వెనెజ్వెలా విషయంలో ట్రంప్ ప్లాన్ అమెరికాకు సమస్యలను పెంచనుందా?

వెనెజ్వెలా, అమెరికా, నికోలస్ మదురో, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Joe Raedle/Getty

    • రచయిత, ఆంథోనీ జర్చర్
    • హోదా, బీబీసీ నార్త్ అమెరికా ప్రతినిధి

వెనెజ్వెలాలో భయాందోళనలను, దిగ్భ్రాంతికరమైన వాతావరణాన్ని సృష్టించిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఆ దేశ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తున్నారు.

శనివారం ఉదయం తన 'మార్-ఏ-లాగో' రిసార్ట్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో అర్ధరాత్రి అమెరికా దళాలు ఆపరేషన్ నిర్వహించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

అలాగే, తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌‌‌సేత్‌తో కూడిన బృందం వెనెజ్వెలా ప్రజలతో కలిసి పనిచేస్తుందని, సంక్షోభంలో ఉన్న ఆ దేశ నియంత్రణను చేపడుతుందని ట్రంప్ చెప్పారు.

''సురక్షితమైన, సరైన, వివేకవంతమైన రీతిలో అధికార మార్పిడి జరిగే వరకు మేమే ఆ దేశాన్ని నడుపుతాం'' అని ట్రంప్ స్పష్టం చేశారు."

అయితే, 'దేశాన్ని నడపడం' అంటే అసలు అర్థం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ నిర్ణయం ట్రంప్ విధానంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును సూచిస్తోంది. ఇందులో అనేక వైరుధ్యాలు, పెనుసవాళ్లు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెనెజ్వెలా, అమెరికా, నికోలస్ మదురో, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, US government

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలాలో అమెరికా ఆపరేషన్‌ను వాషింగ్టన్ నుంచి పర్యవేక్షిస్తున్న అధ్యక్షుడు ట్రంప్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్

ట్రంప్ వెనెజ్వెలా ప్లాన్ ఏమిటి?

'ఎడతెగని యుద్ధాలకు' వ్యతిరేకంగా గతంలో ప్రచారం చేసిన వ్యక్తి.. ఇతర దేశాల్లో అధికార మార్పిడి కోసం అమెరికా చేసిన మునుపటి ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించిన వ్యక్తి.. 'అమెరికా ఫస్ట్' విదేశాంగ విధానాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పుడు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, దశాబ్దాల నియంతృత్వంతో రాజకీయ స్థిరత్వం దెబ్బతిన్న ఒక దక్షిణ అమెరికా దేశం పునర్నిర్మాణం కోసం తన అధ్యక్ష పదవినే పణంగా పెడుతున్నారు.

అయినప్పటికీ, ట్రంప్ ఎప్పుడూ ఆశాభావంతోనే ఉన్నారు.

తన పరిపాలన తాలూకా 'విజయాల రికార్డు పూర్తిగా నిష్కళంకమైంది' అని, ఈ విషయం (వెనెజ్వెలా) కూడా అందుకు భిన్నంగా ఉండబోదని ఆయన అన్నారు.

వెనెజ్వెలాలో శిథిలావస్థకు చేరిన పారిశ్రామిక మౌలిక వసతులను పునర్నిర్మించడానికి అమెరికా ఇంధన కంపెనీలను భాగస్వామ్యం చేస్తామని, అమెరికా చేస్తున్న పునర్నిర్మాణ ప్రయత్నాలకు నిధులు సమకూరుస్తామని, వెనెజ్వెలా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తామని ఆయన వాగ్దానం చేశారు.

ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి వెనెజ్వెలాలో అమెరికా సైనిక బలగాల మోహరింపు విషయాన్ని ఆయన తోసిపుచ్చలేదు. మీడియాతో మాట్లాడుతూ, ''మేం ఆ భూభాగంపైకి సైనికులను పంపడానికి భయపడం, నిన్న రాత్రి కూడా మా సైనికులు అక్కడే ఉన్నారు'' అని చెప్పారు.

గతంలో ఇరాక్‌పై అమెరికా దాడిని తీవ్రంగా విమర్శించిన ట్రంప్, ఇరాక్ యుద్ధ వ్యూహకర్తలలో ఒకరైన మాజీ విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్ మాటలను ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి.

''ఒకవేళ మీరు దీన్ని (వ్యవస్థను) గందరగోళానికి గురిచేస్తే, దానికి మీరే బాధ్యత వహించాలి'' అనేది కోలిన్ పావెల్ మాట.

అమెరికా ఇప్పుడు మంచికో, చెడుకో వెనెజ్వెలా భవిష్యత్తుకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది.

వెనెజ్వెలా విషయంలో ట్రంప్‌ భిన్నమైన వైఖరి....

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ట్రంప్ తనను తాను 'శాంతిస్థాపకుడిగా'గా అభివర్ణించుకున్నారు.

