పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌లను మిలటరీ పరేడ్‌కు ఆహ్వానించడం ద్వారా చైనా అమెరికాకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది?

చైనా, ఉత్తరకొరియా, రష్యా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లారా బికర్
    • హోదా, చైనా కరస్పాండెంట్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బీజింగ్‌లో ఓ మిలటరీ పరేడ్‌కు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో కలిసి కిమ్ ఈ పరేడ్‌లో పాల్గొంటారు.

ఇది అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించే విషయం. అంతేకాదు.. జిన్‌పింగ్‌కు దౌత్యపరంగా కీలకమైన విజయం కూడా.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, దౌత్యపరంగా చాలా శక్తిమంతమైన దేశంగా అంతర్జాతీయ వేదికపై బీజింగ్ శక్తిని ప్రదర్శించడానికి జిన్‌పింగ్ ఎంతో శ్రమిస్తున్నారు.

ట్రంప్ టారిఫ్‌లతో ఆర్థిక సంబంధాలు దెబ్బతినగా, స్థిరమైన వాణిజ్య భాగస్వామిగా చైనాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు జిన్‌పింగ్.

యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ట్రంప్ విఫలమవుతుండగా, బీజింగ్‌లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చేందుకు జిన్‌పింగ్ సిద్ధమవుతున్నారు.

మిలటరీ పరేడ్‌కు కిమ్ హాజరవుతారని ఆకస్మికంగా వచ్చిన ప్రకటనకూ విశేష ప్రాధాన్యం ఉంది.

ఈ వారం ప్రారంభంలో దక్షిణకొరియా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్‌ను మళ్లీ కలవాలనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.

గతంలో కిమ్, ట్రంప్ మధ్య జరిగిన సమావేశాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించినప్పటికీ చెప్పుకోదగ్గ భారీ ఫలితాలేవీ వాటి వల్ల రాలేదు. మరోసారి ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.

ఈ మొత్తం భౌగోళిక, రాజకీయ ఆటలో అసలైన కార్డులు తన దగ్గరున్నాయని, కిమ్, పుతిన్‌తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటే పరిమితంగా అయినప్పటికీ వారిపై ఉండే తన ప్రభావం కీలకమని జిన్‌పింగ్ సంకేతాలిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైనా, ఉత్తరకొరియా, రష్యా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా, ఉత్తరకొరియా మధ్య ఇటీవల సంబంధాలు బాగా పెరిగాయి.

'ట్రంప్‌తో సమావేశంలో పై చేయి సాధించేందుకు'

చైనా ప్రాంతాల ఆక్రమణ ముగిసి, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80ఏళ్లు అవుతున్న సందర్భంగా సెప్టెంబరు 3న చైనా మిలటరీ పరేడ్ నిర్వహించనుంది.

ఇప్పుడు జిన్‌పింగ్ ఈ పరేడ్ నిర్వహించాలనుకోవడం కీలకం. అక్టోబరు చివర్లో ట్రంప్ ఈ ప్రాంతానికి రావొచ్చని జిన్‌పింగ్‌తో సమావేశానికి సిద్ధంగా ఉన్నారని వైట్‌ హౌస్ తెలిపింది.

వారిద్దరి మధ్య సమావేశం జరిగితే చర్చించడానికి అనేక అంశాలున్నాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సుంకాల ఒప్పందం, అమెరికాలో టిక్‌టాక్ అమ్మకం, యుక్రెయిన్‌లో శాంతి ఒప్పందం లేదా అంతకుమించి ఏదైనా పుతిన్‌ను అంగీకరించేలా చేయడంలో బీజింగ్ సామర్థ్యం వంటివి.

కిమ్, పుతిన్‌ ఇద్దరినీ కలవడం వల్ల ట్రంప్‌తో సమావేశంలో జిన్‌పింగ్ సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

చైనా, ఉత్తరకొరియా, రష్యా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్‌తో సమావేశం కావాలని ట్రంప్ భావిస్తున్నారు.

చైనా, ఉత్తరకొరియా మధ్య బలమైన బంధం

పాశ్చాత్య దేశాల దృష్టిలో రష్యా, ఉత్తరకొరియా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేని దేశాలు. ఆయుధాల కార్యక్రమం వల్ల పుతిన్‌కన్నా ఎక్కువగా కిమ్‌పై చాలా ఎక్కువగా ఇలాంటి అభిప్రాయం ఉంది.

