భూమికి 400 కి.మీ. ఎత్తున జీవితం ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో బాత్‌రూమ్‌లు ఎలా పనిచేస్తాయి? దుస్తులు ఉతుక్కోవడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జినా రానార్డ్
- హోదా, సైన్స్ రిపోర్టర్
సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌లో) 8 రోజులు ఉండేందుకు వెళ్లారు. కానీ వారిని తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో వారిద్దరూ నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున వారు భూమిని చేరుకుంటున్నారు.
నిజానికి భూమికి 400 కిలోమీటర్ల పైన ఎత్తులో ఉండటం ఎలా ఉంటుంది?
అక్కడ వ్యోమగాములు ఎలా నిద్రపోతారు? ఏం తింటారు? వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది? దుస్తులు ఎలా ఉతుక్కుంటారు?
అన్నింటికంటే ముఖ్యంగా స్పేస్‌లో ఎలాంటి వాసన వస్తుంది?
ఇలాంటి అనేక విషయాలపై మాజీ వ్యోమగాములు ముగ్గురు గతంలో ‘బీబీసీ’తో మాట్లాడారు.



ఫొటో సోర్స్, Nasa
ఎలా నిద్రపోతారు?
వ్యోమగాముల దినచర్యను ఐదేసి నిమిషాల వారీగా భూమిపైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తుంది.
వారు చాలా త్వరగా నిద్రలేస్తారు. ఐఎస్ఎస్ మాడ్యుల్‌లో ఫోన్‌బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు వస్తారు.
‘‘ప్రపంచంలో ఇదే అత్యుత్తమ స్లీపింగ్ బ్యాగ్’’ అని నికోల్ స్టాట్ చెప్పారు.
నాసాలోని ఈ అమెరికన్ ఆస్ట్రోనాట్ 2009, 2011లో చేపట్టిన రెండు మిషన్లలో భాగంగా 104 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్‌మెంట్స్‌లో ల్యాప్‌టాప్‌లు ఉంటాయి.
ఇవి సిబ్బంది తమ కుటుంబసభ్యులతో కాంటాక్ట్‌లో ఉండటానికి ఉపయోగపడతాయి.
అలాగే ఫోటోలు, పుస్తకాలు లాంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
నిద్రలేచిన తరువాత ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే బాత్‌రూమ్‌లు సక్షన్ సిస్టమ్‌లో పనిచేస్తాయి.
సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు.
కానీ ఐఎస్ఎస్‌లో సాంకేతిక సమస్యవల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ చేస్తున్నారు.
తరువాత వ్యోమగాములు పనిలోకి దిగుతారు. ఐఎస్ఎస్‌లో నిర్వహణ, శాస్త్రీయ ప్రయోగాల పనులు ఎక్కువగా జరుగుతుంటాయి.
స్పేస్ స్టేషన్ ఎంత పెద్దది?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్‌హామ్ పాలెస్ అంత సైజులో, లేదంటే అమెరికన్ పుట్‌బాల్ మైదానమంతటి పరిమాణంలో ఉంటుంది.
‘ఐఎస్ఎస్ లోపల అనేక బస్సులను ఒకదాని పక్కన మరొకటి నిలిపినట్టుగా ఉంటుంది. రోజులో సగ భాగం మీరు అక్కడ మరో మనిషిని చూడలేరు’ అని కెనడియన్ ఆస్ట్రోనాట్ చారిస్ హాడ్‌ఫీల్డ్ చెప్పారు.
ఆయన 2012-13 మధ్యన ఎక్స్‌పీడిషన్ -35కు కమాండర్‌గా వ్యవహరించారు.
‘‘ఐఎస్ఎస్ విశాలంగా, ప్రశాంతంగా ఉన్నా అక్కడి వ్యోమగాములు ఊరికే అటూఇటూ తిరగరు’’ అని ఆయన చెప్పారు.
ఐఎస్ఎస్‌లో ఆరు ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యోమగాములు హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్‌లను ధరిస్తారు.
‘‘మేం గినియా పిగ్స్ లాంటివాళ్లం’’ అని స్టాట్ చెప్పారు.
‘‘అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్లు, చేతులు కదపలేం. అందుకే కండర క్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్టు అవుతుంది. వ్యోమగాముల బిజీ షెడ్యూల్‌లో ఐదునిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద చాలెంజ్’ అన్నారు హాడ్‌ఫీల్డ్. టైమ్ దొరికినప్పుడు బయటి ప్రదేశాన్ని చూడటానికి కిటికీ వరకు వెళ్లడం, లేదంటే మ్యూజిక్ వినడం, ఫోటోలు తీయడం, పిల్లల కోసం ఏదైనా రాయడం’’ చేస్తుంటామని తెలిపారు.

