సునీత విలియమ్స్: అంతరిక్షంలో అనారోగ్యానికి గురైతే ఎలా? అక్కడ ఎవరు చికిత్స చేస్తారు? డాక్టర్లు ఉంటారా?

sunita williams

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్‌మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటికే అంతరిక్షానికి వెళ్లింది.

అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ ప్రస్తుతం బాగా బరువు తగ్గిపోతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని వివిధ మీడియా సంస్థల కథనాలు వస్తున్నాయి.

తాజాగా విడుదలవుతున్న ఫొటోలలో ఆమె బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారని ఆ కథనాలు చెప్తున్నాయి.

అయితే, అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములను వారికి కేటాయించిన ఫ్లైట్ సర్జన్లు నిత్యం పరిశీలిస్తున్నారని, వారి ఆరోగ్యమంతా బాగున్నట్లు నాసా అధికారులు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు స్పేస్‌ డాట్ కామ్ పేర్కొంది.

ఈ సమయంలో, అంతరిక్షంలోకి వెళ్లిన వారికి అత్యవసరంగా వైద్య చికిత్స అవసరం పడితే ఎవరు ట్రీట్‌ చేస్తారు? అక్కడ డాక్టర్లు ఉంటారా? అన్ని రకాల వైద్య సదుపాయాలు వారికి అందుబాటులో ఉంటాయా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వీడియో క్యాప్షన్, Video: అంతరిక్షంలో వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే చికిత్స ఎలా?

అంతరిక్షంలో మెడికల్ ఎమర్జెన్సీలను వ్యోమగాములు ఎలా ఎదుర్కొంటారు?

గత కొన్నేళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మనుషులను పంపుతూ అక్కడ నివాసయోగ్యతపై పరిశోధనలు చేస్తూ ఉంది.

అంతరిక్షంలో వ్యోమగాములకు సపోర్ట్ ఇవ్వడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే. ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో.

ఈ విషయంపై అంతరిక్షంలో వ్యోమగాములకు అత్యవసరంగా వైద్య సదుపాయాలు అవసరం పడితే ఎలా అనే విషయంపై అమెరికాలో ఏరోస్పేస్‌, డిఫెన్స్ కంపెనీ నార్త్‌రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్ తన ఆర్టికల్‌లో వివరించింది. ఈ కంపెనీ అందిస్తున్న సమాచారం ప్రకారం..

వ్యోమగాముల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నాసా టెలిమెడిసిన్‌ విధానం అనుసరిస్తుంది. దీని ద్వారానే వారి అనారోగ్యానికి చికిత్స అందిస్తుంటుంది. కానీ, వ్యోమగాములు కూడా దీనిలో భాగం కావాల్సి ఉంది.

వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపకముందే, అంతరిక్ష కేంద్రంలో వాడే అన్ని మెడికల్ డివైస్‌ల గురించి వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, అవి ఎలా వాడాలో నేర్పుతారు.

అంతేకాక, సిబ్బందిలోనే ఒకరికి 40 గంటల పాటు శిక్షణ ఇస్తారు.

ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీలను అయినా ఆ శిక్షణ తీసుకున్న వ్యక్తి డీల్ చేయగలరు.

తలనొప్పి, వెన్నునొప్పి, చర్మ సమస్యలు, చర్మం కాలినప్పుడు, డెంటల్ ఎమర్జెన్సీలు వంటి అన్నిటికీ ఆ శిక్షణ తీసుకునే వారు వైద్యం చేస్తారు.

మరి, తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఎలా?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం బేసిక్ మెడికల్ కిట్ ఉంటుంది.

అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికల్ కండీషన్లపై ఒక పెద్ద పుస్తకం, డెఫిబ్రిలేటర్ (గుండె వేగాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్), పోర్టబుల్ ఆల్ట్రాసౌండ్, కళ్లను పరీక్షించే ఒక పరికరం, రెండు లీటర్ల సెలైన్ వంటి కొన్ని ఉపయోగకరమైన వైద్య పరికరాలు ఉంటాయి.

వ్యోమగాములకు వైద్య శిక్షణ

ఫొటో సోర్స్, NASA/SCIENCE PHOTO LIBRARY

ఫొటో క్యాప్షన్, అంతరిక్ష కేంద్రానికి వెళ్లే సిబ్బందికి వైద్య పరికరాల వాడకంపై శిక్షణ ఇస్తారు

వ్యోమగాముల శరీరం లోపల ఎలా ఉందో స్పష్టమైన ఫొటోలను ఈ ఆల్ట్రాసౌండ్ మెషిన్ అందించగలదు.

అయినప్పటికీ, ఆల్ట్రాసౌండ్ ద్వారా తీసిన పిక్చర్లను భూమిపై ఉన్న వైద్య బృందానికి పంపిస్తారు. సమస్యేంటి? దానికి చికిత్స ఏంటి? అనేది భూమిపై ఉన్న వైద్య బృందం నిర్ణయిస్తుంది.

నాసా భూమిపై నుంచే వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. వారికొక ఫ్లైట్ సర్జన్ కూడా ఉంటారు.

ఏరోస్పేస్ మెడిసిన్‌లో ఉండే ఈ నిపుణులను వ్యోమగాములు భూమిపై ఉన్నప్పుడే కేటాయిస్తారు.

వారి శారీరక వ్యాయామాలను, వైద్య శిక్షణను నెలల తరబడి ఈ నిపుణులు పరిశీలిస్తారు.