మాస్కో యుక్రెయిన్ ఆక్రమణను సమర్థించడంతో కిమ్‌పై విమర్శలు మరింత పెరిగాయి.

బీజింగ్‌కు రావాలన్న ఆహ్వానం కిమ్‌కు చాలా పెద్ద విషయం. ఉత్తరకొరియా నేత ఒకరు చైనాలో మిలటరీ పరేడ్‌కు హాజరుకానుండడం 1959 తరువాత మళ్లీ ఇదే.

2019 నుంచి జిన్‌పింగ్, కిమ్ కలిసి బహిరంగంగా కనిపించింది తక్కువ. చైనా, ఉత్తరకొరియా మధ్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లయిన సందర్భంగా ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

ఉత్తరకొరియా అణుకార్యక్రమంపై ట్రంప్‌తో సమావేశాలకు ముందు కిమ్ 2018లో బీజింగ్ వెళ్లారు.

ఇటీవల రష్యా, ఉత్తరకొరియా సంబంధాలు బలపడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, చైనా జోక్యం చేసుకోవడం లేదు.

యుక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నట్టు కనిపించేందుకు చైనా ప్రయత్నించింది. శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని విజ్ఞప్తి చేసింది. కానీ యుద్ధానికవసరమయ్యే వస్తువులను సరఫరా చేయడం ద్వారా మాస్కోకు బీజింగ్ మద్దతిస్తోందని అమెరికా, దాని మిత్రదేశాలు ఆరోపిస్తున్నాయి.

పుతిన్‌కు కిమ్ దగ్గరవుతుండడంతో చైనాతో ఉత్తరకొరియా సంబంధాలు బలహీనపడ్డాయేమోనని కొందరు విశ్లేషకులు అనుమానించారు.

కానీ వచ్చేవారంలో కిమ్ బీజింగ్ పర్యటనతో అదేమీ లేదని తేలిపోయింది.

చైనా, ఉత్తరకొరియా, రష్యా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

జిన్‌పింగ్, పుతిన్, కిమ్, ట్రంప్ ఒకే వేదికపై కనిపిస్తారా?

చైనాతో సంబంధాలను కిమ్ అంత త్వరగా విడిచిపెట్టలేరు. ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ చైనాపై భారీస్థాయిలో ఆధారపడి ఉంది. ఉత్తరకొరియాకు ఆహార దిగుమతులలో 90 శాతం చైనా నుంచే వస్తాయి.

పుతిన్, జిన్‌పింగ్‌తో మాత్రమే కాకుండా ఇండోనేసియా, ఇరాన్ వంటి ఇతర దేశాధినేతలతో కలిసి వేదిక పంచుకోవడం కిమ్‌కు ఆమోదయోగ్యతను సాధిస్తుంది.

జిన్‌పింగ్ విషయానికొస్తే ట్రంప్‌తో సమావేశానికి అవకాశం ఉన్న నేపథ్యంలో వాషింగ్టన్‌పై ఆయన దౌత్యపరంగా పై చేయి సాధించినట్టు చెప్తున్నారు విశ్లేషకులు.

ఒప్పందం కుదుర్చుకునేందుకు, టారిఫ్‌లు, వాణిజ్యయుద్ధాన్ని నివారించేందుకు రెండు దేశాలు నిరంతరాయంగా చర్చలు జరిపాయి. సుంకాల అమలుపై 90 రోజుల విరామం కొనసాగుతోంది. కానీ సమయం దగ్గర పడుతోంది.

సంప్రదింపుల విషయంలో వీలయినంత ఎక్కువ బలోపేతంగా కనిపించాలని జిన్‌పింగ్ భావిస్తుండొచ్చు.

కిమ్ జోంగ్ ఉన్‌ను కలవాలని గతంలో ట్రంప్ ప్రయత్నించినప్పుడు చైనా చాలా సాయం చేసింది. జిన్‌పింగ్ మళ్లీ అది చేస్తారా?

మరింత ముఖ్యమైన విషయం యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో చైనా ఎలాంటి పాత్ర పోషించగలదు?

అన్నింటికన్నా ఆసక్తికర ప్రశ్న జిన్‌పింగ్, పుతిన్, కిమ్, డోనల్డ్ ట్రంప్ మధ్య సమావేశం ఉంటుందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)