వెనెజ్వెలాలో చమురు మాత్రమే కాదు.. బంగారం, రాగి, ఐరన్, బొగ్గు వంటి ఖనిజ నిల్వలు ఎంత భారీ స్థాయిలో ఉన్నాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థ ఓఎన్‌జీసీ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశమైన వెనెజ్వెలా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ 'పెట్రోలియోస్ డి వెనెజ్వెలా' (పీడీవీఎస్ఏ)తో 2005లో ఒక ఒప్పందంపై సంతకం చేసింది.
భారత్‌తో ఒప్పందంపై సంతకం చేస్తున్నప్పుడు, అప్పటి వెనెజ్వెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తమ దేశం అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.
లాటిన్ అమెరికన్ దేశాల్లో 21వ శతాబ్దపు అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు హ్యూగో చావెజ్ స్థానంలో వచ్చిన వ్యక్తి నికోలస్ మదురో.
వెనెజ్వెలా చమురు నిల్వలను మాత్రమే ఉన్న దేశం కాదు. దక్షిణ అమెరికాలో ఇది ఒక ప్రత్యేకమైన దేశం.
ఈ ప్రాంతంలో అత్యంత పట్టణీకరణ చెందిన దేశాలలో ఒకటి.


ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా నుంచి చమురు ఎక్కువగా కొనే దేశం చైనా
కారకస్ వెనెజ్వెలా రాజధాని. ఇది 91,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మూడు కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ప్రధానంగా మాట్లాడే భాష స్పానిష్. కొన్ని ప్రాంతీయ భాషల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది.
వెనెజ్వెలా చమురు నిల్వలను అమెరికా నియంత్రించాలనుకుంటోందని, ట్రంప్ పరిపాలనాయంత్రాంగం తనను అధికారం నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తోందని మదురో చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
వెనెజ్వెలా చమురు నిల్వలు 300 బిలియన్ (30,000 కోట్ల) బ్యారెళ్లకు పైగా ఉన్నాయని అంచనా. ప్రపంచంలోని మరేదేశంలోనూ ఈ స్థాయి చమురు నిల్వలు లేవు.
ఇది ప్రధానంగా చాలా భారమైన ముడి చమురు. ఖరీదైనది, వెలికితీయడం కష్టం. అయినప్పటికీ వెనెజ్వెలా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా కొనసాగుతోంది.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఈఐఏ) ప్రకారం, 2023లో వెనెజ్వెలా ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో 0.8% మాత్రమే ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం వెనెజ్వెలా ప్రతిరోజూ 9 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తోంది. చైనా దాని అతిపెద్ద కొనుగోలుదారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖనిజాల నిలయం
వెనెజ్వెలాలో చమురుతో పాటు ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. కారకస్‌లోని భారత రాయబార కార్యాలయం వెనెజ్వెలాలోని మైనింగ్ రంగంపై 2016లో జరిగిన సర్వేను షేర్ చేసింది.
బొగ్గుతో పాటు, ఉక్కు, అల్యూమినియం, నికెల్, మాంగనీస్, రాగి, జింక్ వంటి ఖనిజ నిల్వలు వెనెజ్వెలాలో ఉన్నాయి.
ఈ సర్వే ప్రకారం వెనెజ్వెలాలో 12 వేల మిలియన్ (ఒక మిలియన్ అంటే పది లక్షలు) టన్నుల ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయి.
వెనెజ్వెలాలోని కల్లావో గ్రామం సంప్రదాయకంగా ఒక ప్రధాన బంగారు గనుల కేంద్రంగా ఉంది. దేశంలో 4 మిలియన్ (40 లక్షల) టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా.
ఇక్కడ 60 మిలియన్ టన్నుల అల్యూమినియం ఉందని కూడా అంచనా.
10 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు.
వెనెజ్వెలాలో ప్రధాన పంట కాఫీ. మొక్కజొన్న, వరి కూడా విస్తృతంగా సాగుచేస్తారు. ప్రధాన వ్యవసాయ ప్రాంతాలు ఉత్తర పర్వతాలు, దిగువ ప్రాంతాలు.
21వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో వెనెజ్వెలాలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదు. ఆ దేశం ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల కొరత, నిరుద్యోగం, నేరాల వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఫలితంగా దాదాపు 70 లక్షల మంది వెనెజ్వెలా ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో వైరం ఇప్పటిది కాదు..
అమెరికాకు లక్షల సంఖ్యలో వెనెజ్వెలా ప్రజలు వలస రావడానికి మదురోనే కారణమని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది.
ఈ ప్రాంతంలో పనామా, కొలంబియా మధ్య పర్వతాలు, వర్షారణ్యాల గుండా 100 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని "డారియన్ గ్యాప్" అని పిలుస్తారు. ఇది మధ్య, దక్షిణ అమెరికాను కలిపే ఏకైక భూ మార్గం. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు.
ఇటీవలి సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో వెనెజ్వెలా శరణార్థులు ఈ ప్రమాద మార్గంలో ప్రయాణించారు. వెనెజ్వెలా శరణార్థుల సంక్షోభం ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల సంక్షోభాలలో ఒకటి.
వెనెజ్వెలా నాయకులకు, అమెరికాకు మధ్య వైరం చాలా కాలం నాటిది. అమెరికా తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తోందని మదురో గురువు హ్యూగో చావెజ్ పదేపదే ఆరోపించేవారు.
మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వెనెజ్వెలాలో అత్యంత ఆదరణ పొందిన నాయకులలో ఒకరు. 2013లో మరణించారు. అంతకు 14 సంవత్సరాల ముందునుంచీ పదవిలో ఉన్నారు. ఆయన తనను తాను "పేదల ప్రతినిధి"గా అభివర్ణించుకున్నారు.
