స్నేహితులకు ‘సీత’.. ప్రత్యర్థి పార్టీలూ మెచ్చిన నేత

సీతారాం ఏచూరి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నీరజ చౌదరి
    • హోదా, బీబీసీ హిందీ కోసం

అర్ధ శతాబ్ద కాలం కమ్యూనిస్ట్ నేతగా ఉన్న సీతారాం ఏచూరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు.

1975లో సీతారాం ఏచూరి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఏచూరి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి ఆయన సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న ఏచూరి ఆధునిక ఆలోచనలతో ఆ పార్టీలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు.

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 72 ఏళ్ల వయసులో దిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు.

సీతారాం ఏచూరి పేరు వినగానే మనకు అనేక విషయాలు, విశేషణాలు గుర్తుకొస్తాయి.

బాగా చదువుకున్న వ్యక్తి, ఆలోచనాపరుడు, వేల ఆర్టికల్స్.. అనేక పుస్తకాలు రాసిన రచయిత, నిరంతరం కొత్త ఆలోచనలు చేసే వ్యక్తిగా ఆయన్ను చాలామంది ఇష్టపడతారు.

1977లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఏచూరి బాధ్యతలు స్వీకరించేనాటికి ఆ యూనివర్శిటీలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.

ఆ సమయంలో ఆయన జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి రాత్రుళ్లు ఆలస్యంగా వెళ్లేవారు.

ఏచూరి అప్పుడు ఇరవైల్లో ఉన్నారు. ఆయన మంచి వక్త. ‘ప్రేక్షకుల మూడ్‌ను గమనించి ఎప్పటికప్పుడు వారికి ఆసక్తి కలిగించేలా మాట్లాడేవారు’ అని సి.రాజమోహన్ చెప్పారు. ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజా జనరల్ సెక్రటరీగా ఉండేవారు.

‘అనేక రకాల సమస్యలను ఒకేసారి పరిష్కరించగల సామర్థ్యం ఏచూరి సొంతం. అన్నింటికీమించి ఆయన మంచి వ్యవహారదక్షుడు. ప్రజల మనసులు గెలుచుకోవడం తెలిసిన మనిషి’ అన్నారు రాజమోహన్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పార్టీ ప్రభావం చూపకపోయినా తాను ప్రభావవంతమైన పాత్రలో

పేద దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్‌లో సీపీఎం ఎన్నడూ మెయిన్‌స్ట్రీమ్ పార్టీ కాలేకపోయింది.

కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో తప్ప ఇంకే రాష్ట్రంలోనూ విజయవంతం కాలేకపోవడంపైనా చర్చ జరుగుతుంటుంది.

సీపీఎం ప్రధాన పార్టీ కాలేకపోయినా ఏచూరి మాత్రం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతగా గుర్తుండిపోతారు.

1989 నుంచి 2014 మధ్య వివిధ రాజకీయ కూటములను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ఆయన కృషి చేశారు.

సీతారాం ఏచూరి, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మరో హరికిషన్ సింగ్ సుర్జీత్

రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఇతర పార్టీలు, నాయకులతో ఆయనకు స్నేహం ఉండేది.

అందుకే ఆయన్ను హరికిషన్ సింగ్ సుర్జీత్‌తో పోల్చుతుంటారు.

పంజాబ్‌కు చెందిన సుర్జీత్ సీపీఎం దిగ్గజ నేత. 1992-2005 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989లో వీపీ సింగ్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా ఎదగడానికి సుర్జీత్ రాజకీయ సామర్థ్యం, చాతుర్యం ఉపయోగపడ్డాయి.

తిరిగి 1996లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు, 2004లో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి సుర్జీత్ వ్యూహాలు పనికొచ్చాయి.

సుర్జీత్‌లానే.. 2004లో యూపీఏ సంకీర్ణం ఏర్పాటులో, 2023లో ఇండియా కూటమి ఏర్పాటులో సీతారాం ఏచూరి పాత్ర ఎంతో ఉంది.

ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో మెరుగ్గా రాణించడంలో.. బీజేపీ మెజారిటీని తగ్గించడంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు.

స్నేహితులు, సహచరులు ఏచూరిని ‘సీత’ అని పిలుస్తారు.

1996, 2004లో సంకీర్ణ ప్రభుత్వాలు రూపొందించిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఏచూరి పాత్ర ఉంది.

Anil Biswas, Prakash Karat, Buddhadev Bhattacharya, Jyoti Basu, Harkishen Singh Surjeet and Sitaram Yechury

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనిల్ బిస్వాస్, ప్రకాశ్ కరాత్, బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్‌లతో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో సీతారాం ఏచూరి (2004 నాటి చిత్రం)

‘చారిత్రక తప్పిదం’లో తాను భాగమై..

1996లో సీపీఎం చేసిన ‘చారిత్రక తప్పిదం’ గురించి తరువాత కాలంలో ఏచూరి వివిధ సందర్భాలలో మాట్లాడారు.

భారత్‌కు ఒక వామపక్షనేత ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని 1996లో పార్టీ ఎలా వదులుకుందో ఆయన గుర్తుచేసుకున్నారు.

