మలావి రైతులకు లాభాలు తెచ్చి పెడుతున్న బనానా వైన్

ఫొటో సోర్స్, Anne Okumu/BBC
- రచయిత, అన్నే ఒకుము & యాష్లే లైమ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆఫ్రికా దేశమైన మలావిలో ఒక చిన్న రైతు అయిన ఎమిలీ, గతంలో బాగా పండిపోయిన అరటి పళ్లను పారేయడమో, కుళ్ళిపోయేలా చేయడమో చేసేవాళ్లు. కానీ ఆమె ఇప్పుడు వాటితో ఒక మంచి ఉపయోగం ఉందని కనుగొన్నారు. అదే బనానా వైన్.
విపరీతమైన వేడి కారణంగా అరటిపళ్లు చాలా త్వరగా పండిపోతాయి. ఫలితంగా ఉత్తర మలావి ప్రాంతంలోని కరోంగా జిల్లాకు చెందిన అరటి రైతులు గతంలో భారీ నష్టాలను చవి చూశారు. అలా నష్టపోయిన వారిలో ఎమిలీ కూడా ఒకరు.
"ఆ నష్టాలను ఎలా తగ్గించుకోవాలన్న విషయంపై బాగా ఆలోచించాం. ఆ క్రమంలోనే అరటి వైన్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం" అని ట్వైటూల్ కోఆపరేటివ్ గ్రూప్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఎమిలీ బీబీసీతో చెప్పారు.
రైతులకు ఇది వైన్ తయారు చేయడం మాత్రమే కాదు, మారుతున్న వాతావరణంతో పాటు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం కూడా.


ఫొటో సోర్స్, Anne Okumu/BBC
చెట్లు ఎక్కడున్నాయో కనిపించేది కాదు
ఈ రైతులు మలావి సరస్సు ఒడ్డున వ్యవసాయం చేసేవాళ్లు. వర్షాలు ఎక్కువగా కురిస్తే, ఆ సరస్సులో నీటిమట్టం పెరిగి వాళ్ల అరటి తోటలు మునిగిపోయేవి. దీంతో వాళ్లు ఎత్తైన మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతుంటాయి.
"మా పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయేవి. అరటిపళ్లు కూడా అందులోనే కలిసిపోతుండేవి. ఒక్కోసారి మేం అరటి చెట్లను ఎక్కడ నాటామో కూడా కనిపించేది కాదు’’ అని ఎమిలీ వివరించారు.
"ఈ ఎత్తైన ప్రాంతానికి వచ్చాం. కానీ, ఇక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీని వల్ల అరటిపళ్లు తొందరగా పండిపోయి, వృథా అయిపోతాయి” అని ఆమె చెప్పారు.
దీంతో వ్యవసాయం ద్వారా తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి, సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన గ్రూపులో ఆమె కూడా చేరారు.

