మిడతల సూప్, కీచురాళ్ల కేక్: రుచిగా ఉంటే కీటకాలతో చేసిన వంటకాలు తినడానికి మీరు సిద్ధమేనా?

కీటకాలు, సూపర్ ఫుడ్, సింగపూర్, కీటకాలతో వంటకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనేకమంది షెఫ్‌లు కీటకాలతో వంటకాలు ప్రయోగాలు చేస్తున్నారు.
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఇన్‌సెక్ట్స్ టు ఫీడ్ ది వరల్డ్’ పేరిట ఇటీవల సింగపూర్‌లో ఒక సదస్సు నిర్వహించారు.

ప్రపంచ ప్రఖ్యాత కుక్‌లతో పాటు 600 మందికి పైగా శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు ఇందులో పాల్గొన్నారు.

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో పావు వంతు, అంటే సుమారు 200 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తమ రోజువారీ ఆహారంలో భాగంగా కీటకాలను తింటున్నారు.

ఆహార కొరతను అధిగమించడానికి కీటకాలను ఆరోగ్యకరమైన, పర్యావరణ అనుకూల ఎంపికగా భావించేవారు ఇలాంటి ఆహారాన్ని మరింత ఎక్కువమంది ప్రజలు తినాలని కోరుతున్నారు.

సింగపూర్ షెఫ్ నికోలస్‌తో కలిసి ఈ కాన్ఫరెన్స్ కోసం ‘క్రికెట్-లేస్డ్ మెనూ’ రూపొందించిన న్యూయార్క్‌కు చెందిన షెఫ్ జోసెఫ్ యూన్.. "కీటకాలను రుచికరంగా వండడంపై దృష్టి పెట్టాలి" అని అన్నారు.

ఈ సదస్సులో కేవలం క్రికెట్‌లను(వీటిని మిడత, కీచురాయి, చిమట అని పిలుస్తారు) మాత్రమే ఆహారంగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారు.

"కీటకాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, అవి ఆహార భద్రత సమస్యను పరిష్కస్తాయి" అని చెప్తూనే.. వాటిని రుచికరంగా తయారు చేయడం ఒక సవాల్ అని జోసెఫ్ యూన్ అన్నారు.

మిడతలతో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పశువులతో పోలిస్తే వాటిని పెంచడానికి నీరు, స్థలం చాలా తక్కువ అవసరమవుతుంది.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పురుగులు, కీటకాలు, మిడతలు, ఆహారం, ఫుడ్

ఫొటో సోర్స్, Insects to Feed the World

ఫొటో క్యాప్షన్, కీటకాల బఫేతో నికోలస్ (కుడి నుంచి మూడో వ్యక్తి), జోసెఫ్ యూన్ (కుడి నుంచి నాలుగో వ్యక్తి)

కీటకాలు – పేదరికం

శతాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కీటకాలు విలువైన ఆహార వనరుగా ఉన్నాయి.

జపాన్‌లో మాంసం, చేపలు తక్కువగా ఉండే ప్రాంతాలలో మిడతలు, పట్టుపురుగులు, కందిరీగలు తినేవాళ్లు.

రెండో ప్రపంచ యుద్ధంలో ఆహార కొరత సమయంలో ఆ అలవాటు మళ్లీ మొదలైంది.

థాయిలాండ్‌లోని నైట్ మార్కెట్‌లలో మిడతలు, పట్టుపురుగులను స్నాక్స్‌గా విక్రయిస్తుంటారు.

మెక్సికో సిటీలో చీమల లార్వాల వంటల కోసం వందల డాలర్లు చెల్లిస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన అజ్‌టెక్‌లు ఈ వంటకాన్ని రుచికరమైనదిగా భావించేవాళ్లు.

అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో.. కీటకాలను తినేవారిని ఇప్పుడు వాళ్ల పేదరికంతో ముడిపెట్టడంపై కీటకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆహారంలో కీటకాలను ఉపయోగించే సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలలో ఇప్పుడు దీనిని ఒక అవమానంగా భావించడం పెరిగిందని న్యూయార్క్‌‌కు చెందిన షెఫ్ జోసెఫ్ యూన్ అన్నారు.

"వాళ్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విదేశీ సంస్కృతుల గురించి తెలుసుకుని తాము కీటకాలను తినడంపై సిగ్గు పడుతున్నారు."

తన ‘ఎడిబుల్ ఇన్‌సెక్ట్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్’ పుస్తకంలో ఆంత్రొపాలజిస్ట్ జూలీ లెస్నిక్.. వలసవాదం కీటకాలను తినడాన్ని ఒక కళంకంగా మార్చిందని వాదించారు. క్రిస్టోఫర్ కొలంబస్, ఆయన బృందంలోని సభ్యులు స్థానిక అమెరికన్లు కీటకాలను తినడాన్ని అసహ్యించుకునేవారని ఆమె తన పుస్తకంలో రాశారు.