కానీ, గడచిన ఏడాది కాలంలో, ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిని ఉపయోగించడానికి తాను సిద్ధమేనని ఆయన నిరూపించారు.

గత వారమే ఆయన సిరియా, నైజీరియాలో వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు.

2025లో, ఇరాన్‌లోని అణు కేంద్రాలు, కరీబియన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అనుమానిత నౌకలను, యెమెన్‌లోని తిరుగుబాటు దళాలను, సోమాలియాలోని సాయుధ గ్రూపులను, ఇరాక్‌లోని ఇస్లామిక్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నారు.

గతంలో జరిగిన ఈ సైనిక చర్యలన్నీ క్షిపణులు, యుద్ధ విమానాల ద్వారా జరిగాయి. దీనివల్ల అమెరికా సైనికులకు నేరుగా ముప్పు కలగలేదు. కానీ దీనికి విరుద్ధంగా వెనెజ్వెలా విషయంలో ట్రంప్ చర్యలు, దేశ భవిష్యత్తు పట్ల ఆయన నిబద్ధత చాలా భిన్నంగా ఉన్నాయి.

ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, తన లక్ష్యం 'వెనెజ్వెలాను మళ్లీ గొప్పగా మార్చడం' (మేక్ వెనెజ్వెలా గ్రేట్ అగైన్) అన్నారు.

ట్రంప్ 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' నినాదానికి దగ్గరగా ఉన్న ఈ కొత్త నినాదాన్ని అంగీకరించడం ఆయన మద్దతుదారుల్లో కొందరికి కష్టంగా అనిపించవచ్చు.

ఒకప్పుడు ట్రంప్ విధేయురాలిగా ఉన్న కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ ఈ చర్యను 'ఎక్స్' వేదికగా విమర్శించారు.

''మన ప్రభుత్వం ఎప్పటికీ ముగియని సైనిక దాడులు, విదేశీ యుద్ధాలకు మద్దతు ఇవ్వడంపై అమెరికా పౌరుల ఆగ్రహం న్యాయమైనది. దీనికి మేం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇద్దరూ వాషింగ్టన్ సైనిక యంత్రాంగం నిరంతరం నడవడానికి నిధులు ఇస్తున్నారు. దీనికి ముగింపు పలుకుతారని భావించి చాలామంది 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' మద్దతుదారులు ఓటు వేశారు. కానీ మేం తప్పు చేశాం'' అని ఆమె రాశారు.

మరో రిపబ్లికన్, విమర్శకులు థామస్ మ్యాసీ.. మదురో అరెస్టు కోసం చూపిన చట్టపరమైన కారణాలను ట్రంప్ వాదనతో పోలుస్తూ విమర్శించారు.

అయితే, మెజారిటీ రిపబ్లికన్ సభ్యులు అధ్యక్షుడికి మద్దతుగా నిలిచారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, ఒక 'నేరపూరిత పాలన'కు వ్యతిరేకంగా తీసుకున్న ఈ సైనిక చర్యను ''నిర్ణయాత్మకమైనది, న్యాయబద్ధమైనది''గా అభివర్ణించారు.

వెనెజ్వెలా, అమెరికా, నికోలస్ మదురో, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Jim Watson / AFP via Getty Images

'మున్రో సిద్ధాంతం స్థానంలో డొన్రో సిద్ధాంతం'

ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, వెనెజ్వెలాలో చేపట్టిన ఈ చర్య తన 'అమెరికా ఫస్ట్' ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. దీనివల్ల అమెరికా ప్రాంతీయ భద్రతకు భరోసా లభిస్తుందని, చమురు సరఫరా స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఆయన 19వ శతాబ్దం ప్రారంభం నాటి 'మున్రో సిద్ధాంతాన్ని' మళ్లీ తెరపైకి తెచ్చి, దానికి 'డొన్రో సిద్ధాంతం' అని కొత్త పేరు పెట్టారు.

19వ శతాబ్దపు అమెరికా విదేశాంగ విధానమైన ఈ మున్రో సిద్ధాంతం ప్రకారం.. పశ్చిమ అర్ధగోళం, అంటే అమెరికా ఖండాలు, యూరప్ దేశాల ప్రభావం నుంచి విముక్తి పొంది ఉండాలి.

వెనెజ్వెలాలో జరిగిన ఈ చర్య పశ్చిమ అర్ధగోళంలో అమెరికా ఆధిపత్యాన్ని ఇకపై ఎవరూ ప్రశ్నించలేరని నిరూపిస్తుందని ట్రంప్ అన్నారు.

"మన జాతీయ భద్రతకు మూలాధారాలైన వాణిజ్యం, భూభాగం, వనరుల సంరక్షణ" అమెరికా కొత్త భద్రతా వ్యూహ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ అర్ధగోళాన్ని అమెరికా 'హోం ల్యాండ్'గా ఆయన అభివర్ణించారు.

