తేగ్‌బీర్ సింగ్: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బాలుడు, ఇది ఎలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, Sikhinder Deep Singh
- రచయిత, నవజోత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్‌లోని రోపడ్ పట్టణానికి చెందిన 5 ఏళ్ల తేగ్‌బీర్ సింగ్, ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతాన్ని అధిరోహించిన అతిపిన్న వయసు ఆసియా వాసిగా రికార్డు సృష్టించాడు.కిలిమంజారోను అధిరోహించిన ప్రపంచంలోనే రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
తేగ్‌బీర్ సింగ్ కంటే ముందు, ఈ రికార్డు సెర్బియాకు చెందిన ఓగ్జెన్ జెకోవిచ్ (వయసు 5) పేరిట ఉంది.
టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతం ఎత్తు 19,341 అడుగులు.
తేగ్‌బీర్ సింగ్ తండ్రి సుఖిందర్ దీప్ సింగ్ కూడా కుమారుడితో కలిసి ఈ పర్వతాన్ని అధిరోహించారు.
తండ్రీకొడుకులిద్దరూ 2024 ఆగస్టు 18న పర్వతారోహణ ప్రారంభించి ఆగస్టు 24 నాటికి పూర్తి చేశారు. ఆగస్టు 25న తిరిగి కిందకు వచ్చారు.
"కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి బేస్ క్యాంప్ బరాఫు. బరాఫు నుంచి మేం కరంగ క్యాంప్, బ్రాంకో, షిరా గుహ, మకామే క్యాంప్ మీదుగా కిలిమంజారో చేరుకున్నాం. ఈ ట్రెక్ పూర్తి చేయడానికి మాకు 7 రోజులు పట్టింది" అని తేగ్‌బీర్ సింగ్ తండ్రి సుఖిందర్ దీప్ సింగ్ చెప్పారు.


ఐదేళ్ల పిల్లలతో ఇలాంటివి చేయించడం సరైనదేనా?
"ఇంత చిన్న అబ్బాయితో మీరు ఎందుకిలా చేయిస్తున్నారు? అనే ప్రశ్న నన్ను అనేక మంది చాలా సార్లు అడుగుతారని నాకు తెలుసు. అయితే నేను వాడికి ప్రపంచాన్ని చూపిస్తున్నాను” అని సుఖిందర్ దీప్ సింగ్ చెప్పారు.
“మూడేళ్ల పిల్లలు కూడా రాక్ క్లైంబర్స్ అయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అలాంటి పని మన పిల్లలు ఎందుకు చేయకూడదు?” అని ఆయన అన్నారు.
“మన పిల్లలు ఆటల్లో రాణించాలి. విదేశాల్లోనూ వాళ్లు చేయగలిగినవి చేయాలి. అందుకే నేను తేగ్‌బీర్ ట్రెక్కింగ్ సరదాను ఆపడం లేదు. వాడిని ప్రోత్సహిస్తున్నాను. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నాను” అని సుఖిందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sukhinder Deep Singh/BBC
‘ఖాళీగా కూర్చోలేడు’
తేగ్‌బీర్ సింగ్ తల్లి డాక్టర్ మన్‌ప్రీత్ కౌర్ గైనకాలజిస్టు.
"తేగ్‌బీర్ సింగ్ పుట్టుకతో చాలా తెలివైనవాడు. చురుకైనవాడు. వాడు ఖాళీగా కూర్చోలేడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు" అని మన్‌ప్రీత్ కౌర్ చెప్పారు.
"ఉదయం పరుగెత్తడానికి లేచినప్పుడు, నేను వెళ్ళను అని ఎప్పుడూ చెప్పలేదు. కొత్తది చేయడానికి, నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ట్రెక్కింగ్‌లో బాగా శిక్షణ ఇస్తే వాడు పర్వతాలను ఎక్కగలడని అనుకున్నాం. శిక్షణ మొదలైన తర్వాత వాడిని నేనెప్పుడూ ఆపలేదు. అదే వాడికి ధైర్యం, సంకల్పాన్ని ఇచ్చింది” అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Sukhinder Deep Singh/BBC
చిన్న వయసులో..
