కారకస్ ‘కోట’ నుంచి న్యూయార్క్ కోర్టు దాకా మదురోను, ఏయే మార్గాల్లో ఎలా తీసుకువెళ్లారు?

నికోలస్ మదురో అమెరికా ట్రంప్

ఫొటో సోర్స్, @realdonaldtrump

ఫొటో క్యాప్షన్, నికోలస్ మదురో చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలతో తీసిన ఫోటో మదురోపై చేసిన ఆపరేషన్‌కు ప్రతీకగా మారింది.
    • రచయిత, టిఫనీ వర్తైమర్, బీబీసీ విజువల్ జర్నలిజం టీం

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించేందుకు నెలలతరబడి ప్రణాళిక రచిస్తే, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ‘‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ మొదలుపెట్టమని ఆదేశించగానే, ఆ ప్రణాళికను కేవలం 150 నిమిషాల్లో పూర్తిచేసినట్టు అమెరికా సైన్యం తెలిపింది.

శనివారం తెల్లవారజామున ఏ చడీచప్పుడు లేకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి ఆధునిక రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని ఒక అసాధారణ ఘటన.

నికోలస్ మదురో ఆయన భార్య సీలియా ఫ్లోరెస్‌ సురక్షితమైన గదిలోకి పారిపోతుండగా, ఒక ఎలైట్ అమెరికా సైనిక బలగం వారిని నిర్బంధించింది. వీరిద్దరిని ఇప్పుడు న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. నార్కో టెర్రరిజం ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శనివారం (జనవరి3) నాడు సూర్యోదయం కాగానే, వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో ఏ స్థాయిలో సైనిక చర్య జరగనుందో స్పష్టమైంది.

ఫ్యుర్టెటియునాలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసించే పెద్ద సైనిక సముదాయంలో ధ్వంసమైన భవనాలు,బొగ్గులా మారిన కార్ల ఫోటోలు విడుదలయ్యాయి.

ఈ కాంపౌండ్ వద్దే మదురోను ఆయన భార్యను బంధించారని వెనెజ్వెలా అధికారిక పార్టీ నేత నహుం ఫెర్నాండెజ్ మీడియాతో చెప్పారు.

కొన్ని గంటల ముందే ట్రంప్ గ్రీన్ సిగ్నల్

కారకస్‌లో అర్థరాత్రి రెండు గంటల సమయంలో పేలుళ్ల శబ్దాలతో ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్ మొదలైంది. నగరానికి విద్యుత్ సరఫరాను కట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను ట్రంప్ విధ్వంసకరమైనదిగా అభివర్ణించారు.

వెనెజ్వెలా వైమానిక దళాలను నిర్వీర్యం చేసి, అమెరికా సైనిక విమానాలకు ఫ్యూర్టే టియూనాకు చేరుకోవడానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు.

‘‘మేం చాలా పకడ్బందీగా ఈ ఆపరేషన్‌ను పూర్తి ఆశ్చర్యకరమైన రీతిలో చేయగలిగామని’’ అత్యున్నత సైనికాధికారి జెన్ డాన్ కేయిన్ తెలిపారు.

సైనిక సముదాయం, పోర్టు, విమానాశ్రయం సహా దాడికి గురైన ఐదు ప్రాంతాలను బీబీసీ పరిశీలించింది. ఫ్యుర్టే టియునా మంటల్లో చిక్కుకున్నట్టు ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ మంటలు మైళ్ల కొద్దీ దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి.

నికోలస్ మదురో అమెరికా ట్రంప్

వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో అమెరికా సైనిక హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగిరిన దృశ్యాలను అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. ఆ హెలికాప్టర్లు నేరుగా ఫుయెర్టే టియునా వైపు వెళ్లాయని స్థానికులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, "చాలా తీవ్రంగా కాల్పులు జరిగాయి" అని వ్యాఖ్యానించారు.

మునుపటి వైమానిక దాడుల నుండి పొగలు స్పష్టంగా కనిపిస్తున్న కారకాస్ మీదుగా ఎగురుతున్న US సైనిక హెలికాప్టర్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కారకాస్ మీదుగా ఎగురుతున్న అమెరికా సైనిక హెలికాప్టర్లు

హెలికాప్టర్లు దిగిన వెంటనే, అమెరికా ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ దళాలు వేగంగా కదిలాయి.

