పెళ్లి బస్సును నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌కు 32 ఏళ్ల జైలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫాని టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలో ఓ బస్సు డ్రైవర్‌కు 32 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెళ్లి బస్సును నిర్లక్ష్యంగా నడిపి ఘోర ప్రమాదానికి కారకుడయ్యారన్నది ఆయనపై నమోదైన అభియోగం.
2023 జూన్ 11న జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. ఇది ఆస్ట్రేలియాలో అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో ఒకటి అని చెబుతున్నారు.
ఈ ప్రమాదం ఎందరి జీవితాల్లోనో విషాదం నింపింది. తల్లిదండ్రులు చనిపోవడంతో కొందరు పిల్లలు అనాథలయ్యారు. కొందరు జీవిత భాగస్వాములను కోల్పోయారు. తమ పిల్లలకు తామే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి కొందరు తల్లిదండ్రులకు ఎదురైంది.
ఓ కుటుంబంలో భార్య, బిడ్డను కోల్పోయి తండ్రి ఒక్కరే మిగిలారు. మరో వ్యక్తి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దుర్భర జీవితం గడుపుతున్నారు.
‘‘మార్చురీలో కూతురి చల్లని మృతదేహాన్ని తాకిన తండ్రి వేదన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను’’ అని మాథ్యూ ముల్లెన్ అనే వ్యక్తి అన్నారు. ఆయన కూతురు 26 ఏళ్ల రెబెక్కా ముల్లెన్ ఈ ప్రమాదంలో చనిపోయారు.
శిక్షపడ్డ డ్రైవర్ పేరు బ్రెట్ బటన్. ఆయన వయసు 59ఏళ్లు. ప్రమాదం సమయంలో ఆయన పెయిన్ కిల్లర్ మెడిసిన్ తీసుకుని ఉన్నారని గుర్తించారు.
న్యూ సౌత్‌వేల్స్‌లోని హంటర్ వ్యాలీ వైన్ ప్రాంతంలో వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
తొలుత బటన్‌పై హత్యానేరం నమోదుచేశారు. అయితే విచారణ తర్వాత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన నేరంలో శిక్ష విధించారు.

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది డ్రైవర్ ఒక్కరే
బటన్‌కు ఏ శిక్ష విధిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు, మృతుల కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు.
తీర్పు సమయంలో వారంతా తమవారిని తలచుకుని కన్నీరు పెట్టారు.
2048 మే వరకు బటన్‌ను పెరోల్ మీద విడుదల చేయబోనని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ప్రమాదం జరిగిన రోజు బటన్ పెద్ద మొత్తంలో ట్రామాడల్ అనే టాబ్లెట్లు వాడారని తేలింది.
ఇది అత్యంత శక్తిమంతమైన మందు. దీనివల్ల మగత, అయోమయం, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.
తాను తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నానని, అందుకోసమే మందులు వాడుతున్నానని బటన్ చెప్పారు.
ఆ రోజు బటన్ డ్రైవింగ్ చేస్తున్న తీరు చూసి చాలా భయపడిపోయామని ప్రయాణికులు కోర్టులో చెప్పారు. బస్సును నెమ్మదిగా నడపాలని బటన్‌ను అడిగామని కొందరు ప్రయాణికులు వెల్లడించారు.
ఓ జంక్షన్ దగ్గర బస్సుపై అదుపు కోల్పోయిన బటన్, రోడ్డుపక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టారు.
ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. బటన్ ఒక్కరే ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలూ లేకుండా బయటపడగలిగారు.
ఈ కేసులో 30మందికి పైగా బాధితుల నుంచి రెండు రోజులపాటు జడ్జి స్టేట్‌మెంట్‌లు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Facebook/Sydney Women’s AFL Masters
పశ్చాత్తాపంలో డ్రైవర్
ఈ ప్రమాదం వల్ల తమ జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో, తామెంత బాధను అనుభవిస్తున్నామో, తమ జీవితం ఎంత వేదనాభరితంగా మారిందో బాధితులు కోర్టుకు వివరించారు.
గాయపడినవారిలో కొందరు డ్రైవింగ్ అంటేనే భయపడుతున్నారు. కొందరు శారీరకంగా, మానసికంగా తీవ్రస్థాయిలో దెబ్బతిని..తిరిగి పనిచేయలేని స్థితిలో ఉన్నారు. వారందరూ కోర్టులో తమ బాధను, వేదనను వివరించారు.
ప్రమాదం తర్వాత తొలిసారి మాట్లాడిన డ్రైవర్ బటన్, బాధితులకు క్షమాపణలు చెప్పారు. తన పశ్చాత్తాపాన్ని, బాధను బయటకు వ్యక్తపరచలేనంత వేదనలో ఉన్నానని ఆయన అన్నారు.
‘‘క్షమాపణలు చెప్పేందుకు మాటలు కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నా. కానీ వందలమంది జీవితాలను ప్రభావితం చేసిన అంతటి విషాద ఘటనకు కారణమైన తర్వాత క్షమాపణతో ఎలా సరిపెట్టగలను’’ అని బటన్ కోర్టులో అన్నారు.
ఇంతమంది వ్యక్తులకు, కుటుంబాలకు ఈ స్థాయిలో నష్టం కలిగించిన అసాధారణ ప్రమాదపు కేసును తన 50 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదని జడ్జి రాయ్ ఎల్లిస్ అన్నారు.
‘‘మీలో కొందరికయినా కొంత ఉపశమనం కలుగుతుందని కోర్టు భావిస్తోంది’’ అని బటన్‌కు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అన్నారు.
ప్రమాద ఘటన జరిగిన హంటర్ వాలీ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉంది. ద్రాక్షతోటలు, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. హంటర్ వ్యాలీ మ్యారేజ్ ఫంక్షన్స్‌కు ఫేమస్. ఈ ప్రాంతాన్ని వెడ్డింగ్ హబ్‌గా అని కూడా అంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














