ఆబ్రోసెక్సువాలిటీ: ఒకసారి అబ్బాయిలంటే ఆకర్షణ కలుగుతుంది, మరొకసారి అమ్మాయిలపై కోరిక పుడుతుంది

couple , abrosexuality

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

‘ఒక్కోసారి నా భర్త మీద విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. ఆ మరుక్షణమే నా ఆకర్షణ మరొకరి వైపు మరలుతుంది. అందంగా ఉన్న అమ్మాయినో అబ్బాయినో చూసినప్పుడు వాళ్లతో శారీరకంగా దగ్గరవ్వాలని అనిపిస్తుంది. ఆ క్షణంలో చాలా సతమతమైపోతాను’

దిల్లీకి చెందిన 38 ఏళ్ల జయంతి (పేరు మార్చాం) చెబుతున్న మాట ఇది. ఒక అంతర్జాతీయ సంస్థలో ఆమె పని చేస్తున్నారు.

జయంతికి ఉన్న ఈ కండిషన్‌ను ఆబ్రోసెక్సువాలిటీ అంటారని ‘గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, ఆంధ్రా మెడికల్ కాలేజ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోగ్యనాథుడు చెప్పారు.

ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఎమ్మా ఫ్లింట్ ‘మెట్రో’ పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె తనకు ఆబ్రోసెక్సువాలిటీ ఉన్నట్లు తెలిపారు.

ఆ తరువాత ఆబ్రోసెక్సువాలిటీపై చర్చ మొదలైంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆబ్రోసెక్సువాలిటీ అంటే ఏంటి?

స్త్రీ, పురుషులు ఇద్దరిపైనా శారీరక ఆకర్షణ కలిగి ఉండటంతోపాటు అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటాన్ని వైద్య పరిభాషలో ఆబ్రోసెక్సువాలిటీ అంటారని డాక్టర్ ఆరోగ్యనాథుడు బీబీసీతో చెప్పారు.

‘‘ఈ లక్షణాలు ఉన్నవారు కొన్ని రోజులు పూర్తిగా పురుషుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ ఆకర్షణ కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఉండవచ్చు. ఆ వెంటనే వాళ్ల దృష్టి అమ్మాయిల వైపు మారొచ్చు" అని డాక్టర్ ఆరోగ్యనాథుడు తెలిపారు.

ఇలా లైంగిక ఆకర్షణలు తరచూ మారుతూ ఉండటాన్ని ‘‘సెక్సువల్ ఫ్లూయిడిటీ’’ అని అంటారు.

ఆబ్రోసెక్సువాలిటీ అనేది కొత్త కాన్సెప్ట్.

"హే! చాాలా అందంగా కనిపిస్తున్నావ్. నీ లాంగ్ నెక్ బ్లౌజ్ చూస్తుంటే చాలా టెంప్టింగ్‌గా ఉంది. నేనే అబ్బాయినైతేనా " ఇలాంటి కామెంట్స్ స్నేహితురాళ్లు, బంధువులు, ఆఫీసులో మహిళా కొలీగ్స్ వంటి వారి నుంచి చాలా మంది మహిళలు వినే ఉండొచ్చు.

కామెంట్స్ చేసింది సేమ్ జెండర్ వాళ్లే కాబట్టి, సాధారణంగా మహిళలు వాటిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కొందరు కాస్త ఇబ్బంది పడొచ్చు. అవతలి వాళ్లకు మీపై ఆకర్షణ ఉండడం దీనికి కారణం కావొచ్చు.

ఇలాంటి పరిస్థితి అమ్మాయిలకు మాత్రమే ఎదురుకాదు. అబ్బాయిలు కూడా వేరే అబ్బాయిల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉండొచ్చు.

ఇలాంటి ధోరణి తరచుగా కనిపిస్తుంటే మాత్రం, అవతలి వ్యక్తికి మీపై శారీరక ఆకర్షణ కలిగి ఉండొచ్చు. అలా అని ఇవి గే, లెస్బియన్‌ల లక్షణాలు కాదు.

'ఆబ్రోసెక్సువాలిటీ' లక్షణాలు ఉన్నప్పుడు లైంగికత విషయంలో స్థిరత్వం ఉండదు. కొన్ని రోజులు పురుషుల పట్ల ఆకర్షితులైతే, మరి కొన్ని రోజులు వాళ్ల దృష్టి అంతా మహిళలపై ఉంటుంది.