ఫొటో సోర్స్, Anne Okumu/BBC
ఇంటి కాంపౌండ్‌లోనే వైన్ ఉత్పత్తి
ఈ వైన్ తయారీ ప్రక్రియ మెచెంజేరే గ్రామంలో ఓ ఇంటి కాంపౌండ్‌లో జరుగుతోంది.
ఈ ప్రక్రియ చాలా సులభం: బాగా పండిపోయిన అరటిపళ్లను ఒలిచి, చిన్న ముక్కలుగా కట్ చేసి, తూకం వేసి, తగినంత చక్కెర, ఈస్ట్, ఎండుద్రాక్ష, నీటితో కలిపి, ఈ మిశ్రమాన్ని నిమ్మకాయలతో కప్పి పెడతారు.
ఈ మిశ్రమం పులియడానికి కొన్నివారాల పాటు వదిలేస్తారు. ఈ అరటిపళ్ల గుజ్జు 13% ఆల్కహాల్ కలిగిన వైన్‌గా మారుతుంది. ఇది ద్రాక్షతో తయారు చేసిన వైన్‌లాగే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
“ఇది చాలా నాణ్యమైన వైన్. మీరు దీని తియ్యని రుచిని ఆస్వాదించవచ్చు” అని ఎమిలీ చెప్పారు.
సంప్రదాయ వైన్ రుచులకు అలవాటు పడిన వాళ్లకు బనానా వైన్ అసాధారణంగా అనిపించవచ్చు, కానీ దానిని రుచి చూసిన వాళ్లకు మాత్రం, అది చాలా నచ్చుతుంది.
ఈ బనానా వైన్ కొద్దిగా తియ్యగా, పండు రుచిని కలిగి ఉంటుంది. దీని నుంచి కొద్దిగా నిమ్మ, అరటిపండు వాసన వస్తుంటుంది.
"ఇది స్మూత్‌గా, తేలికగా ఉంటుంది" అని బనానా వైన్‌ను బాగా ఇష్టపడే స్థానికుడు పాల్ కమ్వెండో చెప్పారు. "అరటిపళ్లతో వైన్ తయారు చేయొచ్చని నాకు తెలియదు" అని ఆయన అన్నారు.
తియ్యదనం, ఆమ్లత్వాన్ని సరైన పాళ్లతో కలపడమే అరటి వైన్ రహస్యమని ఎమిలీ అంటున్నారు.
“అరటిపళ్లు ఎప్పుడు బాగుంటాయో మీరు తెలుసుకోవాలి. పళ్లు బాగా పండితే వైన్ తియ్యగా అవుతుంది. పళ్లు మరీ పచ్చిగా ఉంటే పుల్లగా తయారవుతుంది’’ అని ఎమిలీ తెలిపారు.
మలావిలో బనానా వైన్ తయారీ పెరగడంపై ఉత్పత్తిదారులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక మార్కెట్లలో ఎక్కడ చూసినా బనానా వైన్ సీసాలు కనిపిస్తున్నాయి. సుమారు 250 రూపాయలకు ఒక సీసా చొప్పున అమ్ముతున్నారు.
"మేము వాటిని రాజధాని లిలాంగ్వే, అతిపెద్ద నగరం బ్లాంటైర్‌లోని మార్కెట్‌లతో సహా మలావి అంతటా ఈ వైన్ అమ్ముతున్నాం" అని కమ్యూనిటీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ (కాంసిప్) సహకార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెన్నిసన్ గోండ్వే చెప్పారు. ఈ సంస్థ నాణ్యత, రుచిని నిర్ధరించడానికి వైన్ ఉత్పత్తిలో మహిళలకు శిక్షణ ఇస్తోంది.
వృథాగా పోయే అరటిపళ్లతో వైన్‌ను తయారు చేయడం తమ జీవితాన్ని మార్చివేసిందని ఎమిలీ అన్నారు.

ఫొటో సోర్స్, Anne Okumu/BBC
ఎగుమతులే లక్ష్యం
"మాలో కొందరు ఇళ్లు కట్టుకున్నారు. మరికొందరు పశువులు, కోళ్లు కొనుక్కున్నారు. ఇప్పుడు మేం మంచి భోజనం తినగలుగుతున్నాం" అని ఎమిలీ చెప్పారు.
ట్వైటూల్ కో-ఆపరేటివ్ సంస్థ తమ వైన్ ఉత్పత్తిని పెంచేందుకు కోసం యంత్రాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
బనానా వైన్ ఎగుమతికి అనుమతి ఇవ్వాలంటూ మలావి బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్‌ను కాంసిప్ సంస్థ కోరింది.
"బనానా వైన్ రుచి చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. దీని రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్లు దీనిని ప్రయత్నించి చూస్తే, ఇదెంత బాగుందో..! అని ఆశ్చర్యపోతారు" అని వైన్ మిశ్రమాన్ని కలుపుతూ ఎమిలీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














