యశ్ దయాల్: రింకూ సింగ్ కొట్టిన 5 సిక్సర్లతో ట్రోలింగ్ ఎదుర్కోవడం నుంచి భారత్ టెస్ట్ జట్టులో చోటు వరకు

యశ్ దయాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, యశ్ దయాల్
    • రచయిత, హిమాన్షు దుబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌‌ కోసం భారత టెస్టు జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌కు ఆ జట్టులో చోటు దక్కింది. ఇంతకు యశ్ దయాల్ ఎవరు?

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఏప్రిల్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఓ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యశ్ దయాల్ పేరు తొలిసారి ప్రముఖంగా వినిపించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే చివరి 6 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది.

గుజరాత్ టైటాన్స్ తరఫున చివరి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌కు అప్పగించారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ క్రీజులో ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలిచేలా కనిపించింది.

కానీ, యశ్ దయాల్ వేసిన ఆ ఓవర్లో 5 సిక్సర్లు కొట్టి రింకూ సింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రింకూకు ప్రశంసలు, యశ్‌పై సందేహాలు

ఈ మ్యాచ్ తర్వాత ఒక వైపు రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు యశ్ దయాల్ కెరీర్‌పై సందేహాలు తలెత్తాయి.

ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో యశ్ దయాల్‌కు అవకాశం కూడా రాలేదు.

మరి యశ్ దయాల్ టెస్టు జట్టులో ఎలా స్థానం సంపాదించాడు?

నిజానికి మీడియం ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఐపీఎల్ చేదు జ్ఞాపకాలను మరచిపోయి దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. రంజీ ట్రోఫీ చివరి సీజన్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాత, విజయ్ హజారే ట్రోఫీలో ఆరు మ్యాచ్‌‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

ఈ ప్రదర్శన తర్వాత యశ్ దయాల్, దులీప్ ట్రోఫీలో అవకాశం దక్కించుకున్నాడు.

భారత్ ‘బి’ తరఫున ఆడుతూ నాలుగు వికెట్లు పడగొట్టాడు. యశ్ ఆటతీరుతో అతని జట్టు భారత్ ‘ఎ’ పై జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రాజస్థాన్ రాయల్స్‌,యశ్ దయాల్,మ్యాచ్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2022 మేలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్

ఐపీఎల్ 2024లో యశ్ ప్రదర్శన ఎలా ఉంది?

ఐపీఎల్ 2024లో యశ్ దయాల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.

2024 మే 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

గెలిచిన జట్టుకు టోర్నీలో ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సారి కూడా చివరి ఓవర్ బౌలింగ్ బాధ్యతను మీడియంపేసర్ యశ్ దయాల్‌కు అప్పగించారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడు.

యశ్ వేసిన తొలి బంతికే ధోని ఆకాశమే హద్దుగా సిక్స్ కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆనందంతో కేకలు వేయగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

కానీ, ఆ తర్వాతి బంతికే ధోనీ వికెట్‌ తీసి మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు యశ్‌ దయాల్‌.

చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలంటే చివరి నాలుగు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అది జరగలేదు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. దీంతో యశ్ దయాల్ పేరు ఐపీఎల్‌ 2024లో మారుమోగింది.

ఐపీఎల్ మ్యాచ్‌, యశ్ దయాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2024 మే నెలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో యశ్ దయాల్

బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌లు రాణిస్తున్న సమయంలో..

ఐపీఎల్ 2023లో ఒక ఓవర్‌లో 30 పరుగులు ఇచ్చి వార్తల్లో నిలిచిన యశ్ దయాల్, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక ఓవర్‌లో 16 పరుగులు చేయకుండా ఆపగలిగాడు.

ఇప్పుడు భారత టెస్టు జట్టులో యశ్ దయాల్‌కు అవకాశం లభించింది.

‘భారత జట్టులోకి మంచి ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇది మంచి విషయం.

యశ్ దయాల్ మీడియం ఫాస్ట్ బౌలర్. గత సీజన్‌లో అతను బాగా ఆడాడు. దీంతో టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.

అయితే బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ లాంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న సమయంలో అతనికి జాతీయజట్టులో చోటు దక్కింది. యశ్ దయాల్‌కు తొలి టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తే అది పెద్ద విషయమే’ అన్నారు సీనియర్ జర్నలిస్టు అఖిల్ సోనీ.

‘ఐపీఎల్‌లాంటి టోర్నమెంట్లు క్రికెటర్లకు ఆప్షన్లను పెంచాయి. అయితే గాయపడే ప్రమాదమూ ఇందులో ఎక్కువగానే ఉంది’ అని ఆయన అన్నారు.

చెన్నై జట్టు, రుతురాజ్ గైక్వాడ్ ,వికెట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చెన్నైప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసిన తర్వాత యశ్ దయాల్, 2024 మే 18నాటి చిత్రం

యశ్ దయాల్ రికార్డ్ ఎలా ఉంది?

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ ఇన్ఫో ప్రకారం, మీడియం పేసర్ యశ్ దయాల్ 56 టీ20 మ్యాచ్‌లు ఆడి 53 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడిన యశ్ దయాల్ మొత్తం 28 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు.

సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌- భారత్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరుగనుంది.

అయితే రెండో టెస్టు కోసం జట్టును ఇంకా ఎంపిక చేయలేదు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ

భారత టెస్టు జట్టులో ఎవరెవరున్నారు?

బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)