ఆంధ్రప్రదేశ్: ఉత్తరాంధ్రలో ఊళ్లపై నత్తల దాడి.. ఇళ్లలో, పొలాల్లో ఎక్కడ చూసినా నత్తలే.. ఎందుకిలా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా నత్తలే కనిపిస్తున్నాయి.
వేల సంఖ్యలో నత్తలు ఊళ్లపై దాడి చేస్తున్నాయి.
నిద్ర లేచి చూసేసరికి పొలాల్లో, ఇళ్లల్లో నత్తలే కనిపిస్తున్నాయి.
పొలాలు, తోటలలో చేరి, వాటిని నాశనం చేస్తున్నాయి.
దీంతో నత్తలు ఉన్న గ్రామాల్లో వాటిని ఏరడం, బస్తాల్లో వేయడం దినచర్యగా మారిపోయింది రైతులకు.
ప్రతి ఇంటి ముందు, పొలంలోనూ నత్తలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి.

రెండేళ్లుగా ఇదే సమస్య
సాధారణంగా గ్రామాల్లో చిత్తడిగా ఉన్న చోట్ల, వర్షాలు పడినప్పుడు.. నదులు, చెరువుల వద్ద కొద్దిసంఖ్యలో నత్తలు కనిపిస్తుంటాయి.
అయితే ఇటీవల కాలంలో ఇవి కూడా పెద్దగా కనిపించడం లేదు.
ఇన్ని వేల నత్తలు ఇలా ఒక నిర్దిష్ట ప్రాంతంలో (కొమరాడ మండలం) పెరిగిపోవడం సమస్యలను సృష్టిస్తోంది.
ఇవి ఎక్కడ నుంచి వచ్చాయని బీబీసీ బృందం రైతులను అడిగితే
"ఏమో తెలియదండీ. రెండేళ్లుగా నత్తలు ఇక్కడ పెరిగిపోతున్నాయి" అని చెప్పారు.

ఇళ్లు, వాకిళ్లు, పొలాలు ఎక్కడ చూసినా అవే
ఇళ్లు, వాకిళ్లు, రహదారులు, పొలాలు, పండ్ల తోటలు, ఆరు బయట ఇలా ఎక్కడ చూసినా నత్తలే కనిపిస్తున్నాయి.
పొలాల్లో ఆకులు, కాయలు, పువ్వులు, కొమ్మలు, కాండానికి నత్తలు కాస్తున్నట్లుగా వేలాడుతున్నాయి.
ఇప్పటి వరకు ఏనుగుల దాడులతోనే గజగజలాడుతున్న రైతులు ఇప్పుడు నత్తల సమస్యతో తల పట్టుకుంటున్నారు.

నత్తల సమస్య ఎక్కువగా ఉన్న గంగిరేవువలస, గదబవలస, రావికర్రవలస గ్రామాలకు బీబీసీ బృందం వెళ్లింది.
ముందుగా గంగిరేవు వలసలో 4 ఎకరాల్లో బొప్పాయి అందులో అంతర పంటలుగా జామ, వక్క మొక్కలను వేసిన కె. సాయిబాబు అనే రైతు తోటకు చేరుకుంది.
ఆ తోటలకి వెళ్లే రోడ్డు మీద, ఆ తోటలోని బొప్పాయి, జామ, వక్క మొక్కలపై ఎక్కడ చూసినా నత్తలే కనిపించాయి.

‘చేతికందిన పంటను తినేశాయి’
దాదాపు పంట చేతికొచ్చిన దశలో బొప్పాయి పండ్లను నత్తలు తినేశాయి.
కొన్ని బొప్పాయి మొక్కల ఆకులు కూడా కొరికేశాయి. ఇక బొప్పాయి మొక్కల ఆకులపై, కాయలు, పళ్లు, కాండం ఎక్కడ చూసినా నత్తలే కనిపించాయి.
అలాగే తమకు చిక్కుడు తోట ఉందని ఇప్పుడది నత్తల ఆవాసంగా మారిందని కళ అనే రైతు చెప్పారు.

