రేర్‌ ఎర్త్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు, ఇవి ఎందుకంత కీలకం, అమెరికా తట్టుకోగలదా?

నియోడిమియం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లలో ఉపయోగించే శక్తిమంతమైన అయస్కాంతాల తయారీలో నియోడిమియం అనే అరుదైన మూలకాన్ని వాడతారు
    • రచయిత, అయేషా పెరీరా
    • హోదా, ఆసియా డిజిటల్ ఎడిటర్

చైనా, అమెరికా మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్‌లు వాణిజ్యయుద్ధ తీవ్రతను తెలుపుతున్నాయి.

ఈ పరస్పర సుంకాలే కాకుండా, అమెరికాను ఇబ్బంది పెట్టేందుకు చైనా వద్ద మరో మార్గమూ ఉంది.

ఇప్పుడు చైనా, అత్యంత అరుదైన ఖనిజాలు, అయస్కాంతాల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ.

అమెరికా ఈ ఖనిజాలపై ఎంతగా ఆధారపడుతుందో ఈ చర్య ద్వారా బయటపడింది.

అమెరికాలో కీలకమైన ఖనిజాల ఉత్పత్తిని పెంచడంతో పాటు, వీటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గాలను రూపొందించాల్సిందిగా వాణిజ్య శాఖను ట్రంప్ ఆదేశించారు.

కానీ, ఈ అరుదైన మూలకాలు (రేర్ఎర్త్స్) ఎందుకంత ముఖ్యమైనవి, వాణిజ్య యుద్ధంలో వీటి పాత్ర ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మంగోలియాలోని ద బయాన్ ఓబో మైనింగ్ టౌన్‌లో రేర్ ఎర్త్ లోహాల నిల్వలు భారీగా ఉన్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంగోలియాలోని ద బయాన్ ఓబో మైనింగ్ టౌన్‌లో రేర్ఎర్త్ నిల్వలు భారీగా ఉన్నాయి

చైనాదే గుత్తాధిపత్యం

అరుదైన మూలకాలను (రేర్ఎర్త్స్)ను వెలికితీయడంతో పాటు వాటిని శుద్ధి చేసే ప్రక్రియలో చైనా దాదాపు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు.

అరుదైన మూలకాల ఉత్పత్తిలో 61 శాతం, వాటి ప్రాసెసింగ్‌లో 92 శాతం వాటా చైనాదేనని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. అంటే వీటి సరఫరా గొలుసులో చైనాదే ఆధిపత్యంగా చెప్పవచ్చు. ఏ కంపెనీలకు వీటిని సరఫరా చేయాలో, చేయకూడదో నిర్ణయించుకునే సామర్థ్యం చైనాకు ఉంది.

ఈ రేర్ఎర్త్స్‌ వెలికితీత, శుద్ధి చేయడం రెండూ చాలా ఖరీదైన, కాలుష్యకారక వ్యవహారాలే.

రేర్ఎర్త్ వనరులన్నీ రేడియోధార్మిక మూలకాలను కలిగి ఉంటాయి. అందుకే ఈయూలోని దేశాల సహా అనేకఇతర దేశాలు వీటిని ఉత్పత్తి చేయడానికి ఇష్టపడవు.

అరుదైన మూలకాల సరఫరా గొలుసులో రాత్రికి రాత్రే చైనాకు ఆధిపత్యం దక్కలేదు. దశాబ్దాల పాటు సాగిన వ్యూహాత్మక ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ఫలితంగా ఇది సాధ్యమైంది.

జియాంగ్జి ప్రావిన్సులోని రేర్ ఎర్త్ మెటల్స్ మైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జియాంగ్జి ప్రావిన్సులోని రేర్ ఎర్త్ మెటల్స్ మైన్

ఆ సామర్థ్యం చైనాదే

అమెరికా విధించిన సుంకాలకు బదులుగా చైనా ఈ నెల మొదట్లో ఏడు అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. 'హెవీ రేర్‌ఎర్త్స్’గా పేరున్నవే ఇందులో ఎక్కువ భాగం ఉన్నాయి. రక్షణ రంగంలో ఈ ఖనిజాలు చాలా కీలకమైనవి.

'లైట్' రేర్ఎర్త్స్‌తో పోలిస్తే ఇవి దొరకడం కష్టం, పైగా శుద్ధి చేయడం ఇంకా కష్టం. అందుకే వీటిని ఎక్కువ విలువైనవిగా భావిస్తారు.

రేర్ ఎర్త్స్‌, అయస్కాంతాలను చైనా నుంచి బయటకు ఎగుమతి చేయడానికి కంపెనీలన్నీ ఏప్రిల్ 4 నుంచి ప్రత్యేక లైసెన్స్‌ను పొందాలి.

చైనాలో తప్ప బయట ఎక్కడా హెవీ రేర్ ఎర్త్స్ (భారీ అరుదైన మూలకాలు)ను శుద్ధి చేసే సామర్థ్యం ఎవరికీ లేనందున అమెరికాను ఇది చాలా బలహీనపరుస్తుందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్‌ఐఎస్) పేర్కొంది.

తయారీ రంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ వాహనాల ఇంజిన్ల తయారీలో కీలకమైన అయస్కాంతాలను తయారు చేయడానికి రేర్ ఎర్త్ లోహాలు చాలా ముఖ్యం

అమెరికాపై ప్రభావం

అమెరికా 2020-2023 మధ్య అన్ని రకాల అరుదైన మూలకాల సమ్మేళనాలు, లోహాల దిగుమతుల్లో 70 శాతం చైనాపై ఆధారపడిందని అమెరికా జియోలాజికల్ రిపోర్టు పేర్కొంది.

దీని అర్థం, చైనా విధించిన కొత్త ఆంక్షలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

మిలటరీకి సంబంధించిన క్షిపణులు, రాడార్లు, శాశ్వత అయస్కాంతాల్లో హెవీ రేర్ ఎర్త్స్‌ను వాడతారు.

ఎఫ్-35 జెట్‌లు, టోమాహాక్ క్షిపణులు, మానవరహిత విమానాల వంటి రక్షణ సాంకేతికతలన్నీ ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉన్నాయని సీఎస్‌ఐఎస్ నివేదిక పేర్కొంది.

దీనివల్ల అమెరికా కంటే అయిదు నుంచి ఆరు రెట్ల వేగంతో చైనా ఆయుధ ఉత్పత్తిని విస్తరించడం, అధునాతన ఆయుధ వ్యవస్థలను, సామగ్రిని పొందుతోందని ఈ నివేదిక తెలుపుతోంది.

ఈ ప్రభావం రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాదు.

అమెరికా తయారీ రంగం కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

"కీలకమైన రేర్ ఎర్త్ పదార్థాల ధరలు పెరుగుతాయని అంచనా. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ల నుంచి మిలిటరీ హార్డ్‌వేర్ వరకు అనేక రకాల ఉత్పత్తుల్లో ఉపయోగించే వస్తువులు, ఉత్పత్తుల ఖర్చులు తక్షణమే పెరుగుతాయి'' అని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో క్రిటికల్ మెటీరియల్స్ రీసర్చ్ ఫెలో డాక్టర్ హార్పర్ అంచనా వేశారు.

ఇలాంటి ఖనిజాలపై అమెరికా ఆధారపడటం వల్ల తలెత్తే జాతీయ భద్రతా ప్రమాదాల గురించి దర్యాప్తు చేయమని ట్రంప్ అధికారులను ఆదేశించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)