధ్యత గురించి నేను హమ్దుల్లా ఫిత్రత్‌ను ప్రశ్నించాను.

“మా అక్కాచెల్లెళ్ల చదువు ఒక ముఖ్యమైన అంశం. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మా అక్కాచెల్లెళ్లలో చాలామంది డిమాండ్ ఇదే” అని ఆయన అన్నారు.

కానీ మూడేళ్ల పాలన తర్వాత, ప్రజలు తమను విశ్వసిస్తారని వాళ్లు నిజంగా ఆశిస్తున్నారా? అని అడిగితే..."మా నాయకత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాము. అది వెల్లడించాక దాని గురించి మాట్లాడతాం” అని ఆయన బదులిచ్చారు.

అఫ్గానిస్తాన్, తాలిబాన్లు
ఫొటో క్యాప్షన్, మంత్రసాని శిక్షణ పొందుతున్న యువతులు
అఫ్గానిస్తాన్, తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లోని స్త్రీలు క్రమక్రమంగా తమ స్వేచ్ఛను కోల్పోతున్నారు

మహిళావిద్యపై తాలిబాన్ల ప్రభుత్వంలో విభేదాలు

మహిళలకు విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. కొందరు విద్యను కొనసాగనివ్వాలని కోరుతున్నారు. కానీ కాందహార్‌లోని నాయకత్వం మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది.

దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను మేం గమనించాం. కాబూల్‌కు చాలా దూరంలో, తాలిబాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే మిడ్‌వైఫ్ ట్రైనింగ్ కోర్సు (మంత్రసాని శిక్షణా కోర్సు)ను మేం పరిశీలించాం. మేం ఆఖరి నిమిషంలో దాన్ని చూడాలని నిర్ణయించడం వల్ల అది మా కోసం కావాలని చేసిన ఏర్పాటు కాదని అనిపించింది.

సీనియర్ మహిళా డాక్టర్ నిర్వహిస్తున్న ఈ కోర్సుకు 20 ఏళ్ల వయసున్న డజనుకు పైగా యువతులు హాజరయ్యారు. ఈ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. స్వేచ్ఛగా మాట్లాడలేకపోయినా, ఈ పని చేయడం చాలా సంతోషంగా ఉందని అందులో పాల్గొన్నవారు అన్నారు.

“నేను ఇక్కడికి రావడానికి నా పిల్లలను ఇంట్లో వదిలి వచ్చాను. కానీ నేను దేశానికి సేవ చేస్తున్నానని వాళ్లకు తెలుసు. ఈ పని నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది” అని ఇక్కడ శిక్షణ పొందుతున్న సఫియా అన్నారు.

చాలామంది ఇది తమకు లభించిన ప్రత్యేక అవకాశం అని అంగీకరించారు. అయితే వారిలో కొందరికి, దీన్ని కూడా నిలిపేయవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి.

ఆరవ తరగతి తర్వాత బాలికలకు చదువు అందకపోతే, భవిష్యత్తులో ఈ కోర్సు చేయడానికి విద్యార్థినులు ఎవరు ఉంటారు అనే ప్రశ్నకు తాలిబాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వలేదు.

దేశంలో ప్రజారోగ్యం, భద్రత, కళలు, హస్తకళలులాంటి కొన్ని రంగాలలో మహిళలు ఇప్పటికీ తమ పనిని కొనసాగించగలుగుతున్నారు. కానీ దీనికి వాళ్లకు ఎలాంటి అధికారిక అనుమతీ లేదు. ఇది క్షేత్రస్థాయిలో తాలిబాన్ అధికారులు, స్వచ్ఛందసంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య నిశ్శబ్ద అవగాహనతో జరుగుతోంది.

అయితే కొత్త చట్టం ఈ అనధికారిక వ్యవస్థనూ తాలిబాన్ల నైతిక పరిశీలన కిందికి తెచ్చింది.

చట్టాలను ఎలా అన్వయించాలో అర్థం చేసుకోవడానికి తాలిబాన్లు కష్టపడుతున్నారని మానవతా సహాయ సంస్థలలో పని చేసే వ్యక్తులు మాతో అన్నారు. ఇది తమ కార్యకలాపాలను మరింత కష్టతరం చేస్తుందని వాళ్లు భావిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో చర్చలకు తాలిబాన్లు మొదటిసారి హాజరైన రెండు నెలల లోపే ఈ చట్టాన్ని ప్రకటించారు. తాలిబాన్ల ఒత్తిడితో అఫ్గాన్ పౌర సమాజ ప్రతినిధులు, మహిళా హక్కుల కార్యకర్తలను ఈ సమావేశానికి దూరంగా ఉంచారు.

ఈ సమావేశం కోసం తాలిబాన్ల షరతులను అంగీకరించడం సరైనదేనా, భవిష్యత్తులో వాళ్లతో చర్చలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలు అంతర్జాతీయ సమాజంలో చాలా మంది లేవనెత్తారు.

కొత్త చట్టంపై యూరోపియన్ యూనియన్, ‘‘ఇలాంటి నియంత్రణలు విధించడం అంటే, వ్యవస్థలను దుర్వినియోగం చేయడమే. ఇది లింగ వివక్షతో సమానం, మానవత్వానికి మచ్చ’’ అని తీవ్రమైన పదాలతో ప్రకటన చేసింది.

"ఈ చట్టంలోని విలువలను అఫ్గాన్ సమాజం ఆమోదించింది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా యూఎన్, ఇతరులు....ఇస్లామిక్ చట్టాలు, సంప్రదాయాలను, ముస్లిం సమాజ విలువలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము” అని హమ్దుల్లా ఫిత్రత్ అన్నారు.

రెండు వారాల కిందటే ఈ చట్టాన్ని విమర్శించినందువల్ల తాలిబాన్ల మొరాలిటీ పోలీసింగ్ తరహా మంత్రిత్వ శాఖ, అఫ్గానిస్తాన్‌లోని యూఎన్ మిషన్‌కు ఇకపై సహకరించబోమని చెప్పింది.

దీంతో రెండు నెలల కిందటి వరకు పురోగమిస్తున్నట్లు అనిపించిన సంబంధాలు ఇప్పుడు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి.

“సహాయం విషయానికి వస్తే, ప్రపంచం అఫ్గానిస్తాన్‌కు సహాయాన్ని కొనసాగించాలని నేను భావిస్తున్నాను. కానీ తాలిబాన్లతో మాట్లాడేటప్పుడు, ప్రతి చర్చలో స్త్రీలు తప్పనిసరిగా ఉండాలనే నియమం విధించాలి. అది జరగకపోతే, తాలిబాన్లతో చర్చలు నిలిపేయాలి” అని మనస్తత్వవేత్త కరీనా అన్నారు.

‘‘అఫ్గాన్ మహిళలకు ఏం జరుగుతుంది అన్న విషయంపై ప్రపంచం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అది జరగకపోతే, ఈ మనస్తత్వం చాలా సులభంగా వాళ్లలోకి, వాళ్ల ఇళ్లలోకి వ్యాపిస్తుంది’’ కరీనా అభిప్రాయపడ్డారు.

( భద్రత కోసం ఈ ఇంటర్వ్యూలోని మహిళలందరి పేర్లనూ మార్చాము.)

వీడియో క్యాప్షన్, మహిళా నిరసనలను అణచివేస్తున్న తాలిబాన్

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)