చైనా, విమానం హైజాక్ అంశాలపై జైశంకర్ ఏమన్నారు? మల్లికార్జున ఖర్గే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు

ఫొటో సోర్స్, ANI
తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.
గత వారం జెనీవా పర్యటనలో ఉన్న మంత్రి జైశంకర్ చైనాతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు.
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 184 : ది కాందహార్ హైజాక్'పైనా స్పందించిన జైశంకర్, సినిమా ఇండస్ట్రీపైనా వ్యాఖ్యలు చేశారు.
కాగా చైనా విషయంలో జైశంకర్ చెప్పిన మాటలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కార్యక్రమంలో, భారత్ - చైనా సంబంధాల గురించి జైశంకర్ మాట్లాడుతూ.. ‘భారత, చైనా సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు 75 శాతం పూర్తయింది’ అన్నారు.
‘డెడ్‌లాక్ పాయింట్ (ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతం) నుంచి సైన్యాలు వెనక్కి తగ్గితే శాంతి నెలకొంటుంది. అప్పుడు భారత్ - చైనా సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే ఇతర అవకాశాలను పరిశీలించొచ్చు’ అని జైశంకర్ అన్నారు.

చైనా ఏమని చెప్తోంది
జైశంకర్ ప్రకటన అనంతరం, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై స్పందించింది.
భారత్ - చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, అంతా నియంత్రణలోనే ఉందని తెలిపింది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. సెప్టెంబర్ 12న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తమ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారని చెప్పారు.
సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇటీవల జరిగిన చర్చలతో సాధించిన పురోగతిపై రెండు పక్షాలూ చర్చించాయని తెలిపారు.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం, ఏకాభిప్రాయ సాధన, పరస్పర సహకారం, పరస్పర విశ్వాసం, ద్వైపాక్షిక సంబంధాలకు అనువైన వాతావరణం వంటి వాటి దిశగా చర్చలు కొనసాగించేందుకు ఇరుదేశాల నేతలు అంగీకారం తెలిపారు.
‘ఇటీవలి సంవత్సరాల్లో గల్వాన్ లోయ సహా భారత్ - చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని నాలుగు ప్రాంతాల నుంచి సైనిక బలగాలను వెనక్కి రప్పించాలని రెండు దేశాల సైన్యాలు భావించాయి. ప్రస్తుతం భారత్ - చైనా సరిహద్దులో సాధారణ పరిస్థితి ఉంది. అంతా నియంత్రణలోనే ఉంది’ అని ఆయన చెప్పారు.
భారత్ - చైనా సంబంధాలపై చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్ టైమ్స్'లో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. అందులో రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలలో జైశంకర్‌ను ఒక అడ్డంకిగా పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఈ విశ్లేషణను తొలగించారు.
జెనీవాలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘చైనాపై ప్రధాని మోదీ వల్లమాలిన ప్రేమ భారత ఆర్థిక, భౌగోళిక సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ముప్పు’ అని రాశారు.

