బిహార్‌ ఎన్నికలు: తేజస్వి యాదవ్‌తో పొత్తు లేకుంటే లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు వచ్చేవా

వామపక్ష నేతలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

రాష్ట్రీయ జనతాదళ్‌, జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీలు రెండూ పుట్టక ముందు 1995లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు ఏడాది కిందట 1994లో లాలూ యాదవ్‌ నుంచి విడిపోయిన నితీశ్‌ కుమార్‌ సమతా పార్టీని స్థాపించారు.

1995 ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్‌)తో కలిసి నితీశ్‌ కుమార్‌ ఎన్నికల బరిలోకి దిగారు. అది ఆయన రాజకీయ జీవితంలో ఏర్పాటు చేసిన తొలి కూటమి.

అవిభాజ్య బిహార్‌లో 324 సీట్లున్న విధాన సభకు జరిగిన ఆ ఎన్నికల్లో సమతా పార్టీ కూటమి 310 సీట్లకు పోటీ చేసి కేవలం 7 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో ఆరు సీట్లు ఆయన కూటమి భాగస్వామి అయిన సీపీఐ(ఎంఎల్‌)వే.

2020 నాటికి పరిస్థితులు మారిపోయాయి. అదే ‘సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్’ రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 19 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టి 12సీట్లు గెలుచుకుంది. సీపీఐ, సీపీఎంలు కూడా చెరి రెండు సీట్లు గెలుచుకున్నాయి.

బిహార్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం సీపీఐ (ఎంఎల్‌) పునరుత్థానం. ఈ ఎన్నికల్లో వామపక్షాల పనితీరు బాగానే ఉంది. మూడు పార్టీలు కలిపి 29 సీట్లకు పోటీ చేసి, 16 సీట్లు గెలవగలిగాయి.

బెంగాల్‌, కేరళ తర్వాత ఎక్కువమంది వామపక్ష ఎమ్మెల్యేలున్న రాష్ట్రం బిహారే.

ఈసారి కూడా బిహార్ లో వామపక్షాలు సహకరించుకోలేదు

ఫొటో సోర్స్, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఈసారి కూడా బిహార్ లో వామపక్షాలు సహకరించుకోలేదు

వర్గ పోరాట రాజకీయం

2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సీపీఐ (ఎంఎల్)కి సంజీవనిగా పని చేశాయని చెప్పాలి. ఇటీవలి కాలం వరకు ఆ పార్టీ బిహార్‌లో ఏ ఎన్నిక జరిగినా ఒంటరిగానే బరిలోకి దిగింది.

ఈసారి రాష్ట్రీయ జనతాదళ్‌తో పొత్తు పెట్టుకుని, తాను పోగొట్టుకున్న అస్తిత్వాన్ని చాలా వరకు తిరిగి పొందగలిగింది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) కేవలం మూడు సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న లక్ష్యం, గత ఎన్నికలు నేర్పిన పాఠాలతో గ్రాండ్‌ అలయన్స్‌లో చేరింది సీపీఐ (ఎంఎల్).

బిహార్‌లో ఆర్జేడీ కుల రాజకీయాలకు పెట్టింది పేరు కాగా, సీపీఐ (ఎంఎల్) వర్గ పోరాట రాజకీయాలకు కట్టుబడి ఉండేది. అయితే ఈ ఇరువర్గాల మధ్య అసమతౌల్యాన్ని సీపీఐ(ఎంఎల్) ఎందుకు పట్టించుకోలేదు ? ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారు. కానీ ఆవైపు నుంచి సమాధానం సరిగ్గా రాలేదు.

భావజాలంలో రెండుపార్టీల మధ్య సమానత్వం లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జట్టు కట్టామని ఇరుపక్షాలు అంగీకరించాయి.

కాంగ్రెస్, ఆర్జేడీల ఓట్లు కూడా వామపక్షాలకు బదిలీ అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్, ఆర్జేడీల ఓట్లు కూడా వామపక్షాలకు బదిలీ అయ్యాయి.

కూటమిగా ఎలా రాణించారు?

“ఒకప్పుడు వామపక్షాలకు బిహార్‌లో మంచి పట్టుఉండేది. 90ల నుంచి ఇప్పటి వరకు ఆర్జేడీ, జేడీయూ వంటి మధ్య తరగతి పార్టీలు వామపక్షాలకు తీవ్ర నష్టం కలిగించాయి’’ అన్నారు ప్రభాత్‌ ఖబర్‌ భోజ్‌పురి పత్రిక స్థానిక సంపాదకుడు అజయ్‌ కుమార్.

“ఒకప్పుడు లెఫ్ట్‌ పార్టీల నుంచి విడిపోయిన కొందరు లాల్‌ప్రసాద్‌ యాదవ్‌తో జట్టుకట్టారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు.

మండల్‌ పాలిటిక్స్‌ యుగంలో సీపీఐ(ఎంఎల్‌) పెద్ద పరాజితగా మిగిలింది. అయితే వారి ఓటు బ్యాంకు మాత్రం కొద్దిగా మిగిలి ఉంది. అందుకే వారు ఎక్కువ సీట్లలో పోటీ చేస్తారు. కానీ గెలవలేరు. తమ ఓటుబ్యాంకును సీట్లుగా మార్చుకోలేరు. భారతదేశంలో కులం, వర్గం మధ్య వ్యత్యాసం చెరిగిపోయింది. అందుకే వామపక్షాల ఉనికి తగ్గుతోంది” అని అజయ్‌ కుమార్‌ అన్నారు.

