భూమి మినహా ఏడు గ్రహాలు ఒకే వరుసలో.. ఈ ఖగోళ అద్భుతం ఎప్పుడంటే

గ్రహాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోనాథన్ ఓ’కల్లాఘన్

రాత్రివేళ ఆకాశంలో ఇప్పటికే వరుసగా కనిపిస్తోన్న ఆరు గ్రహాల సరసన బుధుడు కూడా చేరుతుండటంతో ఫిబ్రవరి 28న ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నాయి.

ఖగోళ శాస్త్రజ్ఞులు దీన్ని అరుదైన అమరికగా పరిగణిస్తున్నారు. శాస్త్రవేత్తలకు ఈ అరుదైన దృశ్యం ఎందుకింత ముఖ్యం?..

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆకాశంలో ఎలాంటి మబ్బులు లేకుండా ఉంటే, మీకో అరుదైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే.. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లు రాత్రి వేళ ఆకాశంలో ఒకే వరుసలో కనిపిస్తుంటాయి.

కానీ, ఫిబ్రవరి చివరిలో ఒక రాత్రి వీటి వరుసలోకే బుధ గ్రహం కూడా వచ్చి చేరనుంది. దీంతో, అరుదైన ఏడు గ్రహాల వరుసను ఆకాశంలో చూడొచ్చు.

మన సౌర వ్యవస్థలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వివిధ వేగాలలో తిరుగుతూ ఉంటాయి.

బుధ గ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది. కాబట్టి, 88 రోజుల్లో ఇది సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేసుకుంటుంది.

భూమికి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది.

దూరంగా ఉన్న నెఫ్ట్యూన్‌కు సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 60,190 రోజులు పడుతుంది. అంటే 165 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. ఎర్త్ ఇయర్ అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం.

ఈ గ్రహాలు వివిధ వేగాలలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండటం వల్ల, వీటిల్లో పలు గ్రహాలు సూర్యునికి ఒక దిశలో వరుసగా రావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆకాశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గ్రహాలను స్పష్టంగా చూడొచ్చు.

ఎలా చూడొచ్చు?

బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను సాధారణంగా మన కంటితోనే చూడొచ్చు. కానీ, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను చూడాలంటే బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వాడాల్సిందే.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనం వీటిని చూడొచ్చు. ఈ రెండు మాసాలలో రాత్రివేళ ఆకాశంలో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి కనుక బుధ గ్రహం మినహా మిగిలిన అన్ని గ్రహాలను మనం చూడొచ్చు. దీన్ని ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తున్నారు.

ఫిబ్రవరి 28న వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రావడం మనకు కనిపిస్తుంది. భూమి పైనుంచి చూసేవారికి ఇది అరుదైన దృశ్యం.

''మీ కంటితో గ్రహాలను చూడటం నిజంగా అదొక ప్రత్యేకత'' అని బ్రిటన్‌లోని ఫిఫ్ట్ స్టార్ ల్యాబ్స్‌కు చెందిన సైన్స్ కమ్యూనికేటర్, ఆస్ట్రోనోమర్ జెనిఫర్ మిలార్డ్ అన్నారు.

చూడటానికి ఇవి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అలాంటి అలైన్‌మెంట్లు భూమిపై ప్రభావం చూపుతాయా? మన సౌర వ్యవస్థ గురించి మరింత ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా? అనేది తెలుసుకోవాలి.

''వాటి కక్ష్యల స్థానం బట్టి అవి ఇలా వస్తుంటాయి. గ్రహాలు ఒక సరళ రేఖపైకి రావడం భూమిపై ప్రభావం చూపుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ, ఈ వాదనలు చాలా వరకు శాస్త్ర పరంగా బలహీనమైనవే'' అని మిలార్డ్ చెప్పారు.

2019లో కొందరు పరిశోధకులు గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రావడం మన సౌర కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని సూచించారు.

ఆకాశంలో గ్రహాలు

ఫొటో సోర్స్, Getty Images

''రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సూర్యునితో పాటు ఒకే వరుసలోకి రావడాన్ని సిజిగీ అంటారు. ఈ సమయంలో, అవి కలిసి నక్షత్రం లోపలే చిన్న భ్రమణాలను కలిగిస్తాయి. వీటినే రాస్బీ తరంగాలు అని పిలుస్తారు. ఇవి వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేయగలవు'' అని జర్మనీలోని హెల్మ్‌హోట్జ్-జెంట్రమ్‌ పరిశోధన కేంద్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టెఫానీ చెప్పారు.

భూమిపై రాస్బీ వేవ్స్‌ తుపాన్లు, యాంటీసైక్లోన్లకు కారణమవుతాయని ఫ్రాంక్ స్టెఫానీ అన్నారు. అవే రాస్బీ వేవ్స్ సూర్యునిపై కూడా ఉంటాయన్నారు.

1966లో నాసా సైంటిస్ట్ గ్యారీ ఫ్లాండ్రో 1977లో నాలుగు గ్రహాలు గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్‌లోకి వస్తాయని అంచనావేశారు. కేవలం 12 ఏళ్ల కాలంలోనే ఇవన్నీ ఒకే సరళరేఖపై వచ్చాయి. ఈ నాలుగు ఒకే సరళరేఖపైకి రావడం ప్రతి 175 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నారు.

ఒకే లైన్‌లోకి గ్రహాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇదే నాసా 1977లో వాయేజర్ 1, 2 అనే రెండు స్పేస్‌క్రాఫ్ట్‌ల లాంచ్‌కు దారితీసింది. బాహ్య సౌర వ్యవస్థపై 'గ్రాండ్ టూర్' కోసం వీటిని లాంచ్ చేశారు.

1979లో వాయేజర్ 1 బృహస్పతిని దాటి, 1980లో శని గ్రహాన్ని దాటి వెళ్లింది. శని ఉపగ్రహమైన టైటాన్‌ను దాటి వెళ్లాలని శాస్త్రవేత్తలు కోరుకోవడం వల్ల యురేనస్, నెప్ట్యూన్ వద్దకు ఇది వెళ్లలేదు. కానీ, వాయేజర్ 2 మాత్రం నాలుగు గ్రహాలు ఒకే లైన్‌లోకి రావడాన్ని చూడగలిగింది.

1986, 1989లో యురేనస్, నెప్ట్యూన్లను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వాయేజర్ 2 చరిత్రలోకి ఎక్కింది.

''ఇది చాలా బాగా పనిచేసింది'' అని అమెరికాలోని కొలొరాడో యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ ఫ్రాన్ బాగెనాల్ అన్నారు. ఈయన వాయేజర్ సైన్స్ టీమ్‌లో సభ్యులు.

‘ఒకవేళ వాయేజర్ 2ను 1980లో ప్రయోగించి ఉంటే, నెప్ట్యూన్‌ను చేరుకునేందుకు 2010 వరకు సమయం పట్టేది. ఇలాంటి వాటికి ఎవరు డబ్బులు పెడతారు?'' అని బాగెనాల్ ప్రశ్నించారు.

గ్రహాలు ఒకే లైన్‌లోకి రావడం కేవలం మన సౌర వ్యవస్థకే పరిమితం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)