పురుగులు, ఫుడ్, సింగపూర్

ఫొటో సోర్స్, BBC/Kelly Ng

ఫొటో క్యాప్షన్, థాయ్-స్వీడిష్ స్టార్టప్ గ్లోబల్ బగ్స్ మిడతలతో చిరుతిళ్లు తయారు చేస్తోంది.

కొన్ని దేశాలు ఇటీవలే కీటకాలతో చేసిన ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సింగపూర్ ఇటీవల మిడతలు, పట్టు పురుగులు, తేనెటీగలు సహా 16 రకాల కీటకాలను ఆహారంగా ఆమోదించింది.

అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఈ కీటకాహార పరిశ్రమపై యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, థాయిలాండ్‌తో సహా కొన్ని దేశాలు నియంత్రణలు విధిస్తున్నాయి.

ఒక అంచనా ప్రకారం, ఈ కీటకాహార పరిశ్రమ విలువ సుమారు 34 వందల కోట్ల రూపాయలు.

ఈ సదస్సులో పాల్గొన్న షెఫ్ నికోలస్ కీటకాలతో తయారు చేసిన ప్యాటీలతో, ప్రసిద్ధ వంటకం లాక్సాను కొత్తగా తయారు చేశారు.

కీటకాలకు ఉండే మట్టి వాసనను పోగొట్టడం ఈ వంటకాల తయారీలో కీలకమని ఆయన అన్నారు.

అయితే మిడతలతో ప్రయోగాలు చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉందని, ప్రతిరోజూ మిడతలతో వంట చేయడం కష్టమని ఆయన అన్నారు.

సింగపూర్ కీటకాలతో కూడిన వంటలను ఆమోదించినప్పటి నుంచి కొన్ని రెస్టారెంట్లు వాటితో ప్రయోగాలు చేస్తున్నాయి.

ఒక సీఫుడ్ రెస్టారెంట్, తమ ఆహార పదార్థాలపై మిడతల పొడిని చల్లడం లేదా దాన్ని చేపల తల కూరకు సైడ్ డిష్‌గా సర్వ్ చేయడం ప్రారంభించింది.

అయితే దీన్ని చాలా ఏళ్ల నుంచి అమలు చేస్తున్న రెస్టారెంట్లూ ఉన్నాయి. టోక్యోకు చెందిన టేకో కేఫ్ గత 10 సంవత్సరాలుగా వినియోగదారులకు కీటకాల వంటకాలను అందిస్తోంది.

వీళ్ల మెనూలో మడగాస్కర్ బొద్దింకలతో కూడిన సలాడ్, గొల్లభామలతో చేసిన ఐస్ క్రీం, పట్టుపురుగుతో చేసిన కాక్‌టెయిల్ ఉన్నాయి.

పురుగులు, కీటకాలు, మిడతలు, ఫుడ్

ఫొటో సోర్స్, nsects to Feed the World

ఫొటో క్యాప్షన్, కీటకాలతో వంటకాలు

అయితే, ప్రజల వైఖరి మారవచ్చు. ఒకప్పుడు సుషీ, పీతలు వంటివి తినేవాళ్లను వింతగా చూసేవాళ్లు. ఇప్పుడది మామూలుగా మారింది. సుషీ శ్రామిక తరగతి వంటకంలా ప్రారంభమైంది. "పేదవాని కోడి" అని పిలిచే పీతలను ఒకప్పుడు ఈశాన్య అమెరికాలో ఖైదీలు, బానిసలకు ఆహారంగా ఇచ్చేవారని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీకి చెందిన ఆహార పరిశోధకుడు కెరీ మాటివ్క్ చెప్పారు.

కానీ రవాణా వ్యవస్థ మెరుగు పడడం, ఆహార నిల్వలు మెరుగుపడటంతో, ఎక్కువ మంది ప్రజలకు ధాన్యాల వంటి ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి.

ఒకప్పుడు ఆహారంగా కూడా పరిగణించని ఆహార పదార్థాలు క్రమంగా ముఖ్య ఆహారంగా మారతాయని డాక్టర్ మాటివ్క్ చెప్పారు. “కానీ సాంస్కృతిక విశ్వాసాలు మారడానికి సమయం పడుతుంది. కీటకాలను అసహ్యమైనవి, మురికిగా ఉంటాయి అనే అభిప్రాయాన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది’’

భవిష్యత్ తరాలు వాతావరణ సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందు వల్ల, తమ పిల్లలలో కీటకాలు సహా అసాధారణ ఆహారాన్ని తీసుకునే అలవాట్లను ప్రోత్సహించమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.

క్వినోవా, బెర్రీలలాగా కీటకాలు భవిష్యత్తులో "సూపర్ ఫుడ్స్"గా మారినా ఆశ్చర్యం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)