పార్లమెంట్‌లో బీజేపీ మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలం కావడంతో యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సీపీఎం నాయకుడు జ్యోతిబసును ప్రధానమంత్రి పదవి స్వీకరించాల్సిందిగా కోరారు.

కానీ అప్పటి సీపీఎం సెంట్రల్ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

పార్టీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా తర్వాతి కాలంలో జ్యోతిబసు అభివర్ణించారు.

సీపీఎం నేత ప్రధానమంత్రి పదవి స్వీకరించడాన్ని వ్యతిరేకించిన కమిటీలోని మూడోవంతు సభ్యుల్లో ఏచూరి కూడా ఒకరు.

అప్పుడు సుర్జీత్, జ్యోతిబసుతో కలిసి సీతారాం ఏచూరి కర్ణాటక భవన్‌కు వెళ్లారు.

అప్పటికే అక్కడ చంద్రబాబు నాయుడు, దేవెగౌడ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సీపీఎం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తర్వాతి సంవత్సరాల్లో ఏచూరి తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని భావించారో లేదో తెలియదు.

Sitaram Yechury, Narendra Modi, Sitaram Yechuri, Seetaram Yechuri, Seetaram Yechury

ఫొటో సోర్స్, x/narendramodi

ఫొటో క్యాప్షన్, సీతారాం ఏచూరి, నరేంద్ర మోదీ (ఏచూరి మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో రాసిన సందేశంలో ఈ ఫొటో పంచుకున్నారు)

పార్లమెంట్‌లో సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారు.

12 ఏళ్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన అద్భుత ప్రసంగాలు చేశారు.

బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో, తాము అనుకున్న అంశాలను పార్లమెంట్‌లో చర్చకు వచ్చేలా చేయడంలో కీలకపాత్ర పోషించారు.

వాటన్నింటిపైనా ఆయనకు సమగ్ర అవగాహన ఉండేది. ఏచూరి రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు ఆయన్ను తిరిగి నామినేట్ చేయాలని పార్టీలకతీతంగా అనేకమంది ఎంపీలు సీపీఎంను కోరారు.

ప్రకాశ్ కరాత్, సీతారాం ఏచూరి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రకాశ్ కరాత్, సీతారాం ఏచూరి

తాను అంగీకరించకపోయినప్పటికీ నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా పార్టీ నిర్ణయాలన్నింటినీ ఆయన గౌరవించారు.

భారత్-అమెరికా అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు ఆయన పార్టీ నిర్ణయంతో విభేదించారు.

ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారు ఆ ఒప్పందంపై ముందుకు వెళ్లింది.

సీపీఎం అప్పటి ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరాత్‌తో సీతారాం ఏచూరికి ఉన్న విభేదాల సంగతి అందరికీ తెలుసు.

కరాత్, ఏచూరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సామరస్యంగానూ ఉంటారు.

స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఆధునిక భారత్‌ను తీర్చిదిద్దిన అనేక రాజకీయ జోడీల్లో కరాత్, ఏచూరి జోడీ ఒకటి.

నెహ్రూ-పటేల్, వాజపేయీ-అడ్వాణీ, మోదీ-షాలాంటి జోడీ ఏచూరి-కరాత్‌ కూడా.

ఇండియా కూటమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నేతలతో

ఇండియా కూటమిలో కీలక పాత్ర

సోనియా, రాహుల్‌గాంధీలతో ఏచూరికి మంచి సంబంధాలున్నాయి.

ఏచూరిని రాహుల్ గాంధీ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్‌గా అభివర్ణించారు.

భారత్ భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలపై తాము గంటల తరబడి చర్చించుకున్నామని రాహుల్ గుర్తుచేసుకున్నారు.

2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య సంబంధాల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా సోనియా ఏచూరిని సంప్రదించేవారు.

2004-2008 మధ్య లెఫ్ట్ పార్టీల సహకారంతో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

రైట్ వింగ్‌కు చెందిన శక్తిమంతమైన నేత మోదీ అధికారంలో ఉన్న సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నేతృత్వం వహించారు ఏచూరి.

ఇది దేశరాజకీయాల నమూనాలో మార్పు వచ్చిన సమయం.

సీపీఎం అస్తిత్వం నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న సమయమది.

అయినప్పటికీ ఏచూరి తన అసాధారణ రాజకీయ వ్యవహారశైలి, నేర్పుతో చాలా త్వరగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఇండియా కూటమిగా ఒక తాటిపైకి తీసుకురాగలిగారు.

బీజేపీ నేతృత్వంలోని కూటమికి సవాళ్లు విసరగలిగారు.

sitaram yechury

ఫొటో సోర్స్, ANI

క్లిష్ట సమయాల్లో ప్రతిపక్షాల్లో ఐక్యత తెచ్చిన నాయకుడిగా ఏచూరి గుర్తుండిపోతారు. ఈ ఐక్యత సాధించడానికి తెరవెనక ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

ఎన్నో ఏళ్లుగా తమతో కలిసి సాగుతున్న కామ్రేడ్‌కు ఆ పార్టీ నేతలు అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు.

దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడడానికి, పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి తన జీవితకాలం మొత్తం పనిచేసిన ఏచూరిని ఈ దేశం గుర్తుంచుకుంటుంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)