బియ్యం సాకుతో డోనల్డ్ ట్రంప్ భారత్‌పై మళ్లీ కొత్త సుంకాలు విధిస్తారా?

ఫొటో సోర్స్, ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty Images
"భారత్ తన బియ్యాన్ని అమెరికాలోకి నిరంతరం డంప్ చేస్తోంది. దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? వారు దీనికి సుంకాలు చెల్లించాలి. బియ్యంపై సుంకాలకు వారికి మినహాయింపు ఉందా?"
సోమవారం రాత్రి, వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్‌ను ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అడిగిన ప్రశ్న ఇది.
దీనికి స్కాట్ బెస్సెంట్ బదులిస్తూ "లేదు సార్. మేం ఇంకా వారితో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాం" అన్నారు.
అనంతరం, ట్రంప్ "అవును, కానీ, వారు బియ్యాన్ని ఇలా పంపొద్దు. అలా అనుమతించలేం" అన్నారు.
అమెరికన్ రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ట్రంప్ చర్చించారు. ఇతర దేశాలపై విధించిన సుంకాల ద్వారా అమెరికా పొందుతున్న నిధుల్లో 12 బిలియన్ డాలర్లను అమెరికన్ రైతులకు ఆర్థిక సహాయంగా ప్రకటించారు ట్రంప్.
ఈ పరిణామం తర్వాత, బియ్యం సాకుతో ట్రంప్ ఇప్పుడు భారతదేశంపై మళ్లీ కొత్త సుంకాలను విధిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు 25 శాతం జరిమానాతో సహా భారత్‌పై అమెరికా ప్రస్తుతం 50 శాతం సుంకాన్ని విధిస్తోంది.

అసలేం జరిగింది?
అమెరికాకు భారత బియ్యం ఎగుమతులను ప్రస్తావిస్తూ, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 'డంపింగ్' అనే పదాన్ని ఉపయోగించారు. 'భారత్ దాని బియ్యాన్ని అమెరికాలో ఇలా డంప్ చేయకూడదు. దీని సంగతి చూస్తా' అన్నారాయన.
భారత్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నాయని అమెరికాలోని చాలా ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. ఇది స్థాని రైతుల 'ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుంది' అని అంటున్నారు.
వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో రైతుల ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 'గత ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు' అన్నారు.
అమెరికాలో వ్యవసాయ కమ్యూనిటీని ట్రంప్ మద్దతుదారుగా పరిగణిస్తుంటారు. కానీ, ఇటీవలి సంవత్సరాలలో, పెరుగుతున్న ఖర్చులు, అస్థిర ధరలతో అక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఫొటో సోర్స్, ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty Images
భారత్‌లోనే అధిక సుంకం
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌లో సగటున 37.7 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే అమెరికాలో భారత వ్యవసాయ ఉత్పత్తులపై 5.3 శాతం సుంకం ఉండేది. అయితే, భారత్‌పై ట్రంప్ కొత్త సుంకాలతో ఇది 25 శాతానికి పెరిగింది.
భారతదేశానికి, క్లిష్టమైన సమయంలో ట్రంప్ హెచ్చరిక వచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ "యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌కు సహాయం చేస్తోందని" అమెరికా ఆరోపిస్తూ అదనపు సుంకం విధించింది.
మరోవైపు, అమెరికా వాదనను భారత్ వ్యతిరేకిస్తూ వస్తోంది. "ఇంధన మార్కెట్‌లో అస్థిరత నేపథ్యంలో భారత వినియోగదారుల ప్రయోజనాల కోసం దిగుమతి విధానం ఉంటుంది" అని దిల్లీ చెబుతోంది.
ఇటీవల, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చారు. ఆయనకు మోదీ నుంచి సాదర స్వాగతం లభించింది. రష్యన్ మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం, పుతిన్, మోదీల స్నేహం ట్రంప్‌కు అసౌకర్యాన్ని కలిగించింది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై నిరంతర చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు పురోగతి లేదు.
గతంలో, ట్రంప్ భారతదేశాన్ని 'అత్యధిక సుంకాలు ఉన్న దేశం' గా అభివర్ణించారు. వాణిజ్య అడ్డంకులు, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును కారణాలుగా చూపుతూ భారతదేశంపై 50 శాతం సుంకం విధించారు ట్రంప్.
ఈ సుంకాల తగ్గింపుపై ఒప్పందాలు జరుగుతాయనే ఆశలు తక్కువగానే ఉన్నా, అమెరికా ప్రతినిధి బృందం ఈవారం భారత్‌ను సందర్శిస్తోంది.

ఫొటో సోర్స్, Abhishek Chinnappa/Getty Images
బియ్యం ఎగుమతుల్లో మొదటి స్థానం
ప్రపంచంలోనే బియ్యం ఎక్కువగా ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశం భారత్.
భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం ప్రకారం, భారత్ ఏటా 15 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో 28 శాతం. 2024-25లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది. ఇది ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 30.3 శాతం వాటాను కలిగి ఉంది.
బియ్యం ఉత్పత్తిలో చైనా రెండో స్థానంలో ఉంది, వార్షిక ఉత్పత్తి సుమారు 14 కోట్ల మెట్రిక్ టన్నులు. బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న బియ్యం రకాల్లో బాస్మతి ఒకటి.
2024-25లో 59.44 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఇందులో, 33.23 లక్షల టన్నుల బాస్మతియేతర బియ్యం ఎగుమతి అయ్యాయి. అత్యధికంగా పార్బాయిల్డ్ రైస్ (పాక్షిక బాయిల్డ్ రైస్) 90.44 లక్షల టన్నులు ఎగుమతి అయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