ఆ సమయంలోనే వ్యోమగాములతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు. అంతరిక్షానికి వెళ్లినప్పుడు, వారి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఇది చాలా కీలకం.

ప్రతి వారం ఫ్లైట్ సర్జన్‌తో వ్యోమగాములకు ప్రైవేట్‌గా మెడికల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు. భూమిపై ఉండే కంట్రోల్ సెంటర్ నుంచే వ్యోమగాములను వారు నిత్యం గమనిస్తూ ఉంటారు.

అలాగే, వ్యోమగాములకు చెందిన బయోమెట్రిక్ డేటా, అల్ట్రాసౌండ్‌ రిజల్ట్స్‌ను నాసా సేకరిస్తుంది. ఈ మిషన్‌లో వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించడానికి ఇది చాలా సాయపడుతుంది.

‘‘స్పేస్ స్టేషన్‌లో ఎక్కువ కాలం ఉండేవారు రోజూ రెండుగంటలు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు వేర్వేరు యంత్రాలు సహాయపడతాయి. కండరాలకు ఉపయోగపడే అన్నిరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైజ్ (ఏఆర్ఈడీ) ఉపయోగపడుతుంది. స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది ట్రెడ్‌మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్‌ కూడా వాడతారు.’’ అని హెలెన్ షార్మన్ చెప్పారు. షార్మన్ బ్రిటిష్ వ్యోమగామి. 1991లో సోవియట్ స్పేస్ స్టేషన్‌లో ఎనిమిది రోజుల పాటు గడిపారు.

అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళలు చాలా వేగంగా అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఉంటుందని స్పేస్ గైనకాలజిస్ట్‌గా పేరొందిన డాక్టర్ వర్ష జైన్ గతంలో బీబీసీతో చెప్పారు. ఆమె అంతరిక్షంలో మహిళల ఆరోగ్యంపై నాసాతో కలిసి పనిచేశారు.

భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత పురుషులు ఎక్కువగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

నాసా వ్యోమగామి లోరల్ ఓ'హారా

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, స్పేస్ సర్జరీ చేసిన రోబోతో నాసా వ్యోమగామి లోరల్ ఓహారా

రోబోతో సర్జరీలు

సిబ్బందిలోనే క్వాలిఫైడ్ డాక్టర్ ఉండటం భూమికి వేల మైళ్ల దూరంలో ఉన్న వారికి మెడికల్ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు చికిత్స చేసేందుకు సాయపడుతుండొచ్చు.

కానీ, అంతరిక్షంలో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తే ఎలా? అది సాధ్యమవుతుందా? అన్న అనుమానం కూడా రావొచ్చు.

దీనికోసం నాసా రోబోలను స్పేస్ సర్జన్లుగా మారుస్తోంది. భూమిపై నుంచి వాటిని నియంత్రిస్తూ.. వైద్య సేవలను అందించేలా వీటిని రూపొందిస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జీరో గ్రావిటీలో తొలి సర్జరీ డెమోను ఒక చిన్న సర్జికల్ రోబో పూర్తి చేసింది. ఆ రోబో పేరు స్పేస్‌మిరా (SpaceMIRA).

నాసా చేపట్టిన ఈ కీలకమైన అడుగుతో, దీర్ఘకాలం మనుషులు అంతరిక్షంలో విజయవంతంగా ప్రయాణించడమే కాదు, సర్జికల్ ఎమర్జెన్సీలను కూడా అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చేపట్టవచ్చని తెలిసింది.

అంతేకాక, భూమిపై కూడా వైద్యసేవలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించొచ్చని భావిస్తున్నారు.

సునీత విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునీత విలియమ్స్

వ్యోమగాములు ఎముకల సాంద్రత కోల్పోయే ప్రమాదం

అయితే, ఎక్కువ కాలం మైక్రోగ్రావిటీకి గురికావడం వల్ల వ్యోమగాముల ఎముకలు సాంద్రత కోల్పోయే (బోన్ డెన్సిటీ లాస్) ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు గురికావు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయేలా తయారవుతాయని వైద్యులు చెబుతున్నారు.

గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి.

“గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన శరీరంలోని కణాలు, కండరాలు నిరంతరం రీసైకిల్ అవుతుంటాయి. అవి 6 నెలలకు పైగా గురుత్వాకర్షణకు గురికాకపోతే, బోన్ డెన్సిటీ (ఎముకల సాంద్రత) 25-30%, కండరాల సాంద్రత 50% వరకు తగ్గుతుంది. దీని కారణంగా, అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ల్యాండ్ అయినప్పుడు ఎక్స్‌ట్రా వెహిక్యులార్ వర్క్ లేదా మాడ్యూల్ నుంచి బయటపడటం వంటి కొన్ని కార్యకలాపాలు కష్టం కావొచ్చు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వాళ్లు నిరంతరం వ్యాయామం చేస్తూ తమ కండరాలు, ఎముకలను బలంగా ఉంచుకుంటారు.’’ అని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఆర్.ఎ.పూర్ణచంద్ర తేజస్వి గతంలో బీబీసీతో చెప్పారు.

‘‘వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్‌ను ఎదుర్కొంటారు. వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి మొదలైన సమస్యలు ఎదురుకావచ్చు. దీన్ని ఎదుర్కోవడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇస్తారు.’’ అని తేజస్వి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)