అయితే, మదురోను బంధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ రాజకీయాలపై, ప్రపంచంలోని ఇతర ప్రధాన సైనిక శక్తులతో అమెరికాకు ఉన్న సంబంధాల గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వెనెజ్వెలా, అమెరికా, నికోలస్ మదురో, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Trump/Truth Social

ఫొటో క్యాప్షన్, డోనల్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ద్వారా షేర్ చేసిన నికోలస్ మదురో ఫోటో

ట్రంప్ నిర్ణయంపై విమర్శలు

మదురో ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక సార్వభౌమ దేశంపై జరిగిన ఈ బాధ్యతారాహిత్యమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.

బైడెన్ ప్రభుత్వ హయాంలో, యుక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిని అమెరికా సరిగ్గా ఇలాంటి పదజాలంతోనే ఖండించింది.

ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం ఆ రెండు దేశాల (రష్యా-ఉక్రెయిన్) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ప్రయత్నాలు చాలాసార్లు రష్యా వైపు మొగ్గు చూపినట్లు కనిపించాయి.

ట్రంప్ చర్య వల్ల ప్రపంచానికి వెళ్లే సంకేతాలపై సెంట్రిస్ట్ రిపబ్లికన్ ఎంపీ డాన్ బెకాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

''నాకున్న అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, ఇప్పుడు రష్యా ఈ ఉదాహరణను యుక్రెయిన్‌పై తన అక్రమ, క్రూరమైన సైనిక చర్యలను సమర్థించుకునేందుకు ఉపయోగించుకుంటుంది. లేదా చైనా తైవాన్‌పై దాడిని సమర్థించుకోవడానికి దీనిని ఒక కారణంగా వాడుకుంటుంది'' అని అన్నారు.

ట్రంప్ పట్ల డెమోక్రాటిక్ విమర్శకుల వైఖరి మరింత స్పష్టంగా ఉంది.

హవాయి సెనేటర్ బ్రయాన్ షాట్జ్ విదేశీ సంబంధాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, ''ఏ కారణం చేతనైనా అమెరికా ఇతర దేశాలను నడపకూడదు. ఎప్పటికీ ముగియని యుద్ధాలు, అధికార మార్పిడి ప్రచారాలలో పడటం వల్ల కలిగే ఫలితాలు అమెరికన్లకు వినాశకరంగా ఉంటాయని మనం ఇప్పటికే తెలుసుకుని ఉండాలి'' అని అన్నారు.

నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత డెమోక్రాట్లు సభలో మెజారిటీ సాధిస్తే, హకీమ్ జెఫ్రీస్ హౌస్ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది.

మదురో ఒక నేరస్థుడని, మానవ హక్కుల ఉల్లంఘనల సుదీర్ఘ రికార్డు ఉన్న నియంత అని ఆయన అంగీకరించారు. అయితే, దాడికి ముందు కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జెఫ్రీస్ ఖండించారు.

ఆయన మాట్లాడుతూ, ''చట్టాన్ని గౌరవించడం, అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రమాణాలను కాపాడాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ట్రంప్‌కు ఉంది. అమెరికా ఫస్ట్ అంటే అదే' అని పేర్కొన్నారు.

అయితే, దాడికి ముందు ఆపరేషన్ వివరాలు 'లీక్' అవుతాయనే ఆందోళనతోనే తాను కాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వలేదని ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

ఈ సైనిక ఆపరేషన్ విజయవంతమైంది. ఇందులో ఏ ఒక్క అమెరికన్ కూడా మరణించలేదు. అమెరికా ఆస్తులకు జరిగిన నష్టం కూడా చాలా తక్కువ.

ట్రంప్ తనదైన శైలిలో ఈ చర్యను 'అద్భుతమైన దాడి' అని, 'అమెరికా చరిత్రలో సైనిక శక్తి సామర్థ్యాల అత్యంత ఆశ్చర్యకరమైన, సమర్థవంతమైన, శక్తిమంతమైన ప్రదర్శనలలో ఒకటి' అని అభివర్ణించారు.

ఇప్పుడు వెనెజ్వెలాను నడిపించే, పునర్నిర్మించే బాధ్యతను తీసుకుంటామని అమెరికా చెబుతోంది. కానీ దీని అసలు అర్థం ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. ఈ విజయం ఇలాగే కొనసాగుతుందని ట్రంప్ తన అధ్యక్ష పదవినే పణంగా పెడుతున్నారు.

దశాబ్దాలుగా అల్లకల్లోలంలో ఉన్న వెనెజ్వెలాను ట్రంప్, ఆయన బృందం బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలాగే, ట్రంప్ విదేశాంగ విధానం వల్ల తమకేం జరుగుతుందోనన్న అనుమానంతో ఉన్న ఒక ప్రాంతాన్ని స్థిరపరచాల్సిన అవసరం కూడా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)