‘అత్యంత కష్టమైన పంట’: యాలకుల రైతులు ఈ సాగుపై ఏమంటున్నారు?

యాలకులు

ఫొటో సోర్స్, Graayma

    • రచయిత, ప్రీతి గుప్తా
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్
    • నుంచి, ముంబయి

యాలకుల పంట లాభదాయకమైందని చాలామంది చెప్తారు. అది నిజమే కావచ్చు. కానీ, సాగు చేయడం విషయానికొస్తే రైతుకు అత్యంత కష్టమైన పంట కూడా ఇదేనని కేరళ రాష్ట్రంలో యాలకులను పండించే స్టాన్లీ పోథన్ అన్నారు.

శతాబ్దాలుగా సుగంధభరితమైన దినుసుగా ప్రాచుర్యం పొందిన యాలకులను సాగు చేయడం చాలా కష్టమైన పని.

''యాలకుల మొక్క చాలా సున్నితమైంది. దీనికి తెగుళ్లు, చీడపీడల బెడద ఎక్కువ. దీంతో మీరు ప్రతి ఆకును, ప్రతి పువ్వునూ గమనిస్తూ, నిరంతరం పొలంలోనే ఉండాలి. దీనికి ప్రతిరోజూ శ్రద్ధ అవసరం'' అని పోథన్ చెప్పారు.

వాతావరణ పరిస్థితుల పరంగా యాలకుల పంటను చాలా సున్నితమైనదిగా పరిగణిస్తారు.

''నిరుడు వేసవి తీవ్రంగా ఉంది. వేడి కారణంగా మా పంటలో అధిక భాగాన్ని నష్టపోయాం. ప్రపంచంలోనే యాలకుల అతిపెద్ద ఉత్పత్తిదారైన గ్వాటెమలా దేశం కూడా ఈ సీజన్‌లో దాదాపు 60 శాతం పంట నష్టపోయింది. ఇక్కడ కేరళలోనూ మేం తీవ్రంగా నష్టపోయాం'' అని పోథన్ చెప్పారు.

ఇండియా స్పైస్ బోర్డు గణాంకాల ప్రకారం.. దిగుబడి బాగా పడిపోయిన ఫలితంగా గత ఏడాది యాలకుల ధర కిలోకు రూ.1,178 పెరిగింది. ఇది అంతకుముందు సంవత్సరం కన్నా 70 శాతం అధికం.

యాలకులు ఎప్పుడూ ఖరీదైనవే. బరువు-ధర పరంగా చూస్తే, కుంకుమ పువ్వు, వెనీలా తర్వాత మూడో అత్యంత ఖరీదైన మసాలా దినుసు ఇది.

అందుకే తమ దిగుబడిని పెంచడానికి రైతులు ఆసక్తి చూపిస్తారు, కానీ అది అంత సులభమేమీ కాదు.

''తీవ్రమైన వేసవి.. అకాల వర్షాలు వస్తే కష్టమంతా తుడిచిపెట్టుకుపోతుంది. యాలకుల సాగులో అదే కఠోర వాస్తవం'' అని పోథన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాలకుల పంటను చూపిస్తున్న రైతు స్టాన్లీ పోథన్

ఫొటో సోర్స్, Stanley Pothan

ఫొటో క్యాప్షన్, యాలకుల పంటను చూపిస్తున్న రైతు స్టాన్లీ పోథన్

'సాంకేతికత' అందిపుచ్చుకునేలా..

భారత సుగంధద్రవ్యాల మండలి (స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా)లో భాగమైన భారత యాలకుల పరిశోధన సంస్థ (ఐసీఆర్ఐ) యాలకులకు ఉన్న డిమాండ్‌ను తీర్చడంలో ఉన్న కష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.

''యాలకుల పంట మెరుగుదల, చీడపీడలు, తెగుళ్లపై నిరంతర పర్యవేక్షణ, భూసార నిర్వహణ, పంట సామర్థ్యం పెంపు, సాగులో సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై మేం పూర్తిగా దృష్టి పెట్టాం'' అని ఐసీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఏబీ రీమా చెప్పారు.

నేల స్థితిగతులను పర్యవేక్షించడానికి, దాన్ని ఉత్తమంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు అందించడానికి ఉపయోగపడే యాప్ ఐసీఆర్ఐ సాధనాలలో ఒకటి.

''నేల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం నుంచి ఫోన్లలోనే వర్షపాతం, పంటలకు తెగుళ్ల హెచ్చరికలను తెలుసుకోవడం వరకు యాలకుల రైతులకు ఇప్పుడు ఈ యాప్ రోజువారీ సాధనంగా మారింది'' అని డాక్టర్ రీమా అన్నారు.

ప్రస్తుత రోజుల్లో చిన్న రైతులు కూడా డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. వారు కేవలం స్థానిక సలహాలపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. స్వయంగా తమ పొలంలో నుంచే రైతులు నేల నాణ్యతను, తేమను, తెగుళ్ల లక్షణాలను కూడా పరిశీలించవచ్చు.

అదే సమయంలో, శాస్త్రవేత్తలు కూడా మరింత బలంగా ఉండేలా యాలకుల రకాల కోసం పరిశోధిస్తున్నారు.

''మేం ప్రధానంగా తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే యాలకుల రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నాం. అదే సమయంలో, అవి అధిక దిగుబడి ఇచ్చేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేవిగా ఉండేలా చూస్తున్నాం'' అని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రీతి చెట్టి చెప్పారు.

బాగా తక్కువ నీటి వినియోగంతోనూ పెరగగలిగే ఒక యాలకుల రకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వారు ముందడుగు వేశారు.

