మల్లు స్వరాజ్యం: ‘తన గొంతే తుపాకీ తూటా’

మల్లు స్వరాజ్యం

ఫొటో సోర్స్, vamdandi

    • రచయిత, కాత్యాయని
    • హోదా, బీబీసీ కోసం

మల్లు స్వరాజ్యంను తలచుకోగానే ఉధృతమైన ఒక ప్రవాహం మనసులో మెదులుతుంది. అడ్డంకులను అధిగమిస్తూ, ఎత్తు పల్లాలను ఊడ్చివేస్తూ సాగిపోయే ప్రవాహం. నిజంగా ఆమె జీవన యానంలో ఎన్ని అవరోధాలు! ఎన్ని మలుపులు! ఎంత వేగం!

ఆడవాళ్ళను పల్లకీలలో, పరదాల వెనుక మగ్గబెట్టిన రెడ్డి, భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఒక బాలిక, పసితనం వదలక మునుపే కూలీలను దండుగట్టి, సొంత చిన్నాన్నకు వ్యతిరేకంగా సమ్మె చేయించారు. తొలి యవ్వనంలో తుపాకి పట్టి గెరిల్లా పోరాటంలోకి దూకారు. దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో సంసార సాగరాన్ని ఈదారు. ప్రజా ప్రతినిధిగా చట్టసభలో అడుగుపెట్టారు.

ఇలా ఆమె జీవితంలో ప్రతి మలుపు ఒక అద్భుత గాథలోని ఘట్టం లాంటిదే. వీటి వెనుక అనేక పరిస్థితుల, భావజాలాల నేపథ్యం ఉంది.

అయితే, ఇంత వైవిధ్యమైన దశలన్నిటినీ కలిపే ఒక అంతః సూత్రాన్ని మాత్రం తనదైన ప్రయత్నంతో ఆమె స్వయంగా రూపొందించుకున్నారు. అది పీడిత ప్రజలపై అపారమైన ప్రేమ.

స్వరాజ్యం మాటలను రికార్డ్ చేసి, తన స్వీయకథకు అక్షరాలు కూర్చే పనిలో విమలతో కలిసి పాల్గొనటంతో నాకు ఆమె గురించి సన్నిహితంగా తెలుసుకునే అవకాశం కలిగింది.

తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డితో మల్లు స్వరాజ్యం

ఫొటో సోర్స్, FB/Communist Party of India (Marxist)

ఫొటో క్యాప్షన్, తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డితో మల్లు స్వరాజ్యం

ఈ దేశంలోని స్త్రీలలోని బహుముఖాలైన సామర్థ్యాలకు, సాహసానికి వ్యక్తీకరణను ఇచ్చిన తొలి సందర్భం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ వెలుగులో స్వరాజ్యం వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యం, అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రోత్సాహం, ఆమెను గడీల ఇరుకుతనం నుండి బయటి ప్రపంచంలోకి నడిపించాయి.

స్త్రీల మీద, దళితుల మీద అమలవుతున్న దురాచారాలను సంస్కరించే ప్రయత్నాలూ, రైతు కూలీలపై ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా చట్టబద్ధ పోరాటాల మీదుగా మొదలైన ఆమె ఉద్యమ ప్రయాణం గెరిల్లా యోధురాలిగా అజ్ఞాత జీవితంలోకి నడిచే వరకూ సాగింది.

బడి చదువులు పెద్దగా లేని స్వరాజ్యం, సోవియెట్ సాహిత్యానికి మంచి పాఠకురాలయ్యారు. ప్రజల బాణీల్లో స్వయంగా పాటలు అల్లారు. అనర్గళమైన వక్తగా పేరు పొందారు.

మార్క్సిస్ట్ అవగాహనను స్థానిక పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించగల వ్యూహకర్తగా మారారు. ఇదంతా కేవలం తన వ్యక్తిగత ప్రతిభ కాదంటూ, "ఏనాడు కూలివాడల్లో జొరబడ్డానో అవే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాల్ని అందించింది, నా పాటలకు బాణీలనిచ్చింది. నా జీవితానికి ఒక చరిత్రను ఇచ్చిందీ వాళ్ళే" అన్నారామె.