అయితే ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్‌)తోపాటు మిగిలిన వామపక్షాలు సీపీఐ, సీపీఎంలు కూడా బాగానే రాణించాయి. కూటమిగా పోటీ చేయాలన్న నిర్ణయంతో ప్రయోజనం పొందగలిగాయి.

మధ్య, దక్షిణ బిహార్‌లలో వామపక్షాల పట్టు ఇంకాఉంది. కూటమి కారణంగా ప్రజలు ఏకమై ఓటేశారని అజయ్‌ కుమార్ అభిప్రాయపడ్డారు.

వామపక్ష కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌లో ఒకప్పుడు ప్రతిపక్షం

1970లలో బిహార్‌లో వామపక్షాలకు బలమైన ఓటు బ్యాంకు ఉండేది. 1972 నుంచి 1977 వరకు బిహార్‌ అసెంబ్లీలో సీపీఐ ప్రధాన ప్రతిపక్షం. కానీ 1977లో వెనకబడిన కులాలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ తీసుకున్న నిర్ణయం వామపక్షాలకు పెద్దదెబ్బలా మారింది.

ఆ నిర్ణయంతో బిహార్‌లో కులం ఆధారంగా అణచివేత, వెనకబాటుతనం అన్నవి వెనక్కి పోయాయి. వామపక్షాల ప్రాభవం కూడా తగ్గడం మొదలు పెట్టింది.

మండల్‌ కమిషన్‌ వ్యవహరంలో కులం కేంద్రంగా మారడంతో వామపక్షాల వర్గపోరాటం చర్చకు నిలబడలేక పోయింది.

"1990లో సీపీఐ (ఎంఎల్) అజ్జాతంలో ఉండేది. వామపక్షాలు ఇండియన్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో పని చేసేవి.

1990, 1995 మధ్య సూర్యదేవ్‌ సింగ్, కృష్ణదేవ్ సింగ్, భగవాన్‌ సింగ్‌లాంటి పెద్ద పెద్ద వామపక్ష నేతలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో చేతులు కలిపారు. బిహార్‌లో వామపక్షాల భావజాలం కుప్పకూలిన కాలం అది" అన్నారు అజయ్‌ కుమార్‌.

కానీ బిహార్‌లో వామపక్షాలు కలిసి పోరాడటంలో విఫలమయ్యాయన్నది కూడా నిజం. 1995 తర్వాత వామపక్షాలు సంకీర్ణంగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. గత ఎన్నికల్లో కూడా గ్రాండ్‌ అలయన్స్‌లో భాగం కాలేదు.

ఈ ఎన్నికల్లో కూడా మూడు పార్టీల మధ్య పెద్దగా సామరస్యం లేదు. సీపీఐ నేత కన్హయ్య కుమార్ సీపీఐ (ఎంఎల్) నాయకుల కోసం ప్రచారం చేయలేదు.

ఇప్పుడు వచ్చిన ఫలితాలు బిహార్‌ ఎన్నికలలో సీపీఐ (ఎంఎల్)కు అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పాలి. 2000 సంవత్సరం తర్వాత సీపీఐ(ఎంఎల్‌) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. 2000లో 6సీట్లు, 2005 అక్టోబర్‌ ఎన్నికలలో 5 సీట్లు గెలుచుకుంది.

2010లో అసలు ఖాతా కూడా తెరవలేకపోయింది. 2015లో సీపీఐ (ఎంఎల్‌)కు కేవలం 3 సీట్లే వచ్చాయి.

వామపక్ష నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫలితాలపై పార్టీ మాట

“ మేం ప్రతిసారీ 100 సీట్లకు అభ్యర్థులను నిలబెట్టాం. ఈసారి చాలా సీట్లు త్యాగం చేసాము. దానికి ప్రయోజనం పొందాం. ఈ ఎన్నికల్లో మా పెర్ఫార్మెన్స్‌ చాలా బాగుంది’’ అని సీపీఐ (ఎంఎల్) బిహార్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ అన్నారు.

“మేం సీట్లు వదులుకున్నచోట మహాకూటమి అభ్యర్ధులు మంచి విజయాలు సాధించారు. అంటే ఓటు బదిలీ బాగా జరిగింది. మేం ఎక్కడున్నా మా ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంది" అన్నారు కునాల్‌.

ఓటు బదిలీ ప్రయోజనం ఎవరికి?

వామపక్షాల ఓట్ల వల్లే మహాకూటమి ప్రయోజనం పొందిందా? దీనిపై ప్రతి స్థానంపై ప్రత్యేకంగా విశ్లేషణ అవసరమంటున్నారు సెంటర్ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌)కు చెందిన సంజయ్‌ కుమార్‌. ఈసారి మహాకూటమి చాలా పకడ్బందీగా బరిలోకి దిగిందని ఆయన విశ్లేషించారు.

తమ ఓటు బ్యాంకు ఎక్కడికీ పోదని వామపక్షాలు నమ్ముతుంటాయి. వాళ్లు గెలిచినా, ఓడినా వారి ఓటర్లకు పెద్దగా పట్టింపు ఉండదు. ఈసారి తమ మద్దతు తీసుకుంటున్న పార్టీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వబోతోందని అర్ధమయ్యాక వారంతా ఏకమయ్యారు.

వామపక్ష ఓటు బ్యాంకుతోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌లు లాభపడ్డాయని అనుకోవడానికి వీలులేదు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల ఓట్లు వామపక్షాలకు కూడా బదిలీ అయ్యాయి. ఇది కాదనలేని నిజం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)