వెనెజ్వెలా చమురు ఆదాయం నుంచి వచ్చే బిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు కేటాయించారు.
ఆయన వారసుడు నికోలస్ మదురో చమురు ధరలు తగ్గడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. రాజకీయ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులు వెనెజ్వెలాను దాదాపు పతనమయ్యే పరిస్థితుల్లోకి నెట్టివేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ వెనెజ్వెలా వీధుల్లో నిరసనలు చెలరేగాయి.
లక్షలాది మంది వెనెజ్వెలా వాసులు స్వదేశం నుంచి పారిపోయి కొలంబియా, బ్రెజిల్‌లో ఆశ్రయం పొందారు. వెనెజ్వెలాలోని కొన్ని పేదరిక ప్రాంతాలలో 70 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.
చమురు నిక్షేపాలు కలిగిన పొరుగున ఉన్న గయానాతో వెనెజ్వెలాకు చాలా కాలంగా సరిహద్దు వివాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మదురో గెలుపును గుర్తించని అమెరికా
అమెరికా, వెనెజ్వెలా పాలకుల శత్రుత్వం హ్యూగో చావెజ్ కాలంలో ప్రారంభమైంది. ట్రంప్ హయాంలో మరింత పెరిగింది.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎన్నికల సంఘం జులై 2024 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురోను విజేతగా ప్రకటించింది. వరుసగా మూడోసారి ఆయన పదవి చేపట్టారు.
ప్రతిపక్షం తమ అభ్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ నిజమైన విజయం సాధించారని తెలిపింది.
ఎన్నికల్లో మదురో గెలిచినట్టు గుర్తించడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ అనేక ఇతర దేశాల ప్రభుత్వాలు నిరాకరించాయి. ఓటింగ్ డేటా సవివరంగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అయితే చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు ఆయన అధికారంలో ఉండడాన్ని అంగీకరించాయి.
2018లో జరిగిన ఎన్నికలూ పక్షపాతంతో జరిగాయని అమెరికా సహా అనేక దేశాల ప్రభుత్వాలు ఆరోపించాయి. వెనెజ్వెలాపై భారీ ఆంక్షలు విధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా చరిత్ర..
1498–99లో స్పెయిన్ దేశస్థులు క్రిస్టోఫర్ కొలంబస్, అలోన్సో డి ఓజెడా వెనెజ్వెలాకు వెళ్లారు. అప్పటికి అక్కడ కారిబ్, అరవాక్, చిబ్చా ప్రజలు నివసించేవారు.
1521లో వెనెజ్వెలాలో స్పెయిన్ వలసపాలన మొదలయింది. 1810లో నెపోలియన్ స్పెయిన్‌ను ఆక్రమించినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వెనెజ్వెలా ప్రజలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.
1908–1935 మధ్య నియంత జువాన్ విసెంటె గోమెజ్ పాలనలో వెనెజ్వెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా మారింది.
దశాబ్దాల సైనిక పాలన తర్వాత 1945లో మొదటిసారి సామాన్య ప్రజలు దేశంలో తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
1973లో పెరుగుతున్న చమురు ధరలతో వెనెజ్వెలా ప్రయోజనం పొందింది. కరెన్సీ అమెరికా డాలర్‌తో పోలిస్తే గరిష్ట విలువను చేరుకుంది. దేశంలోని చమురు, ఉక్కు పరిశ్రమలు జాతీయం చేశారు.
1989లో ఆర్థిక మాంద్యం మధ్య కార్లోస్ ఆండ్రెస్ పెరెజ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐఎంఎఫ్ రుణాలను ఉపయోగించి వరుస కేటాయింపులు చేశారు. ఆ తర్వాత అల్లర్లు, మార్షల్ లా, సార్వత్రిక సమ్మె జరిగాయి. ఫలితంగా వందలాది మంది మరణించారు.
1992లో కల్నల్ హ్యూగో చావెజ్, ఆయన మద్దతుదారులు రెండు తిరుగుబాట్లకు ప్రయత్నించారు. ఈ తిరుగుబాట్లలో దాదాపు 120 మంది మరణించారు. చావెజ్ జైలు పాలయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయనకు క్షమాభిక్ష లభించింది.
పాత పార్టీలతో నిరాశ చెందిన సమయంలో 1998లో హ్యూగో చావెజ్ అధ్యక్షుడిగా ఎన్నికై 'బొలీవేరియన్ విప్లవాన్ని' ప్రారంభించారు.
చమురు లాభాలను ఉపయోగించి ఆయన సోషలిస్ట్, ప్రజాదరణ పొందిన ఆర్థిక, సామాజిక విధానాలను అమలు చేశారు. అమెరికా వ్యతిరేక విదేశాంగ విధానాన్ని అనుసరించారు.
2005లో హ్యూగో చావెజ్ నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య జరిగిన చర్చలలో ఇంధన రంగం కీలకమైన ఎజెండాగా ఉంది.
2006లో రష్యాతో మూడు బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందంపై వెనెజ్వెలా సంతకం చేసింది. అమెరికాపై ఆధారపడటం ఆగిపోయింది.
చావెజ్ 2012లో నాల్గవసారి అధ్యక్షుడయ్యారు. మరుసటి ఏడాది క్యాన్సర్‌తో మరణించారు.
2013లో చావెజ్ వారసుడిగా ఎన్నికైన నికోలస్ మదురో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో వెనెజ్వెలా అధ్యక్షుడయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