ఫొటో సోర్స్, ANI
చైనా యాప్‌ల నిషేధం బూటకం: మల్లికార్జున ఖర్గే
‘‘మోదీ ఇచ్చిన క్లీన్‌చిట్ తరువాత ఆయన మాటలనే కాపీ చేస్తూ ‘చైనా భారత్‌లోని ఏ భూభాగాన్నీ ఆక్రమించలేదు’ అని 2024 ఏప్రిల్‌లో ప్రకటన చేసింది కూడా ఇదే విదేశాంగ మంత్రి’’ అని ఖర్గే అన్నారు.
‘పార్లమెంట్‌లో చైనా గురించి ప్రతిపక్షాలు ప్రశ్నలడిగితే సమాధానం చెప్పని ప్రధాని, విదేశాంగ మంత్రి.. విదేశాల్లో మాత్రం ప్రకటనలు చేస్తుండడం విచిత్రం’ అంటూ వ్యంగ్యంగా రాశారు.
‘భారత్ ఇప్పటికే దెప్సాంగ్ మైదానాలు, డెమ్‌చోక్ నాలాతో పాటు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్టులోని అనేక పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయింది'' అని ఆయన రాశారు.
''2020 మే నాటి అనేక చొరబాటు పాయింట్ల వద్ద బఫర్‌జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా, చైనాకు అనుకూలంగా వాస్తవాధీన ప్రాంత మార్పును మోదీ ప్రభుత్వం ఆమోదించడం నిజం కాదా?'' అని ఖర్గే ప్రశ్నించారు.
డోక్లామ్, గల్వాన్ ఘటనలను మోదీ ప్రభుత్వం మరిచిపోయిందని.. చైనా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే పనిలో నిమగ్నమైందంటూ ఆయన విమర్శలు చేశారు.
గల్వాన్ ఘర్షణల అనంతరం, చైనా నుంచి దిగుమతులు 56 శాతం పెరిగాయని ఖర్గే అన్నారు.
చైనా యాప్‌ల నిషేధం కేవలం బూటకమని, చైనా పెట్టుబడులను మోదీ ప్రభుత్వం బహిరంగంగానే ఆహ్వానిస్తోందని ఆయన ఆరోపించారు.
2017లో, చైనా సరిహద్దులో సిక్కింకు ఆనుకుని ఉన్న డోక్లామ్ వివాదంతో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.
డోక్లామ్ పీఠభూమి ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణ యత్నాలను భారత్ వ్యతిరేకించింది.
భూటాన్, చైనా ఈ ప్రాంతం తమదంటే తమదని చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్ భూటాన్‌కు మద్దతు ఇస్తూ వస్తోంది.
అయితే, 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
జెనీవాలో జైశంకర్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత సుబ్రమణియంస్వామి కూడా ట్వీట్ చేశారు.
‘జైశంకర్ చెప్పిన ‘డిస్‌ఎంగేజ్‌మెంట్’ అర్థమేంటి? జైశంకర్ చెబుతున్న దాని ప్రకారం, ఆక్రమించుకున్న భారత భూభాగం నుంచి చైనా వెనక్కి వెళ్తుంది, కానీ భారత్ తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
'సినిమాల్లో ప్రభుత్వాన్ని మంచిగా చూపించరు'
సెప్టెంబర్ 12న, జెనీవాలో జైశంకర్ చైనా గురించి మాట్లాడారు. అదే రోజు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో అజిత్ డోభాల్ సమావేశమయ్యారు.
డోభాల్, వాంగ్ యీ భేటీని కీలకంగా భావిస్తున్నారు. ఎల్ఏసీ వద్ద సైనిక బలగాల ఉపసంహరణపైనా ఈ భేటీలో చర్చించారు.
దీనికి కొద్దిరోజుల ముందే వియత్నాంలో జైశంకర్, వాంగ్ యీ భేటీ అయ్యారు.
ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చిన 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్' సిరీస్ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం ఒక ప్రటకన చేశారు.
అదే సమయంలో, 1984లో జరిగిన మరో హైజాక్ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు, ఆ విమానంలో తన తండ్రి కూడా ఉన్నారని చెప్పారు.
జెనీవాలో ప్రవాస భారతీయులతో జైశంకర్ మాట్లాడుతూ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్' సిరీస్‌ను తాను చూడలేదని, కానీ ''సినిమా వాళ్లు ప్రభుత్వాలను అంత మంచిగా చూపించరు'' అన్నారు.
మరో ఎయిరిండియా విమానం హైజాకింగ్ గురించి జైశంకర్ గుర్తుచేస్తూ, ''1984లో హైజాకింగ్ జరిగింది. అప్పట్లో నేను యువ అధికారిగా ఉన్నా. హైజాకర్లతో డీల్ చేసే బృందంలో నేనూ ఉన్నా'' అని చెప్పారు.
జైశంకర్ చెప్పిన దాని ప్రకారం, అప్పట్లో తన భార్య కూడా ఉద్యోగం చేసేదని, తన కొడుకుని చూసుకునేందుకు ఇంటికి త్వరగా వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు.
''ఆ రోజు మా అమ్మకు ఫోన్ చేసి విమానం హైజాక్ అయిందని, అందువల్ల నేను రాలేనని చెప్పా. ఆ విమానంలో మా నాన్న కూడా ఉన్నారని నాకు తెలిసింది'' అని జైశంకర్ చెప్పారు.
అప్పట్లో, కొంతమంది ఖలిస్తానీ యువకులు ఆ విమానాన్ని హైజాక్ చేశారు. అయితే, ఆ తర్వాత వాళ్లు లొంగిపోయారు అన్నారు.

