నిక్కు మధుసూదన్: 700 లక్షల కోట్ల మైళ్ల దూరంలోని గ్రహంపై జీవం ఉండొచ్చనడానికి ఆధారాలు గుర్తించిన శాస్త్రవేత్త

మరో గ్రహంపై జీవం, కే2-18బీ, పరిశోధనలు

ఫొటో సోర్స్, Cambridge University

ఫొటో క్యాప్షన్, కే2-18బీ ఆర్ట్ వర్క్
    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్

సూర్యుడు కాకుండా మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఓ సుదూర ప్రపంచం జీవానికి ఆవాసం కావొచ్చనడానికి శాస్త్రవేత్తలు కొన్ని కొత్త ఆధారాలు గుర్తించారు. అయితే, ఇవి ఖచ్చితమైన ఆధారాలు అని ఇంకా నిర్ధరణ కాలేదు.

కే2-18బీ అనే గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న కేంబ్రిడ్జ్ పరిశోధక బృందం భూమ్మీద ఏకకణ జీవులు వంటివి మాత్రమే ఉత్పత్తి చేసే అణువులు వంటి సంకేతాలను గుర్తించింది.

జీవానికి సంబంధించిన రసాయనాలను నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యుఎస్‌టీ) ద్వారా ఈ గ్రహం వాతావరణంలో కనుగొనడం ఇది రెండోసారి.

అయితే ఈ ఫలితాలను నిర్ధరించడానికి మరింత సమాచారం అవసరమని ఈ బృందంతో పాటు స్వతంత్ర ఖగోళ శాస్త్రవేత్తలూ అంటున్నారు.

మరింత స్పష్టమైన ఆధారాలు త్వరలోనే లభిస్తాయని తాను నమ్ముతున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆస్ట్రానమీ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న తన ల్యాబ్‌లో నాతో చెప్పారు.

''అక్కడ మనిషి జీవించవచ్చని చెప్పడానికి ఇప్పటికిదే బలమైన ఆధారం. ఒకట్రెండేళ్లలో మనం దీన్ని ధ్రువీకరించుకోగలమని నేను నమ్ముతున్నాను'' అని నిక్కు మధుసూదన్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్ద గ్రహం

కే2-18బీ అనేది భూమి పరిమాణంతో పోలిస్తే రెండున్నర రెట్లు పెద్దదిగా ఉంటుంది. భూమి నుంచి ఏడు వందల ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఒక ట్రిలియన్ మైలు అంటే సుమారు లక్ష 61 వేల కోట్ల కిలోమీటర్ల దూరం.

గ్రహాల రసాయన చర్యలను విశ్లేషించడంలో జేడబ్ల్యుఎస్‌టీ చాలా శక్తిమంతమైనది.

జీవంతో ముడిపడి ఉన్న కనీసం రెండు అణువుల్లో ఒకదానికి సంబంధించిన రసాయన సంకేతాన్ని కేంబ్రిడ్జి గ్రూప్ ఆ గ్రహం వాతావరణంలో గుర్తించింది.

అవి డైమిథైల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిథైల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్). భూమ్మీద ఈ వాయువులను మెరైన్ ఫైటోప్లాంక్టన్, బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేస్తాయి.

ఈ వాయువులు అంతమొత్తంలో కనిపించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ప్రొఫెసర్ మధుసూదన్ చెప్పారు.

''ఈ వాయువు భూమి మీద ఉండే మొత్తం కంటే కే2-18బీపై వేల రెట్లు అధికంగా ఉందన్నది మా అంచనా'' అని ఆయన అన్నారు.

''ఈ వాయువుకు, జీవానికి సంబంధం ఉండడం నిజమే అయితే ఈ గ్రహం ప్రాణులతో నిండి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

కే2-18బీ మీద జీవం ఉందని మనం నిర్ధరిస్తే ఆ పాలపుంతలో జీవం అత్యంత సాధారణం అని నిర్ధరణ అవుతుంది అన్నారు.

మరో గ్రహంపై జీవం, కే2-18బీ, పరిశోధనలు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, జేమ్స్ వేబ్ స్పేస్ టెలిస్కోప్ గ్రహాల వాతావరణాన్ని సమర్థవంతంగా అధ్యయనం చేయగలదు.

ఆవిష్కరణ అని చెప్పేంత స్థాయిలో లేదు

ప్రస్తుతం ఇంకా ఏదీ పూర్తిగా నిర్ధరణ కాలేదని ప్రొఫెసర్ మధుసూదన్ బృందం అంగీకరించింది.

కొత్తగా గుర్తించిన ఆధారాలను ఆవిష్కరణ అని చెప్పగలిగే స్థాయిలో లేదని వారు అన్నారు.