ఆబ్రో సెక్సువాలిటీ, గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్, సెక్స్, లైంగికత

ఫొటో సోర్స్, Getty Images

"పెళ్లితో నా సమస్య తీరిపోతుందనుకున్నా"

సెక్సువల్ ఫ్లూయిడిటీ ఉన్న జయంతి.. పెళ్లికి ముందే తనకు అటువంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించానని చెప్పారు.

‘నేను అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరి పట్లా ఆకర్షితురాలినవుతున్నానని నాకు పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లితో ఆ సమస్య తీరిపోతుందనుకున్నా. కానీ నాలో కలిగే కోరికలకు పెళ్లి పరిష్కారం కాదని ఆ తరువాత అర్థమైంది’ అని జయంతి చెప్పారు.

ఒక అంతర్జాతీయ సంస్థలో ఆసియా-పసిఫిక్ డైవర్సిటీ కౌన్సెలర్‌గా పని చేస్తున్న సూర్యకాంతం రావి తన పరిశోధనలో భాగంగా జయంతితో మాట్లాడారు.

"జయంతికి పెళ్లికి ముందే తనలో ఉన్న లక్షణాలు తెలిశాయి. కానీ, ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఆమె ఇప్పటికీ ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పలేదు.

ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె పని చేయలేకపోయేవారు. కోపం వచ్చేది. అసహనానికి గురయ్యేవారు. పెళ్లి తన సమస్యకు పరిష్కారం అని అనుకున్నారు. కానీ పెళ్లి ఆమె సమస్యను తీర్చలేదు. భర్తతో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తన కుటుంబంలో ఇబ్బందులు రాకూడదనుకున్న ఆమె తన పరిస్థితిని ఎవరితోనూ చెప్పుకోలేదు.

జయంతికి వేరే వ్యక్తిపై ఆకర్షణ ఉన్నా భర్తతో దగ్గరగా ఉండాల్సివస్తే.. అలాంటి సమయంలో ఆ వేరొక వ్యక్తిని ఊహించుకుంటూ ఆనందం పొందుతుండేవారు’’ అని సూర్యకాంతం బీబీసీతో చెప్పారు.

ఆబ్రో సెక్సువాలిటీ, గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్, సెక్స్, లైంగికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఎల్ జీ బీ టీ క్యూ, గే లక్షణాల గురించి అవగాహన కల్పించడానికి చాలా సపోర్ట్ గ్రూపులు, హ్యాండిల్స్ ఉన్నాయి.

‘పెళ్లి తరువాతే తెలిసింది’

జయంతి లాంటి పరిస్థితే ఉన్న 42 ఏళ్ల షాలిని (పేరు మార్చాం) కౌన్సెలింగ్‌కు వెళ్లారు.

ఈమె హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నారు.

ఈమెకు పెళ్లి తర్వాతే తనలో ఉన్న లక్షణాలు అర్థమయ్యాయి. ఈమె ఇద్దరు ముగ్గురు కౌన్సెలర్ల దగ్గరకు వెళ్లినప్పుడు వాళ్లు అడిగిన ప్రశ్నలు ఆమెను ఇబ్బంది పెట్టాయి.

దీంతో కౌన్సెలింగ్ కి వెళ్లడం ఆపేసినట్లు ఆమె బీబీసీతో చెప్పారు.

తన పరిస్థితిని కౌన్సెలర్లు ఒక డిజార్డర్‌లా చూసి ఈ లక్షణాలను మందులతో నియంత్రించాలని చూశారని.. తనకు కావల్సింది మందులు కాదని ఆమె తెలిపారు.

‘కొందరు అమ్మాయిలను చూసినప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుండేది అనే ఆలోచన వస్తుంది. కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. అబ్బాయిల వైపు కూడా ఆకర్షితులవుతూ ఉంటాం. మా ఆకర్షణ మా భాగస్వాములకు మాత్రమే పరిమితం కాదు. ఆఫీస్ వాతావరణంలో అలాంటి భావాలను అణచిపెట్టుకుని.. నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి ఊరుకుంటాం. మహిళలే కాబట్టి చాలామందికి మా ఆలోచన కూడా అర్థం కాదు" అని షాలిని చెప్పారు.