స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 02:01 గంటలకు, ఈ దళాలు ఫ్యూర్టె టియూనా కంపౌండులోకి ప్రవేశించాయి. నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ "ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయారు" అని జెనరల్ కేయిన్ చెప్పారు.

ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని వివరాలు వెల్లడించారు. మదురో దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని ఒక సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని ప్రయత్నించారని చెప్పారు.

"ఆ సురక్షిత ప్రదేశాన్ని మొత్తం ఉక్కుతో నిర్మించారు. కానీ మా సిబ్బంది అంత వేగంగా కదిలారు కాబట్టే, మదురో గది తలుపు దగ్గరకు కూడా చేరలేకపోయారు" అన్నారు ట్రంప్.

ఆ తలుపు చాలా మందంగా, బరువుగా ఉందని ట్రంప్ వివరించారు. "ఆయన తలుపు వరకూ వచ్చారు. కానీ దాన్ని మూసేలోపే మా వాళ్లు అక్కడికి చేరుకున్నారు" అని ఆయన చెప్పారు.

మదురో దంపతులు ఆ సేఫ్ రూమ్‌లోకి వెళ్లగలిగినా, "దాన్ని 47 సెకన్లలో పేల్చి తెరిచేవాళ్లం" అని ఆయన వ్యాఖ్యానించారు.

నికోలస్ మదురో అమెరికా ట్రంప్
నికోలస్ మదురో చేతులకు హ్యాండ్‌కఫ్స్ వేసి, చెవులకు రక్షణ పరికరాలు పెట్టి, కళ్లకు నల్లటి కళ్లద్దాల్లా కనిపించే ఒక రకమైన కవర్‌తో తీసిన ఫోటో ఆపరేషన్‌కు ప్రతీకగా మారింది.

ఫొటో సోర్స్, Trump and Getty Images

ఫొటో క్యాప్షన్, మదురోను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలోకి ఎక్కించారని ట్రంప్ చెప్పారు

జనరల్ కేన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బృందం ఉదయం 04:29 గంటలకల్లా "సముద్రం మీదుగా" తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఈ మొత్తం ఆపరేషన్‌లో అత్యంత కీలకంగా మారిన దృశ్యం అమెరికా ఇవో జిమా నౌకపై కనిపించింది. నికోలస్ మదురో చేతులకు బేడీలువేసి, చెవులకు రక్షణ పరికరాలు పెట్టి, కళ్లకు గంతలుకట్టి తీసిన ఫోటో ఆ ఆపరేషన్‌కు ప్రతీకగా మారింది.

ఆ ఫోటో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

అమెరికా ఇవో జిమా నుంచి మదురో దంపతులను ముందుగా అమెరికా నేవీకి చెందిన గ్వాంటానామో బే స్థావరానికి తరలించారు. అక్కడి నుంచి వారిని అమెరికా ప్రభుత్వ విమానంలో న్యూయార్క్ రాష్ట్రంలోని స్టువార్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు తీసుకువచ్చారు.

ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా నేరుగా మాన్‌హాటన్‌కు తరలించారు. ఈ మొత్తం ప్రయాణం అత్యంత కట్టుదిట్టైమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది.

మదురో దంపతులను నిర్బంధించిన కేంద్రం వద్ద భద్రతా దళాల బందోబస్తు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మదురో దంపతులను నిర్బంధించిన కేంద్రం వద్ద భద్రతా దళాల బందోబస్తు

అమెరికా అధికారులు మదురో దంపతులపై తీవ్రమైన అభియోగాలు మోపారు.

వాటిలో ముఖ్యంగా,

మాదకద్రవ్య ఉగ్రవాదానికి కుట్ర (నార్కో-టెర్రరిజం), కొకైన్ రవాణా, అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్ గన్‌లు, విధ్వంసక ఆయుధాలు కలిగి ఉండటం

ఈ అభియోగాలన్నింటినీ అధికారికంగా నమోదు చేసినట్లు అమెరికా న్యాయ శాఖ ప్రకటించింది.

ఈ విషయంపై అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి ఘాటుగా స్పందించారు. "వారు త్వరలోనే అమెరికా నేలపై, అమెరికా కోర్టుల్లో, అమెరికన్ న్యాయవ్యవస్థ పూర్తి తీవ్రతను ఎదుర్కొంటారు" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)