అధిక దిగుబడి ఇచ్చే మొక్కల పెంపకాన్ని వేగవంతం చేసేందుకు ఉపకరించేలా యాలకుల జన్యు నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు.

''మిగతా మసాలా దినుసులతో పోలిస్తే యాలకులపై పరిశోధనలు పరిమితంగానే ఉన్నాయి. దీన్ని పరిష్కరించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం'' అని ప్రీతి చెట్టి చెప్పారు.

యాలకులను ఆరబెట్టడంలో...

యాలకుల సాగులో మరో ముఖ్యమైన ప్రక్రియ కాయలను కోసిన తర్వాత వాటిని ఆరబెట్టడం.

పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రమే సొంతంగా ఆరబెట్టే యంత్రాలను ఏర్పాటుచేసుకొనేవారు. వాటికి తరచుగా కలపను ఇంధనంగా వాడేవారు.

''చిన్న రైతులు తాము పండించిన యాలకులను ఆరబెట్టడానికి పొరుగున పెద్ద రైతులపై లేదా దళారులపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో వాటి నాణ్యతపై ప్రభావం పడేది'' అని అన్ను సన్నీ చెప్పారు. కేరళలో రైతులకు సహాయం చేయడానికి 2016లో గ్రామ్య అనే సామాజిక సంస్థను ఆమె స్థాపించారు.

''మసాలా దినుసులలో బాగా విలువైనది, వాణిజ్య పంట కాబట్టి యాలకుల సాగులోకి చాలామంది వచ్చారు. ఇది చాలా గమ్మతైన పంట. వాస్తవంగా అది ఎప్పుడు ఎలా ఉంటుందో, దానికి ఏమి అవసరమో, ఎప్పుడు ఏ చర్య తీసుకోవాలో, ఎప్పుడు వేచి చూడాలో అర్థం చేసుకోవడానికి 10 నుంచి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రతి సీజన్ ఒక కొత్త ప్రయోగం లాంటిది'' అని అన్ను సన్నీ అన్నారు.

యాలకులను ఆరబెట్టే ప్రక్రియలో సాయపడటానికి గ్రామ్య హీట్-పంప్ డ్రయర్‌లను పరిచయం చేసింది. అందుకుగాను కిలోకు రూ.10 చొప్పున వసూలు చేస్తోంది.

మాథ్యూస్ జార్జ్

ఫొటో సోర్స్, Mathews Geroge

ఫొటో క్యాప్షన్, బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మరలిన మాథ్యూస్ జార్జ్

సేంద్రియ పద్ధతిలో సత్ఫలితాలు

ఎరువులు, పురుగు మందుల సహాయంతో యాలకుల సాగు కష్టంగా మారింది. కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నారు.

''నేను తొలుత ఈ సాగు ప్రారంభించినప్పుడు నాకు అస్సలు అవగాహన లేదు. యాలకులు చాలా సున్నితమైనవి, వాటిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం కష్టమని యాలకుల పరిశోధన సంస్థలోని శాస్త్రవేత్తలు తొలుత నన్ను నిరుత్సాహపరిచారు'' అని 2020లో కేరళలో బ్యాంకింగ్ రంగం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారిన మాథ్యూస్ జార్జ్ చెప్పారు.

మొదట్లో వారు చెప్పింది నిజమే అనిపించేలా జరిగింది. అతని మొదటి పంటలో దాదాపు 90 శాతం చీడపీడల వల్ల నాశనమైంది. స్థానిక వ్యాపారులు అతని పంట నాసిరకంగా కనిపించడంతో తీసుకోలేదు. రెండు సంవత్సరాల ప్రయోగం తర్వాత ఆయన 'వృక్షాయుర్వేదం' అనే ప్రాచీన భారతీయ సాగు పద్ధతులకు మారారు. తద్వారా తనకు మరింత విజయం లభించిందని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ, యాలకుల సాగు ఇప్పటికీ సులభం కాదంటున్నారు.

యాలకుల సాగుకు సంబంధించి నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరమని ఆయన చెప్తున్నారు.

కార్మికులయ్యే ఖర్చులో దాదాపు 75 శాతం పంట కోత సమయంలోనే అవుతుందని పోథన్ చెబుతున్నారు.

''పంట కోత నైపుణ్యం ఉండాల్సిన పని. దీన్ని ఎక్కువగా మహిళలే చేస్తారు. ఏ కాయ కోయాలో, ఏది కోయడానికి సిద్ధమవ్వలేదో వారికి కచ్చితంగా అవగాహన ఉంటుంది. ఒకటో రెండో కాయలు తెంపి, మళ్లీ 45 రోజుల తర్వాత రెండో దఫా కోత కోసం మళ్లీ అదే మొక్క వద్దకు వారు వస్తారు. అందుకే ఇది చాలా శ్రమతో కూడిన పని'' అని ఆయన అన్నారు.

ఇక్కడ ఉపాధికి ఢోకా ఉండదని సన్నీ చెబుతున్నారు.

''యాలకుల సాగులో యాంత్రీకరణ పరిమితం. స్ప్రేయింగ్, కలుపు తీయడం యంత్రాలతో చేయవచ్చు. కానీ పంట కోత చేయలేరు. మా పొలాన్ని సందర్శించే ప్రతి ఇన్నోవేటర్ 'దీన్ని మేం పరిష్కరిస్తాం' అని చెబుతారు, కానీ ఇప్పటివరకూ నిర్దిష్టమైన పరిష్కారం ఏదీ రాలేదు'' అని సన్నీ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)