"అయితే, ఈ ఇద్దరు(జయంతి, షాలిని) మహిళలు ఎవరితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి చూడలేదు. సాఫీగా సాగుతున్న కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవాలని వారు అనుకోవడం లేదు’’ అని సూర్యకాంతం అన్నారు.

"మా ఆలోచనలు అదుపు తప్పినప్పుడు నచ్చిన పనులు చేసుకోవడం, హాబీల వైపు దృష్టి సారించడం మాత్రం చేస్తూ ఉంటాం. ఇతర పురుషుల వైపు ఆకర్షణ కలిగినా కూడా, ఆ సంబంధం ఎక్కడికి దారి తీస్తుందోననే భయం కూడా ఉంది" అని జయంతి, షాలిని చెప్పారు.

ఆబ్రోసెక్సువాలిటీ, గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్, సెక్స్, లైంగికత

ఫొటో సోర్స్, Getty Images

ఆబ్రోసెక్సువాలిటీ కేసులు అరుదు

"ఆబ్రో సెక్సువాలిటీ గురించి పెద్దగా రీసెర్చ్ జరగలేదు, ఇలాంటి కేసులు ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు" అని హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ విశేష్ అన్నారు.

‘ఈ లక్షణాల వల్ల కుటుంబ సంబంధాల్లో ఇబ్బందులు తలెత్తొచ్చు. భాగస్వామి ఆమోదించకపోవచ్చు. సామాజికంగా సమస్యలు రావచ్చు, ఒక్కోసారి విడాకులకు దారి తీయొచ్చు’ అని విశేష్ అన్నారు.

‘నాలాంటి ఐడెంటిటీ ఉన్న మరో వ్యక్తిని నేను ఎన్నడూ కలవలేదు’ అని ‘ది ఎక్సపీరియెన్స్స్ ఆఫ్ ఆబ్రోసెక్సువల్ ఇండివిడ్యుయల్స్ ఆన్ టిక్ టాక్’ అనే రీసర్చ్ పేపర్‌లో ఎలీనార్ డాటన్ రాశారు. ఈ తరహా ఆకర్షణ గురించి సమాజంలో అవగాహన తక్కువగా ఉందని డాటన్ అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో బయటకు వచ్చి చెప్పడం వల్ల యూజర్స్ నుంచి ఎదురయ్యే కామెంట్లకు సమాధానం చెప్పడం మరింత నిరుత్సాహానికి, నిస్పృహకు గురి చేస్తోందని ఒక యూజర్ కామెంట్ చేసినట్లు రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు.

అయితే, సోషల్ మీడియాలో ఎల్‌జీబీటీక్యూ, గే లక్షణాల గురించి అవగాహన కల్పించడానికి చాలా సపోర్ట్ గ్రూపులు, హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.

జో స్టాలర్, క్వీర్, జెండర్ ఫ్లూయిడ్ సోషల్ వర్కర్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఎల్జీబీటీల గురించి అవగాహన పెంచే పోస్టులు పెడుతూ ఉంటారు.

ఆబ్రో సెక్సువాలిటీ, గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్, సెక్స్, లైంగికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌కు చెందిన ఎమ్మా ఫ్లింట్ మెట్రో పత్రికకు రాసిన వ్యాసంలో తనకు ఆబ్రోసెక్సువాలిటీ ఉన్నట్లు తెలిపారు.

హార్మోన్ల అసమతుల్యత, ఆలోచనలు, పెరిగిన వాతావరణం కూడా ఇలాంటి లక్షణాలు పెరగడానికి కొంతవరకు కారణం కావచ్చు.. కానీ, ఆబ్రోసెక్సువాలిటీకి నిర్దిష్టమైన కారణాలేవీ చెప్పలేమని డాక్టర్ ఆరోగ్యనాథుడు అన్నారు.

ఇలాంటి లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పుడు కేవలం ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఎలా మెలగాలో తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలని విశేష్ అంటారు.

‘ఈ లక్షణాలున్నట్లు వాళ్లకు అర్థమైన తర్వాత సహాయం అవసరం ఉండదు. వాళ్లు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే థెరపిస్ట్ అవసరం’ అని అన్నారు.

ఇలాంటి లక్షణాలను సహజంగా భావించి ఆత్మన్యూనత లేకుండా ముందుకు వెళ్లగలిగితే, సమస్యలు ఉండవని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)