ఫొటో సోర్స్, ANI
'జీవితం అంత తేలిక కాదు'
జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన 'ఖటా ఖట్' వ్యాఖ్యలపై కూడా జైశంకర్ ఘాటుగా స్పందించారు.
జీవితం అంత తేలిక కాదని రాహుల్ గాంధీ లక్ష్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. దానికి కష్టపడడంతో పాటు నిబద్ధత అవసరమన్నారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ 'ఖటా ఖట్' అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించారు. ఒక పనిని త్వరగా పూర్తి చేయాలనేందుకు రాహుల్ గాంధీ ఈ మాటలను వాడుతుంటారు.
జైశంకర్ మాట్లాడుతూ, ''మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, ఆ దిశగా విధానాల అమలు వంటివి చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టంతో కూడుకున్న పని. జీవితమంటే ఖటా ఖట్ (త్వరగా తేల్చేసేది) కాదు. జీవితమంటే కష్టపడడం, కృషి చేయడం'' అన్నారు.

ఫొటో సోర్స్, ANI
'అద్భుతమైన సమాధానం'
విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు తరచూ రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
విదేశీ వేదికలపై భారత విదేశాంగ విధానానికి సంబంధించిన ప్రశ్న అయినా, లేదా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కౌగిలించుకోవడంపై ప్రశ్న అయినా, జైశంకర్ ఇచ్చే సమాధానాలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి.
జెనీవా పర్యటనలో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివిధ వేదికలపై పలు వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 12న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ప్రోగ్రామ్‌కి జైశంకర్ హాజరయ్యారు. ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా భాగస్వాములుగా ఉన్న 'బ్రిక్స్' గ్రూప్ అవసరమా అని ఆయన్ను అడిగారు.
'బ్రిక్స్' క్లబ్ ఎందుకు ఏర్పాటైంది? దాని విస్తరణ గురించి మీరేమనుకుంటున్నారు? అని జైశంకర్‌ను అడిగారు.
జైశంకర్ బదులిస్తూ, "నిజాయితీగా చెప్పాలంటే, జీ - 7 సమూహం వల్లే బ్రిక్స్ సమూహం ఏర్పడింది. ఆ క్లబ్‌లోకి ఎవరినీ అనుమతించలేదు, కాబట్టి, మేం మా సొంత క్లబ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం.''
జైశంకర్ మాట్లాడుతూ, "ఇదొక ఆసక్తికరమైన సమూహం. ఇతర గ్రూపులు భౌగోళిక లేదా బలమైన ఆర్థిక కారణాలతో అనుసంధానమై ఉంటాయి. కానీ, బ్రిక్స్‌లో రష్యా, చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఉన్నాయి. వీటిలో సాధారణంగా కనిపించే విషయం ఏంటంటే, ప్రపంచ వ్యవస్థలో పెద్ద దేశాల ప్రాతినిధ్యం పెరుగుతోంది" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
అలాగే, జీ-7తో పాటు జీ-20 కూడా ఉంది కదా, మరి బ్రిక్స్ అవసరం ఏంటి? అని జైశంకర్‌ను అడిగారు.
దానికి ఆయన బదులిస్తూ ''బ్రిక్స్ విషయంలో మీరెందుకు అభద్రతాభావానికి గురవుతున్నారో నాకర్థం కావడం లేదు. అది మిమ్మల్ని ఎందుకంత ఇబ్బంది పెడుతోంది? జీ 20 ఏర్పాటయ్యాక జీ 7 ఆగిపోయిందా? అలా ఏం లేదు. జీ 20తో పాటు జీ 7 కూడా ఉంది. అలాగే జీ 20తో పాటు బ్రిక్స్ కూడా ఎందుకు ఉండకూడదు?" అన్నారు.
ఆ సమాధానం విన్న తర్వాత, ఆ ప్రశ్న అడిగిన ఫ్రెంచ్ రాయబారి జీన్ డేవిడ్ లెవిట్, 'అద్భుతమైన సమాధానం' అన్నారు.
బ్రిక్స్ విస్తరణ గురించి జైశంకర్ మాట్లాడుతూ, "కొన్నేళ్లుగా, చాలా దేశాలు ఈ సమూహంలో చేరాలనుకుంటున్నాయని తెలుసు. గతేడాది జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్‌ను విస్తరించాలని నిర్ణయించాం. కొత్త దేశాలను ఆహ్వానించాం."
బ్రిక్స్ 2006లో ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా ఈ సమూహంలో చేరింది. తాజాగా, ఈ గ్రూప్‌లో మరిన్ని దేశాలు చేరే ప్రక్రియ ప్రారంభమైంది.
ఆ దేశాల్లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ ఉన్నాయి. సౌదీ అరేబియా కూడా ఈ గ్రూపులో చేరే యోచన చేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