ఇది జరగాలంటే తమ ఫలితాలు 99.99999శాతం సరైనవని పరిశోధకులు చెప్పాల్సి ఉంటుంది. శాస్త్రీయ పరిభాషలో దీన్ని ఫైవ్ సిగ్మా రిజల్ట్‌ అంటారు.

కానీ ఈ పరిశోధన ఫలితాలు 3 సిగ్మా, 99.7శాతం కచ్చితత్వాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. దీన్ని పెద్ద మొత్తంలో ఆధారాలు లభించినట్టు చూడొచ్చు కానీ శాస్త్రీయ రంగాన్ని ఒప్పించడానికి ఇది సరిపోదు. అయితే 18 నెలలు క్రితం ఈ బృందం చూపించిన 68శాతం (ఒక సిగ్మా రిజల్ట్‌)తో పోలిస్తే తాజా ఫలితాలు చాలా ఎక్కువ. ఆ సమయంలో ఈ 68శాతం ఫలితాలను ఊహాజనితంగా భావించారు.

అయితే కేంబ్రిడ్జి బృందం ఐదు సిగ్మా రిజల్ట్ సాధించినప్పటికీ ఆ గ్రహం మీద జీవం ఉందనే నిర్ధరణకు రావడానికి అది కచ్చితమైన ఆధారం కాబోదని ఎడిన్‌బరో యూనివర్శిటీ అండ్ స్కాట్లాండ్ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కాథరిన్ హేమాన్స్ చెప్పారు. పరిశోధన బృందంలో కాథరిన్ స్వతంత్రంగా పనిచేశారు.

''అలాంటి కచ్చితత్వం ఉన్నప్పటికీ ఆ వాయువు ఎక్కడి నుంచి పుట్టిందనే ప్రశ్న ఉంటుంది'' అని ఆమె బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

మరో గ్రహంపై జీవం, కే2-18బీ, పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కే2-18బి భూమి కన్నా రెండున్నర రెట్లు పెద్దది

ప్రయోగశాలల్లో ఈ వాయువులను ఉత్పత్తి చేయొచ్చా?

సముద్రంలోని సూక్ష్మజీవులు భూమ్మీద ఈ వాయువులను ఉత్పత్తి చేస్తాయి.

అయితే సరైన సమాచారం ఉన్నప్పటికీ గ్రహాంతరవాసుల ప్రపంచంలో ప్రాణులకు అవసరమైనది ఉందని మనం చెప్పలేం. ఎందుకంటే విశ్వంలో అనేక వింతలు చోటుచేసుకుంటుంటాయి.

అలాగే ఆ గ్రహంపై అణువులు ఉత్పత్తి చేయగల ఇతర ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయో మనకు తెలియదు.

ఈ విషయాన్ని కేంబ్రిడ్జి బృందం అంగీకరించింది. ప్రయోగశాలల్లో జీవానికి అనుకూలం లేని పరిస్థితుల్లో డీఎంఎస్, డీఎండీఎస్ ఉత్పత్తి చేయగలమా అన్నది పరిశీలించేందుకు ఆ బృందం ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

కే2-18బీ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు ఇతర పరిశోధన సంస్థలు ప్రత్యామ్నాయ, జీవనంతో సంబంధం లేని, వివరణలను ముందుకు తెస్తున్నాయి. డీఎంఎస్, డీఎండీఎస్‌ల గురించి మాత్రమే కాకుండా గ్రహం నిర్మాణ తీరుపై శాస్త్రీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

కే2-18బి వాతావరణంలో విస్తృతమైన ద్రవాలున్నాయని చాలా మంది పరిశోధకులు చెప్పడానికి కారణం అమ్మోనియా గ్యాస్ లేకపోవడం. నీటి అడుగున అమ్మెనియా ఆవిరైపోతుందన్నది వారి సిద్ధాంతం. ఓషన్ ఆఫ్ మోల్టెన్ రాక్ ఇదే విషయాన్ని వివరించిందని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఆలివర్ షార్టల్ చెప్పారు.

‘‘ఇతర గ్రహాల చుట్టూ తిరిగే గ్రహాల గురించి మనకు తెలిసిన సమాచారమంతా వాటి వాతావరణంలో కనిపించే కొంత మొత్తం కాంతి ద్వారానే వస్తోంది. మన దగ్గర చదవడానికి ఉన్న సమాచారం అంత నమ్మదగ్గ పెద్ద సంకేతం కాదు. ప్రాణులకు సంబంధించనదే కాదు...ప్రతిదీ అలాగే చూడాలి’’ అని ఆయన అన్నారు.

మరో గ్రహంపై జీవం, కే2-18బీ, పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కే2-18బీపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)