ఉత్తరాఖండ్: హిందూయేతరులు, రోహింజ్యా ముస్లింలు మా ఊళ్లోకి రావద్దంటూ ఆ గ్రామంలో బోర్డులు ఎందుకు పెడుతున్నారు?

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
- రచయిత, ఆసిఫ్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘హిందూయేతరులు/రోహింజ్యా ముస్లింలు.. చిరు వ్యాపారులు మా గ్రామంలోకి రావద్దు, ఏమీ విక్రయించవద్దు’
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇలాంటి బోర్డులు కనిపిస్తున్నాయి.
హిందూయేతరులు, రోహింజ్యా ముస్లింలు తమ గ్రామాల్లోకి రావడంపై నిషేధం విధిస్తున్నట్లు బోర్డులు పెట్టారు.
‘హెచ్చరిక’ అంటూ ఈ బోర్డులను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.
ఈ అంశంపై ముస్లిం సంఘాలు ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశాయి.
తాము గుర్తించిన మేరకు ఇలాంటి బోర్డులను తొలగించామని, వీటిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు చెప్పారు.
రుద్రప్రయాగ పక్కనున్న చమోలీ జిల్లాలో మైనర్‌ను వేధించిన ఘటన వెలుగులోకి రావడంతో మత ఘర్షణలు వ్యాపించాయి. ఆ తరువాత ఇలాంటి బోర్డులు మొదలయ్యాయి.
అయితే, ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు రోహింజ్యా ముస్లింలు ఉన్నట్లు కానీ, వాళ్లను ఇక్కడ నుంచి పంపించివేసినట్లు కానీ అధికారిక సమాచారం ఏమీ లేదు.

స్థానికులు, గ్రామ నాయకులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేసిన అనేక గ్రామాల్లో నియాల్సు ఒకటి. ప్రమోద్ సింగ్ ఈ గ్రామానికి సర్పంచ్.
బీబీసీ ప్రమోద్ సింగ్‌తో మాట్లాడింది. “మా గ్రామంలో బోర్డును మార్చేశారు. గతంలో ఆ బోర్డు మీద హిందూయేతరులు, రోహింజ్యా ముస్లింలు అని రాసి ఉండేది. అయితే ఇప్పుడు దానికి బదులుగా ‘చిరు వ్యాపారులు గ్రామంలోకి రావడం నిషేధం” అని రాసి ఉందని ప్రమోద్ సింగ్ చెప్పారు.
‘వీధుల్లో తిరుగుతూ అమ్ముకునే వ్యాపారులు అనేక మంది ఎలాంటి గుర్తింపు లేకుండానే గ్రామంలోకి వస్తారు’ అని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.
బోర్డుల మీద ‘హిందూయేతర, రోహింజ్యా ముస్లిం’ వంటి పదాలను ఉపయోగించడం పూర్తిగా తప్పు అన్నారు ప్రమోద్.
‘ఇలా రాయడం సరికాదని ఈ బోర్డు పెట్టిన వారికి ముందే చెప్పాం. ఇవి ఏర్పాటుచేసిన వాళ్లకు ఏ సంస్థతో సంబంధం ఉందో నాకు తెలియదు’ అని ఆయన అన్నారు.
బీబీసీ మరికొన్ని గ్రామాల్లో ఆయా గ్రామ పెద్దలతో మాట్లాడింది. అయితే వాళ్లు ఈ సంఘటన గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో పని చేస్తున్న అశోక్ సెమ్వాల్ రుద్రప్రయాగ్‌లో ఉంటున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
“ఈ బోర్డులను గ్రామ పెద్దలు, కొన్ని సంస్థలు ఏర్పాటు చేశాయి. స్థానికుల్లో అవగాహన కల్పించడమే వారి లక్ష్యం. చాలా గ్రామాల్లో ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేశారు. కేదారఘాటి నుంచి ఈ ప్రచారం ప్రారంభం కావడంతో అందరూ బోర్డులు పెట్టుకుంటున్నారు” అని ఆయన చెప్పారు.
మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే వీలున్నప్పుడు ఊరికి రావాల్సిన అవసరం ఏముందని అశోక్ ప్రశ్నించారు. బోర్డుల్లో మార్పులు చేయాలని పోలీసులు తనను కోరినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.