"ఆరోగ్యంగా ఉండేందుకు నేను రోజూ నాలుగైదు కిలోమీటర్లు పరుగెడతాను. ఉదయం నేను రన్నింగ్ చేయడానికి వెళ్లినప్పుడల్లా తేగ్‌బీర్ సింగ్ నాతో వస్తాడు. రోపడ్‌లో రిటైర్డ్ హ్యాండ్‌బాల్ కోచ్ విక్రమ్‌జిత్ సింగ్ ఘమ్మాన్ ఉండటం మా అదృష్టం. ఆయన ప్రతి ఆదివారం పట్టణంలో ఔత్సాహికులకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చేవారు" అని సుఖిందర్ చెప్పారు.
"ఒక రోజు నేను ఆయనతో మాట్లాడాను. మేం కూడా ఆయన వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించాం. ప్రతి ఆదివారం మేమిద్దరం ఆయన వద్ద శిక్షణ కోసం వెళ్లేవాళ్లం. తేగ్‌బీర్ సింగ్ ఉత్సాహాన్ని చూసి, వాడికి ప్రొఫెషనల్ ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇప్పించాలని విక్రమ్ సలహా ఇచ్చారు" అని సుఖిందర్ వివరించారు.
"రోపడ్‌కు చెందిన 8 ఏళ్ల సాన్విసూద్ పర్వతారోహకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తేగ్‌బీర్ సింగ్ కూడా ఆ పని చేయగలడని మాకు ధైర్యం వచ్చింది” అని సుఖిందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sukhinder Deep Singh/BBC
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి ఎలా సిద్ధమయ్యారు?
ఏడాదిన్నర శిక్షణ తర్వాత తేగ్‌బీర్‌ను కిలిమంజారో పర్వతం ఎక్కేందుకు తీసుకెళ్లారు. అంతకు ముందు, అంటే 2024 ఏప్రిల్‌లో తేగ్‌బీర్‌ను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు తీసుకెళ్లారు.
“తేగ్‌బీర్ సింగ్ విషయంలో ముందుకెళ్లవచ్చని అనిపించిన తర్వాత ఏడాదిన్నర పాటు అతడి రోజువారీ దినచర్యకు షెడ్యూల్ రూపొందించాం. వాడు ప్రతీ రోజూ ఉదయం ఐదు గంటలకే లేచి మొదట జిమ్‌కు, ఆ తర్వాత నాతో పాటు పరుగెత్తడానికి వచ్చేవాడు” అని తేగ్‌బీర్ సింగ్ తండ్రి చెప్పారు.
"ఇద్దరి డైట్‌లో జాగ్రత్తలు తీసుకోవడమే నా పని. మాది స్వచ్ఛమైన శాకాహార కుటుంబం కాబట్టి జిమ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వారికి ప్రోటీన్‌తో కూడిన భోజనం ఇవ్వడం చాలా ముఖ్యం" అని డాక్టర్ మన్‌ప్రీత్ కౌర్ వివరించారు.

ఫొటో సోర్స్, Sukhinder Deep Singh/BBC
కిలిమంజారో ఎక్కడానికి అనుమతి ఎలా వచ్చింది?
కిలిమంజారో పర్వతం ఎక్కాలని అనుకున్న తర్వాత వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. తేగ్‌బీర్ సింగ్ శారీరక దృఢత్వం, మానసిక పరిస్థితి గురించి వివరాలను కిలిమంజారో అధికారులకు ఇచ్చారు.
అతను శిక్షణ తీసుకుంటున్న వీడియోలు, మౌంట్ ఎవరెస్ట్ బేస్‌క్యాంపుకు చేరుకున్న వీడియోలను అధికారులకు పంపారు.