ఆ ఎరుక ఆమెను అచ్చమైన ప్రజల మనిషిగా నిలిపింది.

వీడియో క్యాప్షన్, మల్లు స్వరాజ్యం: 'అందరూ ఎప్పటికైనా కమ్యూనిజం బాట పట్టాల్సిందే'

నిజాం సర్కారు ఆమె తలపై వెల కట్టిన సమయంలో, ప్రజలే ఆమెను కాపాడుకున్నారు. తనకు ఆశ్రయం ఇచ్చిన ప్రతి ఆదివాసీ గూడేన్నీ, ప్రజల ప్రతి త్యాగాన్నీ తొంబయ్యేళ్ళ వయసులోనూ ఆమె అపురూపంగా గుర్తు చేసుకున్నారు.

అట్టడుగు జనంతో అంతగా మమేకమై బతికిన తనకు సాయుధ పోరాటం విరమణ అనంతరం బయటి ప్రపంచంలో, కుటుంబమనే చిన్న పరిధిలో ఎలా ఇమడాలో తెలియలేదని చెప్పేవారు ఆమె. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాల నుంచి స్త్రీల ప్రత్యేక సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోగలిగారు. పుట్టింటి నుండి కొద్దిపాటి ఆస్తిని అడగటానికి ఆమె పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది.

తను ఎమ్మెల్యే అయిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు చట్టం కోసం గట్టిగా ప్రయత్నించడానికి ఈ అనుభవం ప్రేరణగా మారింది. ప్రజా ఉద్యమాల్లో కొంతకాలం పని చేసి బయటికి వచ్చిన ఆడవాళ్ళు సమాజంలో ఎదుర్కోవాల్సిన అదనపు సమస్యల గురించి స్వరాజ్యం చాలా బాధ పడ్డారు. పరిష్కారాల దిశగా ఆలోచించారు.

ఎన్నో కష్టనష్టాలు భరించి పోరాడినా, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కాకమునుపే ఆ పోరాట విరమణ జరగటం, పార్టీలో చీలిక ఆమెను కలవరపరిచాయి. పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయినా ఆమె జీవన శైలిలో, ప్రజలతో సాన్నిహిత్యంలో మార్పు రాలేదు.

మల్లు స్వరాజ్యం

ఫొటో సోర్స్, FB/Communist Party of India (Marxist)

ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, ప్రజలపై వేధింపులు తన దృష్టికి వచ్చినప్పుడల్లా తనది రాజీ లేని పోరాటమేనని చెబుతూ "అసెంబ్లీలో కూచున్నా నాకు తెలిసింది గెరిల్లా తరహా పోరాటమే" అనేవారు స్వరాజ్యం.

తన స్వీయ కథకు ఆమె ఏరికోరి ఎంచుకున్న టైటిల్ "నా గొంతే తుపాకీ తూటా". ఔను, ప్రతి చోటా ఆమెది యుద్ధ పరిభాషే.

భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన స్వరాజ్యం మార్క్సిస్ట్ దృక్పథం కలిగిన అందరి నడుమ ఐక్యత ఏర్పడాలని బలంగా కోరుకున్నారు.

అన్ని సామాజిక సమస్యల మీదా ప్రత్యేక పోరాటాలు చేస్తూనే, పీడిత ప్రజల ప్రయోజనాలనే ఉమ్మడి లక్ష్యం కోసం మార్క్సిస్టుల నడుమ ఒక విశాల వేదిక రూపొందాలనుకున్నారు.

"ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయాలని నా కల. వచ్చే తరమన్నా ఆ పని చేసి తీరాలి. నాకు ఆశ ఉంది. నా ఆశ నిరాధారం కాదు" అన్నారు తన స్వీయ చరిత్రలో.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)