వెనెజ్వెలా: రష్యన్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా

మారినెరా, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా కోస్ట్ గార్డ్ చాలా వారాలుగా మారినెరా అనే నౌకను ట్రాక్ చేస్తోంది.

ఉత్తర అట్లాంటిక్, కరేబియన్‌లలో జరిగిన వరస ఆపరేషన్లలో వెనెజ్వెలాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా తెలిపింది.

ఈ ట్యాంకర్లలో ఒకటి (ఇందులో చమురు లేదని తెలిపింది) ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (ఐస్‌లాండ్, స్కాట్లాండ్ మధ్య) స్వాధీనం చేసుకుంది.

మారినెరా అనే పేరున్న ఆ నౌక రష్యాకు చెందినది.

"మారినెరా నౌకలో ఉన్న రష్యన్ పౌరుల పట్ల మానవీయంగా, న్యాయంగా వ్యవహరించేలా చూసుకోవాలి" అని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికాను డిమాండ్ చేసింది.

బీబీసీ మానిటరింగ్ ప్రకారం, ‘‘వారు రష్యాకు తిరిగి రావడాన్ని అమెరికా అడ్డుకోకూడదు’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆ నౌక వెనెజ్వెలా రహస్య నౌకాదళంలో భాగమని, అది రష్యా పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించినందున అది ఏ దేశానికి చెందినదానిగానూ పరిగణించలేమని, దానిపై కోర్టు ఉత్తర్వు కూడా ఉందని వైట్‌హౌస్ తెలిపింది.

అమెరికా కోస్ట్‌గార్డ్ అనేక వారాలుగా ఈ నౌకను వెంబడిస్తోంది. ఈ సమయంలో ఆ ట్యాంకర్ తన పేరును మార్చుకుని రష్యన్ జెండాతో వెళుతున్నట్లు రిపోర్టులున్నాయి.

ట్యాంకర్‌ను రక్షించడానికి రష్యా నుంచి జలాంతర్గాములు సహా సైనిక సహాయం వస్తున్నట్లు కూడా రిపోర్టులు ఉన్నాయి. కానీ అది జరగకముందే ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది.

ఇక ఎం/టీ సోఫియా అనే రెండో ట్యాంకర్ "చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తోంది" అని అమెరికా ఆరోపించింది. దానిని కరేబియన్‌లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నౌక, అమెరికా

ఫొటో సోర్స్, US European Command

ఫొటో క్యాప్షన్, యూఎస్ యూరోపియన్ కమాండ్ సోషల్ మీడియాలో నౌకకు సంబంధించిన ఫోటోను విడుదల చేసింది.

రష్యా ఏం చెప్పింది?

తమదేశపు రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. రష్యన్ రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించడానికి ఆ నౌక (మారినెరా)కు తాత్కాలిక అనుమతి ఇచ్చినట్లు రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇతర దేశాల అధికార పరిధిలో రిజిస్టరైన నౌకలపై బలప్రయోగం చేసే హక్కు ఏ దేశానికీ లేదని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తమ దేశ గుర్తింపు ఉన్న నౌకను రక్షించాలని భావించిందనే అనుమానం రాకుండా లేదంటే అమెరికాకు కోపం తెప్పించకుండా, ఈ సంఘటనపై రష్యా జాగ్రత్తగా స్పందించిందని బీబీసీ మానిటరింగ్ రష్యా ఎడిటర్ విటాలీ షెవ్‌చెంకో తెలిపారు.

"అసాధారణ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు రష్యన్ అధికారిక వార్తాసంస్థ టీఏఎస్ఎస్ తెలిపింది. ట్యాంకర్‌ను 'మా నౌక' అని కూడా పేర్కొంది. అయితే, ఈ ప్రకటనలు ఏవీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాలలో ప్రసారం కాలేదు లేదా శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కాలేదు" అని షెవ్‌చెంకో చెప్పారు.

ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మొదట సైలెంట్‌గా ఉన్నా, ఇప్పుడు కొంచెం వాతావరణం మారిందని చెప్పారాయన.

"ట్యాంకర్‌పై రష్యన్ జెండా ఎగరేయడానికి 'తాత్కాలిక అనుమతి' ఉందని, ఇతర దేశాల అధికార పరిధిలో రిజిస్టరైన నౌకలపై బలప్రయోగం చేసే హక్కు ఏ దేశానికీ లేదని రష్యన్ రవాణా మంత్రిత్వ శాఖ చెబుతోంది" అని షెవ్‌చెంకో చెప్పారు.

ట్యాంకర్‌ను రక్షించడానికి మాస్కో జలాంతర్గామిని పంపిందనే రిపోర్టులపై రష్యన్ అధికారులు స్పందించలేదు. కానీ, జలాంతర్గామి ట్యాంకర్ వద్దకు 24 గంటలు ఆలస్యంగా వచ్చిందని రేబార్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.

బ్రిటన్ సహాయం

ఉత్తర అట్లాంటిక్‌లో రష్యన్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సహకరించినట్లు యూకే రక్షణ శాఖ ప్రకటించింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) విమానం కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపింది.

దీనిపై బ్రిటిష్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఒక ప్రకటన విడుదల చేశారు.

"ఈరోజు బ్రిటిష్ సాయుధ దళాలు రష్యాకు వెళ్తున్న బెల్లా 1 అనే నౌకను విజయవంతంగా అడ్డుకోవడంలో అమెరికాకు సహాయం చేశాయి. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించే ప్రపంచ ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగం" అని ఆ ప్రకటన తెలిపింది.

"ఈ నౌక మధ్యప్రాచ్యం నుంచి యుక్రెయిన్ వరకు ఉగ్రవాదం, సంఘర్షణకు ఆజ్యం పోస్తున్నవారి, ఆంక్షలు తప్పించుకునేవారి కూటమిలో భాగం. తన జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇలాంటి రహస్య నౌకా కార్యకలాపాలను యూకే అడ్డుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో ఉంది.

వెనెజ్వెలా, నౌక, చమురు

ఫొటో సోర్స్, US European Command

ట్రంప్ కోరిక చెక్కుచెదరకుండా

జేమ్స్ లాండేల్, దౌత్య ప్రతినిధి

ఏకపక్ష సైనిక చర్య తీసుకోవాలనే కోరిక డోనల్డ్ ట్రంప్‌లో ఇంకా తగ్గలేదని ఇది నిరూపిస్తోంది.

వెనెజ్వెలాపై సైనిక దాడి ఈ విషయాన్ని నిరూపించింది.

ట్యాంకర్లపై చర్య తీసుకోవడం ద్వారా ట్రంప్ మరింత బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

నౌకలో ఏ సరుకు ఉందో సహా మనకు సమాధానాలు తెలియని అనేక ప్రశ్నలు ఉన్నాయి. అమెరికా ఒంటరిగానే ఇలాంటి చేసుకుపోవడానికి ఇష్టపడొచ్చు. కానీ, మిత్రదేశాల సహాయం కూడా అవసరమని ఈ ఘటన నిరూపించింది.

అమెరికాకు ఇటువంటి చర్యలు తీసుకోగల శక్తి ఉంది. ఎందుకంటే, ప్రపంచంలోనే పెద్దపెద్ద సైనిక వైమానిక స్థావరాలు దాని దగ్గర ఉన్నాయి. వాటితో ఇలాంటి పనులు చేయగలదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)