తేగ్‌బీర్‌కు వైద్య పరీక్షలు చేయించి, ఆ రిపోర్టుల్ని కూడా ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత అధికారులు కిలిమంజారో పర్వతారోహణకు వారికి అనుమతి ఇచ్చారు.
పర్వతారోహణలో తండ్రి, కొడుకులకు తోడుగా 9 మంది సహాయ బృందం ఉంది.
"నేను, తేగ్‌బీర్‌తో పాటు ఇద్దరు గైడ్‌లు ఉన్నారు. ఒక చీఫ్ గైడ్, ఒక జూనియర్ గైడ్. అంతేకాకుండా, ఒక కుక్, ఒక వెయిటర్ (ఆహారం వడ్డించేందుకు), ఐదుగురు పోర్టర్లు కూడా వచ్చారు. ఆ పోర్టర్‌లు మా సామాన్లు, పానీయాలు, సిలిండర్లు.. అన్నీ మోసుకొచ్చారు” అని సుఖిందర్ దీప్ సింగ్ చెప్పారు.
ఈ బృందంలో సీనియర్ గైడ్ జోయ్‌కెన్ గబుసా.. చైల్డ్ ట్రెక్కింగ్‌లో నిపుణుడు. పిల్లలకు వారి వయసును బట్టి శిక్షణ ఇస్తారు.
ఈ మొత్తం ప్రయాణంలో, తేగ్‌బీర్ సింగ్, అతని తండ్రి సుఖిందర్ సింగ్ కూడా ఒక భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
ఈ బృందం కిలిమంజారో పర్వత శిఖరానికి దగ్గరగా చేరుకున్నప్పుడు, అకస్మాత్తుగా మంచు తుపాను వచ్చింది.
సుఖిందర్ సింగ్ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు.
"తుపాను చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ మేం మా లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాతే తిరిగి వెళ్ళాలని అనుకున్నాం. అలాగే ముందుకెళ్లాం. గైడ్‌తో మాట్లాడిన తర్వాత పరుగెత్తాలని నిర్ణయించుకున్నాం. గైడ్‌లు తేగ్‌బీర్ వెన్నంటి ఉన్నారు. నేను పర్వత శిఖరం మీదికి పరుగు తీశాను. అలా మా లక్ష్యాన్ని చేరుకున్నాం. అక్కడ ఫొటోలు తీసుకున్నాం” అని సుఖిందర్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sukhinder Deep Singh/BBC
ఖర్చెంత?
‘‘కిలిమంజారో పర్వతారోహణకు దాదాపు రూ.8 లక్షలు ఖర్చవుతుంది. విమాన ప్రయాణం, గైడ్, వసతి, సేఫ్టీ కిట్లు, శిక్షణకు అయ్యే ఖర్చులు అదనం’’ అని సుఖిందర్ దీప్ సింగ్ చెప్పారు.
తేగ్‌బీర్ సింగ్ అంతకుముందు ఏప్రిల్‌లో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును సందర్శించాడు. ఆ బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉంది.
పంజాబ్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతిపిన్న వయస్కుడైన పర్వతారోహకుడిగా తేగ్‌బీర్ సింగ్ గుర్తింపు పొందాడు.

ఫొటో సోర్స్, AAP/X
అభినందనలు
తేగ్‌బీర్ సింగ్ సింగ్‌ను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ ప్రశంసించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తేగ్‌బీర్ సింగ్‌కు అభినందనలు తెలిపింది.
“ఇది చరిత్రాత్మకం, రోపడ్‌కు చెందిన ఐదేళ్ల తేగ్‌బీర్ సింగ్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కుడైన ఆసియన్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రయాణం చిన్న వయసులోనే అతని ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. పంజాబ్‌కు గర్వకారణం” అని ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఎక్స్’లో పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