“పోలీసులు, కొంతమంది వ్యక్తులు బోర్డుల్లో మార్పులు చేయాలని కోరారు. బోర్డుపై ఏదైనా వర్గం గురించి రాసే బదులు 'బయటి వ్యక్తి' అని రాయాలని పోలీసులు సూచించారు. మా గ్రామంలో ఇప్పుడు ఉన్న బోర్డులో మార్పులు చేసినట్లే ఇతర గ్రామాల్లోనూ మార్పులు చేయిస్తాం” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
ముస్లిం సంఘాల అభ్యంతరాలు
ఎంఐఎం ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ నయ్యర్ ఖజ్మీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం డీజీపీ అభివవ్‌కుమార్‌ను కలిసింది.
రుద్రప్రయాగ్‌లో ఏర్పాటు చేసిన బోర్డులు, చమోలీలోని నందనగర్ ఘాట్‌లో జరిగిన సంఘటనల గురించి వారు డీజీపీకి వివరించారు.
“ఈ విషయంపై మేం ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినవ్ కుమార్‌ను కలిశాం. రుద్రప్రయాగ్‌లో ఏర్పాటు చేసిన బోర్డుల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. బోర్డుల ఫొటోలను ఆయనకు చూపించాం. దీనిపై విచారణ జరుపుతామని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు” అని డాక్టర్ నయ్యర్ కజ్మీ చెప్పారు.
దేహ్రాదూన్ నగర ఖాజీ మౌలానా మహ్మద్ అహ్మద్ ఖాస్మీ నాయకత్వంలోని ముస్లిం సేవా సంస్థ బృందం కూడా డీజీపీ అభినవ్ కుమార్‌ను కలిసి మెమొరాండం సమర్పించింది.
పర్వత ప్రాంతాల్లోని గాడ్వాల్, కుమావ్‌లో ముస్లింలు లక్ష్యంగా దాడులు పెరగడంపై తాము మెమొరాండం సమర్పించినట్లు ఆయన చెప్పారు.
బోర్డుల ఏర్పాటుతో పాటు చమోలీ ఘటనపై డీజీపీ అభినవ్ కుమార్ విచారం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
పోలీసులు ఏమంటున్నారు?
ప్రస్తుతం బోర్డులన్నీ తొలగించామని, ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రుద్రప్రయాగ్ పోలీసులు చెబుతున్నారు.
'బోర్డుల గురించి మాకు సమాచారం అందింది. గ్రామపెద్దలతో సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని రుద్రప్రయాగ్ డీఎస్పీ ప్రబోధ్ కుమార్ గిల్డియాల్ తెలిపారు.
ప్రస్తుతం మైఖండ గ్రామంలో మాత్రమే ఇలాంటి బోర్డులు ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు.
"మా దృష్టికి వచ్చిన బోర్డులన్నింటినీ తొలగించాం. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని ఏర్పాటు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత: కాంగ్రెస్
ఈ ఘటనకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి గరిమా దసోని అన్నారు.
“ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మత విద్వేషాలు లేవు. అయితే ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన వ్యూహాలతో వాటిని గ్రామాల్లోకి తీసుకు వెళ్తున్నారు” అని దసోనీ ఆరోపించారు.
పురోధలోనూ ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని, అయితే అక్కడ బోర్డుల్ని ఏర్పాటు చేయడం లాంటిదేమీ జరగలేదని ఆమె చెప్పారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ అంశం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ఎక్స్”లో రెండు సందేశాలు పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ASIF ALI/BBC
పొరుగు జిల్లాలో మత ఘర్షణలు
రుద్రప్రయాగ పొరుగు జిల్లా చమోలిలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో కొంతమంది యువకులు ఓ ముస్లిం యువకుడి దుకాణంపై దాడి చేసి ధ్వంసం చేశారు.
ఆ ముస్లిం యువకులు బాలికను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానిక మార్కెట్‌లో హిందూ సంస్థలు ఊరేగింపు నిర్వహించి యువకుడికి చెందిన సెలూన్‌ను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఇతర ముస్లింల దుకాణాలపైనా దాడులు చేశారు.
ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బాలికను వేధించిన నిందితుడు ఆరిఫ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని సొఫత్‌పూర్ గ్రామంలో అరెస్టు చేశారు.
మార్కెట్‌లో జరిగిన విధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