ఫొటో సోర్స్, Nasa
ఎలాంటి వాసన వస్తుంది?
ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేసిన అనుభవాలను హాడ్‌ఫీల్డ్ వివరిస్తూ .. ‘‘ఐఎస్ఎస్ బయట 15 గంటలు గడిపాం. అప్పుడు, నాకు ఈ ప్రపంచానికి మధ్యన నేను వేసుకున్న సూట్ తప్ప ఏ ఆధారమూ లేదు. అది ఉత్కంఠను, అధివాస్తవిక అనుభూతిని కలిగించింది’’ అని తెలిపారు.
కానీ ఈ స్పేస్ వాక్ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసింది. అదే ‘‘స్పేస్ స్మెల్’’.
‘‘భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి. కానీ స్పేస్‌లో ఒకే ఒక్క వాసన. అదే మెటాలిక్ స్పేస్ స్మెల్. కానీ మేం దానికి అలవాటుపడ్డాం’’ అని హెలెన్ షార్మన్ చెప్పారు. షార్మన్ తొలి బ్రిటిష్ వ్యోమగామి. 1991లో సోవియట్ స్పేస్ స్టేషన్‌లో ఎనిమిది రోజులపాటు గడిపారు.
స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు సైంటిఫిక్ కిట్స్, సూట్స్ అంతరిక్షంలోని బలమైన రేడియేషన్‌కు ప్రభామితమవుతాయి.
‘‘రేడియేషన్ ఫ్రీరాడికల్స్‌ను ఏర్పరుస్తుంది. అవి అంతరిక్ష కేంద్రంలో ఆక్సిజన్‌తో కలిసి లోహపు వాసనను సృష్టిస్తాయి’’ అని ఆమె చెప్పారు.
‘‘స్పేస్‌లో వాన, గాలి, వేడి మొదలైనవి ఉండవు. ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవు. అంటే మొహంపై వానచినుకులు పడటం, గాలికి ముంగురులు కదలడం, తాజాగాలిని పీల్చడం లాంటివీ ఏవీ ఉండవు. అందుకే ఆమె స్పేస్ నుంచి తిరిగొచ్చిన 33 ఏళ్ల తరువాత కూడా భూమిపైన ఉండే అనుభూతులకు ఎంత విలువ ఉందో చెబుతున్నారు.

ఫొటో సోర్స్, NASA
ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేస్తారు?
స్పేస్ స్టేషన్‌లో దీర్ఘకాలంపాటు ఉండేవారు ప్రతిరోజు రెండుగంటలు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు వేర్వేరు యంత్రాలు సహాయపడతాయి .
కండరాలకు ఉపయోగపడే అన్నిరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైస్ (ఏఆర్ఈడీ) ఉపయోగపడుతుంది.
స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది ట్రెడ్‌మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు.
స్పేస్ స్టేషన్‌లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు. ఎక్సర్‌సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారుతాయి. వాటిని కార్గో వెహికిల్‌లో బయటకు విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి. కానీ రోజువారీ దుస్తులు శుభ్రంగానే ఉంటాయి. ఒక ప్యాంట్ మూడు నెలలు వాడాను నేను’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Ria Novosti/Science Photo Library
ఏం తింటారు?
ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్‌లో ఆహారడబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది. గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడుతాయి. ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనకకు మరలుతుంటారు.
ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు. అందులో కొత్త సిబ్బంది లేదంటే ఫుడ్, దుస్తులు, పరికరాలు వస్తాయి. ఏటా నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్‌కు పంపుతుంది. అవి ఐఎస్ఎస్‌కు చేరుకోవడం చాలా ఉత్సాహంగానూ, స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది అని ఆమె చెప్పారు.
ఇక పగలంతా కష్టపడి పనిచేసిన తరువాత రాత్రి భోజన సమయం వస్తుంది. స్టేషన్‌లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది.
"ఇది మిలటరీ రేషన్ వంటిదే కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు' అని స్టాట్ చెప్పారు.
"జపనీస్ కూరలు లేదా రష్యన్ తృణధాన్యాలు సూప్స్ నాకు ఇష్టమైనవి" అని ఆమె చెప్పారు.
కుటుంబాలు తమవారి కోసం బోనస్ ఫుడ్ ప్యాక్‌లను పంపుతాయి అని చెప్పారు. స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది తరచూ ఆహారాన్ని పంచుకుంటారు.
మేం 8 గంటలు నిద్రపోతాం.. కానీ చాలామంది కిటికీ వద్దే ఉండిపోయి భూమిని చూస్తుంటారు అని స్టాట్ చెప్పారు.
అయితే సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ పైన చిక్కుకుపోయారని అందరూ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆ ముగ్గురు వ్యోమగాములు చెప్పారు.
‘‘మేం స్పేస్‌లో వీలైనంత ఎక్కువ కాలం గడిపేందుకు కలగన్నాం. కష్టించాం. శిక్షణ పొందాం’’ అని చెప్పారు.
‘‘ప్రొఫెషనల్ వ్యోమగామికి మీరు ఇచ్చే అద్భుతమైన బహుమతి ఏదైనా ఉందా అంటే వారిని ఎంతకాలం వీలైతే అంతకాలం అంతరిక్షంలో ఉండేలా చేయడమే’’ అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