‘చిక్కుడు, దొండ, బెండ.. దేన్నీ వదలడం లేదు’
చిక్కుడు తోటలోకి వెళ్లడంతోనే అక్కడ చిక్కుడు పాదు పాకేందుకు వేసిన వెదురు కర్రలతో సహా అన్నీ చోట్ల నత్తలే ఉన్నాయి.
చిక్కుడు కాయల కంటే నత్తలే ఎక్కువగా కనిపించాయి.
పక్కనే ఉన్న బెండ, దొండ తోటల పరిస్థితి అదే.
ఆ తోటల్లో రైతులు ఉన్నారు, పనులు కూడా చేస్తూ కనిపించారు. కానీ వారందరూ చేస్తున్న పనులన్నీ ఒక్కటే...నత్తలను ఏరటం.

నత్తలు లేని ప్రాంతమే లేదు
అంతర పంటగా వేసిన జామ, వక్క మొక్కలది అదే పరిస్థితి.
పొలంలో సోలార్ ల్యాంప్, ప్లాస్టిక్ బాకెట్లపై కూడా నత్తలే కనిపించాయి.
చేలో నడుస్తుంటే నత్తలు లేని ప్రాంతం ఏదీ కనిపించలేదు.
కంటి కనిపించినంత దూరంలో కూడా నత్తలే ఉన్నాయి.
పంట రక్షణ కోసం చుట్టూ కట్టిన గ్రీన్ క్లాత్ పై కూడా నత్తలే.

కొమరాడ మండలంలోని గంగరేగువలస గ్రామంలోనే ముందుగా ఈ నత్తల బెడద మొదలైనట్లు అధికారులు గుర్తించారు.
ఇక్కడ రైతులు తమ పొలాలు, తోటల్లో భిన్నమైన పంటలను వేస్తూ వ్యవసాయం చేస్తున్నారు.
అలా ఇక్కడ ఎక్కువగా బొప్పాయి, జామ, వక్క ఉన్నాయి.

కేరళ నుంచి వచ్చాయా?
ఇందులో వక్క మొక్కలను గత రెండేళ్లుగా కేరళ నుంచి తీసుకుని వస్తున్నారు.
"కేరళలో వక్క మొక్కల పంట ఎక్కువ. అవి నత్తలకు అవాసంగా ఉండే తడి నేలలో పెరుగుతుంది. అక్కడ నుంచి తీసుకుని వచ్చే మొక్కలపై నత్తల లార్వా ఉండటం...ఇక్కడ కొమరాడ మండలంలోని చాలా చిత్తడి నేలలే కావడంతో నత్తల అవాసాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. దీంతో ఇవి ఇక్కడ పెరుగుతున్నాయి" అని జిల్లా ఉద్యానవనశాఖాధికారి సత్యనారాయణ రెడ్డి బీబీసీకి వివరించారు.

‘రోజూ ఇదే మా పని’
గదబవలస గ్రామంలోకి వెళ్తుండగానే మహిళా రైతు కళ కుప్పగా పోసిన నత్తలపై ఉప్పు చల్లుతున్నారు.
"రోజూ మా పని ఇదే. ఉప్పు, నత్తలే మా జీవితం. ఉదయాన్నే లేవడం, నత్తలను తుడవడం, బతికి ఉన్న నత్తలను చంపేందుకు వాటిపై ఉప్పు చల్లడం, చనిపోయిన తర్వాత వాటిని దూరంగా విసిరేయడం. రెండేళ్లుగా జూలై నుంచి అక్టోబర్ వరకు నత్తలే మా జీవితంగా మారిపోయింది" అని ఆమె చెప్పారు.

పరిష్కారం ఏమిటి?
డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివ్సిటీ, ఎంటమాలజీ విభాగం నేతృతంలోని బృందం కొమరాడలో పర్యటించింది.
అక్కడ పరిస్థితులు అంచనా వేసిన తర్వాత కాపర్ సల్ఫేట్, ఉప్పు ద్రావణంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు రైతులకు సూచించారు.
అయితే ఒకసారి నత్తలు పొలాల్లోకి వచ్చాయంటే ఏటా నివారణ చర్యలు చేపట్టకోతే అవి వస్తూనే ఉంటాయని హెచ్చరించారు.
రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా రైతులు ఇటీవలే సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని అధికారులు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














